అనంతపురం

అక్రమ నీటి వాడకంపై ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, అక్టోబర్ 15 : తుంగభద్ర జలాశయం నుంచి జిల్లాకు కేటాయించిన నీటిని ఆయకట్టు రైతులు దుర్వినియోగం చేసే అవకాశం ఉందని హెచ్చెల్సీ అధికారులు ఆందోళన నెలకొంది. ఓవైపు హంద్రీ నీవా కాలువ ద్వారా జిల్లాకు కృష్ణా జలాలు వస్తుండగా, మరోవైపు తుంగభద్ర నుంచి హెచ్చెల్సీకి నీటి విడుదల కొనసాగుతోంది. అయితే కాలువ వెంట నీరు వెళ్తున్నా తమ పంటలు కాపాడుకోలేక పోతున్నామన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. దీంతో ఆరుతడి పంటలు, ఇప్పటికే వేసిన పంటలు కాపాడుకునేందుకు రైతులు అక్రమ పద్ధతులు అనుసరించే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పంటల రక్షణ పేరుతో ఎట్టి పరిస్థితుల్లోనూ హెచ్చెల్సీ ద్వారా వచ్చే నీటిని వాడుకోరాదని ఇప్పటికే రైతుల్ని హెచ్చరించిన విషయం విదితమే. అదేవిధంగా హెచ్చెల్సీ పరిధిలోని లేని చెరువులకు నీటిని విడుదల చేయడం కుదరని తేల్చి చెప్పారు. ఐఏబీలో రూపొందించిన అంచనాల మేరకు ఆగస్టు 6వ తేదీ నుంచి తుంగభద్ర జలాశయం నుంచి దశలవారీగా నీటిని వారాబందీ (ఆన్‌అండ్‌ఆఫ్) విధానంలో తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు 8.593 టీఎంసీలు చేరినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దామాషా పద్ధతిలో కేటాయించిన మేరకు 25.142 టీఎంసీల నీరు హెచ్చెల్సీకి దక్కే అవకాశం ఉండగా, డిసెంబర్ 20 నాటికి జలాల విడుదల ఆగిపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తాగునీటికి ప్రాధాన్యతనిస్తూ రిజర్వాయర్లలో నిల్వ ఉంచడంలో సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. హెచ్‌ఎల్‌ఎంసీ, జీబీసీ, మిడ్‌పెన్నార్ దక్షిణ కాలువ, టీబీసీ, మిడ్‌పెన్నార్ ఉత్తర కాలువ, చాగట్లు రిజర్వాయర్, పీఎబీఆర్ కుడి కాలువలకు హెచ్చెల్సీ నీటిని తరలిస్తున్నారు. ఆఖరులో డిసెంబర్ 1 నుంచి 2019 జనవరి 22 వరకు 53 రోజులపాటు పీఏబీఆర్ కుడి కాలువకు రోజుకు 600 క్యూసెక్కుల చొప్పున విడుదల చేసే నీటితో 2.748 టీఎంసీలు రానున్నాయి. తొలుత ఆగస్టు 6 నుంచి హెచ్‌ఎల్‌ఎంసీకి 2.722 టీఎంసీల నీటి విడుదల ప్రారంభమైంది. నవంబరు 28 వరకు 115 రోజులపాటు 2.699 టీఎంసీలు నీటిని రానుంది. ఆగస్టు 12 నుంచి గుంతకల్లు బ్రాంచి కెనాల్‌కు మొదలైన నీటిని నవంబరు 11 వరకు 90 రోజులపాటు 2.273 టీఎంసీలు విడుదల చేసుకోనున్నారు. సెప్టెంబర్ 26 నుంచి మిడ్‌పెన్నార్ సౌల్ కెనాల్ (ఎంపీఎస్‌సీ)కు కేటాయించిన నీరు 2019 జనవరి 15వ తేదీ వరకు దశలవారీగా విడుదల కానున్నాయి. 110 రోజులపాటు నీటిని విడుదల చేయడంతోపాటు అదనంగా ఒక టీఎంసీ నీటిని హంద్రీ నీవా ద్వారా కేటాయించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. గత నెల 26వ తేదీ ఎంపీఎస్‌సీకి నీటి విడుదలకు కలెక్టర్ జీ.వీరపాండ్యన్ ఆమోదం తెలిపారు. ఈమేరకు 90 రోజులపాటు నీటిని విడుదల చేయాలని కార్యాచరణ ప్రణాళిక కూడా రూపొందించారు. అయితే గరిష్టంగా 3.110 టీఎంసీలు అవసరమని, నీటి విడుదలను 90 రోజుల నుంచి 120 రోజులకు పెంచాలని మంత్రి పరిటాల సునీత, శింగనమల ఎమ్మెల్యే, విప్ యామినీ బాల కలెక్టర్‌ను విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో వారాబందీ (ఆన్ అండ్ ఆఫ్) పద్ధతిలో 110 రోజులు నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. తద్వారా 1 టీఎంసీ నీటిని హంద్రీ నీవా కాలువ ద్వారా మళ్లించేందుకు నిర్ణయించారు. దీంతో 0.70 టీఎంసీల నీరు పెన్నహోబిళం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా మిడ్ పెన్నార్ రిజర్వాయర్ (ఎంపీఆర్) చేరేలా కార్యాచరణ రూపొందించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో కరవు పరిస్థితుల్ని బట్టి రైతులు స్వల్ప కాల, ఆరుతడి పంటలే వేసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ తడి పంటలు వేసుకోరాదని హెచ్చెల్సీ ఎస్‌ఈ లేపాక్షి మక్బుల్ సాహెబ్ స్పష్టం చేశారు. ఇక తాగునీటికి కూడా ప్రాధాన్యత ఇచ్చినందున టీబీ డ్యామ్ నుంచి నీటి విడుదల ఆగిపోయే ఆఖరి రోజు నాటికి 2.50 టీఎంసీ సామర్థ్యమున్న పీఏబీఆర్‌లో వచ్చే ఏడాది 2019 ఆగస్టు వరకు తాగునీటి అవసరాలు తీర్చేందుకు నిల్వ ఉంచేలా చర్యలు తీసుకున్నారు. కాగా పీఏబీఆర్ కుడి కాలువకు ఎంత మేరకు నీటిని కేటాయించాలన్న విషయంపై అధికారులు ఇప్పటికీ తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే రోజుకు 600 క్యూసెక్కుల చొప్పున 2.748 టీఎంసీల నీటిని విడుదల చేయాలన్న ప్రతిపాదించారు. అలాగే చాగళ్లు రిజర్వాయర్‌కు కూడా రోజుకు 200 క్యూసెక్కుల చొప్పున డిసెంబర్ 23 వరకు 90 రోజులపాటు 1.555 టీఎంసీల నీటిని విడుదల చేయడానికి చర్యలు తీసుకున్నారు. దీనికి కూడా ఎలాంటి నీటి కేటాయింపులు లేక పోయినా ప్రజా ప్రతినిధుల ఒత్తిడి మేరకు ఈ ఏడాది కూడా నీటిని విడుదల చేయడానికి అధికారులు ముందుకు రావడం విశేషం.