అనంతపురం

ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల బోణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఫిబ్రవరి 15 : ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఆయా పార్టీల నేతలు నామినేషన్ల వేయడం బుధవారం ప్రారంభించారు. అనంతపురం-కడప-కర్నూలు జిల్లాల పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ పట్ట్భద్రులు, ఉపాధ్యాయ స్థానాలకు ఈనెల 13న నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. అయితే తొలి రెండు రోజులు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. మూడో రోజు బుధవారం ఏకంగా ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో వైకాపా అభ్యర్థులు పట్ట్భద్రులకు వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఉపాధ్యాయ స్థానానికి కెవి.సుబ్బారెడ్డి నామినేషన్లు వేశారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటల నగరంలోని పార్టీ కార్యాలయం నుంచి అట్టహాసంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకొని ఒక్కొక్కరు నాలుగు నామినేషన్ల చొప్పున దాఖలు చేశారు. వీరితో పాటు ఎస్.విజయలక్ష్మి ఉపాధ్యాయ స్థానానికి సాదాసీదాగా నామినేషన్ వేశారు. పట్ట్భద్రుల స్థానానికి ఎ.మల్లికార్జున, శేషుయాదవ్ నామినేషన్లు వేశారు. కాగా ఈనెల 17న కాంగ్రెస్, టిడిపి అభ్యర్థులతోపాటు మరికొందరు నామినేషన్లు దాఖలు చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఈనెల 20వ తేదీ వరకూ నామినేషన్లకు గడువు ఉంది. గత 2011 ఎన్నికలతో పోలిస్తే ఈసారి గ్రాడ్యుయేట్ ఓటర్లు, ఉపాధ్యాయ ఓటర్లు చీలే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో అధికార టిడిపి అభ్యర్థి కెజె.రెడ్డితో పాటు వైకాపా, సిపిఎం, కాంగ్రెస్ అభ్యర్థులు బరిలో నిలుస్తున్నారు. అలాగే ఉపాధ్యాయ ఎన్నికల్లో కూడా టిడిపి అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్యతోపాటు ఐదారుగురు అభ్యర్థులు బరిలో నిలిచే అవకాశం ఉంది. దీంతో అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్షం వైకాపాకు చెందిన అభ్యర్థుల మధ్య పోటీ నెలకొనే అవకాశం ఉంది.
ప్రతి పిటీషన్ నమోదు చేయాల్సిందే..
* బాధితులను తిప్పి పంపితే చర్యలు..
* ఎస్పీ రాజశేఖర్‌బాబు

అనంతపురం, ఫిబ్రవరి 15 : భర్త అదృశ్యమయ్యాడనో, వ్యక్తి అపహరణకు గురయ్యాడనో.. ఇతరత్రా ఎలాంటి సమస్యతోనైనా బాధితులు పోలీసు స్టేషన్‌కు వచ్చిన వెంటనే పిటీషన్‌ను ఎంటర్‌ప్రైజెస్ ఈకాప్స్‌లోని పిటీషన్ మేనేజ్‌మెంట్‌లో నమోదు చేయాలని ఎస్పీ ఎస్‌వి.రాజశేఖరబాబు సిబ్బందిని ఆదేశించారు. జిల్లాలోని డిఎస్పీలు, స్టేషన్ హౌస్ అధికారులతో బుధవారం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్ వర్కింగ్ సిస్టమ్(సిసిటిఎన్‌ఎస్)పై సమీక్షించారు. ముందుగా సిసిటిఎన్‌ఎస్ పనితీరుపై లోతుగా సమీక్షించారు. స్టేషన్ల వారీగా ఆయా ఎస్‌హెచ్‌ఓల పనితీరును పురోగతి గణాంకాల పట్టికను ప్రొజెక్టర్ ద్వారా పరిశీలించారు. మెరుగైన పనితీరు కనబర్చిన పోలీసు అధికారులను ప్రశంసించారు. అదే సమయంలో వెనుకబడిన అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాధితులు ఇస్తున్న పిటిషన్‌లో క్రిమినల్ కోణం లేదని, సివిల్ అని, లేక తన పరిధిలోకి రాదని వెనక్కి పంపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. పిటీషనర్ ఎవరైనా వారిచ్చే పిటీషన్‌ను సిసిటిఎన్‌ఎస్‌లో అంతర్భాగమైన పిటీషన్ మేనేజ్‌మెంట్ మాడ్యూల్‌లోకి వెళ్లి నమోదు చేయాలన్నారు. జిల్లా నలుమూల నుంచి వివిధ సమస్యలతో ప్రజలు తన వద్దకు వస్తుంటారని, చాలా వరకూ సంబంధిత పోలీసు స్టేషన్లకు వెళ్లి, తన వద్దకు రావడం పరిపాటిగా మారిందన్నారు. ఆ సమయంలో సదరు పిటీషన్‌ను సంబంధిత పోలీసులు పిటీషన్ మేనేజ్‌మెంట్‌లో నమోదు చేయకపోతే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. పిటీషన్ మేనేజ్‌మెంట్ కోసం ప్రతి పోలీసు స్టేషన్లో రిసిప్షనిస్టుతోపాటు కమ్యూనిటీ పోలీసు ఆఫీసర్ (సిపిఓ) సేవలు వినియోగించుకుంటామని చెప్పారు. సిపిఓ కోసం త్వరలో ఓ యాప్‌ను రూపొందిస్తున్నట్లు తెలిపారు. రిసెప్షనిస్టులకు సహకారం అందించడం, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, రోడ్డు ప్రమాదాలపై చైతన్యం, పర్వదినాలు, రథోత్సవాల్లో బందోబస్తు సేవలు.. ఇలా జిల్లా పోలీస్ సిపిఓల సహకారాన్ని తీసుకోనున్నట్లు తెలిపారు. ఒక పోలీస్- ఒక నిఘా కార్యక్రమాన్ని కిందిస్థాయి నుంచి అధికారుల వరకు మంచిగా అమలు చేయాలని కోరారు. ఇటీవల నిర్వహించిన లోక్ అదాలత్‌లో జిల్లా పోలీసుల కృషి అమోఘమని ప్రశంసించారు. రాష్ట్రంలో నాల్గవ స్థానంలో కేసుల పరిష్కారం చూపగలిగామన్నారు. యుఐ (అండర్ ఇనె్వస్టిగేషన్) కేసులు బాగా తగ్గించాలన్నారు. అలాగే జి-2 పిటీషన్లను ఎస్పీ సమీక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు కె.మాల్యాద్రి, శ్రీనివాసరావు, డిఎస్పీలు జె.మల్లికార్జునవర్మ, సుబ్బారావు, వేణుగోపాల్, రవికుమార్, శివరామిరెడ్డి, వెంకటరమణ, చిదానందరెడ్డి, వెంకట రామాంజనేయులు, రనసింగప్ప, ఖాసీంసాబ్, నర్సింగప్ప, మహబూబ్‌బాషా, వెంకటేశ్వర్లు, చిన్నికృష్ణ, స్పెషల్ బ్రాంచి ఇన్‌స్పెక్టర్ జి.రాజశేఖర్, లీగల్ అడ్వయిజర్ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎస్పీ సిసి మురళీమోహన్, పలువురు సిఐలు, ఎస్‌హెచ్‌ఓలు, తదితరులు పాల్గొన్నారు.

‘పురం’ టిడిపి సంస్థాగత
ఎన్నికల పర్యవేక్షకుడిగా కృష్ణమూర్తి
* నేతల మధ్య సఖ్యత కుదిర్చేనా..
హిందూపురం, ఫిబ్రవరి 15 : తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సంస్థాగత ఎన్నికలకు పర్యవేక్షకుడిగా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో చురుగ్గా పనిచేస్తున్న కృష్ణమూర్తిని నియమించారు. గత కొద్దిరోజులుగా నియోజకవర్గ టిడిపిలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో గురువారం విచ్చేస్తున్న కృష్ణమూర్తికి సవాల్‌గా మారనుంది. అసమ్మతి సెగలు తీవ్రస్థాయికి చేరుకోగా సంస్థాగత ఎన్నికల కమిటీలను కృష్ణమూర్తి ఎలా భర్తీ చేస్తారో అన్న విషయం చర్చనీయాంశమవుతోంది. ఇటీవలే పిఏ శేఖర్‌పై నియోజకవర్గంలోని టిడిపి అసమ్మతి వర్గం తప్పించడంలో సఫలం కాగా తాజాగా చిలమత్తూరు, లేపాక్షి ఎంపిపిలపై కూడా తమ వైఖరిని అదే ధోరణి ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. నియోజకవర్గంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు రెండు వర్గాలు చీలి పోగా సంస్థాగత ఎన్నికల నిర్వహణ పర్యవేక్షకుడిగా తలనొప్పిగా మారే అవకాశాలు లేకపోలేదు. అసమ్మతి వర్గం నాయకులు కూడా సంస్థాగత ఎన్నికల్లో తమ వర్గీయులకే ప్రాధాన్యత కల్పించాలని పట్టుదలతో వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. హిందూపురం నియోజకవర్గంపై అంతగా అవగాహన లేని కృష్ణమూర్తి ఇక్కడికి వచ్చి ఎలా సయోధ్య కుదుర్చుతారోనన్న విషయం కార్యకర్తల్లో నెలకొంది. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను కృష్ణమూర్తి కలిసి నియోజకవర్గంలో సంస్థాగత ఎన్నికల నిర్వహణపై చర్చించినట్లు సమాచారం. అయితే టిడిపికి విధేయులుగా ఉంటున్న వారికే కమిటీల్లో ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించినట్లు చర్చ తెలుస్తోంది. కాగా చిలమత్తూరు, లేపాక్షి మండలాల్లో అసమ్మతి వర్గం దాదాపు పూర్తిస్థాయిలో పైచేయి కనబర్చుతుండగా కృష్ణమూర్తి ఎవరి సూచనలు పరిగణనలోకి తీసుకోవాలోనన్న తర్జనభర్జనలో ఇప్పటికే ఉన్నట్లు సమాచారం. ఏదిఏమైనా నియోజకవర్గంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై కృష్ణమూర్తి ఎలా ముందడుగు వేస్తారు.. కమిటీలను ఎలా భర్తీ చేస్తారోనన్న చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది.

