అనంతపురం

కేత్రస్థాయిలో బలోపేతానికి బీజేపీ కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జనవరి 17 : ప్రధాని మోదీ ఆకాంక్ష మేరకు వచ్చే ఎన్నికల నాటికి జిల్లాలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ నేతలు ప్రణాళికాబద్ధ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో బీజేపీ మిణుకుమిణుకుమంటోందన్న అపవాదును ప్రజల మనసుల్లోంచి తొలగించి, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రభావం చూపేలా క్షేత్రస్థాయి నుంచి పునాది పటిష్టం చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉండటంతో ‘మోదీ’ మంత్రం దక్షిణ భారతదేశంలోనూ ఫలించేలా జాతీయ నేతలు జిల్లాస్థాయి నుంచి క్షేత్ర స్థాయి వరకు నాయకుల్ని పురమాయిస్తున్నారు. అంతేగాకుండా 2019 ఎన్నికల్లో టీడీపీతో పొత్తుల్లో భాగంగా అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు దక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఈనేపథ్యంలో అధిష్టానం ఆదేశాల మేరకు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లోనూ బూత్ స్థాయిలో పార్టీని జనంలోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారు. ఈక్రమంలో నియోజకవర్గాల వారీగా పార్టీ సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారు. ఒక్కో నియోజకవర్గంలో వెయ్యి మందికిపైగా క్రియాశీలకంగా వ్యవహరించే కార్యకర్తల్ని ఎంపిక చేసి ఎన్నికల రణక్షేత్రంలో ప్రముఖ పాత్ర పోషించేలా దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనంతపురం అర్బన్‌తో పాటు గుంతకల్లు, ఉరవకొండ, కదిరి, పెనుకొండ, హిందూపురం, మడకశిరలో వంద శాతం ఎంపిక ప్రక్రియ ముగిసింది. పుట్టపర్తి, ధర్మవరం నియోజకవర్గాల్లో 50 శాతం క్రియాశీల కార్యకర్తల్ని ఎంపిక చేశారు. మిగతా ప్రక్రియను త్వరలో పూర్తి చేయడంలో జిల్లా నేతలు, స్థానిక నాయకులు దృష్టి పెట్టారు. కాగా హిందూపురం పార్లమెంట్ పరిధిలో బీజేపీకి చెప్పుకోదగ్గ ఆదరణ ఉంది. అలాగే అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీ మెరుగ్గానే ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. తాడిపత్రి, రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీకి చెప్పుకోదగ్గ స్థాయిలో లేదనే అభిప్రాయం ఉంది. అక్కడ టీడీపీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండటంతో బీజేపీ బలపడేందుకు తీవ్ర ప్రయత్నాలే చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో జిల్లాలోని 260 పోలింగ్ బూత్‌ల పరిధిలో తమ పార్టీకి ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పార్టీ కార్యకర్తలు పని చేసేలా సన్నద్ధం చేస్తుండటం విశేషం. ఈ ఏడాది జూన్‌లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలుండటం, ఆ తర్వాత కొన్ని రాష్ట్రాలకు జరిగే ఎన్నికల్లో భాగంగా ఏపీలోనూ ఎన్నికలు జరగనున్నాయి. ఆలోపే జిల్లాలో తమ ఓటు బ్యాంకును పెంచుకోవడం, పార్టీ శ్రేణుల్ని సమాయత్తం చేసే దిశగా జిల్లా నాయకత్వం ముందుకు వెళుతోంది. దక్షిణ భారతదేశంలో కర్ణాటక ఎన్నికల తర్వాత ఏపీపై జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా దృష్టి కేంద్రీకరించనున్నారని తెలుస్తోంది. కాగా టీడీపీతో పొత్తుతో అనంతపురం, లేదా జిల్లాలో రెండు అసెంబ్లీ స్థానాలు, హిందూపురం పార్లమెంట్ స్థానాన్ని ఆశిస్తున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డీ.వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో క్రియాశీలక సైన్యాన్ని సిద్ధం చేసేందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ క్రియాశీలక కార్యకర్తల్ని సన్నద్ధం చేస్తున్నామన్నారు.

ఎందుకీ నిర్లక్ష్యం!
