అనంతపురం

చెదిరిన గూడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లమాడ, అక్టోబర్ 14: జిల్లాలో కురుస్తున్న వర్షాలకు పేదోళ్ల గూళ్లు చెదురుతున్నాయి. చిన్న చిన్న కుటుంబాలు తలదాచుకుంటున్న పాత మిద్దెలు, కొట్టాలు నేలకొరుగుతున్నాయి. భారీ వర్షాలైనా, తుఫానులైనా పేదవాళ్ల నిలువ నీడపై గ్రహణం పడుతుండటం పరిపాటిగా మారింది. కురుస్తున్న వర్షాల కారణంగా ఆత్మకూరు మండలంలో 106, గుత్తి మండలంలో52, నార్పల మండలంలో 33, పెద్దవడగూరు మండలంలో 108, శింగనమల మండలంలో 68, తాడిపత్రి మండలంలో 34, వజ్రకరూరు మండలంలో 65, ఉరవకొండ మండలంలో75, పామిడి మండలంలో 150, విడపనకల్లు మండలంలో 190, యాడికి మండలంలో 73, యల్లనూరు మండలంలో 20, బెళుగుప్ప మండలంలో 23, బ్రహ్మసముద్రం మండలంలో 15, గుమ్మగట్ట మండలంలో 9, కణేకల్లు మండలంలో 66, కళ్యాణదుర్గం మండలంలో 22, శెట్టూరు మండలంలో13, రాయదుర్గం మండలంలో 5, కొత్తచెరువు మండలంలో15, ఓబుళదేవరచెరువు మండలంలో 13, బత్తలపల్లి మండలంలో 32, చెనే్నకొత్తపల్లి మండలంలో 2, తాడిమర్రి మండలంలో 25, అగళి మండలంలో13, అమరాపురం మండలంలో 11, లేపాక్షి మండలంలో 24, పరిగి మండలంలో 15, పెనుకొండ మండలంలో6, రోళ్ళమండలంలో 4, గాండ్లపెంట మండలంలో 4 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. గార్లదినె్న మండలంలో 25 ఇండ్లు పాక్షికంగా, 21 ఇండ్లు పూర్తిగా, గుంతకల్లు మండలంలో 108 పాక్షికంగా, 20 పూర్తిగా, పెద్దపప్పూరు మండలంలో 104 పాక్షికంగా, 20 పూర్తిగా, బొమ్మనహళ్ మండలంలో 15 పాక్షికంగా, 8 పూర్తిగా, కంబదూరు మండలంలో 19 పాక్షికంగా, 3 పూర్తిగా, నల్లచెరువు మండలంలో 6 పాక్షికంగా, 1 పూర్తిగా, కదిరి మండలంలో 32 పాక్షికంగా, 8 పూర్తిగా, తనకల్లు మండలంలో 12 పాక్షికంగా, 1 పూర్తిగా, అమడగూరు మండలంలో 2 పాక్షికంగా, 1 పూర్తిగా, ధర్మవరం మండలంలో 16 పాక్షికంగా,1 పూర్తిగా, రామగిరి మండలంలో 6 పాక్షికంగా, 2 పూర్తిగా, నల్లమాడ మండలంలో ఒక ఇల్లు పూర్తిగా, గుడిబండ మండలంలో 21 ఇండ్లు పాక్షికంగా దెబ్బతినగా 3 ఇండ్లు పూర్తిగా నేలమట్టమైనట్లు సమాచారం. కాగా మరికొన్ని మండలాల్లో దెబ్బతిన్న ఇండ్లు, పూర్తిగా నేలకొరిగిన ఇండ్ల వివరాలు తెలియాల్సి వుంది. పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లను పరిశీలించి ఇల్లు దెబ్బతిన్న పరిస్థితిని అంచనా వేసి రూ. 3 వేల నుంచి రూ. 8 వేల వరకు, ఇల్లు పూర్తిగా గోడలు, పైకప్పుతోపాటు నేలకొరిగి వుంటే రూ. 10 వేల నుంచి రూ. 20 వేల వరకు తక్షణసాయంగా ఆయా మండలాల్లోని తహశీల్దార్‌లు అందజేయనున్నట్లు సమాచారం. ఇక పూర్తిగా ఇళ్లు నేలకొరిగిన వారికైతే నష్టపరిహారం రూపంలో అందజేయకపోయినప్పటికీ వారికి ఎన్టీఆర్ గృహాన్ని మంజూరు చేసే అవకాశం వున్నట్లు అధికారుల ద్వారా తెలిసింది. కాగా పాక్షికంగా ఇండ్లు దెబ్బతిన్న వారికి కూడా ఎన్టీఆర్ గృహాలను మంజూరు చేసి ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. గత వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ఇప్పటికీ కొన్ని మండలాల్లో దెబ్బతిన్న ఇండ్ల సమాచారం తెలుసుకునే పనిలోనే అధికారులు నిమగ్నమై వున్నారు.