కెజె.రెడ్డికే ఎన్జీఓల మద్దతు
* రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు
అనంతపురం కల్చరల్, ఫిబ్రవరి 15: పశ్చిమ రాయలసీమ పట్ట్భద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో ఎన్జీఓల సంఘం కెజె.రెడ్డిని బలపరుస్తున్నట్లు ఎన్జీఓల సంఘం రాష్ట్ర అధ్యక్షులు అశోక్‌బాబు పేర్కొన్నారు. ఈమేరకు నగరానికి వచ్చిన ఆయన బుధవారం ఎన్జీఓ హోమ్‌లో విలేఖరులతో మాట్లాడారు. ఎన్జీఓ సంఘం అధ్యక్షులుగా తనను తిరిగి ఎన్నుకున్నందుకు ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. ఎన్జీఓ సంఘానికి ఏ పార్టీతో సంబంధం లేదన్నారు. కెజె.రెడ్డికి ఉద్యోగ వర్గంతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా స్థానిక ఎన్జీఓ నాయకుల అభిప్రాయం మేరకు తాము ఆయనకు మద్దతునిస్తున్నామన్నారు. కెజె.రెడ్డిని గెలిపించడం ద్వారా పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి, ఉద్యోగాల కల్పనకు తోడ్పడాలన్నారు. వనరుల్ని సద్వినియోగపరిస్తే రాయలసీమ తప్పక అభివృద్ధి సాధిస్తుందన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో తాము రాజీ లేని పోరాటం చేస్తామన్నారు. ప్రత్యేక హోదా కోసం ఉద్యోగులు ఉద్యమిస్తే ప్రభుత్వానికి నష్టమే తప్ప లాభం లేదన్నారు. ఈ సందర్భంగా కెజె.రెడ్డి మాట్లాడుతూ తనకు ఎన్జీఓ సంఘం మద్దతు తెలపడం పట్ల అభినందనలు తెలిపారు. రాయలసీమను పరిశ్రమల సీమగా మార్చేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, నాయకులు రామకృష్ణారెడ్డి, ప్రసాద్, నరసింహులు, వెంకటనరసయ్య, శివారెడ్డి, వెంగళ్‌రెడ్డి, చవ్వా ఆదినారాయణ, శ్రీనివాసులు, కుళ్లాయప్ప, వెంకటేష్‌బాబు పాల్గొన్నారు.

ఎసిబి వలలో అవినీతి చేప
* లంచం తీసుకుంటూ పట్టుబడిన ట్రాన్స్‌కో లైన్‌మెన్
ధర్మవరం, ఫిబ్రవరి 15: అవినీతి అధికారులపై ఎసిబి పంజా విసురుతోంది. దీంతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఒక రైతు నుండి రూ.6వేలు లంచం తీసుకుంటు బుధవారం రెడ్‌హ్యాండెడ్‌గా విద్యుత్ లైన్‌మెన్ దొరికిపోయాడు. అవినీతి నిరోధక శాఖ కర్నూలు డిఎస్‌పి జయరామరాజు తెలిపిన వివరాల మేరకు ధర్మవరం మండలం ముచ్చురామి గ్రామానికి చెందిన రైతు నాగిరెడ్డి కుమారుడు రామ్మోహన్‌రెడ్డి దాదలూరు సమీపంలో వ్యవసాయ బోరుకు విద్యుత్ లైన్‌ను అమర్చడానికి 2013నుండి విద్యుత్ అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతుండేవాడు. బోరులో నీళ్లు వున్నా విద్యుత్ లైన్లు లేకపోవడంతో అధికారులకు రైతు మొరపెట్టుకున్నా విద్యుత్ కనెక్షన్‌ను ఇవ్వలేదు. లంచం ఇస్తేనే విద్యుత్ కనెక్షన్ అమరుస్తామని సదరు రైతును లైన్‌మెన్ ఆదినారాయణ డిమాండు చేయడంతో రైతు రామ్మోహన్‌రెడ్డి చేసేదేమీ లేక రూ.6వేలు లంచం ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుని అవినీతి నిరోధక శాఖ అధికారులకు సమాచారం అందించాడు. మామిళ్ళపల్లిలోని ప్రాథమిక పాఠశాల దగ్గర రైతు నుండి లైన్‌మెన్ ఆదినారాయణ రూ.6వేలు లంచం తీసుకుంటు పట్టుబడ్డాడన్నారు. అనంతరం ఏసిబి అధికారులు అవినీతి డబ్బును స్వాధీనం చేసుకుని లైన్‌మెన్ ఆదినారాయణను అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు డిఎస్‌పి తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ ఖాదర్‌బాషా, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా ఖాద్రీశుని బ్రహ్మోత్సవాలు
* మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్