* ‘పురం’లో రిజర్వు స్థలాల ఆక్రమణ.. * పట్టించుకోని యంత్రాంగం
హిందూపురం టౌన్, జనవరి 17 : పట్టణంలో మున్సిపాలిటీకి సంబంధించిన రిజర్వు స్థలాలు వందల సంఖ్యలో ఆక్రమణలకు గురవుతున్నాయి. మున్సిపల్ స్థలాల్లో పోటాపోటీగా ప్రార్థనాలయాలు నిర్మించడం ఇక్కడ రివాజుగా మారింది. మరోవైపు రిజర్వు స్థలాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోని దుస్థితిలో మున్సిపాలిటీ ఉండటం గమనార్హం. కొట్నూరు వద్ద దాదాపు మూడు ఎకరాల స్థలం ఉన్నా మున్సిపల్ స్థలమని అధికారులు తెలుసుకోలేకపోయారు. చివరకు రెవెన్యూ అధికారులు అది మున్సిపల్ స్థలమని గుర్తించి తాగునీటి పథకం ఫిల్టర్ బెడ్‌ల నిర్మాణానికి కేటాయించారు. మరోవైపు పట్టణంలో బెంగళూరు రోడ్డులో ఉన్న రిజర్వు స్థలం ఆక్రమణలకు గురవుతోందని, చర్యలు తీసుకోవాలని తరచూ ప్రజాప్రతినిధులు కౌన్సిల్‌లో మొర పెట్టుకుంటుంటారు. పట్టణంలోని వన్‌టౌన్ పోలీసుస్టేషన్ ఎదురుగా మున్సిపల్ స్థల వివాదం కోర్టులో ఉన్నా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అలాగే పట్టణంలో మున్సిపల్ ట్యాంక్‌లను కూల్చివేసి స్థలాలను ఆక్రమించుకుంటున్నారు. ఇటీవలే ముక్కడిపేట, పెనుకొండ రోడ్డు, డీఎల్ రోడ్డు తదితర చోట్ల ఆక్రమణలకు గురవడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు ముక్కడిపేటలో రోడ్డు పక్కన ట్యాంక్ వివాదాస్పదంగా మారింది. పట్టణంలోని నల్లప్ప లేఔట్‌లో మున్సిపాలిటీకి స్థలం ఉంటే ఈ స్థలం ఆక్రమణలకు గురవుతుండటంతో మూడేళ్ల క్రితం అప్పటి అధికారులు చర్యలు తీసుకుని చుట్టూ ప్రహారీ నిర్మించారు. ఇలాగే వదిలేస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, ఈ స్థలాన్ని ఉద్యానవనంగా ప్రకటించి నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. ఈ స్థలంలోకి వెళ్లడానికి లక్షలాది రూపాయలు వెచ్చించి రోడ్లు నిర్మించారు. అయితే మూడేళ్లుగా ఈ స్థలాన్ని పట్టించుకోకపోవడం గమనార్హం. అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడంతో ఉద్యానవన స్థలంలో పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. దీనికితోడు ఇక్కడ జనావాసాలు లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిందని స్థానికులు వాపోతున్నారు. మున్సిపల్ అధికారులు రిజర్వు స్థలాలపై దృష్టి సారించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆక్రమణలు చోటు చేసుకొంటున్నా చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. మున్సిపల్ రిజర్వు స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే అంశంపై ఇప్పటికీ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులకు పూర్తిస్థాయిలో అవగాహన లోపించడం, రికార్డులు లేకపోవడం ఈ విభాగం నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఇప్పటికైనా పట్టణంలోని విలువైన మున్సిపల్ రిజర్వు స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఉద్రిక్తత నడుమ ఇళ్ల కూల్చివేత
* నగరంలోని నేతాజీ నగర్‌లో ఆక్రమణల తొలగింపు.. * అడ్డుకున్న యజమానులు
* అరెస్టు.. * గత్యంతరం లేకే ఇళ్లు కూల్చివేత : ఆర్‌డీఓ