‘చాగల్లు’ గేట్లు ఎత్తివేత

* పెన్నానదిలోకి నీటి ప్రవాహం
పెద్దపప్పూరు, అక్టోబర్ 14 : మండలంలోని చాగల్లు ప్రాజెక్టు నీరు భారీగా వస్తుండటంతో శనివారం సాయంత్రం నాలుగు గేట్లు ఎత్తి కిందికి వదిలారు. గేట్లు ఎత్తడంతో బొందలదినె్న, గార్లదినె్న, తాడిపత్రి, యాడికి గ్రామాలకు వెళ్లే రహదారులు స్తంభించిపోయాయి. అశ్వర్ధనారాయణ స్వామి తీర్ధంలో ఉన్న కాజ్‌వేపై మోకాళ్ల లోతుపైగా నీరు పారుతోంది. చాగల్లు రిజర్వాయర్, పెండేకల్లు ఎడమ కాలువ నుంచి నీరు వదిలారు. అయినప్పటికీ నార్పల మండలంలో కురిసిన భారీ వర్షానికి ఒక్కసారిగా వర్షం నీరు రావడంతో నార్పల మండలానికి చెందిన కొందరు పెద్దపప్పూరు మండలాధికారులను కలిశారు. మండల తహశీల్దార్ రమాదేవి, ఎంపిడిఓ అనురాధ చాగల్లు ప్రాజెక్టును సందర్శించి నీటి ఉధృతి ఎక్కువగా వుండటంతో నాల్గు గేట్ల ద్వారా పెన్నా నదికి నీరు వదిలారు. ఈ నీరు వదలడంతో దాదాపు 200 వాహనాలకు పైగా రాకపోకలు స్తంభించాయి.
నీట మునిగిన ఉల్లికంటిపల్లి
బుక్కరాయసముద్రం : గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల శింగనమల మండలం ఉల్లికంటిపల్లి నీట మునిగింది. ఇదివరకే చాగల్లు రిజర్వాయర్ నిర్మాణం ముందు ఊరును ఖాళీ చేయమని ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించినప్పటికి ఆ గ్రామ ప్రజలు అక్కడే వున్నారు. అయితే గత వారం రోజులుగా కురిసిన వర్షాల వల్ల చాగల్లు రిజర్వాయర్ బ్యాక్ వాటర్ గ్రామంలోకి ప్రవేశించి ఇళ్లు నీట మునిగాయి. వారిని పనరామర్శించడానికి సిపిఎం నాయకులు రామగోపాల్‌రెడ్డి, బాలరంగయ్య, వైకాపా నాయకులు ఆలూరు సాంబశివారెడ్డి, శింగనమల తహశీల్దార్ నాగేంద్ర పలువురు గ్రామంలోకి వెళ్లి పరామర్శించి ఇదివరకు ప్రభుత్వం నిర్దేశించిన స్థలాల్లోకి వెళ్లిపోండని వారిని మండల అధికారులు ఖాళీ చేయించారు. అయితే గ్రామంలోకి నీరు రావడంతో రైతులు నిల్వ వుంచుకున్న పశువుల మేత, వేరుశెనగ పంట ఇతరత్రా పంటలు నీట మునిగిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని వారు అధికారులు, నాయకులతో గోడు వెళ్లబోసుకున్నారు. నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో చాగల్లు రిజర్వాయర్ గేట్లు ఎత్తివేసినట్లు మండల తహశీల్దార్ నాగేంద్ర తెలిపారు.
భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం
ధర్మవరం, అక్టోబర్ 14: ధర్మవరం పట్టణంలో శుక్రవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అర్ధరాత్రి దాటిన తర్వాత కురిసిన ఈ వర్షానికి పట్టణంలోని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు కాలనీల్లో వర్షం నీరు ఇళ్లల్లోకి చేరింది. శాంతినగర్, చంద్రబాబునగర్, తారకరామాపురం, పిఆర్‌టి స్ట్రీట్, పార్థసారధి నగర్‌తోపాటు పలు వార్డుల్లో మగ్గం గుంతలు నీట మునిగాయి. పలువురు చేనేత కార్మికులు మగ్గం గుంతల్లోకి నీరు చేరడంతో వేలాది రూపాయలు నష్టపోయారు. విషయం తెలుసుకున్న అధికారులు వార్డుల వారీగా పర్యటించి తడిసిపోయిన మగ్గాల వివరాలను తెలుసుకున్నారు. అలాగే మండలంలోని చిగిచెర్ల గ్రామంలో సైతం భారీ వర్షానికి ఎస్‌సి కాలనీ నీట మునిగింది. ఏలకుంట్ల గ్రామంలో వర్షం దెబ్బకు ఓ గుడిసె నేలమట్టమైంది. అయితే ఇందులో ప్రాణ నష్టం ఎక్కడా సంభవించకపోయినా ఆస్తి నష్టం భారీగానే జరిగింది. ఇక చిన్న, చిన్న వాగులు, వంకలు సైతం పొంగిపొర్లాయి. ఆర్‌డిఓ బాలానాయక్, తహశీల్దార్ మహబూబ్‌బాషాలు వర్షం వల్ల దెబ్బతిన్న మగ్గాలు, లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు చేరి జరిగిన నష్టంపై ఆరా తీశారు. పలు మగ్గాల కార్మికులు తాము పూర్తిగా నష్టపోయామని ఆదుకోవాలని అధికారులకు విన్నవించుకున్నారు.
బత్తలపల్లిలో...
బత్తలపల్లి : గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు బత్తలపల్లి జలమయమైంది. మండలంలోని పలు చెరువులు, వాగులు ప్రవహించాయి. వర్షాలు లేక వరుణదేవున్ని ప్రార్థించిన వారందరూ ఏకధాటిగా కురుస్తున్న వర్షాలను నిలిచిపోయేలా ప్రార్థించే పరిస్థితికి వచ్చారు. శుక్రవారం రాత్రి కురిసిన వర్షంతో శనివారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇళ్ల మధ్య వర్షం నీటితో వీధులు వాగులా తలపిస్తున్నాయి. బాలుర ఉన్నత పాఠశాల, విద్యాధరి పాఠశాల, పలు కాలనీల ఇళ్ల మధ్య వర్షం నీటితో నిండిపోయాయి. అంతేగాక సంజీవపురం, యర్రాయపల్లి, లింగారెడ్డిపల్లి, ముష్టూరు తదితర గ్రామాల్లో భారీగా వర్షం పడింది. దీంతో పలు చెరువులు, కుంటలు నిండి వాగులు ప్రవహించాయి. విషయం తెలుసుకున్న తహశీల్దార్ సురేష్‌బాబు జలమయమైన వీధులను, పోట్లమర్రి వద్ద ప్రవహిస్తున్న ఈదుల వాగు వంకను పరిశీలించారు. వాగు వద్ద పోలీసులను నియమించారు. కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా వుండాలని తహశీల్దార్ సురేష్‌బాబు, ఎస్‌ఐ హరూన్‌బాషాలు పేర్కొన్నారు. వాగులు, చిత్రావతి నదీ ప్రాంతం వద్దకు వచ్చే సందర్శకులు ఫొటోలు, సెల్ఫీలు దిగేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు. మండలంలోని పలు గ్రామాల్లో సుమారు 10 ఇళ్లు వర్షానికి కూలిపోయాయి. పాడుబడ్డ ఇళ్లల్లో ఎవరూ నిద్రించవద్దని తహశీల్దార్ పేర్కొన్నారు. మాల్యవంతం, వెంకటగారిపల్లి, గంటాపురం, వేల్పుమడుగు, డి.చెర్లోపల్లి, ముష్టూరు గ్రామాలందు ఒక్కొక్క ఇల్లు చొప్పున కూలిపోయాయి. శనివారం పలువురు బాధితులు స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని తహశీల్దార్‌కు వినతిపత్రాలు అందజేశారు.
ఆంధ్రా, కర్నాటక సరిహద్దులో భారీ వర్షం
మడకశిర : నియోజకవర్గ సరిహద్దులోని కర్నాటక ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి పలు చెరువులకు జలకళ వచ్చింది. మండలానికి సరిహద్దులోని ఐడి హళ్లి, మిడిగేసి ప్రాంతంలో రాత్రి భారీవర్షం కురవడంతో వాగులు, వంకలు పొంగి పొర్లాయి. దీంతో ఉప్పడిపల్లి, మణూరు, వైబిహళ్లి, హరేసముద్రం చెరువులకు భారీగా నీరు వచ్చి చేరింది. అదేవిధంగా మండల పరిధిలోని పాపసానిపల్లి, భూతప్ప కనుమ, కోతులగుట్ట, గుండుమల అటవీ ప్రాంతంలో భారీ వర్షం కురియడంతో హంద్రీనీవా కాలువల్లో భారీగా నీరు చేరింది. దీనికితోడు మడకశిర చెరువు, కల్లుమర్రి చెరువుకు సైతం భారీగా నీరు చేరింది. అయితే వేరుశెనగ పంటకు భారీ నష్టం వాటిల్లుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మడకశిరలో 39, అమరాపురంలో 16.2, గుడిబండ 16.4, రొళ్ళ 14.2, అగళి మండలంలో 13.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
రామగిరిలో..
రామగిరి : మండలంలో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. రామగిరిలో 47.2 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. రామగిరి, పోలేపల్లి, కేశంపల్లి చెరువులు పొంగిపొర్లాయి. పోలేపల్లి చెరువు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మరవలు పోవడంతో గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. వీటితోపాటు పేరూరు చెరువులోకి, డ్యాంలోకి కొద్దిపాటి నీరు చేరాయి. వర్షాలు ప్రతి రోజు కురుస్తుండడంతో వేరుశెనగ పంట దెబ్బతింటోందని సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు.

కుళ్లుతున్న ఉల్లి..
* లబోదిబోమంటున్న రైతులు
అమరాపురం, అక్టోబర్ 14 : మండల పరిధిలోని గౌడనకుంట, హేమావతి, ఉదగూరు, కాచికుంట, పేలుబండ, శివరం తదితర గ్రామాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉల్లి పంట కుళ్లిపోతోంది. ఉల్లిని ఏవిధంగా నిలువ చేసుకోవాలో అర్థం కాక రైతన్నలు లబోదిబోమంటున్నారు. మండలంలో దాదాపు వంద ఎకరాల్లో ఉల్లిపంట సాగు చేశారు. పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటంతో ఏవిధంగా పంటను బయటకు తీయాలో అర్థం కాక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఎకరాకు దాదాపు రూ. 20వేలు ఖర్చు చేసి పంటను పెట్టామని, కనీసం పెట్టుబడులు కూడా చేతికి రావడం లేదన్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
గంగమ్మకు జల హారతి
నంబులపూలకుంట, అక్టోబర్ 14: మండల పరిధిలోని పెడబల్లి డ్యాం వద్ద శనివారం గంగమ్మ గంగ పూజను నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాజమండ్రి పీఠాధిపతి నిత్య నరసింహస్వామి హాజరైనారు. పీఠాధిపతి నరిసింహస్వామి చేతుల మీదుగా డ్యాం వద్ద గంగ పూజ , జల హారతి పూజలను నిర్వహించారు. పాడి పంటలతోపాటుగా పాడి పశువులు అభివృద్ధిగా ముందుగా సాగాలన్నారు. చెరువులన్ని నీటితో నిండడం ఎంతో శుభ సూచకమన్నారు. ప్రతి రైతు ఇంట పాడి పంటలు , పాడి పశువులు సంవృద్ధి చెందాలని గంగపూజను నిర్వహించారు. కార్యక్రమంలో సేవా భారతి అధ్యక్షుడు చెన్నరాయశెట్టి, సర్పంచ్ రామాంజులు, డీలర్ సిద్దారెడ్డి, సేవా భారతి సభ్యులు శరత్‌కుమార్‌రెడ్డి, హరినాధరెడ్డి, వెంకటరెడ్డి, అంజి, సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
లేపాక్షికి మహర్దశ
* అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటుకు సర్వే..
లేపాక్షి, అక్టోబర్ 14 : ప్రపంచ పర్యాటక చిత్రపటంలో పేరెన్నికగన్న లేపాక్షికి మహర్దశ రానుంది. మూడు రోజుల క్రితం పంచాయతీరాజ్ శాఖామంత్రి నారా లోకేష్ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గ పరిధిలో ఒక పంచాయతీ గ్రామాన్ని ఎంపిక చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్న విషయం తెలిసిందే ఇందులో భాగంగానే లేపాక్షి పంచాయతీని అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా శనివారం హైదరాబాదు మెథడిస్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ప్రొఫెసర్ ఎస్‌హెచ్ ఫణి నేతృత్వంలో లేపాక్షిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీల ఏర్పాటుకు సర్వే నిర్వహించారు. 15 కిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేయనున్నారు. దీనికితోడు లేపాక్షిలో నంది విగ్రహానికి ముందున్న గుట్టపై జఠాయువు పక్షి విగ్రహ స్థాపన, జఠాయువు ఘాట్‌లో దాదాపు రూ. 60లక్షలతో గుప్త కామేశ్వరి అమ్మవారి ఆలయ నిర్మాణం, కోనేరును ఆధునికీకరణ చేసి విద్యుత్ దీపాల అలంకరణ వంటి పనులు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జయప్ప, పంచాయతీ రాజ్ డిఇ ప్రభాకర్ చౌదరి, జెఇ రామకృష్ణ, కార్యదర్శి శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు.