కదిరి, ఫిబ్రవరి 15: శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అందరి సహకారంతో అంగరంగ వైభవంగా నిర్వహిద్దామని మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం ఆలయ ప్రాంగణం లో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమావేశం పాలక మండలి ఛైర్మన్ పచ్చిపులుసు నరేంద్రబాబు అధ్యక్షతన జరగగా ముఖ్య అతిథులుగా కందికుంటతోపాటు మాజీ ఎమ్మెల్యే ఎం.ఎస్ పార్థసారథి, బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్థన్‌రెడ్డి, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ గుడిసె దేవానంద్, కదిరి డిఎస్పీ వెంకటరామాంజినేయులు, సిఐ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కందికుంట మాట్లాడుతూ గతంలో నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించామని, అదేస్ఫూర్తితో మరిం త గొప్పగా నిర్వహిద్దామన్నారు. డిఎ స్పీ వెంకటరామాంజనేయులు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలు ప్రారంభం మార్చి 7 నుండి 21వ తేదీ వరకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తమ శాఖ నుండి చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిత్యం ఆలయం బయట ఒక ఔట్‌పోస్ట్, ఆలయంలో పోలీస్ సిబ్బంది పర్యవేక్షణ వుంటుందన్నారు. బ్రహ్మోత్సవం రోజున తిరువీధుల నుండి బ్రహ్మ రథోత్సవం తిరిగి యథాస్థానానికి చేరినప్పుడు తేరులో స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా విఐపిలకు పాసులు కేటాయించాలని డిఎస్పీ కోరారు. మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలు సందర్భంగా పారిశుద్ధ్యానికి ఎటువంటి లోటు తలెత్తకుండా మాస్టర్ ప్లాన్ తయారుచేసి తగు చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే ఇతర మున్సిపాలిటీల నుండి కార్మికులను పిలిపించి పారుశుద్ధ్యం చర్యలు చేపడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ గోపాలుడు, డిఈ వెంకటరమణ, వివిధ శాఖల అధికారులు, పాలక మండలి సభ్యు లు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
అంతా మీ ఇష్టమేనా..
* ట్రేడ్ ఫీజు తక్కువగా విధించడం పట్ల ‘పురం’ కమిషనర్ ఆగ్రహం
హిందూపురం టౌన్, ఫిబ్రవరి 15 : అంతా మీ ఇష్టమేనా.. ప్రభుత్వ నిబంధనలు పాటించరా.. వ్యాపారుల ట్రేడ్ లైసెన్సు ఫీజులు ఇష్టారాజ్యంగా తగ్గించడం ఏంటని మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ స్థానిక శానిటరీ సిబ్బందిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశా రు. బుధవారం పట్టణంలోని కార్యాలయంలో సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యాపారులు చేస్తున్న కార్యకలాపాలు, లావాదేవీలను ఏమాత్రం పట్టించుకోకుండా పెరిగిన ఫీజుల వివరాలను వ్యాపారులకు తెలియజేయకుండా ఎ ందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని మందలి ంచారు. తక్కువగా ట్రేడ్ ఫీజు విధించిన బిల్ కలెక్టర్లకు మెమోలు జారీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. త్వరితగతిన వ్యాపారులకు నోటీసులు జారీ చేసి ట్రేడ్ లైసెన్సు ఫీజులు వసూలు చేయాలని ఆదేశించారు. అలాగే పట్టణంలో దీర్ఘకాలికంగా బకాయి ఉన్న ఆస్తి, నీటి పన్నుల బకాయిదారులను కలిసి పన్నులు చెల్లించేలా చూడాలన్నారు. ఆస్తి, నీటి పన్నులు తదితర వా టి వసూలు కోసం పట్టణ వ్యాప్తంగా 10 ప్రత్యేక బృందాలను నియమించామని, వారు రోజువారీ లక్ష్యాలను తప్పనిసరిగా వసూలు చేయాలన్నారు. ముఖ్యంగా ఆస్తి పన్నుతోపాటు తప్పనిసరిగా నీటి పన్ను తదితర పన్నులను కూడా వసూలు చేయాలని, లేనిపక్షంలో శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మున్సిపల్ పరిధిలో వందశాతం పన్నులు వసూలు చేయడం లక్ష్యంగా ఉందన్నారు. ఈ దిశగా రెవెన్యూ, ఇంజినీరింగ్, శానిటరీ విభాగం ఉద్యోగులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్వో సాంబశివ తదితర బిల్ కలెక్టర్లు ఉన్నారు.
