అనంతపురం

ఘనంగా పార్వేట ఉత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కదిరి, జనవరి 15: శ్రీ ఖాద్రీ లక్ష్మినరసింహస్వామి పార్వేట ఉత్సవం ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. నరసింహస్వామి సంక్రాంతి పండుగ మరుసటి రోజున అడవికి పోయి పులిని వేటాడడం జరిగిందని, చెడును పారదోలి మంచిని కాపాడడమే పులి పార్వేట ఉత్సవం యొక్క ప్రాముఖ్యత అని పురాణాలు చెప్తున్నాయి. ప్రతి ఏటా కనుమ పండుగ రోజున పార్వేట ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉదయం 5గంటల నుండి 6 గంటల వరకు శ్రీవారి నిత్యపూజ నివేదనల అనంతరం 8 గంటల నుండి 9 గంటల మధ్య స్వామివారు కదిరి కొండకు చేరుకున్నారు. అక్కడ మధ్యాహ్నం 2 గంటల వరకు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు కదిరి చుట్టుపక్కల ప్రాంతాల నుండేగాక కర్నాటక రాష్ట్రం నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. వీరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పాలక మండలి చైర్మన్ పచ్చిపులుసు నరేంద్రబాబు, సభ్యులు, ఈఓ వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు స్వామివారిని పల్లకిలో ఊరేగిస్తూ పాలు ఆరగింపు మంటపంకు చేరుకున్నారు. ఈ ఉరేగింపులో మాజీ ఎమ్మెల్యే, కదిరి నియోజక టిడిపి ఇన్‌చార్జ్ కందికుంట ప్రసాద్ స్వామివారి పల్లకిని మోస్తూ మండపం వద్దకు చేరుకున్నారు. అక్కడ కౌల్లేపల్లికి చెందిన వారు పాల పొంగు కార్యక్రమం నిర్వహించారు. పాలు పొంగేటప్పుడు ఎటువైపు పొంగుతాయో అ ప్రాంతం వైపు పంటలు బాగా పండుతాయన్నది భక్తుల నమ్మకం. అనంతరం 4 గంటలకు పార్వేట మండపంకు స్వామివారు ఊరేగింపుగా చేరుకోగా పార్వేట వేడుకలను ప్రారంభించారు. పార్వేటలో భాగంగా కుందేలును వదలగా దానిని పట్టుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు పోటీపడ్డారు. అనంతరం స్వామివారు అశ్వ వాహనంపై కదిరి పురవీధులలో ఉరేగింపుగా ఆలయ ముఖద్వారం వద్దకు చేరుకున్నారు. చోర సంవాదం , స్వామివారికి హారతితో పార్వేట ఉత్సవం ముగిసింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సిఐలు శ్రీనివాసులు, శివరాముడు ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు.
కొండెక్కిన నగదు రహిత లావాదేవీలు!

హిందూపురం టౌన్, జనవరి 15: పెద్ద నోట్లు రద్దు అయిన తర్వాత దాదాపు 45 రోజులపాటు కిక్కిరిసిన బ్యాంక్‌లు ఇప్పుడిప్పుడే కొంత రద్దీ తగ్గుతోంది. గతంలో నోట్లు డిపాజిట్ చేయడం, నగదు ఉపసంహరణకు ఒక్కసారిగా ఖాతాదారులు తరలి రావడంతో అన్ని బ్యాంకుల్లో అధికారులకు క్షణం తీరిక లేకుండా పోయింది. అయితే కొంతమేర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎటిఎంలతోపాటు పలు ప్రైవేటు బ్యాంక్‌ల ఎటిఎం పనిచేస్తుండటంతో ఖాతాదారులు సైతం ఒకింత ఊపిరి పీల్చుకొంటున్నారు. ఇకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలని పదేపదే చెబుతున్నా అందుకు తగ్గట్టు సరైన చర్యలు లేకపోవడంతో వ్యాపార వర్గాలు తీవ్ర విస్మయానికి గురవుతున్నాయి. పెద్ద