అనంతపురంటౌన్, జనవరి 17: నగరంలోని నేతాజీ నగర్‌లో బుధవారం ఇళ్ల కూల్చివేత ఉద్రిక్తతకు దారితీసింది. ఇళ్లు కూల్చివేసేందుకు వచ్చిన అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. కొంతమంది మహిళలు ఓ దశలో ఆత్మహత్యా యత్నానికి పాల్పడటంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కోర్టు నిబంధనల మేరకు తాము తొలగిస్తున్నామని అధికారులు సర్దిచెప్పేందుకు యత్నించారు. హైకోర్టు ఆదేశాల మేరకు రిట్ పిటిషన్ కొట్టివేసిన ఆరు ఇళ్లను భారీ పోలీసు బందోబస్తు నడుమ ఆర్‌డీఓ మలోల, తహశీల్దార్ అన్వర్‌హుస్సేన్, డీఎస్‌పీ వెంకటరావు, కమిషనర్ పీవీవీఎస్‌ఎన్ మూర్తి, ఏసీపీ ఇషాక్ ఆధ్వర్యంలో కూల్చివేత పక్రియ చేపట్టారు. ఇళ్లు కూల్చివేయవద్దంటూ గృహిణులు అధికారులను ప్రాధేయపడ్డారు. పైసాపైసా కూడబెట్టి కట్టుకున్న ఇళ్లను కూల్చి వేస్తే తాము రోడ్డున పడాల్సి వస్తుందని మొరపెట్టుకున్నారు. అధికార యంత్రాంగం చర్యలు చేపట్టటంతో గృహిణులు అడ్డుతగిలారు. ఒక గృహిణి ఇంటిలోని వస్త్రాలను కుప్పవేసి తగులపెట్టటంతో మంటలు చెలరేగాయి. దీనితో అధికారులు అప్రమత్తమై సిద్ధంగా ఉంచిన ఫైరింజన్ సహాయంతో మంటలు ఆర్పివేశారు. దీనితో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అడ్డుతగిలిన మహిళలను, యువకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అలాగే ధర్నాకు సిద్ధమైన సీపీఐ కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్ళారు. దీనిపై ఆర్‌డీఓ మలోల స్పందిస్తూ తమ చేతులలో ఏమీ లేదని హైకోర్టు ఉత్తర్వుల మేరకు కోర్టుకెళ్ళిన పిటిషన్‌దారుల రిట్లను కొట్టివేశారని అన్నారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఆరు ఇళ్లను కూల్చివేసి కోర్టుకు సాక్ష్యాధారాలతో సహా నివేదిక సమర్పించాల్సి ఉందన్నారు. ఈ ఉత్తర్వులను అమలుచేయకుంటే కలెక్టర్‌తో సహా తామందరమూ కోర్టు ధిక్కరణను ఎదుర్కొనాల్సి ఉంటుందన్నారు. కావున ఇళ్లలోని సామగ్రి తరలించుకుని కూల్చివేతకు సహకరించాలని కోరారు. ఇదిలా ఉండగా కూల్చివేతకు తెప్పించిన జేసీబీ యంత్ర కార్మికులను టౌన్‌ప్లానింగ్ ఆఫీసర్ గురునాథ్‌బాబు దూషించటంతో వారు వెళ్లిపోయారు. ఇదే అంశాన్ని ఏసీపీ ఇషాక్ కమిషనర్ మూర్తి దృష్టికి తీసుకెళ్ళారు. కూల్చివేత పనులు చేపట్టాల్సిన తరుణంలో జేసీబీ యంత్రాలు అందుబాటులో లేకపోవటంతో కమిషనర్ మూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే జేసీబీ యంత్రాలు సమకూర్చాలని టౌన్‌ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. దీనితో గంట తర్వాత మూడు జేసీబీ యంత్రాలు సంఘటనా స్థలికి చేరుకున్నాయి. యంత్రాలు వచ్చేవరకూ పనులు ఆగకుండా చూసేందుకు ఇళ్ళను సుత్తి, గునపాలతో కూల్చివేత చేపట్టారు. యంత్రాలు వచ్చిన తర్వాత కూల్చివేత ప్రక్రియ వేగం పుంజుకుంది. అరెస్టైన మహిళలు తిరిగి వచ్చి కనికరించాలని ఆర్‌డీఓను ప్రాధేయపడుతూ కన్నీళ్ళను పెట్టుకున్నారు. ఒక ఇంటిలో వినియోగదారుల సేవా కేంద్రం నిర్వహిస్తున్న యువకులు అధికారుల అనుమతి తీసుకుని కంప్యూటర్లు, స్కానర్లు తదితర సామగ్రి తీసుకెళ్ళారు. మరో ఇంటిలో నిర్వహిస్తున్న మినరల్ వాటర్‌ప్లాంట్ ధ్వంసమైంది. పై అంతస్తులో ఉన్న సామగ్రిని అతికష్టంతో నివాసముండే వారు తీసుకెళ్ళారు. ఇళ్ల కూల్చివేతతో ఆరు ఇండ్లలోని కుటుంబాలవారు వస్తుసామగ్రితో రోడ్డునపడ్డారు. గూడు చెదరిపోవటంతో ఎక్కడకు వెళ్ళాలో తెలియక ఆందోళన చెందటం కనిపించింది.
