అనంతపురం

అనిమిరెడ్డిపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ ముట్టడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెళుగుప్ప, అక్టోబర్ 15: పంటలు ఎండిపోతున్నా ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్ సరఫరా అందించకపోవడాన్ని నిరసిస్తూ సోమవారం అనిమిరెడ్డిపల్లి సబ్ స్టేషన్‌ను రైతులు ముట్టడించారు. ఈ సందర్భంగా సబ్ స్టేషన్‌కు తాళాలు వేసి, రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మండల పరిధిలోని అనిమిరెడ్డిపల్లి సబ్ స్టేషన్ పరిధిలో కోనంపల్లి, కాలవపల్లి, కల్యాణదుర్గం మండంలోని గోళ్ల, ముద్దినాయినిపల్లి గ్రామాలకు చెందిన రైతులు గత వారం రోజులుగా ఆయా గ్రామాలకు చెందిన పంట పొలాలకు విద్యుత్ సరఫరా సక్రమంగా అందించడం లేదని, తాము సాగు చేసిన వరి, ఇతర పంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు సబ్ స్టేషన్ వద్దకు చేరుకుని ట్రాన్స్‌కో అధికారులను, సిబ్బందిని కార్యాలయం బయటకు పంపి కార్యాలయానికి తాళాలు వేశారు. అనంతపురం, కల్యాణదర్గం ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం నెలకొంది. సమాచారం అందుకున్న ఏడీ రాజశేఖర్, ఏఈ సలీం అక్కడకు చేరుకుని రైతులతో చర్చించారు. ఆయా పరిధిలోని ట్రాన్‌ఫార్మర్‌లను మార్చి సక్రమంగా విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు. రైతుల పక్షాన కల్యాణదుర్గం వైకాపా సమన్వయకర్త ఉషశ్రీ చరణ్ అధికారులతో చర్చించారు. ఎస్సై నాగస్వామి బందోబస్తు ఏర్పాటు చేశారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేయవద్దు
* పోలీసు భద్రతతో బాలయ్య పాలన * పేదలకు పట్టాలు ఇవ్వకపోతే ఆందోళన రాష్ట్ర సీపీఎం కార్యదర్శి మధు
హిందూపురం టౌన్, అక్టోబర్ 15: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో హిందూపురం ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయవద్దని రాష్ట్ర సీపీఎం కార్యదర్శి మధు సూచించారు. సోమవారం మున్సిపల్ పరిధిలోని బాపూజీనగర్‌లో ఆయన పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు తాము ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్నా ఇప్పటి వరకు ఇంటి పట్టాలు ఇవ్వలేదన్నారు. వౌలిక సదుపాయాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం మధు మాట్లాడుతూ, అనాదిగా హిందూపురం ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపిస్తున్నా సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ కేవలం చుట్టపు చూపుగా వచ్చి హడావుడి చేసి వెళ్ళిపోతున్నారే తప్ప ఏనాడూ ప్రజా సమస్యలను పట్టించుకున్న పాపానపోలేదన్నారు. హిందూపురంలో పోలీసు భద్రత నడుమ పాలన సాగుతోందని విమర్శించారు. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను దళిత వాడల్లో వెచ్చించకుండా ఎక్కడ ఖర్చు చేశారని ప్రశ్నించారు. మరో నెల రోజుల్లోపు బాపూజీనగర్ వాసులకు ఇంటి పట్టాలు అందించి వౌలిక సదుపాయాలు కల్పించాలని, లేనిపక్షంలో హిందూపురం పట్టణ బంద్‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు.