నోట్లను రద్దు చేసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం నగదు రహిత లావాదేవీలు జరపాలని, ఈ దిశగా ప్రభుత్వ శాఖల వ్యాపారులు, ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొనడం జరిగింది. దీంతో స్థానిక మున్సిపల్ అధికారులు బ్యాంకర్లతో సమావేశమై వ్యాపార వర్గాల నుండి స్వైపింగ్ యంత్రాల కోసం దరఖాస్తులు ఆహ్వానించడం జరిగింది. దీంతో దాదాపు 52 మంది వ్యాపారులు, పాఠశాలల నిర్వాహకులు, వివిధ వర్గాలు స్వైపింగ్ యంత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇప్పటి వరకు కనీసం ఒక్క స్వైపింగ్ యంత్రాన్ని కూడా ఇప్పటి వరకు మంజూరు చేయలేదు. చివరకు మున్సిపల్ కార్యాలయంలో కూడా స్వైపింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. దీంతో వ్యాపారులు, పాఠశాలల నిర్వాహకులు లావాదేవీలపై గగ్గోలు పెడుతున్నారు. నగదు రహిత లావాదేవీలు జరపాలని అవగాహన కల్పించిన మున్సిపల్ అధికారులు కార్యాలయంలో ఇప్పటికీ నగదుతోనే లావాదేవీలు నిర్వహిస్తున్నారు. బ్యాంకర్లు ఉదయం నుండి సాయంత్రం వరకు కేవలం నగదు పంపిణీ తదితర బ్యాంక్ కార్యకలాపాలకే పరిమితమవుతుండటంతో స్వైపింగ్ యంత్రాల గురించి ఎలాంటి సమాచారం లేకుండాపోయిందని అభిప్రాయాలను దరఖాస్తుదారులు పేర్కొంటున్నారు. ఇకపోతే గత నెల 8వ తేదీ రాత్రి మూతపడ్డ పలు ఎటిఎం కేంద్రాలు ఇప్పటి వరకు తెరచుకోలేదు. పట్టణంలో కేవలం ఎస్‌బిఐ ఎటిఎంలు పలు ప్రాంతాల్లో పనిచేస్తుండగా మిగిలిన బ్యాంక్‌ల ఎటిఎంలు ఏ మాత్రం పనిచేయడం లేదని ఖాతాదారులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇతర బ్యాంక్‌ల్లో ఖాతాలు కలిగిన ఖాతాదారులు ఎస్‌బిఐ ఎటిఎంలలో నగదు డ్రా చేస్తే సర్వీసు చార్జీలు ఎంత మొత్తంలో పడతాయో తెలియక అయోమయానికి గురవుతున్నారు. దీంతో నగదు ఎలా పొందాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకొని పూర్తి స్థాయిలో అన్ని బ్యాంక్‌ల ఎటిఎం కేంద్రాలు పనిచేసేలా చూడాలని, దరఖాస్తుదారులందరికీ స్వైపింగ్ యంత్రాలను అందచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వైద్య శాఖలో 206 ఎంపిహెచ్‌ఎ
పోస్టుల ఖాళీ

అనంతపురం, జనవరి 15: జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ప్రస్తుతం 206 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్స్(ఎంపిహెచ్‌ఎ) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయడంలో ప్రభుత్వం మీన మేషాలు లెక్కిస్తోంది. దీంతో క్షేత్ర స్థాయిలో వైద్య, ఆరోగ్య సేవలు నత్తనడకన సాగుతున్నాయి. ఈ పోస్టుల్లో నియామక నోటిఫికేషన్ కోసం అర్హులు ఎందరో ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తే ఖాళీ పోస్టులు భర్తీ అయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు జిల్లా వైద్య శాఖలో పనిచేస్తున్న 24 మంది ఎంపిహెచ్‌ఎల తొలగింపు, కొత్తవారి నియామకాలపై గందరగోళం కొనసాగుతోంది. ఈ సమస్యకు సంబంధించిన ఫైల్ ప్రభుత్వ స్థాయిలో ఉంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టుల్లో తొలగింపునకు