వైభవంగా అనఘాష్టమి వ్రతం
పామిడి, ఫిబ్రవరి 15: శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంత స్వామీజి వారి స్వహస్తాల మీదుగా స్థాపించబడిన 3శ్రీశ్రీశ్రీ ఆనఘా ఆత్రేయ దత్త పాదుకాక్షేత్రం2 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీశ్రీశ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజి ఆశీస్సులతో శ్రీ అనఘా ఆత్రేయ దత్త దేవాలయం నందు బుధవారం శ్రీ దత్తాత్రేయులకు అత్యంత ప్రియమైన అనఘాష్టమి వ్రతాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం శ్రీ అనఘా ఆత్రేయ దత్తమూర్తులకు, శ్రీ గురుపాదుకలకు, శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలతో శ్రీ దత్త హోమాన్ని ప్రారంభించి పూర్ణాహుతి అనంతరం అనఘాష్టమి వ్రతాన్ని నిర్వహించారు. సామూహిక 3హనుమాన్ చాలీసా2 పారాయణం, మహామంగళహారతి అనంతరం అన్నదానం చేపట్టారు. శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజి 75వ జయంతోత్సవాన్ని పురస్కరించుకుని సాయంత్రం శ్రీశ్రీ గురుదత్త సేవా సమితి సభ్యులు 75 భజన పాటలతో సంగీత సేవను నిర్వహించగా భజన పాటలు పలువురిని ఆకట్టుకున్నాయి. భక్తులు ప్రత్యేక పూజలను చేపడుతూ అనఘాష్టమి వ్రతాన్ని నిర్వహిస్తూ శ్రీ దత్తాత్రేయ స్వామివారి కృపకు పాత్రులయ్యారు. భక్తుల రద్దీతో దేవాలయం కిటకిటలాడింది. శ్రీ గురుదత్త సేవా సమితి సభ్యులు శ్రీ్ధర్ మాట్లాడుతూ 1984లో మైసూర్ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజివారు అనఘా వ్రతాన్ని పరిచయం చేశారంటూ అప్పటి నుండి పామిడిలోని 8 కుటుంబాలు సంవత్సరంపాటుగా ప్రతి నెల వారి గృహాల్లోనే చేయాలని ఉద్భోదించగా ఇప్పటికీ అనఘా వ్రతాన్ని చేయటం జరుగుతుందని తెలిపారు. పాపాలను హరించటం కోసమై అనఘా వ్రతాన్ని చేపట్టడం జరుగుతుందని ఆయన వెల్లడించారు.
వైభవంగా వేంకటరమణస్వామి కల్యాణం
హిందూపురం టౌన్, ఫిబ్రవరి 15 : పట్టణంలోని బాలాజీనగర్‌లో వెలసిన వేంకటరమణస్వామి ఆలయంలో బుధవారం కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాత సేవతో పూజలు ప్రారంభమయ్యాయి. మూలవిరాట్ వేంకటరమణస్వామి విగ్రహాన్ని వివిధ రకాల ఆభరణాలు, పుష్పాలతో అలంకరించి పూజలు చేశారు. అదేవిధంగా ఉత్సవ విగ్రహాలను అలంకరించి వేద పండితుల మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ కల్యాణోత్సవం నిర్వహించారు. మహా మంగళహారతి అనంతరం భక్తులకు తీర్థ, ప్రసాద వినియోగం, అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
పిడిఎఫ్ అభ్యర్థులను బలపరచండి
* ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు
అనంతపురం కల్చరల్, ఫిబ్రవరి 15: రాష్ట్రంలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్ట్భద్రులు, టీచర్స్ నియోజకవర్గాల నుండి పోటీ చేయుచున్న పిడిఎఫ్ అభ్యర్థులను బలపరచాలని ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈమేరకు ప్రెస్‌క్లబ్‌లో బుధవారం విలేఖరులతో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పిడిఎఫ్ ఎమ్మెల్సీలు కృషి చేస్తున్నారన్నారు. పట్ట్భద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి పోటీ చేస్తున్న డా.గేయానంద్‌ను తిరిగి గెలిపించాలని ఆయన కోరారు. అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీ స్థానం నుండి పోటీ చేస్తున్న కత్తి నరసింహారెడ్డిని కూడా బలపరచాల్సిందిగా ఆయన కోరారు. విద్య, వైద్య రంగాల్లో వౌళిక సౌకర్యాల కల్పన, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న ఆందోళనల్లో వారికి తాము బాసటగా నిలుస్తున్నట్లు తెలిపారు. వీరికి మద్దతు తెలియచేస్తున్నట్లు ఎఐటియుసి జిల్లా అధ్యక్షురాలు శకుంతలమ్మ, సిఐటియు ఇఎస్.వెంకటేష్, ఎస్‌ఎఫ్‌ఐ నూర్‌మహమ్మద్, ఎఐఎస్‌ఎఫ్ రాజేష్, డివైఎఫ్‌ఐ ఆంజనేయులు, సిపిఎం నల్లప్ప, దిల్షాద్, వలి, బాలకృష్ణ తదితరులు పేర్కొన్నారు.
ముగిసిన సేవాలాల్ మహరాజ్ జయంత్యోత్సవాలు
గుత్తి, ఫిబ్రవరి 15 : మండల పరిధిలోని చెర్లోపల్లి గ్రామ సమీపంలో రెండు రోజులుగా జరుగుతున్న శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంత్యోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహాభోగ్ కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సందీప్ చౌహాన్, ట్రస్టు ఉపాధ్యక్షులు కేశవనాయక్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా బంజారాల సంప్రదాయ రీతిలో హో మం చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ అఖిల భారత బంజారాలు సేవాలాల్ మహారాజ్ మార్గంలో పయనించాలన్నారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడడానికి మూఢవిశ్వాసాలే కారణమన్నారు. సేవాఘడ్‌ను ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి అందరూ కలసి రావాలన్నారు. అనంతరం సేవాలాల్ మహారాజ్ జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ మహరాజ్ ఛారిటబుల్ ట్రస్టు రాష్ట్ర నాయకులు రిటైర్డ్ ఐజి జగన్నాథరావు, కర్నాటక మాజీ మంత్రి గోవిందనాయక్, అమర్‌సింగ్ తిలావత్, అశ్వర్థనాయక్, లాల్యనాయక్, సుబ్రమణ్యం నాయక్‌తోపాటు మండలానికి చెందిన అన్ని ప్రభుత్వ శాఖలు పాల్గొన్నారు.