నేటి నుంచి అధికారుల పల్లె నిద్ర
* నిర్లక్ష్యం వహిస్తే చర్యలు..:కలెక్టర్ వీరపాండ్యన్
అనంతపురం సిటీ, జనవరి 17: జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయడంలో గ్రామ, మండల, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు పల్లెనిద్ర కార్యక్రమం ఖచ్చితంగా ఈరోజు నుండి ప్రారంభించాలని, నిర్లక్ష్యం వహిస్తే క్రమశిక్షణ చర్యలు చేపడతామని కలెక్టర్ జి.వీరపాండ్యన్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక రెవిన్యూ భవన్‌లో వివిధ శాఖల అధికారులతో జిల్లాలో చేపడుతున్న సంక్షేమ పథకాల అమలుతీరు, ప్రగతి నివేదికలను పరిశీలించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మరుగుదొడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయడంలో నియోజకవర్గ, మండల, గ్రామాధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పనుల్లో వెనుకబడిన గ్రామాల్లో తానే స్వయంగా పల్లెనిద్ర కార్యక్రమం ద్వారా చేపట్టడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ద్వితీయ స్థానంలో వెనుకబడిన గ్రామాలను గుర్తించి జేసీ ఆధ్వర్యంలో, తృతీయ స్థానంలో వెనుకబడిన గ్రామాలలో జేసీ-2లు పల్లెనిద్ర ద్వారా పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. అదే తరహాలో గ్రామ, మండలాలలో ఎంపీడీఓలు, ఎంఆర్‌ఓలు పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టి ఎప్పటికప్పుడు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పనుల పురోగతిపై కలెక్టర్ కార్యాలయానికి నివేదికలు అందించాలన్నారు. ఇందుకుగాను జెడ్పి సీఈఓ ఆధ్వర్యంలో కమిటీని నియమించామని, అందులో డీపీఓ, డీఆర్‌డీఏ పీడీ, ఎస్‌ఈ ఆర్‌డబ్ల్యుయస్ కమిటీలో టీంమెంబర్లుగా వుంటారని తెలిపారు. ఈ నెల 18, 19వ తేదీల్లో జిల్లాలో ప్రాథమికరంగం నుండి నైపుణ్యాభివృద్ధి మిషన్ వరకు ప్రతి అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి సమీక్షించనున్నారని, జిల్లాలో అమలవుతున్న ప్రగతి, వాస్తవ నివేదికలను అందజేయాలని సూచించారు. అందులో భాగంగా ఈ నెలాఖరులోపు అన్ని అంగన్‌వాడీ కేంద్రాలలో కనీస సౌకర్యాలను ఏర్పాటుచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్‌ఆర్‌జి నిధుల ద్వారా జిల్లాలోని అన్ని వసతి గృహాలలో పిల్లల ఆటస్థలానికి సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని, అందుకు నాణ్యమైన స్థలాలను గుర్తించాలని డ్వామా పీడీని ఆదేశించారు. ఉపాధి హామీ పనుల ద్వారా ఇప్పటికే 24 కోట్లను వివిధ పనులకు వినియోగించడం జరిగిందన్నారు. జిల్లాలో 1291 చెరువులు ఉన్నాయని, 207 చెరువుల్లో పూర్తిగా నీరు చేరిందని, ఈ చెరువుల్లో 30వేల మెట్రిక్ టన్నుల చేపపిల్లలను వదలడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని మత్స్య శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ను ఆదేశించారు. సామాజిక, సాధికారిత మిషన్‌లో భాగంగా పంచాయతీ రాజ్, పాఠశాల విద్య, సంక్షేమ శాఖలకు సంబందించి చంద్రన్న బీమా, వివిధ కార్పొరేన్ల మిషన్‌లో, సేవారంగ మిషన్ల ద్వారా ఈ ప్రగతి, నైపుణ్యాభివృద్ధి మిషన్ ద్వారా యువజన క్రీడలు, ఆర్థికాంశాలపై అధికారులు ఇచ్చిన నివేదికలను క్షుణ్ణంగా కల్టెర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జేసీ టికె.రమామణి, జేసీ-2 సయ్యద్‌ఖాజామొహిద్దీన్, డీఆర్‌ఓ రఘునాథ్, సీపీఓ వాసుదేవరావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

ప్రజల సహకారంతోనే రోడ్డు విస్తరణ పనులు
* మంత్రి కాలవ శ్రీనివాసులు
రాయదుర్గం,జనవరి 17 : పట్టణంలోని ప్రజల సంపూర్ణ సహకారంతోనే రోడ్డు విస్తరణ పనులు చేపడుతామని మంత్రి కాలవ శ్రీనివాసులు తెలిపారు. బుధవారం పట్టణంలోని మంత్రి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు 30 ఏళ్ల నుంచి కలగా మిగిలిపోయిన రోడ్డు విస్తరణ పనులను రూ.14కోట్ల అంచనాలతో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే నిధులు మంజూరైనప్పటికీ సాంకేతిక పరమైన మంజూరు కోసం ఆలస్యం అయిందన్నారు. పట్టణంలోని అనంతపురం, కణేకల్ రోడ్లలో రైల్వేక్రాసింగ్‌ల వద్ద ఒక్కొక్కటి రూ.30 కోట్లతో ఓవర్ బ్రిడ్జిలు నిర్మించనున్నట్లు తెలిపారు. అలాగే రూ.45కోట్లతో అనంతపురం - రాయదుర్గం రోడ్డు నుంచి కణేకల్ - రాయదుర్గం రోడ్లను కలుపుతూ రింగ్‌రోడ్డును కూడా నిర్మించనున్నట్లు తెలిపారు. రాయదుర్గం రోడ్డును జాతీయ రహదారిగా అనుసంధానం చేయడం హర్షణీయమన్నారు. అయితే విస్తరణ పనులకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ముదిగల్లు జ్యోతి, వైస్‌చైర్మన్ నల్లపూల వెంకటేశులు, వార్డుసభ్యులు, ఆర్‌అండ్‌బీ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
రక్తదానం సామాజిక స్పృహ..