పాత నేరస్థులపై ప్రత్యేక నిఘా
* ఎస్పీ అశోక్‌కుమార్
ఉరవకొండ, అక్టోబర్ 14 : దోపిడీ, దొంగతనాల నియంత్రణ కోసం పాత నేరస్థులపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. శనివారం పట్టణంలోని పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో దోపిడీ, దొంగతనాలు నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గత పదేళ్ల నుంచి దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్థులపై నిఘా ఉంచడానికి ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను తయారు చేసినట్లు తెలిపారు. కాగా అగ్రిగోల్డ్ బాధితుల వివరాలను సేకరించేందుకు జిల్లాలో 13 కేంద్రాల ద్వారా 18 కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దాదాపు 7వేల మంది వివరాలను రిజిస్ట్రేషన్ చేయించుకోలేదన్నారు. అలాంటి వారిని మరోసారి తేదీని ఖరారు చేసి వివరాలు సేకరించనున్నట్లు తెలిపారు. అలాగే మట్కా, గ్యాబ్లింగ్ జరగకుండా నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఆయనతోపాటు సిఐ చిన్నగౌస్, ఎస్‌ఐ నగేష్‌బాబు తదితరులు ఉన్నారు.
వ్యక్తి ఆత్మహత్య
గుత్తి, అక్టోబర్ 14 : మున్సిపాలిటీ పరిధిలోని స్వీపర్స్ కాలనీలో నివాసం ఉండే వీరన్న (27) శనివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం రాత్రి సమీప బంధువులతో సంతోషంగా గడిపిన వీరన్న ఇంటికి వెళ్లి ఇంట్లో నిద్రపోయాడు. అర్ధరాత్రి అనంతరం ఇంటి పైకప్పునకు తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వీరన్న నాలుగు సంవత్సరాల క్రితం తమ సమీప బంధువుల అమ్మాయి అంకమ్మను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. కలహాలతో విరక్తి చెందిన వీరన్న ఇంటి పైకప్పునకు ఉరేసుకున్నాడు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు గుత్తి పోలీసులు తెలిపారు.
నీటి గుంతలో పడి చిన్నారి మృతి
బత్తలపల్లి, అక్టోబర్ 14: మండలంలోని అప్రాచెరువు గ్రామంలో శనివారం సాయంత్రం ఇంటి నిర్మాణం కొరకు తవ్విన మంచినీటి సంపులో చిన్నారి పల్లవి(18 నెలలు) నీటిలో పడి మృతి చెందింది. అప్రాచెరువు గ్రామానికి చెందిన విశ్వనాథ్, సత్తెమ్మ దంపతులు ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటి నిర్మాణం కొరకు ఇంటి సమీపంలోనే చిన్నపాటి సంపును నిర్మించుకున్నారు. వీరి కుమార్తె పల్లవి నిర్మాణం ఇంటి సమీపంలోనే వుంచి ఇంటి పనులు చూసుకుంటున్న దంపతులు చిన్నారిని గుర్తించకపోవడంతో చిన్నారి ఆడుకుంటు సంపులో పడింది. ఆలస్యంగా గుర్తించిన కుటుంబ సభ్యులు చిన్నారిని స్థానిక ఆర్‌డిటి ఆస్పత్రికి తీసుకొస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది.

