అనంతపురం

రైతు ఇంట విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనుకొండ, ఫిబ్రవరి 2 : అధి కారులు నిర్వహించిన భూ సేకర ణ సమావేశానికి వెళ్లిన ఇంటి పెద్ద విగతజీవుపై తిరిగిరావడంతో ఆ ఇ ంట విషాదం అలముకుంది. మం డలంలోని మక్కాజీపల్లి తండాకు చెందిన రైతు బాలూనాయక్‌కు భార్య సాలమ్మ, ఇద్దరు ఆడపి ల్లలు ఉన్నారు. ఓ కూతురుకు వివాహం జరిగింది. గ్రామంలో బాలూనాయక్ పేర 3 ఎకరాలు, భార్య పేర మరో 3.5 ఎకరాల భూమి ఉంది. కార్ల ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ప్రభుత్వం భూసేకరణకు శ్రీకారం చుట్టడంతో భూమి కోల్పోవాల్సి వస్తుందేమోనన్న బెంగ బాలూనాయక్‌ను వెంటాడుతోంది. ఇంట్లో భార్యతో తరచూ ఇదే విషయమై చర్చించేవాడని గ్రామంలోని ఇతర రైతులు తెలిపారు. ప్రభుత్వం భూసేకరణ నోటీసులు జారీ చేసినప్పటి నుంచి గ్రామంలోని ప్రతి రైతు ఇంట్లో ఇదే చర్చ జరుగుతోంది. ఈ నేపధ్యంలో గురువారం పెనుకొండ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో కార్ల ఫ్యాక్టరీ నిమిత్తం భూసేకరణ కోసం సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన బాలూనాయక్ తన భూమి యావత్తు కోల్పోయినట్లు భావించి తీవ్ర మనస్తాపంతో అస్వస్థతకు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఇది గమినించిన రైతులు వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అమ్మవారిపల్లి పరిధిలో కార్ల ఫ్యాక్టరీ నిర్మాణం కోసం 560 ఎకరాలు భూములు సేకరిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అనంతరం 2500 ఎకరాలు సేకరించాలని నిర్ణయించడంతో రైతులకు అంతోఇంతో మిగిలిన భూములను సైతం కోల్పోయారు.
దేనికైనా సై!
* 5న సమావేశాన్ని అడ్డుకుంటాం : శేఖర్ వర్గీయులు
* నిర్వహించి తీరుతాం.. : అసంతృప్తవాదులు
* సస్పెన్షన్ చేస్తే మూకుమ్మడి రాజీనామాలు
* రెండుగా చీలిన ‘పురం’ టిడిపి
హిందూపురం, ఫిబ్రవరి 2 : ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి, నియోజకవర్గ టిడిపి బాధ్యుడు కనుమూరి శేఖర్‌ను పంపించేంత వరకూ పోరాటం చేస్తామని అసంతృప్తివాదులు శపథం చేస్తుండగా, శేఖర్ వర్గీయులు మాత్రం ఆయననే కొనసాగించి తీరుతామని చెబుతున్నారు. ఎవరికి వారు ఎంతవరకైనా సై అంటూ సవాల్ విసురుకోవడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. శేఖర్ వైఖరిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడంతోపాటు పంపించేంత వరకూ పోరాటం సాగిస్తామని మాజీ ఎమ్మెల్యే సిసి వెంకట్రాముడు, టిడిపి నేత అంబికా లక్ష్మీనారాయణల ఆధ్వర్యంలో జరిగిన సమావేశాల్లో అసంతృప్తివాదులు స్పష్టం చేసిన విషయం విధితమే. ఇప్పటికే హిందూపురం రూరల్, లేపాక్షి మండలాల్లో శేఖర్ తీరును దుయ్యబడుతూ పెద్ద ఎత్తున సమావేశాలు జరిగాయి. తాజాగా గురువారం స్థానిక మాజీ ఎమ్మెల్యే సిసి వెంకట్రాముడి నివాసానికి 11 మంది దాకా టిడిపి మున్సిపల్ కౌన్సిలర్లు, మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్ డైరెక్టర్ ఆర్‌ఎంఎస్ షఫీవుల్లా, మున్సిపల్ వైస్ చైర్మన్ జెపికె రాము తదితర టిడిపి నాయకులు హాజరై తమ నిరసనగళం విప్పడం దుమారం రేపుతోంది. పిఏ శేఖర్‌ను ఎట్టి పరిస్థితుల్లో కొనసాగించకూడదని, ఆయన ఆగడాల కారణంగా టిడిపి తీవ్రంగా నష్టపోతుండటంతోపాటు లంచగొండితనం ఎక్కువ అవుతోందని కొందరు నాయకులు సిసి, అంబికా ఎదుట వాపోయినట్లు తెలుస్తోంది. త్వరలో హిందూపురం మున్సిపల్ పరిధిలో కూడా సమావేశాన్ని భారీగా నిర్వహిద్దామని నిర్ణయించారు. కాగా ఈనెల 5న చిలమత్తూరు మండల అసంతృప్తివాదుల సమావేశాన్ని పెద్దఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్రధానంగా చిలమత్తూరు మండలంలో టిడిపిలో అసంతృప్తి రాజుకుంటోంది. గత కొంతకాలంగా ఎక్కువ శాతం సీనియర్ టిడిపి నాయకులతోపాటు జడ్పీటీసీ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ శేఖర్ వైఖరిని ఎండగడుతున్నారు. కనీసం బాలకృష్ణ పర్యటన సందర్భాల్లో కూడా ఆయా నాయకులు హాజరుకాకపోవడం పార్టీలో ఏ మేరకు అసంతృప్తి ఉందో అర్థమవుతోందని అసంతృప్తివాదులు అంటున్నారు. ఇదిలా ఉండగా 5న టిడిపి అసంతృప్తివాదులు సమావేశాన్ని నిర్వహిస్తే అడ్డుకుంటామని చంద్రదండు ఉపాధ్యక్షులు, ఎంపిపి నౌజియాభాను మరిది అన్సార్ అహ్మద్ శేఖర్‌కు మద్దతుగా చిలమత్తూరులో గురువారం నిర్వహించిన ర్యాలీలో బహిరంగంగానే ప్రకటించారు. శేఖర్ అభివృద్ధి కార్యక్రమాలకు ఎంతో దోహద పడుతుంటే ఓర్వలేక సిసి, అంబికా గ్రూపు రాజకీయాలు చేస్తున్నారంటూ ఆరోపించారు. చిలమత్తూరు మండలంలో ఎలా అసంతృప్తివాదుల సమావేశం జరుగుతుందో చూస్తామని సవాల్ విసిరారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో సమావేశాన్ని నిర్వహించి తీరుతామని అసంతృప్తివాదులు చెబుతున్నారు. అంతేగాకుండా శేఖర్ వైఖరి కారణంగా టిడిపి నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా నష్టపోతుంటే అలాంటి వారిని దూరంగా పెట్టడానికి డిమాండ్ చేయడం పోయి ఇంకా వత్తాసు పలుకుతారా అంటూ ప్రతి సవాల్ విసురుతున్నారు. కాగా అటు పోలీసులు ఇటు వివిధ శాఖల అధికారులతో అసంతృప్తివాదులు ఆ సమావేశానికి హాజరు కాకుండా రెండు రోజులుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అయినా టిడిపి ప్రతిష్ట దిగజారకుండా, ఎమ్మెల్యే బాలకృష్ణకు చెడ్డపేరు రాకుండా ఎంతవరకైనా పోరాటాన్ని సాగిస్తామని స్పష్టం చేస్తున్నారు. ఇకపోతే టిడిపి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని శేఖర్‌ను ఇక్కడి నుంచి పంపాలని సిసి, అంబికా కోరుతుంటే వారినే సస్పెండ్ చేసేందుకు కుట్ర సాగుతోందని వారి వర్గీయులు అంటున్నారు. వారిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తే మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమని గురువారం రాత్రి జరిగిన సమావేశంలో, రెండు రోజులుగా చిలమత్తూరులో జరుగుతున్న మంతనాల్లో కొందరు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు స్పష్టీకరించినట్లు తెలుస్తోంది. ఏదేమైనా పిఏ శేఖర్‌ను ఇక్కడి నుండి పంపేదాకా అసంతృప్తి వాదులు పోరాటం సాగిస్తామని పేర్కొంటుండగా ఆయనకు అనుకూలంగా ఉన్న నాయకులు ఆ నేతలను సస్పెండ్ చేయించేందుకు ప్రయత్నాలు జోరుగా సాగిస్తున్నట్లు చర్చ సాగుతోంది.
బాలయ్య సీరియస్
హిందూపురంలో గత మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలపై ఎమ్మెల్యే బాలకృష్ణ సీరియస్ అయినట్లు సమాచారం. పోటాపోటీ సమావేశాల గురించి పూర్తి సమాచారం తెప్పించుకున్న బాలకృష్ణ ముఖ్యనేతలతో వీటిపై ఫోన్‌లో మాట్లాడి ఆరా తీసినట్లు తెలుస్తోంది. పార్టీ పరువు బజారుకెక్కెదాకా ఏం జేస్తున్నారని ప్రశ్నించినట్లు సమాచారం.

మహిళలు ఉద్యమిస్తే చరిత్ర
రూపురేఖలే మారిపోతాయి
* మంత్రి పరిటాల సునీత
* నగరంలో మహిళల భారీ ర్యాలీ
అనంతపురం సిటీ, ఫిబ్రవరి 2: మహిళలు ధైర్యంగా ముందుడుగు వేయాలని , మహిళలు ఉద్యమిస్తే చరిత్ర రూపురేఖలే మారిపోతాయని మంత్రి పరిటాల సునీత అన్నారు. పోరాటం చేయడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. ఈనెల 10 నుంచి 12వ తేదీ వరకూ అమరావతిలో నిర్వహించనున్న జాతీయ మహిళా పార్లమెంట్ సందర్భంగా గురువారం నగరంలోని టవర్‌క్లాక్, సప్తగిరి సర్కిళ్ల మీదుగా మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సునీత మాట్లాడుతూ బాలికలు బాగా చదువుకుని తల్లిదండ్రులు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. నగర మేయర్ మదమంచి స్వరూప మాట్లాడుతూ చట్టసభల్లో చట్టాలు తీసుకుని వస్తున్నా అవి సక్రమంగా అమలు కావడంలేదన్నారు. చట్టసభల్లో మహిళలు తమ గళాన్ని వినిపించి మహిళా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. డిఆర్‌ఓ మల్లీశ్వరీదేవి మాట్లాడుతూ పురాణ కాలంలో మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని, కాలక్రమేణా మహిళల పట్ల గౌరవం సన్నగిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. హక్కుల కోసం మహిళలందరూ ఏకతాటిపైకి వచ్చి పోరాడాలన్నారు. అనంతరం సప్తగిరి సర్కిల్‌లో మేయర్ స్వరూప మహిళల చేత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా మహిళా అధికారులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

టిటిడి పరిధిలోకి తిమ్మమ్మ మర్రిమాను
* మాజీ ఎమ్మెల్యే కందికుంట
కదిరి, ఫిబ్రవరి 2: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పర్యాటక కేంద్రం తిమ్మమ్మ మర్రిమాను టిటిడి పరిధిలోకి చేర్చుకుంటామని టిటిడి ఇఓ గిరి హామీ ఇచ్చారని మాజీ ఎమ్మెల్యే, టిడిపి నియోజకవర్గ ఇన్‌చార్జి కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు. ఈమేరకు గురువారం తిరుమలలో టిటిడి ఇఓను కలిసి తిమ్మమ్మ మర్రిమానును టిటిడి పరిధిలోకి తీసుకుని అభివృద్ధి చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గిన్నీస్‌బుక్‌లో చోటు కలిగిన తిమ్మమ్మ మర్రిమానును దేశంలోని అన్ని ప్రాంతాల్లో ప్రాంతాల పర్యాటకులు సందర్శిస్తున్నట్లు తెలిపారు. ఈనేపథ్యంలో రోడ్డు సౌకర్యం కల్పించడంతోపాటు అతిథి గృహాలను అభివృద్ధి చేసి, టిటిడి కల్యాణ మండపం నిర్మిస్తే మరింత అభివృద్ధి చెందుతుందని టిటిడి ఇఓ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఇందుకు ఇఓ సానుకూలంగా స్పందించి టిటిడి పరిధిలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు సిఎండి ఇస్మాయిల్, తిమ్మమ్మ మర్రిమాను కమిటీ సభ్యులు రామానందరెడ్డి, వెంకటనారాయణ, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి ఇంటర్ ప్రయోగ పరీక్షలు
* జంబ్లింగ్ పద్ధతి.. * పకడ్బందీ ఏర్పాట్లు
* జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి చంద్రశేఖర్‌రావు
హిందూపురం టౌన్, ఫిబ్రవరి 2 : ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు శుక్రవారం నుంచి ఈనెల 22వతేదీ వరకు నాలుగు విడతల్లో ప్రయోగ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా వృత్తివిద్య శాఖాధికారి చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 66 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గురువారం పట్టణంలో విలేఖరులతో మాట్లాడుతూ శుక్రవారం నుండి 7వ తేదీ వరకు మొదటి విడత, 8వ తేదీ నుండి 12వ తేదీ వరకు రెండో విడత, 13వ తేదీ నుండి 17వ తేదీ వరకు మూడో విడత, 18వ తేదీ నుండి 22వ తేదీ వరకు నాల్గో విడత కింద ప్రయోగ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని, విద్యార్థులు అర గంట ముందుగానే హాల్‌టికెట్‌లతో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు. నాలుగు విడతలుగా జరిగే పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 16,297 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. ప్రయోగ పరీక్షలు జంబ్లింగ్ పద్ధతిలో జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ ఉదయలక్ష్మి ఆదేశాల మేరకు అన్నిచర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే ఆయా కళాశాలల చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లకు తగు సూచనలు ఇచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా ప్రయోగ పరీక్షలు జరిగే కళాశాలల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలని స్పష్టంగా తెలియజేశామన్నారు. ముఖ్యంగా పరీక్ష హాలులో ఇన్విజిలేటర్ తప్ప మరెవ్వరూ ఉండకూడదని, చీఫ్ సూపరింటెండెంట్లు కేవలం పరీక్షా కేంద్రాలను పర్యవేక్షిస్తూ అక్రమాలకు తావు లేకుండా చూడాలన్నారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో రూప్లానాయక్, రాఘవేంద్రగౌడ్ తదితరులు పాల్గొన్నారు.