సామాజిక సృహలా భావించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న అభాగ్యుల ప్రాణాలను కాపాడేందుకు రక్తదానం చేయాలని మంత్రి కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని శ్రీ సీతారామాంజినేయ స్వామి కల్యాణ మంటపంలో ఏర్పాటు చేయనున్న రక్తదాన శిబిర ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సినీ, రాజకీయ రంగాల్లో ఎన్‌టీ రామారావుకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఈనెల 18న రక్తదానం శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలు, యువత సామాజిక స్ఫూర్తితో ముందడుగేసి రక్తదానం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ముదిగల్లు జ్యోతి, వైస్‌చైర్మన్ నల్లపూల వెంకటేశులు, టీడీపీ నాయకులు హనుమంతరెడ్డి, నాగళ్లి నాగరాజు, పొరాలు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
రైతు, చేనేతల సమస్యలు పరిష్కరించాలి
* సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ.గఫూర్, పుణ్యవతి
ధర్మవరం టౌన్, జనవరి 17: రైతు, చేనేతల సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా తాగు, సాగునీరుకు రూ.10 వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ.గఫూర్, పుణ్యవతిలు డిమాండ్ చేశారు. పట్టణంలోని శివానగర్‌లోని పరమేశ్వరి ఫంక్షన్ హాల్‌లో సీపీఎం 12వ జిల్లా మహాసభలు నిర్వహిస్తున్న సందర్భ ంగా 2వ రోజు బుధవారం ముఖ్య అ తిథులుగా విచ్చేసిన వారు మాట్లాడు తూ ప్రభుత్వం కరవు, ఉపాధి, సమస్యలను పక్కన పెట్టి రాజధాని నిర్మాణంలోనే నిమగ్నమైపోయి పెట్టుబడుల పేర విదేశాలకు తిరగడం తప్ప ప్రజలకు మేలు చేసిందేమీ లేదన్నారు. జిల్లావాసులు తాగునీటి కోసం ప్రతి ఏటా అవస్థలుపడుతున్న విషయం పాలకులకు తెలిసినా తాగునీటి వనరులను చేకూర్చడంలో జిల్లాలో వున్నటువంటి నాయకులు పూర్తిగా విఫలం కా వడం జరిగిందన్నారు. రానున్న కాల ంలో తాగు, సాగునీరు దొరికే పరిస్థితి లేదని, దీని కోసం బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించి తాగు, సాగునీటికి సౌకర్యాలు కల్పించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారి వ్యవస్థను ప్రోత్సహిస్తూ చిన్న, చితక వ్యాపారులను దివాలా తీసే విధంగా చేస్తున్నాయన్నారు. ఇదేవిధంగా కొనసాగితే చిన్న వ్యాపారులు తమ ఇళ్ళలో విద్య, వైద్యం, ఆడపిల్లల వివాహాల కోసం డబ్బులు దాచుకునే పరిస్థితి, వారికి వివాహాలు చేసే పరిస్థితి కూడా వుండదన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుప్రజా సమస్యలను పరిష్కరించేందుకే పనిచేయాలని, పెట్టుబడిదారీ వ్యవస్థతో కొమ్ముకాసే పనిని విస్మరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీపీఎం పార్టీ నాయకులు ఓబుళకొండారెడ్డి, రాంభూపాల్, నల్లప్ప, ఇంతియాజ్, పెద్దిరెడ్డి, జేవీ.రమణ, లక్ష్మినారాయణ, సావిత్రమ్మ, పెద్దన్న, బాలరంగయ్య, నరేష్, ఆంజనేయులు, ఖాదర్‌బాషా, ఎల్. ఆదినారాయణ పాల్గొన్నారు.