నేర రహిత అనంతకు కృషి
* ఎస్పీ రాజశేఖరబాబు
అనంతపురం కల్చరల్, ఫిబ్రవరి 15: నేర రహిత అనంతగా నగరాన్ని తీర్చిదిద్దుటలో యువత భాగస్వామ్యం కీలకమని ఎస్పీ రాజశేఖరబాబు పేర్కొన్నారు. సేఫ్ అనంత కోసం జిల్లా పోలీసులు వినూత్నంగా ప్రవేశపెట్టిన లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టంపై విద్యార్థులకు బుధవారం పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విధుల్లో జోడించి జిల్లా పోలీస్ యంత్రాంగం ఎన్నో వినూత్న యాప్‌లు తయారుచేసిందన్నారు. పోలీస్ సంకల్పించిన మేరకు ఆ స్థాయిలో ప్రజల నుంచి స్పందన రావడం లేదన్నారు. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం దేశంలో ఎక్కడా లేదని, ఈ సేవలు వినియోగిస్తే నేరాలకు పూర్తిగా అడ్డుకట్ట వేయవచ్చన్నారు. ఇంటికి తాళం వేసి ఊళ్లకు వెళ్లే సమయంలో లాక్డ్ సిస్టం యాప్ ద్వారా రిక్వెస్ట్ పంపితే చాలన్నారు. ఈ యాప్ విధి విధానాలను ప్రొజెక్టర్ ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ మల్లికార్జున, ఇన్‌స్పెక్టర్లు రాజవేఖర్, మన్సూరుద్దీన్, ఆర్‌ఎస్‌ఐ జాన్ జోసెఫ్, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం యాప్‌ను రూపొందించిన మణికంఠ, నగరంలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.
మహిళా లాయర్ దారుణహత్య
కణేకల్లు, ఫిబ్రవరి 15 : పట్టణంలోని మార్కెట్ పాఠశాల ప్రాంత సమీపంలో కాపురం ఉంటున్న మహిళా లాయర్ సునీత (28) బుధవారం దారుణహత్యకు గురైంది. గుర్తు దుండగులు ఆమె ఇంట్లోకి చొరబడి గొంతు కోయడంతో అక్కడిక్కడే మృతి చెందింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు పట్టణానికి చెందిన హరీష్, ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన ఖమ్మం జిల్లాకు చెందిన సునీతను 2012 జూన్ 15న పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి భర్త హరీష్ స్వగృహంలో కాపురం ఉంటున్నారు. అయితే హరీష్ అమ్మమ్మకు చెల్లెలు (చిన్న అవ్వ) బెంగుళూరుకు చెందిన సుశీలమ్మ చెందిన వారికి కణేకల్లు ప్రాంతంలోని సర్వేనెంబర్ 1125లోని 2.57 ఎకరాల మాగాణి భూమికోసం ఆస్థి తగాదాలు ఉన్నాయి. ఈవివాదంపై లాయర్ సునీత కేసును చేపట్టిందన్నారు. ఈ విషయంపై గతంలో సునీతాతోపాటు భర్త హరీష్‌పై దాడిచేసి గాయపరిచినట్లు తెలిపారు. ఈనెల 1న కూడా ఇంజక్షన్ ఆర్డర్‌ను ఆ భూమిపై తీసుకొచ్చారని తెలిపారు. ఈ విషయంపైనే ప్రత్యర్థులు ఈదారుణానికి పాల్పడి ఉంటారని భర్త హరీష్ వాపోయాడు. అయితే కొంతమందితో సునీత చేసిన సెటిల్‌మెంట్ల వల్ల కూడా జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సిఐ చలపతిరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి హత్యకు కారణాలను భర్త హరీష్‌తో ఆరాతీశారు. ఎస్‌ఐ యువరాజు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
బస్సు బోల్తా.. 12 మందికి తీవ్ర గాయాలు
* ఇద్దరి పరిస్థితి విషమం
తనకల్లు, ఫిబ్రవరి 15: మండల పరిధిలోని దేవళంతండా వద్ద బుధవారం జిటిఆర్ ప్రైవేటు బస్సు ముందు చక్రం టైరు పగిలి బోల్తాపడింది. ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న అమడగూరు మండలం లోకోజుపల్లికి చెందిన తలారి లక్ష్మణ్ణ, అదే మండలం మల్లేపల్లికి చెందిన చక్కిరమ్మల పరిస్థితి విషమంగా వుంది. అలాగే శ్యామలమ్మ, వేణుగోపాల్‌రెడ్డి, కవిత, తిమ్మమ్మ, ఆదెప్ప, వెంకటరమణ, ఆదెమ్మ, సాంబశివారెడ్డిలకు తీవ్ర గాయాలు కాగా వీరందరిని చికిత్స నిమిత్తం కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్నాటక రాష్ట్రం బాగేపల్లి నుండి తనకల్లు మండలం కొక్కంటి క్రాస్‌కు వస్తుండగా దేవళంతండా సమీపంలోకి రాగానే ఒక్కసారిగా బస్సు ముందు వున్న టైరు పగలడంతో బస్సు బోల్తా పడింది. పరిస్థితి విషమంగా వున్న లక్ష్మణ్ణ, చక్కిరమ్మలను వైద్య సేవల కోసం 108 వాహనంలో కదిరికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.
చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి
రొళ్ల, ఫిబ్రవరి 15 : మండలంలోని వన్నప్పపాళ్యంకు చెందిన పాండురంగప్ప (60) బుధవారం చింతచెట్టుపై నుండి పడి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. పాండురంగప్ప చింతకాయలు దులిపేందుకు క్యాతప్పపాళ్యంలో చింతచెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు కాలు జారి కిందకు పడిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయన్ను చికిత్స నిమిత్తం హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆధునిక సౌకర్యాలతో దంత వైద్యశాల
అనంతపురం కల్చరల్, ఫిబ్రవరి 15: ఆధునిక సౌకర్యాలతో కూడిన దంత వైద్యశాల శ్రీ సాయి అపోలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను నగరంలో ప్రారంభించారు. దంత వైద్యులు డా. జి.సుబ్బారెడ్డి, డా.జి.సరస్వతి ఆర్థోడెంటిక్ అండ్ ఇంప్లాంటాలజీ సెంటర్‌తో కూడిన దంత వైద్యశాలను నిర్మించారు. సూర్యనగర్ ధర్మవరం బస్టాప్ ఎదురుగా నిర్మించిన వైద్యశాలను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా దంత వైద్యులు మాట్లాడుతూ దంతాలకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు అత్యాధునిక పరికరాలతో కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించడమే ధ్యేయంగా దంత వైద్యశాలను నిర్మించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పదవీ విరమణ అయిన వారికి, జర్నలిస్టు హెల్త్ కార్డు ఉన్న వారికి, వారి కుటుంబ సభ్యులకు అన్ని రకాల దంత వైద్య చికిత్సలు క్యాష్‌లెస్ పద్ధతిలో అందించబడునని తెలిపారు. సామాజిక సేవలో భాగంగా అనాద శరణాలయంలోని వారికి, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచితంగా దంత పరీక్షలతోపాటు దంత వైద్య సేవలు అందిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డా.దీప్తి, సిబ్బంది శివకుమార్, శిల్ప, అనిల్‌కుమార్, షమీమ్, నాయక్, సోని పాల్గొన్నారు.
వరదయ్య పద్మశాలీయ కమ్యూనిటీ హాల్ ప్రారంభం
తాడిపత్రి, ఫిబ్రవరి 15: స్థానిక సిబి రోడ్‌లోని శ్రీ మార్కెండేయ స్వామి ఆలయం పక్కన నూతనంగా నిర్మించిన శ్రీ వరదయ్య పద్మశాలీయ కమ్యూనిటీ హాల్‌ను బుధవారం పార్లమెంటు సభ్యులు జెసి దివాకర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎంపి జెసి మాట్లాడుతూ కమ్యూనిటీ హాల్‌లో ఆధునిక పద్దతులతో మినరల్ వాటర్‌ప్లాంట్, స్టీమ్ కుకింగ్ ప్లాంట్‌లను ఏర్పాటుచేశారని పేర్కొన్నారు. కమ్యూనిటీ హాల్‌ను అత్యాధునికంగా వద్ది శివసత్యనారాయణ తీర్చిదిద్దారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్‌పర్సన్ వెంకటలక్ష్మి, మార్కెట్ యార్డు మాజీ చైర్మెన్ భోగాతి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా శ్రీ రామలింగేశ్వర
ఆలయ ప్రారంభోత్సవం
బుక్కరాయసముద్రం, ఫిబ్రవరి 15: బుక్కరాయసముద్రం మండలం సిద్దరాంపురం పంచాయతీ పరిధిలోని యస్.కొండాపురం గ్రామంలో వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ గోపురాలను, బండలను నూతనంగా తీర్చిదిద్దారు. ఆలయంలో బుధవారం ఘనంగా ప్రారంభోత్సవ పూజా కార్యకమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం మహాగణపతి పూజ, స్వస్తి పుణ్యవచనము, కలశ స్థాపన, అంకురార్పణ, నవగ్రహాధారణ పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు పి.హనుమంతరెడ్డి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. నేడు పూజదీక్ష హోమం, విష్ణుగాయత్రి హోమం, రుద్ర హోమం, మహాఘట్ట్భాషేకం, అమ్మవార్లకు మహామంగళహారతి, 17వ తేదీ అన్నదానం, రాతిదూలం లాగుడు పోటీలను కూడా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.