గురైన వారిని నియమించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం శీఘ్రగతిన తగిన నిర్ణయం తీసుకోకపోతే 14 ఏళ్లుగా పనిచేస్తున్న, తొలగింపునకు గురైన 24 మంది ఎంపిహెచ్‌ఎలు శాశ్వతంగా ఉద్యోగావకాశాలు కోల్పోయే పరిస్థితి లేకపోలేదు. వీరి పునర్నియామకానికి సంబంధించి మార్గదర్శకాల కోసం డిఎంఅండ్‌హెచ్‌ఒ కార్యాలయ ఉన్నతాధికారులు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ప్రస్తుతం ఆ ఫైల్ డిప్యూటీ సెక్రటరీ స్థాయిలో పరిశీలనలో ఉంది. 2003లో ఎంపిహెచ్‌ఎలుగా నియమితులైన 152 మందిలో పదో తరగతి విద్యార్హత ఉన్న వారిని తొలగించి, వారి స్థానంలో ఇంటర్ అర్హత ఉన్న 42 మంది తీసుకున్నారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు పదో తరగతి వారిని కూడా తీసుకున్నారు. ఈ పరిస్థితిలో మెరిట్‌లో తమకు అన్యాయం జరిగిందని మరో 42 మంది కోర్టును ఆశ్రయించారు. దీంతో వారి నియామకంపై సాధ్యా సాధ్యాలు పరిశీలించాలని కోర్టు జిల్లా వైద్య శాఖ అధికారులను ఆదేశించింది. ఈ క్రమంలో 14 ఏళ్లుగా పనిచేస్తున్న 24 మందిని లెస్ మెరిట్ పేరుతో డిఎంఅండ్‌హెచ్‌ఒ అధికారులు తిరిగి తొలగించడంతోపాటు వారి స్థానంలో కొత్త వారిని నియమించారు. ఇందులో బిసి- ఇ అభ్యర్థులను కూడా నియమించడం వివాదాస్పదమైంది. దీంతో తొలగింపునకు గురైన వారు గత కొంత కాలంగా ఆందోళన కొనసాగిస్తున్నారు. వీరి సమస్య డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ స్థాయిలో పరిష్కారం కాలేదు. దీంతో ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, త్వరలో ఆదేశాలు వచ్చే అవకాశం ఉందని డిఎంఅండ్‌హెచ్‌ఒ వెంకటరమణ ఆదివారం తెలిపారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 206 ఎంపిహెచ్‌ఎ పోస్టుల్లో 24 మందిని నియమించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాల్ని విడుదల చేయాల్సి ఉందన్నారు. దీనిపై తుది నిర్ణయం తీసుకోవడంపై ప్రభుత్వం రెండు, మూడు రోజుల్లో తమకు విజయవాడకు రావాలని ఆదేశించే అవకాశం ఉందని అన్నారు. కాగా మిగతా 182 ఖాళీ పోస్టుల్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు భర్తీ చేయాల్సి ఉంది. దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

నయనానందకరం ఆలూరు రంగనాథస్వామి కల్యాణోత్సవం

తాడిపత్రి, జనవరి 15: మండల పరిధిలోని శ్రీ ఆలూరు రంగనాథస్వామి దేవస్థానంలో శనివారం రంగనాథస్వామి కల్యాణోత్సవం భక్తుల మధ్య నయనానందకరంగా సాగింది. శ్రీరంగనాథస్వామి మూలవిరాట్‌కు అభిషేకాలుగావించి, ఆకుపూజ, వివిధ రకాల పుష్పాలతో అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. ధనుర్మాసాన్ని పురస్కరించుకొని 40 రోజులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆఖరి రోజున వేద మంత్రోచ్ఛారణల నడుమ భక్తుల సమక్షంలో శ్రీ గోదాదేవితో శ్రీరంగనాథస్వామి కల్యాణోత్సవం కమనీయంగా నిర్వహించారు. కల్యాణోత్సవం అనంతరం గుడారై విందును ఏర్పాటుచేసి భక్తులకు అన్న ప్రసాద వినియోగం కావించారు. భక్తులకు తగు ఏర్పాట్లు చేశారు.