కవితా గానంతో పులకించిన అనంత
అనంతపురం కల్చరల్, అక్టోబర్ 14: అనంత వేదికగా సాగిన ప్రపంచ రికార్డు కవి సమ్మేళనంలో కవితా గానం ఉప్పొంగడంతో అనంత పులకించింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తెలుగు రక్షణ వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రపంచ రికార్డు కవి సమ్మేళనం శనివారం నగరంలోని జడ్పీ హాలులో ప్రారంభమయ్యింది. తెలుగు రక్షణ వేదిక జాతీయ అధ్యక్షులు పొట్లూరి హరిక్రిష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి నగర మేయర్ మదమంచి స్వరూప, కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, రచయిత సింగమనేని నారాయణ తదితరులతోపాటు 12 రాష్ట్రాల నుండి 1000 కవులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పొట్లూరి హరిక్రిష్ణ మాట్లాడుతూ తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటేందుకు ఏర్పాటైన తెలుగు రక్షణ వేదిక కార్యక్రమాలకు రాయలసీమ జిల్లాల్లో శ్రీకారం చుట్టాలని భావించామన్నారు. ఇందులో భాగంగానే రెండు రోజులపాటు 33 గంటల 44 నిమిషాల 55 సెకన్ల ప్రపంచ రికార్డు కవి సమ్మేళనం అనంతలో నిర్వహించడం జరిగిందన్నారు. తెలుగు భాష పరిరక్షణకు భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. నగర మేయర్ మదమంచి స్వరూప మాట్లాడుతూ తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటడం కవులు, సాహితీవేత్తలకే సాధ్యమన్నారు. ప్రపంచ రికార్డు కవి సమ్మేళనంకు అనంత వేదికగా నిలవడం తనకెంతో గర్వంగా ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో సమాజంలో మహిళలు, ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు, సాంఘిక దురాచారాలను రూపుమాపేందుకు సమాజాన్ని చైతన్యవంతం చేయాలని ఆమె కోరారు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన నిర్వాహకులను అభినందిస్తూ దిగ్విజయంగా పూర్తి కావాలని ఆకాంక్షించారు. కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత రాచపాళెం చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ కరవు సీమలో కవులకు కొరత లేదని, మంచి సాహిత్యానికి అనంత నెలవైందన్నారు. ఇతర ప్రముఖులు మాట్లాడుతూ కరవుకు నెలవుగా మారిన జిల్లాలో సాహిత్య చరిత్ర పుష్కలంగా ఉందన్నారు. తెలుగు సాహిత్యానికి ప్రపంచ ఖ్యాతి ఉందని, తెలుగు భాషను పరిరక్షించుకోవటానికి ఇటువంటి వేదికలు ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమానికి ముందు జడ్పీ హాలు నుండి తెలుగు తల్లి విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి, తల్లికి పూలమాలలు సమర్పించారు. కార్యక్రమంలో మల్లెల నరసింహమూర్తి, రాధేయ, రాజారాం, ఆకుల రఘురామయ్య, మధురశ్రీ, రియాజుద్దీన్ కవులు, సాహితీవేత్తలు, భాషాభిమానులు పాల్గొన్నారు.
15 నుంచి పోలీసు అమరవీరుల వారోత్సవాలు
అనంతపురం అర్బన్, అక్టోబర్ 14: విధి నిర్వహణలో అశువులుబాసిన, ప్రాణ త్యాగం చేసిన పోలీసులను స్మరించుకొంటూ ప్రతి ఏటా జరుపుకునే పోలీసు అమరవీరుల వారోత్సవాలను ఈ నెల 15వ తేదీ నుంచి 21 వరకు ఘనంగా నిర్వహించాలని ఎస్పీ జీవీజీ. అశోక్‌కుమార్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ వారోత్సవాల్లో బాగంగా ఓపెన్‌హౌస్, తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 1959 అక్టోబర్ 21న లడక్ ప్రాంతంలో మన దేశ మిలటరీ బలగాలకు చెందిన 10మంది మాతృభూమి కోసం చైనా దళాలతో యుద్ధం చేసి వీరమరణం పొందారన్నారు.