రూ.855 కోట్ల పంట రుణాలు
* ఏపీజీబీ రీజనల్ మేనేజర్ శ్రీరంగన్న
హిందూపురం టౌన్, జనవరి 17 : ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ రీజియన్ పరిధిలో ఉన్న 58 శాఖల ద్వారా 1,0473 మంది రైతులకు రూ.855 కోట్ల పంట రుణాలు అందజేసినట్లు రీజనల్ మేనేజర్ శ్రీరంగన్న తెలిపారు. బుధవారం స్థానిక నానెప్పనగర్ శాఖ ఆధ్వర్యంలో గృహ నిర్మాణ రుణమేళా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతేడాది డిసెంబర్ చివరి నాటికి రూ.1520 కోట్ల రుణ లక్ష్యం కాగా రూ.1526 కోట్ల రుణాలు అందజేసినట్లు తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వం మూడో విడత కింద మంజూరు చేసిన రుణమాఫీ మొత్తాలను ఆయా రైతుల ఖాతాలకు జమ చేసినట్లు తెలిపారు. ప్రధానంగా నూతన గృహాల నిర్మాణాలు, గృహాల కొనుగోలు, మరమ్మతులకు తక్కువ వడ్డీతో హ్యాపీ గృహ రుణమేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా 3305 స్వయం సహాయక సంఘాలకు రూ.126 కోట్ల రుణాలు అందజేసినట్లు చెప్పారు. దీనికితోడు 11070 స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం తొమ్మిది నెలలుగా ఉన్న బకాయిలు రూ.18.02 కోట్లు మంజూరు చేయగా వాటిని ఖాతాలకు జమ చేసినట్లు తెలిపారు. ఇకపోతే కేవలం వ్యవసాయ రుణాలే కాకుండా వ్యాపార, విద్యా, వాణిజ్య రుణాలను కూడా అతి తక్కువ వడ్డీతో అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కదిరి బ్యాంక్ సీనియర్ మేనేజర్ బాలకృష్ణతోపాటు వివిధ శాఖల మేనేజర్లు పాల్గొన్నారు.
అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలి
* డీఎస్పీ కరీముల్లా షరీఫ్
పెనుకొండ, జనవరి 17 : గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డీఎస్పీ కరీముల్లా షరీఫ్ సూచించారు. బుధవారం పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో జరిగిన నెలవారి నేర సమీక్షలో మాట్లాడుతూ గ్రామాల్లో కోడిపందేలు, పేకాట, తదితర అసాంఘిక కార్యకలాపాలపై దృష్టి సారించాలన్నారు. నాన్‌బెయిలబుల్ వారెంట్ కేసులు పెండింగ్ ఉన్న వారిని కోర్టులో హాజరు పరచాలన్నారు. గ్రామాల్లో శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా రోడ్డు భద్రత పంచసూత్రాలు పాటించేలా చైతన్యం తీసుకురావాలన్నారు. ఈ సమావేశంలో సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
వాహనం ఢీకొని జింక మృతి
మడకశిర, జనవరి 17 : మండల పరిధిలోని అగ్రంపల్లి సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక మృతి చెందింది. బుధవారం సాయంత్రం ఐదు జింకలు రోడ్డు పక్కన ఉన్న పొలాల నుంచి పరుగులు తీస్తూ రోడ్డుపైకి రాగా అదే సమయంలో గుర్తు తెలియని వాహనం జింకను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన జరిగిన 20 నిమిషాల తర్వాత మడకశిర ప్రాంతానికి చెందిన వ్యక్తి ద్విచక్ర వాహనంలో వస్తుండగా మృతి చెందిన జింకను చూసి వెంటనే అటవీ శాఖాధికారులకు సమాచారం అందించారు. మృతి చెందిన జింక వయసు దాదాపు నాలుగేళ్లు ఉంటుందని రైతులు తెలిపారు. ఇప్పటికైనా అటవీ శాఖాధికారులు వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

విద్యుదాఘాతంతో యువకుడి మృతి
గుంతకల్లురూరల్, జనవరి 17 : పట్టణంలోని పరిటాల కల్యాణ మండపం వద్ద బుధవారం ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై కర్నాటక రాష్ట్రం మల్కాల్మూరు తాలుకా పైకనుమ గ్రామానికి చెందిన గవిసిద్ద(26) మృతి చెందాడు. తోటి యువకులు తెలిపిన కథనం మేరకు కల్యాణ మండపంలో జరిగిన వివాహ మహోత్సవానికి డెకరేషన్ చేసేందుకు పైకనుమ గ్రామం నుంచి 8 మంది యువకులు వచ్చారు. ఇక్కడ పెళ్లి పూర్తి కావడంతో ఉదయం నుంచి డెకరేషన్లను తీసి వేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా ముఖద్వారం వద్ద ఏర్పాటు చేసిన పైపులను తొలగించేందుకు పైకి ఎక్కగా పైభాగంలో ఉన్న విద్యుత్ తీగలు తగిలి గేట్‌కు ఉన్న ఇనుప కడ్డీలపై కుప్పకూలాడు. ఇనుప కడ్డీ పక్కటెముకల్లో గుచ్చుకోవడంతో అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పట్టణ వన్‌టౌన్ ఎస్‌ఐ వెంకటప్రసాద్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు.