సరస్వతీ అలంకరణలో ఖాద్రీశుడు
కదిరి టౌన్, అక్టోబర్ 15: దసరా పండుగ ఉత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో లక్ష్మీనరసింహస్వామి భక్తులకు సరస్వతీదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. అలాగే చౌడేశ్వరి ఆలయంలో చౌడేశ్వరిదేవిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నృసింహాలయంలో అర్చకులు పార్థసారథిచార్యులు, నరసింహాచార్యులు స్వామివారిని విశేషంగా అలంకరించి అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా మరకత మహాలక్ష్మి, కన్యకాపరమేశ్వరి, గాయిత్రి దేవి, మల్లాలమ్మ దేవి తదితర ఆలయాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆయా ఆలయాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి, మొక్కుబడులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ వెంకటేశ్వరరెడ్డి, భక్తులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యలు వేగవంతంగా పరిష్కరించండి
అనంతపురం సిటీ, అక్టోబర్ 15: మీకోసంలో వచ్చే ప్రజా ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలంటూ సంబంధిత శాఖాధికారులను జిల్లా రెవిన్యూ అధికారి సుబ్బారెడ్డి ఆదేశించారు. సోమవారం మీకోసం సందర్భంగా కలెక్టరేట్‌లోని రెవిన్యూ భవన్‌లో వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజల నుండి అధికారులు 230 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఓ మాట్లాడుతూ ప్రజావాణిలో ప్రజల నుండి వచ్చే వినతులలోని పలు సమస్యలను సంతృప్తికరంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. లేనిపక్షంలో లిఖితపూర్వకంగా సరైన కారణాలతో వినతులను తిరస్కరించాలన్నారు. అధిక సంఖ్యలో వినతులు పింఛన్ల పంపిణీ, రేషన్ కార్డులు, ఇంటి నివేశిత పట్టాలు, వివిధ కార్పొరేషన్లలో రుణాలు తదితర విషయాలపై ప్రజల నుండి స్వీకరించారు.

ప్రకృతి వ్యవసాయంలో మహిళలు
ముందడుగు వేస్తున్నారు
అనంతపురం సిటీ, అక్టోబర్ 15: పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో మహిళలు ముందడుగు వేస్తున్నారని కలెక్టర్ జీ.వీరపాండ్యన్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక జెడ్పీ కార్యాలయం ఆవరణలోని జిల్లా వ్యవసాయ, అనుబంధ శాఖల ఆధ్వర్యంలో జాతీయ మహిళా రైతు దినోత్సవం 2018 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయరంగంలో మహిళలు గణనీయమైన కృషి చేస్తున్నారని, వ్యవసాయ కుటుంబాలను మహిళలు దాదాపు 18 శాతం నడిపిస్తున్నారన్నారు. జిల్లాలో మొట్టమొదటిసారిగా మహిళా రైతులను గుర్తించి వారి కార్యక్రమంలో తాను పాల్గొనడం చాలా సంతోషించదగ్గ విషయమన్నారు. జిల్లాలో 80 శాతం రైతులు వేరుశనగ సాగుపై ఆధారపడి వున్నారన్నారు. వేరుశనగ సాగులో మహిళలు విత్తనం విత్తే దగ్గర నుండి పంట చేతికి వచ్చే వరకు అన్ని రకాలుగా పనులలో మహిళలదే ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. వ్యవసాయ శ్రామికశక్తిలో 43 శాతం మహిళల ద్వారానే లభిస్తోందన్నారు. సహజంగానే స్ర్తికి ఓర్పు, సహనంతోపాటు మృధు స్వభావం, పట్టుదల, పరిశీలనాగ్రహకశక్తి, ఆచరణ వారిలో ఎక్కువగా వుంటుందని, వారు చేపట్టే పనులకు కొంత సాంకేతిక పరిజ్ఞానం జోడిస్తే మరింత సమర్థవంతంగా వ్యవసాయాభివృద్ధి రేటును పురోగమనంలోకి తీసుకెళ్లి గలుగుతారన్నారు. అంతకుమునుపు వ్యవసాయ అనుబంధ రంగాలచే ఏర్పాటుచేసిన స్టాల్స్‌ను కలెక్టర్ తిలకించారు.

అబ్దుల్‌కలాం ఆశయాలను కొనసాగిద్దాం
అనంతపురం సిటీ, అక్టోబర్ 15: భారత రత్న డా.ఏపీజే అబ్దుల్ కలాం ఆశయాలను కొనసాగిద్దామని జేఎన్‌టీయూ ఉప కులపతి ఆచార్య శ్రీనివాసకుమార్ తెలిపారు. సోమవారం జేఎన్‌టీయూ పరిపాలన భవనంలో అబ్దుల్ కలాం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ అబ్దుల్ కలాం ఉపాధ్యాయుడు, గొప్ప శాస్తవ్రేత్త, ఆయన ఒక నిరుపేద కుటుంబం నుండి వచ్చి భారత ప్రధానిగా ఎదిగిన వ్యక్తి అని కొనియాడారు. దేశం యొక్క మిస్సైల్ మాస్‌గా పిలవబడే కలాం ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణి, వాహన ప్రయోగ టెక్నాలజీ అభివృద్ధికి కృషి చేశారన్నారు. ప్రతి ఒక్కరు పరిశోధకుడిగా ముందుకు సాగినపుడే భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టగలమని తెలిపారు. శాంతి సమాజ హితమే అభ్యుదయ మంత్రంగా భావించి తన జీవితాన్ని విద్యార్థులతోనే కడదాకా గడిపిన మహోన్నత వ్యక్తి కలాం అని తెలియజేశారన్నారు.