ఆ సందర్భంగా అమరులైన వారి జ్ఞాపకార్థం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకొంటున్నామన్నారు. ఈ దినోత్సవంకంటే ముందు ఈ నెల 15వ తేదీ నుంచీ అమరవీరుల వారోత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో విద్యార్థులకు పోలీసుల విధులు- పనితీరుపై పోలీసు స్టేషన్లకు తీసుకెళ్లి అవగాహన కల్పించటం జరుగుతుందన్నారు. పోలీసులు నిత్యం ఉపయోగించే సెట్‌తోపాటు ఆయుధాలు, పోలీసు రికార్డులు వరకూ వాటి పనితీరుపై తెలియజేయటం జరుగుతుందన్నారు. జిల్లా కేంద్రంలో ఓపెన్‌హౌస్ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. సమాజ రక్షణ కోసం పోలీసులు ఉపయోగించే అన్ని ఆయుధాల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పిస్తామన్నారు. లాక్డ్‌హౌస్, ఫింగర్ ప్రింట్స్, డయల్ -100తోపాటు పోలీసులకు సంబంధించిన పలు విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించటం జరుగుతుందన్నారు. ఇవేకాకుండా పోలీసు త్యాగాలను గుర్తుచేసే తెలుగు, హిందీ భాషల్లోని చిత్రాలను సినిమా థియేటర్లలో ఉచిత ప్రదర్శన జరిగేలా చూస్తామన్నారు. అమరవీరుల స్తూపాన్ని థియేటర్లలో ప్రదర్శించేలా చర్యలు తీసుకొంటామన్నారు. 15న ఓపెన్ హౌస్ కార్యక్రమం, 16న పాఠశాల, కళాశాల విద్యార్థులకు, పోలీసు సిబ్బంది, అధికారులకు వేర్వేరుగా వ్యాసరచన పోటీలు నిర్వహిస్తామన్నారు. గుర్తించి 10 పాఠశాలల్లో స్వచ్ఛ భారత్ చేపడతామన్నారు. 17న పోలీసు సిబ్బందిచే రక్తదానం, 18న అమరవీరులను స్మరించుకొంటూ ర్యాలీలు, 19 (లేదా) 20న పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులతో ఎస్పీ సమావేశం, 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని అమరవీరుల స్తూపం వద్ద వేడుకలు నిర్వహించి స్మృతి పరేడ్ నిర్వహించి ప్రాణ త్యాగం చేసిన అమరవీరులకు సంస్మరణ పేరున నివాళులర్పించనున్నట్లు తెలిపారు.
అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల పరిశీలన కౌంటర్లు పెంచాలి
అనంతపురం సిటీ, అక్టోబర్ 14: అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల పరిశీలన కౌంటర్లను సంఖ్యను పెంచాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్‌లో జరుగుతున్న అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల పరిశీలనను సిపిఐ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు క్యూలో నిలబడిన అగ్రిగోల్డ్ బాధితులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జగదీష్ మీడియాతో మాట్లాడుతూ అగ్రిగోల్డ్ ఖాతాదారులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారని, సబ్ డివిజన్‌కు ఒక పరిశీలన కేంద్రం ఏర్పాటు చేయడంతో దూర ప్రాంతాల నుండి వచ్చే ప్రజలు తమ పనులను వదులుకుని క్యూల్లో నిలబడుతున్నారన్నారు. గంటల తరబడి ప్రజలు, మహిళలు క్యూలో నిలబడాల్సి వస్తోందన్నారు. సబ్ డివిజన్ కేంద్రానికి రెండు, మూడు పరిశీలన కేంద్రాలు ఏర్పాటుచేస్తే బాధితులకు సౌకర్యంగా ఉంటుందన్నారు. అదేవిధంగా అగ్రిగోల్డ్ బాధితులకు అనుమానాలను నివృత్తి చేసేందుకు ప్రత్యేక విచారణ కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అగ్రిగోల్డ్ బాధితుల సంఖ్యకు వీలుగా కౌంటర్ల సంఖ్యను పెంచాలని సిపిఐ నాయకులు ఎస్పీని కలసి కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు జాఫర్, లింగమయ్య, శ్రీరాములు, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కార్తీక మాస పూజల కరపత్రాలు విడుదల
అనంతపురం కల్చరల్, అక్టోబర్ 14: ఈ నెల 20 నుండి కార్తీక మాసం ప్రారంభమవుతున్న నేపథ్యంలో మొదటి రోడ్డు శ్రీ కాశీవిశే్వశ్వర కోదండ రామాలయంలో కార్తీక మాస పూజలు, కల్యాణోత్సవ కార్యక్రమాల కరపత్రాలు శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ ఓబిలేసు, ఇఓ నాగేంద్రరావు మాట్లాడుతూ కార్తీక మాసం సందర్భంగా శివునికి లక్షబిల్వార్చన, రుద్రాభిషేకం, లక్ష దీపారాధన మొదలగు పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు స్వప్న, ఆంజనేయులు, నరసింహమూర్తి, శ్రీనివాసులు, మాణిక్యం, అర్చకులు నరసింహశాస్ర్తీ పాల్గొన్నారు.