కల్లు తాగి వ్యక్తి మృతి
హిందూపురం రూరల్, జనవరి 17 : మండల పరిధిలోని గోళ్లాపురం క్రాస్‌లో ఉన్న కల్లు దుకాణంలో కల్లు తాగి కర్నాటక వాసి నరసింహప్ప (50) మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. కర్నాటక బొమ్మసముద్రానికి చెందిన నరసింహప్ప రోజూ సమీపంలోని గోళ్లాపురం క్రాస్‌కు వచ్చి కల్లు తాగినట్లు తెలిసింది. అయితే బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో నరసింహప్ప కల్లు దుకాణంలో అతిగా కల్లు తాగి వాంతులు చేసుకుని, అక్కడి నుండి గోళ్లాపురం ప్రధాన రహదారిపైకి వచ్చి కుప్పకూలిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. కల్తీ కల్లు సేవించడం వల్ల నరసింహప్ప మృతి చెందాడా లేదా ఇతరత్రా కారణాల వల్ల మృతి చెందాడా అన్న విషయం పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

34మంది వైద్య విద్యార్థుల రక్తదానం
అనంతపురం అర్బన్, జనవరి 17: సర్వజన ఆసుపత్రిలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 30మంది వైద్య విద్యార్థిని, విద్యార్థులు రక్తదానం చేశారు. బుధవారం ప్రభుత్వ వైద్య కళాశాల, ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు, ఆసుపత్రి సూపరింటెండెంట్ జగన్నాథం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎన్‌ఎస్‌ఎస్ కార్యక్రమ అధికారి ఆదిరెడ్డి పరదేశినాయుడుతో సహా 34 మంది వైద్య విద్యార్థిని, విద్యార్థులు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేయటం చాలా సంతోషంగా ఉందన్నారు. రక్తదానం విలువను ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే నిరుపేద రోగులకు ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్ధినీ విద్యార్థులు రక్తం అందించటంలో ఎప్పుడు ముందుంటారన్నారు. దీన్ని మరోసారి తమ విద్యార్థులు రుజువు చేశారన్నారు. రక్తదానం చేసిన వారికి ప్రశాంసాపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎమ్‌ఓ లలిత, బ్లడ్ బ్యాంక్ వైద్యాధికారి డాక్టర్ శివకుమార్, మంజుల సిస్టర్, ఆంజినేయులు, శైలేష్‌కుమార్, రమణారెడ్డి పాల్గొన్నారు.
వడ్డెర్లను ఎస్టీ జాబితాలో చేర్చాలి
* జిల్లా వడ్డెర్ల సంఘం అధ్యక్షులు మల్లెల జయరామ్
అనంతపురం అర్బన్, జనవరి 17: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన ఎన్నికల మేనిఫెస్టోలో వడ్డెర్లను ఎస్టీ జాబితాలో చేరుస్తానని హామీ ఇవ్వటం జరిగిందని దీనిని నిలిబెట్టుకోవాలని వడ్డెర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లెల జయరామ్ అన్నారు. బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వడ్డెర్లు అనేక విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. తెదేపా అధికారంలోకి వచ్చి దాదాపు నాలుగేళ్లు కావస్తుందని, ముఖ్యమంత్రి వడ్డెర్లకు ఇచ్చిన హామీపై ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదన్నారు. వడ్డెర్లను ఎస్టీ జాబితాలలో చేర్చే అంశంపై ఈ నెల 19న నగరంలోని లలిత కళాపరిషత్‌లో వడ్డెర్ల జిల్లాస్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో తమ ఉద్యమ నిర్మాణాన్ని వెల్లడిస్తామని ఆయన తెలిపారు. సమావేశంలో నాయకులు శ్రీరాములు, శివానందం, రామకృష్ణ, ఉద్యోగ సంఘాలు, మహిళా సంఘాలు పాల్గొన్నారు.
420 మంది విద్యార్థులు ఇన్‌స్పైర్ అవార్డుకు ఎంపిక
అనంతపురం సిటీ, జనవరి 17: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులలో వైజ్ఞానిక నైపుణ్యాన్ని పెంపొందించాలని ప్రభుత్వం ప్రతి సంవత్సరం అందించే ఇన్‌స్పైర్ అవార్డులకు 2017-18 విద్యా సంవత్సరానికి 420 మందిని ఎంపిక చేశారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని 6 నుండి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులను ఈ అవార్డులకు ఎంపిక చేశారు. ఈ విద్యార్థులకు ప్రభుత్వం నుండి 5వేల రూపాయలను అందజేస్తుంది. 5వేల రూపాయలతో విద్యార్థులు, ఒక గైడ్ చేసే ఉపాధ్యాయుడు కలసి సైన్సుకు సంబందించిన ఒక ప్రయోగాన్ని తయారుచేయాల్సి ఉంటుంది. ఈ ప్రయోగాన్ని ఇన్‌స్ఫైర్ అవార్డుల ప్రదర్శన జిల్లాస్థాయిలో జరిగే సమయంలో ప్రదర్శనలు చేయాల్సి ఉంటుంది. ఈ విద్యార్థులకు తమకు సంబందించిన అకౌంటు వివరాలను సైన్సు సెంటర్ క్యూటర్‌కు అందజేయాలని జిల్లా విద్యా శాఖాధికారి సూచించారు.

