అనంతపురం

శక్తి వంచన లేకుండా పనిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, డిసెంబర్ 14: గత నాలుగున్నర సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ శ్రేణులు శక్తివంచన లేకుండా పనిచేయాలని అర్బన్ ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి పేర్కొన్నారు. నియోజకవర్గ కార్యాలయంలో శుక్రవారం టీడీపీ నగర కమిటీ సమావేశం నిర్వహించారు. నగర అధ్యక్షులు ఆదినారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ ప్రతిష్టను పెంచాలన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా నాలుగున్నరేళ్లలో టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల వద్ద గర్వంగా చెప్పుకుని ప్రజల మన్ననలను పొందాలన్నారు. పార్టీ అప్పిగించిన కార్యక్రమాలను బూత్ కమిటీ, క్రియాశీలక సభ్యులందరూ చిత్తశుద్ధితో అమలుపరచాలన్నారు. కార్యక్రమాల పట్ల నిర్లక్ష్యం వహిస్తే పార్టీకి నష్టం వాటిల్లుతుందన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలన్నారు. డివిజన్ కన్వీనర్లు ఓటరు లిస్టుపై ప్రత్యేక దృష్టి సారించాలని, దొంగ ఓట్లను గుర్తించి, అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ప్రతి ఒక్కరు పనిచేయాలన్నారు.
ఏపీఎండీపీ పైపులైను గుంతలు పూడ్చాలని సీపీఎం ధర్నా
అనంతపురంటౌన్, డిసెంబర్ 14: నగరంలో జరుగుతున్న ఏపీఎండీపీ పైపులైను గుంతలు త్వరితగతిన పూడ్చి వేసి ప్రజల ఇబ్బందులు తొలగించాలని కోరుతూ శుక్రవారం సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయంలో ధర్నా నిర్వహించారు. ధర్నాలో నగర కార్యదర్శి నాగేంద్రకుమార్, వెంకటనారాయణ, వలి, రామిరెడ్డి పాల్గొన్నారు. వారు కొంతసేపుకార్యాలయ ఆవరణలో ధర్నా నిర్వహించారు. తర్వాత కమిషనర్ ఛాంబర్ వద్దకు కలిసేందుకు వెళ్లారు. వారి కోరిక మేరకు ధర్నా జరిగే ప్రాంతానికి కమిషనర్ వచ్చారు. నగర కార్యదర్శి నాగేంద్ర మాట్లాడుతూ నగరంలో పైపులైన్ల కోసం గుంతలు తవ్వి పైపులు అమర్చిన తర్వాత వాటిని సక్రమంగా పూడ్చటం లేదన్నారు. దీనితో గుంతలలో పడి మహిళలు, వృద్ధులు, చిన్నారులు గాయాలపాలవుతున్నారన్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం ప్రజల పాలిట శాపంగా మారుతోందన్నారు. టెండర్ నిబంధనల ప్రకారం తవ్విన గుంతలను పూడ్చి వేసి రోడ్డు వేయాల్సిన బాధ్యత ఐహెచ్‌పి కంపెనీ వారిపై ఉందన్నారు. అయితే వారు ప్రజల ఫిర్యాదులను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. గుంతలు పూడ్చటం తమ బాధ్యత కాదని తప్పించుకుంటున్నారని అన్నారు. కావున గుంతలను ఐహెచ్‌పి కంపెనీ వారిచే పూడ్పించి ప్రజల ఇబ్బందులు తొలగించాలని కోరారు.
నాల్గవ రోజుకు చేరిన సీపీఐ ధర్నా
ఏపీఎండీపీ పైపులైను గుంతలను పూడ్చాలని, కంపోస్ట్ యార్డు తరలించాలని కోరుతూ సీపీఐ నగర కమిటీ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నా శుక్రవారం నాల్గవ రోజుకు చేరుకుంది.