ఖాదీ క్యాలెండర్‌పై గాంధీ బొమ్మ
తొలగింపు తగదు

హిందూపురం టౌన్, జనవరి 15: ఇటీవల విడుదల చేసిన ఖాదీ గ్రామీణ పరిశ్రమ క్యాలెండర్, డైరీలలో జాతిపిత మహాత్మాగాంధీ బొమ్మను తొలగించి ప్రధాని నరేంద్రమోదీ బొమ్మను ప్రచురించడం హేయమైన చర్యగా పిసిసి అధికార ప్రతినిధి బాలాజీ మనోహర్, ఎ బ్లాక్ అధ్యక్షులు శైవలి రాజశేఖర్ పేర్కొన్నారు. సాధారణంగా ఖాదీ అంటేనే గుర్తుకు వచ్చేది మహాత్ముడని, అలాంటిది ఆ గొప్ప వ్యక్తి బొమ్మను తొలగించడం తగదన్నారు. ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ క్యాలెండర్‌పై గాంధీ బొమ్మను తొలగించడాన్ని చూస్తే మోదీ మదిలో గాడ్సే ఉన్నట్లు అనిపిస్తోందన్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ వైఖరితో బిజెపి అగ్రనేతలు వాజ్‌పేయి, అద్వాని పార్టీకి దూరంగా ఉంటున్నారన్నారు. గాంధీ బొమ్మను తొలగించడం పట్ల ప్రధాని బహిరంగ క్షమాపణలు చెప్పాలన్నారు. ఇకపోతే నగదు రహిత లావాదేవీలు విజయవంతం కాకపోవడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ వైఖరే కారణమన్నారు. అనవసరంగా నోట్లను రద్దు చేసి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల డబ్బుపై ప్రభుత్వాలు పెత్తనం వహించడం విడ్డూరంగా ఉందన్నారు. వ్యాపారాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కోట్లాది రూపాయలు నోట్ల రద్దు, నగదు ఉపసంహరణపై ఆంక్షలు విధించడంతో వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. నల్లధనం వెలికి తీస్తామని చెప్పిన ప్రధాని ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. కాగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజధాని అమరావతి నిర్మాణంపై ఏమాత్రం స్పష్టత లేదన్నారు. ఏ దేశానికి వెళితే ఆ దేశం తరహాలో రాజధానిని నిర్మిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.హిందూపురం పట్టణాన్ని ఎన్టీఆర్ స్టూడియో తరహాలో మార్చి వేశారని విమర్శించారు. ఇష్టారాజ్యంగా ఎక్కడబడితే అక్కడ ఫ్లెక్సీలు, సినిమా హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారని, ఇతర పార్టీలు ఫ్లెక్సీలు ఏర్పాటుచేస్తే వాటిని ఆఘమేఘాలపై తొలగిస్తూ పక్షపాత వైఖరి అవలంభిస్తున్నారన్నారు. హిందూపురం పట్టణంలో నూతన కూరగాయల మార్కెట్ నిర్మాణంపై ఎమ్మెల్యే బాలకృష్ణకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేసిన పిఎబిఆర్ తాగునీటి పథకాన్ని బలోపేతం చేస్తామని టిడిపి నేతలు చెప్పడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా ఎమ్మెల్యే కేవలం శంకుస్థాపనలు, భూమిపూజలకే పరిమితమవుతున్నారన్నారు. కనీసం ఇప్పటికైనా టిడిపి ప్రభుత్వం కళ్లు తెరచి ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు.