ఎస్పీని కలిసిన రాష్ట్ర విశ్రాంత పోలీసుల సంఘం నాయకులు
అనంతపురం అర్బన్, అక్టోబర్ 14: శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలోని తన ఛాంబర్‌లో రాష్ట్ర విశ్రాంత పోలీసు అధికారుల సంఘం ఎస్పీ జీవీజీ. అశోక్‌కుమార్‌ను కలిసింది. రాష్ట్ర అధ్యక్షులు మహబూబ్‌బాషా, జిల్లా అధ్యక్షులు పరంధాముడు, కార్యదర్శి భీముప్ప, ఇసి సభ్యులు విలియమ్స్, క్రిస్ట్ఫిర్‌లు కలిసిన వారిలో ఉన్నారు.
సర్వజన ఆసుపత్రిలో చిన్నారి మృతి
అనంతపురం అర్బన్, అక్టోబర్ 14: కదిరిలోని మరవతాండకు చెందిన రామచంద్రనాయక్ మూడు నెలలు చిన్నారి చేతన నిమోనియాతో భాదపడుతుండగా కదిరిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చూపిస్తుండగా పరిస్థితి విషమించటంతో శనివారం సర్వజన ఆసుపత్రికి తరలించారు. మధ్యాహ్నం 3గంటలకు ఆసుపత్రికి తీసుకువచ్చారు. వెంటిలేటర్ సహాయంతో బతికించటానికి చేసిన ప్రయత్నాలు సైతం ఫలించకపోవటంతో సాయంత్రం 5 గంటలకు చిన్నారి మృతి చెందింది.
కెజిబివి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల
వేతనాలు చెల్లించండి
అనంతపురం సిటీ, అక్టోబర్ 14: జిల్లా వ్యాప్తంగా కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయాల్లో(కెజిబివి)లలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు తక్షణమే చెల్లించాలని జెసి-2 సయ్యద్ ఖాజామొహిద్దీన్ ఎస్‌ఎస్‌ఏ పిఓను ఆదేశించారు. శనివారం ఎస్‌ఎస్‌ఏ పిఓను జెసి-2 కార్యాలయానికి పిలిపించుకుని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు, వాహనాల అద్దెలను చెల్లించడంపై జెసి-2 ఆరా తీశారు. ఈ సందర్భంగా జెసి-2 మాట్లాడుతూ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు, వాహనాల అద్దె చెల్లించకుండా చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబందించిన మొత్తాన్ని సోమవారం లోపు చెల్లించాలని పిఓను ఆదేశించారు. ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలు సిబ్బందికి వారంలోపు జీతాలు, ఈపిఎఫ్‌లు చెల్లించకపోతే ఆ ఏజెన్సీలను బ్లాక్‌లిస్టులో పెట్టాలని ఆదేశించారు. దీంతోపాటు కాంట్రాక్టు రద్దు చేసి, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.
వైద్య శిబిరానికి అనూహ్య స్పందన
ఆత్మకూరు, అక్టోబర్ 14: ఆత్మకూరు శ్రీ కనకదాస కల్యాణ మండపంలో శనివారం బెంగళూరు శంకర్ కంటి ఆసుపత్రి వారు నిర్వహించిన కంటి వైద్య శిబిరానికి భారీ స్పందన లభించింది. 230మంది ఓపికి హాజరు కాగా 130 మందికి శస్త్ర చికిత్సలు చేయడానికి 2 ప్రత్యేక బస్సులో బెంగళూరుకు తీసుకెళ్ళారు. ఉచిత ప్రయాణ సదుపాయంతోబాటు ఉచితంగా శస్త్ర చికిత్సలు కూడా శంకర్ ఆసుపత్రి వారు నిర్వహిస్తున్నారు. గ్రామ సర్పంచ్ పార్వతి, మాజీ సర్పంచ్ చంద్రశేఖరరెడ్డి, డాబా మల్లన్న, ఆసుపత్రి వైద్యులు డా. ప్రియాంక పాల్గొన్నారు.
నేడు వాల్మీకి జయంతి
ఆత్మకూరు మండల కేంద్రంలో ఆదివారం వాల్మీకి జయంతి నిర్వహిస్తున్నట్లు వాల్మీకి సంఘం నాయకులు విలేఖరుల సమావేశంలో పేర్కొన్నారు. భారతీయులందరికీ వాల్మీకి మహర్షి వందనీయుడని , శ్రీరామచంద్రుని జీవిత గాథను రచించి మానవ జీవన పథం నిర్దేశించాడని వక్తలు కొనియాడారు. కార్యక్రమంలో మండల టిడిపి కన్వీనర్ సూరి,రిటైర్డ్ టీచర్ కిష్టప్ప, బొమ్మయ్య, అక్కులప్ప, ఓభుళపతి ,పూజారి నరసింహప్ప పాల్గొన్నారు.