ఛదువుతోపాటు నైపుణ్యాలను
పెంపొందించుకోవాలి
అనంతపురం సిటీ, డిసెంబర్ 14: విద్యార్థులు, అధ్యాపకులు చదువుతోపాటు నైపుణ్యాలను పెంపొందించుకుంటేనే సమాజంలో ఉన్నత స్థానాలను అధిరోహించవచ్చునని జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ ఆచార్య కృష్ణయ్య పేర్కొన్నారు. జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కాలేజిలోని ఈఈఈ విభాగంలోని సెమినార్ హాల్‌లో సాఫ్ట్ స్కిల్స్‌పై సదస్సును శుక్రవారం ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రిజిస్ట్రార్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి, అధ్యాపకులు నైపుణ్యాలపై అవగాహన పెంచుకోవాలని, ప్రస్తుత సమాజంలో చదువుతోపాటు నైపుణ్యాలకు ఎంతో ముఖ్యపాత్ర ఉందని తెలిపారు. ప్రభుత్వాలు, విద్యాసంస్థలు నైపుణ్యాల అవగాహన కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాయని, వాటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

కరుణించని వరుణుడు
29 వేల హెక్టార్లలో పప్పుసెనగ ప్రశ్నార్థకం
ఉరవకొండ, డిసెంబర్ 14: వరుస కరువులతో ఘోరంగా నట్టేట మునిగిన కరువు రైతు బతుకు రబీలో మరోమారు దెబ్బతినింది. వరుణ దేవుడు రబీ సీజన్‌లో కరుణించకపోవడంతో ఉరవకొండ వ్యవసాయ శాఖ డివిజన్ పరిధిలో పప్పుసెనగ పంట ప్రశ్నార్థకంగా మారింది. ఖరీఫ్ సీజన్‌లో సరైన వర్షాలు కురవకపోవడంతో ఎక్కువ శాతం రైతులు పంటలు సాగు చేయలేదు. కనీసం ఖరీఫ్ సీజన్‌లో పంట సాగు చేస్తామన్న ఆశతో వున్న రైతుకు సరైన వర్షాలు కురవకపోవడంతో అరకొర తేమతోనే పప్పుసెనగ విత్తన సాగు చేశారు. పంటలు సాగుచేసి నెలలు గడుస్తున్నా కనీసం ఒక్కసారి తగిన వర్షం రాకపోవడంతో పంట దెబ్బతినిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ఐదు సంవత్సరాల నుండి కరువు పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. దీంతో రైతులు లక్షలాది రూపాయలు నష్టపోయారు. ఉరవకొండ వ్యవసాయ డివిజన్ పరిధిలో గత ఏడాదికంటే ఈ ఏడాది పప్పుసెనగ సాగు అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. ఉరవకొండ మండలంలో 9050 హెక్టార్‌లు, విడపనకల్లు మండలంలో 9 వేల హెక్టార్లలో, వజ్రకరూరు మండలంలో 9400 హెక్టార్లలో, గుంతకల్లు మండలంలో 2400 హెక్టార్లలో పప్పుసెనగ సాగు చేశారు. గత ఏడాది ఉరవకొండ వ్యవసాయ డివిజన్‌లో అధికంగా పప్పుసెనగ సాగు చేశారు. పంట చేతికొచ్చే సమయంలో వరుణ దేవుడు కరుణించక పంట ఎండిపోయింది. పప్పుసెనగ పంట సాగు చేయడం కోసం ఎకరానికి రూ. 15వేల నుండి 18 వేల వరకు పెట్టుబడులు పెట్టామని రైతులు వాపోతున్నారు. కనీసం ఎకరా కూడా దిగుబడి వచ్చే పరిస్థితి లేదని, దీంతో వేలాది రూపాయలు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. అదేవిధంగా జీబీసీ కింద మిర్చి పంటను సాగు చేశారని, విల్ట్ తెగులు సోకడంతో పంట దెబ్బతిన్న పొలాల్లో పంటను తొలగించి, పప్పుసెనగను సాగు చేశారు. వర్షం రాక పప్పుసెనగ పూర్తిగా దెబ్బతినిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 2 వేల ఎకరాలలో పంట ఎండిపోయిందని రైతులు పేర్కొంటున్నారు. పంటలు ఎండిపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