శ్రీ నెట్టికంటికి విరాళాల వెల్లువ
గుంతకల్లు, జనవరి 15: ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామికి వెండి వస్తువుల విరాళాలు వెల్లువెత్తాయి. శ్రీ స్వామివారికి వెండి రథాన్ని ఏర్పాటుచేయాలని ఆలయ అధికారులు, ట్రస్టు బోర్డు సభ్యులు సంకల్పించారు. దీనికి అనుగుణంగా స్వామివారి వెండి రథం ఏర్పాటుకు నగదు, వెండిని భక్తులు పెద్ద ఎత్తున సమర్పిస్తున్నారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు స్వామివారికి మొక్కులను చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా బళ్లారికి చెందిన సుద్దపల్లి రుక్మిణమ్మ, ఆమె కుమారుడు అనీల్‌కుమార్ స్వామివారి సేవకు వినియోగించే వెండి గజం, చత్రము, చామరము, కుంభహారతి, నివేదన పాత్ర తట్ట తదితర నాలుగు కేజీల విలువైన వెండి వస్తువులను సమర్పించి పెద్ద ఎత్తున స్వామివారికి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అదేవిధంగా జమ్మలమడుగుకు చెందిన హేమంత్‌కుమార్‌రావు, లలితాంబలు వారి తాత మహేంద్ర కర్ రామమూర్తి, ఆయన సతీమణి శారదాబాయి జ్ఞాపకార్థం 1.40 కేజీల వెండి బిస్కెట్‌ను అందజేశారు. అదేవిధంగా స్వామివారి రధోత్సవం ఏర్పాటుకు గుంతకల్లుకు చెందిన డాక్టర్ టీ మారుతికృష్ణ, ఆయన సతీమణి మహితాంజలి వారి తల్లిదండ్రులు ఆంజనేయులు, రామంజినమ్మలు రూ.50,116లు నగదును అందజేసినట్లు ఆలయ ఇఒ ముత్యాలరావు తెలిపారు.
ప్రపంచంలోనే తెలుగు సంస్కృతి ప్రత్యేకం..

పుట్టపర్తి, జనవరి 15: ప్రపంచంలోనే తెలుగు జాతి సంస్కృతి ప్రత్యేకమైనదని మంత్రి పల్లె రఘునాథరెడ్డి అభివర్ణించారు. మూడు రోజులుగా పుట్టపర్తి శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ముగింపు సందర్భంగా మంత్రి పల్లె రఘునాథరెడ్డి పాల్గొని ప్రసంగించారు. ప్రపంచ వ్యాప్తంగా వున్న వివిధ మతాలు, కులాలకు భిన్నంగా తెలుగు సంస్కృతి ప్రత్యేకంగా అద్దంపడుతోందన్నారు. మన పూర్వీకులు గ్రామాల్లోని ప్రజల ఆప్యాయతలు, అనురాగాలు సంస్కృతికి ఆలవాలంగా నిలిచాయన్నారు. ఆధునిక ప్రపంచంలో మన సంస్కృతి, సంప్రదాయాలు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. నానాటికి అంతరించిపోతున్న సంస్కృతి, సాంప్రదాయాలకు జీవం పోసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కళలకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందన్నారు. కళలు, ప్రజల మధ్య ఐకమత్యాన్ని, అనురాగాలను పెంపొందించేందుకు ఎంతో కృషి చేస్తున్నామన్నారు. అందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల కూచిపూడి నృత్యానికి ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలుగాంచే విధంగా దానికి జాతీయ హోదా కల్పించారన్నారు. రూ.100 కోట్లు ప్రత్యేక బడ్జెట్‌ను సైతం అందుకోసం కేటాయించడం జరిగిందన్నారు. పుట్టపర్తి శిల్పారామం అభివృద్ధికి మరో రూ.1 కోటి కేటాయించి అభివృద్ధి చేస్తామన్నారు. సంక్రాంతి సంబరాలు ఆనందంగా జరుపుకుని సకల ఐశ్వర్యాలతో ప్రజలు వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. మండల పరిధిలోని వెంగలమ్మచెరువు, సుబ్బరాయునిపల్లి, నిడిమామిడి గ్రామాల్లో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. చెక్క్భజనలు, కోలాటన్నలు, ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూచిపూడి నృత్య కళాకారిణి లక్ష్మిబృందం ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు, వివిధ బృందాల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ముగ్గుల పోటీల్లో ప్రత్యేకంగా నిలిపిన వారికి ఆయన బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పిసి.గంగన్న, పుడా చైర్మన్ కడియాల సుధాకర్‌నాయుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ కడియాల రాము, దేశం నాయకులు రామాంజనేయులు, ఆంజనేయులు, కడియాల రాము, శ్రీరామిరెడ్డి, బొమ్మయ్య, ఓబులేసు, కౌన్సిలర్లు లక్ష్మిదేవి, బెస్త చలపతి, శ్రీరామ్‌నాయక్, ఆదినారాయణమ్మ, దిల్షాద్‌బేగ్ పాల్గొన్నారు.