విధ్యాదాయిని కటాక్షించు
*శాస్త్రోక్తంగా చిన్నారులకు అక్షారాభ్యాసం
అనంతపురం కల్చరల్, అక్టోబర్ 15: చదువుల తల్లి సరస్వతి దేవి మూలా నక్షత్రం జన్మనక్షత్రం కావడంతో నగరంలోని పలు ఆలయాలలో చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. చిన్నారులు ఓం నమహా అంటూ అక్షరాలను రాయడం ప్రారంభించారు. సోమవారం నగరంలోని ఆలయాలలో అమ్మవారు సరస్వతి దేవిగా కటాక్షించారు. పాతవూరులోని శ్రీ వాసవి మాత వీణాధారిణిగా శే్వత వర్ణ వస్రాలతో, బంగారు ఆభరణాలతో దర్శనమిచ్చారు. 5వ రోడ్డులోని శ్రీ నల్లమల సుంకులమ్మ శ్రీ బాలాత్రిపురసుందరిగా సాక్షాత్కరించారు. శ్రీ శృంగేరి శంకర మఠంలో శారదాంబ దేవి వీణా శారదాగా అలంకరించుకొని దర్శనమిచ్చారు. ఉదయం ఆలయంలో రుద్రహోమం, సరస్వతి హోమాలు అక్షరాభ్యాసాలు నిర్వహించారు. 5వ రోడ్డులోని కనకదుర్గా దేవి అన్నాపూర్ణగా, తపోవనంలోని శ్రీ వేదగాయత్రి మాత శ్రీ రాజరాజేశ్వరి అలంకరణలో దర్శనమిచ్చారు. కొత్తవూరులో శ్రీ మత్కన్యకాపరమేశ్వరి దేవి శ్రీ సరస్వతి దేవి, మీనాక్షి ఆండాల్ అలంకారంలో సాక్షాత్కరించారు. 1వ రోడ్డులోని శ్రీ కాశీవిశే్వర కోదండ రామాలయంలో శారదాంబ శేష వాహనంపై ఆశీనులై ప్రజలకు దర్శనమిచ్చారు. సాంస్కృతిక కార్యక్రమాలతో ఆధ్యాత్మికత సంతరించుకొంది.

హనుమద్ వాహనంపై ఊరేగిన సప్తగిరీశుడు
అనంతపురం కల్చరల్, అక్టోబర్ 15: సప్తగిరీశుడు హనుమద్ వాహనంపై ఆశీనులై భక్తజనకోటికి దర్శనభాగ్యం కలుగజేశారు. సోమవారం వైష్ణవాలయాలలో స్వామివారు విశేషాలంకరణతో సాక్షాత్కరించారు. వైష్ణవ సాంప్రదాయంలో హనుమంత వాహన సేవను తిరుపడిగా కీర్తిస్తారు. అంతరంగంగా బహిరంగంగా స్వామివారిని స్మరిస్తూ సదా తన్మయత్వంలో ఉండే తత్వం హనుమంతునిది. ఈ వాహన సేవ వల్ల భక్తితత్వం అభివృద్ధి చెంది పుణీతులవుతారని పురాణాలు చెబుతున్నాయి. ఉదయం ఆలయంలో మూలవిరాట్‌కు వివిధ పుష్పమాలలతో నయన మనోహరంగా అంకరించారు. సాయంత్రం స్వామివారు సతీ సమేతంగా హనుమద్ వాహనం పై ఊరేగుతుంటే భక్తులు అడుగడుగునా హారతులు ఇస్తూ నీరాజనం పలికారు.