పేదల ఇళ్ల జోలికొస్తే ఊరుకోం
అనంతపురం సిటీ, జనవరి 17: జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉన్న నేతాజీ నగర్‌లో గత 30 ఏళ్లుగా పట్టాలు పొంది నివాసముంటున్న పేదల ఇళ్లను కూలగొడితే ఊరుకోమని సీపీఐ జిల్లా శాఖ హెచ్చరించింది. ఈమేరకు బుధవారం నేతాజి నగర్‌లో ఇళ్లను కూలగొడుతున్న జేసీబీలను సీపీఐ నాయకులు అడ్డుకుని, ధర్నాకు దిగారు. అంతలో పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకతుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జాఫర్ మాట్లాడుతూ 30 సంవత్సరాలు నివాసముంటున్న పేదల ఇళ్లను కూలగొట్టడం చాలా దారుణమని, పేదల ఇళ్ల జోలికివస్తే ఊరుకోమని, పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనేక మంది బ్యాంకుల ద్వారా రుణాలు పొంది ఇళ్లను నిర్మించుకున్నారని, అలాంటి వారు తీవ్ర ఆందోళనపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇళ్లను పడగొట్టడం వెనక్కి తగ్గాలని, లేనిపక్షంలో పేదలతో కలసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి పి.నారాయణస్వామి, నగర కార్యదర్శి ఎన్.శ్రీరాములు, నాయకులు లింగమయ్య, గోపాల్, చిరంజీవమ్మ, జయలక్ష్మి, రమణ్యయ్య, అల్లీపీరా, ఇతర నాయకులు పాల్గొన్నారు.
కుష్ఠు వ్యాధిపై అవగాహన సదస్సులు విస్తృతం

అనంతపురం అర్బన్, జనవరి 17: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 13 వరకు స్పర్శ కుష్ఠు వ్యాధి అవగాహన పక్షోత్సవాలు నిర్వహించాలని జిల్లా వైద్య శాఖాధికారి అనిల్‌కుమార్ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో లెప్రసీ అనంతపురం డివిజన్‌లోని వైద్యాధికారులు, జిల్లా లెప్రసీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్‌కుమార్ మాట్లాడుతూ జనవరి 30న మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా లెప్రసీ డేగా పిలవబడుతుందన్నారు. ఇందులో భాగంగా 15 రోజులపాటు జిల్లాలో లెప్రసీ వైద్య సిబ్బంది అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆయన ఆదేశించారు.
కుష్ఠు వ్యాధిపై సమాజంలో అనేక అనుమానాలు ఉన్నాయని, వీటిపై ప్రజల్లో ఉన్న అనుమానాలు నివృత్తి చేయాలని ఆయన సిబ్బందికి సూచించారు. ఈ వ్యాధి వంశపారంపర్యంగా రాదని, ప్రాథమికంగా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇది సామాన్యమైన వ్యాధి అని, మైకో బ్యాక్టీరియం లెప్రే అను బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి వస్తుందని తెలియజేయాలన్నారు.
ఈ వ్యాధిని బహుళ ఔషధ చికిత్సతో వ్యాధి ఏ దశలో ఉన్ననూ పూర్తిగా నయం చేయవచ్చునన్నారు. వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించి చికిత్స అందిస్తే అంగవైకల్యం నుంచి పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయవచ్చునన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించి బ్యానర్లు, పోస్టర్లు పంపీణీ చేయాలన్నారు. సర్పంచ్‌లకు భాగస్వామ్యం కల్పించాలన్నారు.
మహిళ ఆత్మహత్య
బత్తలపల్లి, జనవరి 17: స్థలం అమ్మకం విషయంలో ఏర్పడిన సమస్యల వల్ల ఓ మహిళ విషపు గుళికలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది. బత్తలపల్లి పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని డీ.చెర్లోపల్లి గ్రామానికి చెందిన గుజ్జల శ్రీరాములు భార్య నారమ్మ(48) మంగళవారం విషపు గుళికలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా బుధవారం మృతి చెందింది. గత నాలుగు నెలల క్రితం అదే గ్రామానికి చెందిన గుజ్జల రవికి ఇంటి స్థలం అమ్మారు. ఇందులో కొంత మొత్తం అమ్మిన రోజే చెల్లించగా మిగిలిన మొత్తం తరువాత చెల్లించే విధంగా పెద్దమనుషుల సమక్షంలో ఒప్పందం కుదిరింది. అయితే గత 10రోజులు గడిచినా అమ్మిన స్థలానికి మిగిలిన సొమ్ము చెల్లించకపోవడంతో ఇంటిలో భార్య, భర్తల మధ్య ఘర్షణ కూడా జరిగినట్లు తెలుస్తోంది. మనస్తాపం చెందిన మహిళ విషపు గుళికలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది. బాధితుల ఫిర్యాదు మేరకు గుజ్జల కిష్టప్ప, రవిలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.