ఘనంగా చౌడేశ్వరి దేవి
జ్యోతుల మహోత్సవం

ధర్మవరం రూరల్, జనవరి 15: ధర్మవరం పట్టణంలో ఆదివారం చౌడేశ్వరి దేవి శతాధిక జ్యోతుల మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. తొగట వీర క్షత్రియుల ఆరాధ్య దైవమైన చౌడేశ్వరి దేవి అమ్మవారికి సామూహిక జ్యోతుల మహోత్సవాన్ని ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని 23వ వార్డులోని అమ్మవారి ఆలయం నుండి 153 చౌడేశ్వరి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా మంగళ వాయిద్యాలతో దుర్గమ్మ ఆలయం వద్దకు తీసుకువచ్చారు. ఊరేగింపులో భాగంగా జ్యోతులను తలపై పెట్టుకుని నృత్యం చేస్తూ అమ్మవారి భక్తి పాటలను ఆలపించారు. ఈ కార్యక్రమానికి సతీ సమేతంగా రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఎంపి నిమ్మల కిష్టప్పలతోపాటు స్థానిక ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణలు హాజరయ్యారు. ఊరేగింపులో భాగంగా ఎమ్మెల్యే గోనుగుంట్ల, ఎంపి నిమ్మల జ్యోతులను ఎత్తుకున్నారు. అనంతరం దుర్గమ్మ దేవాలయం వద్ద ఏర్పాటుచేసిన హోమగుండంలోకి జ్యోతులనెత్తుకున్న వారు దిగారు. ఈ సందర్భంగా చౌడేశ్వరి దేవాలయం నుంచి దుర్గమ్మ ఆలయం వద్ద రహదారులన్నీ జనసంద్రంగా మారిపోయి జనంతో కిక్కిరిసిపోయాయి. దుర్గమ్మ ఆలయంలో మంత్రి, ఎంపి, ఎమ్మెల్యేలు ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్భంగా పల్లె మాట్లాడుతూ సంస్కృతి, సాంప్రదాయాలను ఆధునిక యుగంలో కూడా మరువకూడదన్నారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ కమిటీ ఈఓ ఆనంద్, మున్సిపల్ చైర్మన్ బీరే గోపాలకృష్ణ, చౌడేశ్వరి ఆలయ కమిటీ నిర్వాహకులు లింగం చంద్రశేఖర్‌తోపాటు చందా గోవిందప్ప, గుద్దిటి లక్ష్మినారాయణ, పోలా వెంకటనారాయణ, పోలా ప్రభాకర్, పరిశె సుధాకర్, ఆంజనేయులు, బండారు రామాంజనేయులు, రంగన రామకృష్ణ, మేకల అశ్వర్థనారాయణ, పూజారి నారాయణలతోపాటు అధిక సంఖ్యలో తొగట వీర క్షత్రియ కులస్థులతోపాటు భక్తులు పాల్గొన్నారు.

శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు
అనంతపురం కల్చరల్, జనవరి 15: నగర సమీపంలో గల శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. సంక్రాంతి, కనుమ సందర్భంగా ఆదివారం భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిన్నారులచే భరత నాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శన గావించారు. అదేవిధంగా జానపద, అమ్మవారి జానపద నృత్యాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. అనంతరం ముగ్గుల పోటీలు, సాంస్కృతిక నృత్య ప్రదర్శనల్లో గెలుపొందిన వారికి శ్రీపాద సహకారంతో బహుమతులు ప్రదానం చేశారు. నగరంలో ఆనందోత్సాహాలతో ఘనంగా జరుపుకున్నారు. ఇంటి లోగిళ్లను రంగురంగుల ముగ్గులతో అలంకరణ చేసి గొబ్బిళ్లను పూలతో అలంకరించి పూజలు చేశారు. నవ ధాన్యాలతో కూడిన వంటలు, పిండివంటలతో ఇంటిల్లిపాదీ సంబరాలు జరుపుకున్నారు. దాన ధర్మాలకు, కర్తవ్య నిష్టకు, సంస్కృతి, సంప్రదాయాలకు, స్నేహానికి, కుటుంబ సంబంధాలకు, ప్రకృతి, పర్యావరణ పరిరక్షణకు, గోసంరక్షణకు ప్రతీక అయిన సంక్రాంతిని అత్యంత వేడుకగా జరుపుకున్నారు. చిన్నారులు పతంగులను (గాలిపటాలు) ఎగురవేసి సంబరాలను జరుపుకున్నారు. వివిధ సంస్థల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా తమ జీవితాల్లో వెలుగులు నిండాలని, తమ కుటుంబం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలంటూ దేవాలయాలకు వెళ్లి పూజలు నిర్వహించారు.
ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర
అనంతపురం కల్చరల్, జనవరి 15: అంతర్జాతీయ శ్రీ కృష్ణ చైతన్య సమాజం (ఇస్కాన్) ఆధ్వర్యంలో ఫిబ్రవరి 11న నగరంలో జగన్నాథ రథయాత్ర నిర్వహించనున్నట్లు ఇస్కాన్ మేనేజర్ దామోదర గౌరంగదాస్ ప్రభు తెలిపారు. ఈమేరకు శ్రీ రాధాపార్థసారథి మందిర్‌లో ఆదివారం రథయాత్ర కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ నగరంలో ఇస్కాన్ మందిర్ 9వ వార్షికోత్సవ వేడుకలతోపాటు పూరి జగన్నాథ రథయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. 11వ తేదీ మధ్యాహ్నం 3గం.లకు కెఎస్‌ఆర్ బాలికల జూనియర్ కళాశాల నుండి రథయాత్ర ప్రారంభమవుతుందన్నారు. సప్తగిరి సర్కిల్, టవర్‌క్లాక్ సర్కిల్, రఘువీర సర్కిల్, రాజు రోడ్, శ్రీకంఠం సర్కిల్, పాతవూరు గాంధీ బజార్, బసవన్న కట్ట మీదుగా లలిత కళాపరిషత్‌కు చేరుకుంటుందన్నారు. అనంతరం లలిత కళాపరిషత్‌లో ఇస్కాన్ దక్షిణ భారతదేశ ఇన్‌చార్జి శ్రీ సత్యగోపీనాథ్‌దాస్ ప్రభుచే ఉపన్యాస కార్యక్రమం ఉంటుందన్నారు. 1008 పూర్ణకుంభాలతో, 108 కలశాలతో రథయాత్రకు స్వాగతం పలకడం జరుగుతుందన్నారు. రథయాత్ర ముందు వివిధ కళారూపాల ప్రదర్శన ఉంటుందని, ఈ కార్యక్రమాల్లో పాల్గొనువారు ముందుగా తమ పేర్లను నగరంలోని శ్రీ పాదవేణు షాపులో సంప్రదించి నమోదు చేసుకోవాలని తెలిపారు.
సంప్రదాయబద్దంగా గో పూజ
కనుమ పండుగ సందర్భంగా ఇస్కాన్ మందిర్‌లో ఆదివారం సంప్రదాయబద్దంగా గో పూజ నిర్వహించారు. టిటిడి, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో గో పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా దామోదర గౌరంగదాస్ ప్రభు మాట్లాడుతూ గోవు విశ్వానికి తల్లివంటిదని, గోవు సకల దేవతా నిలయమని పేర్కొన్నారు. గోసేవ, గో సంరక్షణ చేసిన వారి జీవితం ధన్యమన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ ప్రచార మండలి జిల్లా అధ్యక్షులు శ్రీపాదవేణు, డా.కేశన్న, తాళంకి నాగేంద్రకుమార్, ఇంటెల్ ప్రతాప్‌రెడ్డి, చంద్రశేఖరరెడ్డి, రంగారెడ్డి, ఈశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.