ఎన్టీఆర్ జీ ప్లస్-3 గృహాలపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి
* లబ్ధిదారులకు అధికారుల అవగాహన సదస్సు
* డీడీలు కట్టేందుకు ముందుకొస్తున్న లబ్ధిదారులు
కదిరి, డిసెంబర్ 14: రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఎన్టీఆర్ జీ ప్లస్-3 గృహాలపై పేదలు ఆసక్తి చూపకపోవడంతో కలెక్టర్ వీరపాండ్యన్ ప్రత్యేక దృష్టి సారించారు. ఆయా మున్సిపాల్టీలో మున్సిపల్ కమిషనర్‌తోపాటు ట్రైనీ కలెక్టర్ విశ్వనాథ్‌తో జీ ప్లస్-3 పథకం గురించి ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించారు. జిల్లాలోని కదిరి, హిందూపురంతోపాటు మరో 9 మున్సిపాల్టీల్లో షాపూజీ ఫల్లాంజి సంస్థవారు నిర్మిస్తున్నారు. సింగిల్ రూం, సింగిల్ బెడ్‌రూం, డబుల్ బెడ్‌రూం ఇళ్లను మూడు విభాగాలుగా విభజించి ఈ జ్లీ ప్లస్-3 ఇళ్లను నిర్మిస్తున్నారు. ఈ పక్కా గృహాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 3 లక్షలు రాయితీ, బ్యాంకు ద్వారా మరో రూ. 4 లక్షలు రుణాలు ఇచ్చేలా ఈ పథకాన్ని రూపొందించారు. దీంతో చాలామంది ప్రజలు బ్యాంకు రాయితీ రూ. లక్షకు రూ. 860లు చొప్పున వయస్సునుబట్టి ఈఎంఐని నిర్ణయించి దాదాపు 15 నుండి 20 సంవత్సరాలు చెల్లించేలా పథకాన్ని రూపొందించడంతో చాలామంది పేదలు ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వం అందరికీ ఇళ్లు ఇవ్వాలని ఇప్పటికే ఒక్కో మున్సిపాల్టీకి ఇన్ని ఇళ్లు చొప్పున నిర్ణయించింది. వీటిలో అతి తక్కువ శాతం ఇళ్ల కోసం లబ్ధిదారులు డీడీలు చెల్లించడంతో నిర్మాణాలు డీడీ చెల్లించిన వారికే కట్టాలా, లేక ప్రభుత్వం నిర్ణయించిన ఇళ్లు నిర్మించాలా అని అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి ఆయా మున్సిపల్ కమిషనర్లతోపాటు ట్రైనీ కలెక్టర్ విశ్వనాథ్‌తో జీ ప్లస్-3పై ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించి, ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోకపోతే భవిష్యత్తులో చాలా నష్టపోతారని అవగాహన కల్పించడంతో లబ్ధిదారులు డీడీలు కట్టేందుకు ముందుకొస్తున్నారు. కదిరి మున్సిపాల్టీకి సంబంధించి 3662 ఇళ్లు మంజూరు కాగా, వారిలో 1488 మంది అర్హులుగా అధికారులు గుర్తించడం జరిగింది. గతంలో కేవలం 488 మంది మాత్రమే డీడీలు చెల్లించారు. మున్సిపల్ కమిషనర్ ప్రమీల లబ్ధిదారులకు అవగాహన సదస్సు నిర్వహించడం వల్ల మరో 600 మంది డీడీలు చెల్లించడంతో లబ్ధిదారులు 1100లకు చేరారు. ఏది ఏమైనా జీ ప్లస్-3 గృహాలపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి అధికారులతో అవగాహన సదస్సు నిర్వహించడం వల్ల చాలామంది లబ్ధిదారులు పక్కా ఇళ్లు తీసుకునేందుకు ముందుకురావడం జరిగిందని చెప్పుకోవచ్చు.