ప్రపంచ అగ్రదేశాల సరసన నిలిచిన భారత్
తాడిపత్రి, ఫిబ్రవరి 15: భారతదేశ ఖ్యాతి ప్రపంచ దేశాలకు చాటి చెప్పి, రోదసి యాత్రల్లో ఆరితేరిన అగ్ర దేశాల సరసన భారత్‌ను నిలిపిన ఇస్రో శాస్తవ్రేత్తలకు భారతదేశ ప్రజలంతా గౌరవంగా సెల్యూట్ చేయాలని బిజెపి జిల్లా అధ్యక్షులు పేర్కొన్నారు. పిఎస్‌ఎల్‌వి-సి 37 ప్రయోగం విజయవంతం కావడంతో బుధవారం గాంధీ సర్కిల్‌లో బిజెపి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వహిందూపరిషత్‌ల ఆధ్వర్యంలో టపాసులు పేల్చి స్వీట్లు పంచి సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమంలో బిజెవైఎం జిల్లా అధ్యక్షులు హరీష్‌రెడ్డి, బిజెపి నాయకులు రంగనాథరెడ్డి, అంజి, రజాక్‌వలి, ఆర్‌ఎస్‌ఎస్ ఖండఛాలక్ చిరంజీవులు, సుబ్రహ్మణ్యం, విహెచ్‌పి నాయకులు లక్ష్మినారాయణ, శేషుఫణి, రాజారెడ్డి పాల్గొన్నారు.

అట్టహాసంగా వైసిపి అభ్యర్థి నామినేషన్
అనంతపురం సిటీ, ఫిబ్రవరి 15: పట్ట్భద్రులు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న వెన్నపూజ గోపాల్‌రెడ్డి బుధవారం అట్టహాసంగా నామినేషను దాఖలు చేశారు. బుధవారం స్థానిక వైఎస్‌ఆర్‌సిపి జిల్లా కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి, పట్ట్భద్రుల ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, వైసిపి జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, ఎమ్మెల్యే విశే్వశ్వరరెడ్డి, మాజీ మేయర్ రాగే పరుశురామ్‌లతో కలసి నామినేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత సమస్యల పరిష్కారానికి, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. వైసిపి నాయకులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సుబ్బారెడ్డి నామినేషన్
పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కెవి.సుబ్బారెడ్డి బుధవారం నామినేషన్‌ను దాఖలు చేశారు. మొట్టమొదటిగా ఎమ్మెల్సీ నామినేషన్ వేశారు. అంతకుముందు నగరంలోని వైసిపి కార్యాలయం నుండి ఉపాధ్యాయులు, వైఎస్‌ఆర్‌టిఎఫ్ రాష్ట్ర కన్వీనర్ ఓబుళపతి, మూడు జిల్లాల వైఎస్‌ఆర్‌టిఎఫ్ నాయకులతో కలసి కెవి.సుబ్బారెడ్డి నామినేషన్‌ను దాఖలు చేశారు. ఈ సందర్భంగా కెవి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల సాధనలో ఉద్యమించి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఓబుళపతి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల సాధనకు కెవి సుబ్బారెడ్డి కృషి చేస్తారని, అందుకే ఆయనకు వైఎస్‌ఆర్‌టిఎఫ్ మద్దతు తెలుపుతోందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌టిఎఫ్ మూడు జిల్లాల నాయకులు గిరిధర్‌రెడ్డి, రమేష్, సుబ్రహ్మణ్యం, పుల్లారెడ్డి, గోవిందరెడ్డి, శ్రీనివాసులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలి

అనంతపురం సిటీ, ఫిబ్రవరి 15: ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు ఎన్నికల విధులను నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ కోన శశిధర్ అధికారులకు సూచించారు. బుధవారం స్థానిక మెడికల్ కళాశాల ఆడిటోరియంలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ, ప్రవర్తనా నియమావళి తదితర అంశాలపై అధికారులతో సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలై, నామినేషన్ల స్వీకరణ జరుగుతోందన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేయడం జరిగిందన్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా జెసి వ్యవహరిస్తారన్నారు. జిల్లలో 184 పోలింగ్ స్టేషన్లును ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాటుచేశామని, మండలానికి 1, 2 స్టేషన్లును, మున్సిపల్ పరిధిలో ఎక్కువ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటచేశామన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో పరిస్థితిని విశే్లషించి, నిస్సహాయత నివేదికను రూపొందించాలన్నారు. పోలీసులు, రెవిన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లాలో 51 రూట్లు ఏర్పాటు చేశామని, 51 రూట్లకు 51 మంది సెక్టోరల్ అధికారులుగా నియమించామని, ఒక్కొక్క అధికారి పరిధిలో 4 పోలింగ్ స్టేషన్లు వుంటాయని, వీటిని నివేదిక రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. ఫ్లెక్సీలు, పోస్టర్లు ఎక్కడాపడితే అక్కడ అంటించకూడదన్నారు. అలాగే గోడ మీద రాతలు కూడా ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారని, వాటిని కట్టడి చేయాలని అధికారులను ఆదేశించారు. అక్రమ నగదు, మద్యం పంపిణీని నిరోధించాలన్నారు. పొరుగు రాష్ట్రాల నుండి అక్రమ నగదు, మద్యం రాకుండా చెక్‌పోస్టులు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. ఈసారి బ్యాలెట్ పేపర్‌పై అభ్యర్థి ఫొటో కూడా ఉంటుందని, డమీ అభ్యర్థులకు ఉపయోగం ఉండదని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లోకి మీడియాను అనుమితంచకూడదని, ద్వారం దగ్గర నుండే లోపలి దృశ్యాలు, ఫొటోలు తీసుకోవచ్చునని సూచించారు. అనంతరం ఎస్పీ రాజశేఖర్‌బాబు మాట్లాడుతూ ఓటర్లు నిర్భయంగా ఓటేసేలా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు.