అనంతపురం

అర్హులందరికీ ‘చంద్రన్న సంక్రాంతి కానుక’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం కల్చరల్, డిసెంబర్ 19: రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డు కలిగిన వారందరికీ సంక్రాంతి పండుగ సందర్భంగా చంద్రన్న సంక్రాంతి కానుక అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. ఈమేరకు సంక్రాంతి కానుక ద్వారా పంపిణీ చేయాల్సిన సరుకుల నిల్వలను నగరంలోని ఎంఎల్‌ఎస్ పాయింట్‌లో శనివారం మంత్రి పరిశీలించారు. జిల్లాలోని తెల్ల రేషన్ కార్డుదారులకు సరిపడా నిల్వలు ఆయా ఎంఎల్‌ఎస్ పాయింట్లకు చేరాయా, లేదా అని పౌర సరఫరాల సంస్థ అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. సరుకుల నాణ్యతను పరిశీలించారు. బెల్లం, నెయ్యి ప్యాకెట్ల తూకం వేయించి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి విలేఖరులతో మాట్లాడుతూ పేదలందరూ సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకోవాలన్న ఉద్దేశ్యంతోనే చంద్రన్న సంక్రాంతి కానుక పేరుతో సరుకులను పంపిణీ చేస్తున్నామన్నారు. అదేవిధంగా క్రిస్మస్ సందర్భంగా క్రిస్టియన్‌లకు చంద్రన్న క్రిస్మస్ కానుక పేరుతో ప్రత్యేకంగా సరుకులను పంపిణీ చేస్తున్నామన్నారు. గ్రామాల్లో, జిల్లా వారీగా సర్వే చేసి క్రిస్టియన్‌లందరికీ పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో సుమారు 34 వేల మంది క్రైస్తవులకు పంపిణీ చేస్తామన్నారు. చంద్రన్న సంక్రాంతి కానుకను కొత్త రేషన్ కార్డుదారులకు వర్తింప చేస్తామన్నారు. కొత్త రేషన్ కార్డులతో కలిపి 1.41 కోట్ల కార్డుదారులకు 6 సరుకులతో కూడిన సంచీని పంపిణీ చేస్తామన్నారు. కిలో గోధుమ పిండి, అర కిలో బెల్లం, అర కిలో శెనగ బేడలు, అర లీటర్ పామాయిల్, అర కిలో కందిపప్పు, 100 మి.లీ నెయ్యితోపాటు చేతి సంచిని పంపిణీ చేస్తామని, వాటి విలువ రూ. 275లు అవుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా ఇందుకోసం రూ.400 కోట్లు పైనే ఖర్చు చేస్తున్నామన్నారు. జనవరి 2వ తేదీ నుండి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు. తక్కువ ధరలకే వినియోగదారులకు సరుకులు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయ్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ శ్రీనివాసులు, డిఎస్‌ఓ ప్రభాకరరావు, ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్ పాల్గొన్నారు.
చెన్నకేశవపురం లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
* భారీ ఎత్తున తరలివచ్చిన భక్తులు
కొత్తచెరువు, డిసెంబర్ 19: మండల పరిధిలోని చెన్నకేశవపురం గ్రామంలో వెలసిన శ్రీలక్ష్మిచెన్నకేశవ తృతీయ వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. మన్మధ నామ సంవత్సర మార్గశిర శుద్ధ నవమి అయిన శనివారం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ధర్మకర్తలు ఉషారాణి, చెన్నారెడ్డి దంపతులు ధ్వజారోహణ చేసి బ్రహ్మోత్సవ వేడుకలు ప్రారంభించారు. చెన్నకేశవపురంలో నూతనంగా నిర్మించిన శ్రీలక్ష్మి చెన్నకేశవ దేవాలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వేదికపై లక్ష్మిచెన్నకేశవస్వామి ఉత్సవ విగ్రహాలకు పూజా కార్యక్రమాలను వేద పండితులు నిర్వహించారు. శనివారం ఉదయం సుప్రభాత సేవ, ధ్వజారోహణతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. సాయంత్రం దేవాలయ ప్రాంగణంలో మహాభిషేకములు, వాహన సేవ, డోలోత్సవాన్ని నిర్వహించారు. ఆదివారం ఉదయం పూజా కార్యక్రమాలు, హోమాలు బెంగళూరు నుండి తెప్పించిన ప్రత్యేక పుష్పాలతో పుష్పోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. సాయంత్రం సుదర్శన హోమం వుంటుంది. లక్ష్మిచెన్నకేశవ దేవాలయాన్ని ఆంజనేయస్వామి విగ్రహానికి దేవాలయ ప్రాంగణమంతయు శ్రీకాళహస్తి నుండి తెప్పించిన ప్రత్యేక రంగురంగుల దీపాలతో ముస్తాబు చేశారు. దేవాలయ ప్రాంగణం విద్యుత్ కాంతులతో శోభాయమానంగా తయారైంది. ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి కొత్తచెరువు మండలంతోపాటు జిల్లా నలుమూలల నుండి భక్తులు విచ్చేవారు. వీరికి ఎటువంటి అసౌకర్యం తలెత్తకుండా తాగునీరు, అన్న ప్రసాద కార్యక్రమాలు అందిస్తున్నారు. అదేవిధంగా పురాతన దేవాలయమైన రామచంద్రస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం సైతం శనివారం ప్రారంభమైంది. శనివారం ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచన, కంకణధారణ, సాయంత్రం అంకురార్పణ, ధ్వజారోహణం నిర్వహించారు. ఆదివారం తత్కాల హోమం, సిరాధివాసం, సోమవారం విగ్రహ ప్రతిష్ఠ, మహాకుంభాభిషేకములు నిర్వహిస్తున్నట్లు ధర్మకర్తలు ఉషారాణి, చెన్నారెడ్డిలు తెలిపారు. ఈ సందర్భంగా 21వ తేదీన ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని శ్రీకాళహస్తి నుండి తెప్పించిన వైకుంఠ ద్వారాన్ని లక్ష్మిచెన్నకేశవస్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేశారు.