అనంతపురం

చేతికొచ్చిన కంది నోటికందేనా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లమాడ, జనవరి 19: జిల్లాలో ఖరీఫ్‌లో సాగయ్యే పంటలతో రైతులు ఏదో ఒక విధంగా నష్టాలను చవిచూస్తూనే వున్నారు. రైతన్న కష్టానికి వర్షం తోడై పంట చేతికొస్తే అంతవరకూ మార్కెట్లో ఆకాశాన్నంటే ధరలు ఒక్కసారిగా దిగజారిపోయి రైతన్నలకు నష్టాలను చేకూర్చడం జిల్లాలో షరా మామూలుగా మారింది. ఈ ఏడాది వేరుశెనగ పంట చేతికొచ్చిన సమయంలో ఓవైపు ధరలు పడిపోవడం, మరోవైపు ఎడతెరిపిలేని వర్షాలతో పంట కుళ్లిపోయి రైతన్న తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం కంది పంటలో దిగుబడి జిల్లా వ్యాప్తంగా కొన్ని మండలాల్లో ఆశాజనకంగా వున్నప్పటికీ చేతికొచ్చిన పంట నోటికందుతుందో లేదోనన్న దిగులు కంది రైతుల్ని వెంటాడుతోంది. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సాగులో భాగంగా 38 వేల హెక్టార్లలో కంది సాగైనట్లు జిల్లా వ్యవసాయ అధికారుల గణాంకాలు చెప్తున్నాయి. జిల్లాలో రాయదుర్గం, ఉరవకొండ ప్రాంతాల్లో మినహా అన్ని ప్రాంతాల్లో కంది పంట ఆశాజనకంగా వున్నట్లు అధికారుల మాట. ముఖ్యంగా గత నవంబర్ మాసంలో వర్షాలు కురిసిన అన్ని ప్రాంతాల్లోనూ కంది పంటలో దిగుబడి వస్తుందని జిల్లా వ్యవసాయ అధికారుల అంచనా.కాగా కంది పంట సాగైన అన్ని మండలాల్లోనూ పరిశీలిస్తే సాగైన భూమిని బట్టి పంటలో దిగుబడి రావడం, పంట లేకపోవడం సగంసగంగా పరిగణించవచ్చు. కొన్ని పొలాల్లో అయితే కంది ఏపుగా పెరిగినప్పటికీ పూత నిలవకపోవడంతో పంట పండలేదనే చెప్పవచ్చు. మరికొన్ని పొలాల్లో అయితే కంది విరగగాసి కంది మొక్కలన్నీ నేలవాలాయి. కొన్ని ప్రాంతాల్లోని పొలాల్లోని పంట పరిశీలిస్తే ఎకరాకు కనీసం 8 క్వింటాళ్లైనా దిగుబడి వస్తుందని రైతులు ఆనందంగా చెప్తున్నారు. అయితే పంట నూర్పిడి జరిగే సమయానికి మార్కెట్లో ధరలు వుంటాయో లేదోనన్న అనుమానాలను కూడా రైతన్నలు వ్యక్తం చేస్తున్నారు. వేరుశెనగలో అంతర పంటగా కందిని సాగు చేసిన రైతన్నలు వేరుశెనగలో నష్టం వాటిల్లినా కూడా పంట సాగు కోసం వెచ్చించిన మొత్తం కంది ద్వారా అయినా వస్తుందనే ఆశతో కంది దిగుబడి వచ్చిన రైతులు ఆశతో వున్నారు. కాగా మార్కెట్లో కందిపై ధరల హెచ్చుతగ్గులు పరిశీలిస్తుంటే జిల్లాలోని కంది పంట పూర్తిగా నూర్పిడి జరిగే సమయానికి ధర అమాంతం పడిపోయే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి. ప్రస్తుతం కంది నూర్పిడి జరిగే గోదాముల వద్ద రైతుల నుంచి రూ.7 నుంచి 9 వేల ధరకు కొనుగోలు చేస్తున్నారు. దుకాణాల్లో కంది బేడలు రూ.185లకు విక్రయిస్తున్నారు. క్వింటా కందుల ధర ప్రస్తుతం మార్కెట్లో వున్న ధరలు తగ్గకుండా వున్నా కూడా కందిని సాగు చేసిన రైతులకు లాభం చేకూరే అవకాశాలు వున్నాయి. జిల్లా వ్యాప్తంగా సాగైన కంది నూర్పిడి వచ్చే సమయానికి మార్కెట్లో ప్రస్తుతం వున్న ధర నిలకడగా వుండటం పై రైతుల్లో దిగులు మొదలైంది. మార్కెట్లో కంది పంట దిగుబడినిబట్టి ఇప్పటికే దళారులు కంది ధరలను తగ్గించేసి కంది కొనుగోలు చేసి నిల్వలు చేసుకోవడానికి పన్నాగం పన్నుతున్నట్లు వ్యాపారస్థుల ద్వారా అందిన సమాచారం. వేరుశెనగ ధరలను మార్కెట్లో నిలకడగా వుండేట్టు చేసి రైతులకు నష్టాలు రాకుండా చేయడంలో ప్రభుత్వం విఫలమైందనే చెప్పుకోవచ్చు. కాగా మార్కెట్ మాయగాళ్ళ ఉచ్చులో కంది రైతులు నలిగిపోకుండా రైతులకు లాభం చేకూరే విధంగా కనీసం కంది ధరలనైనా నిలకడగా వుండేటట్టు చేసి కంది రైతులను ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది.
‘మీకోసం’కు బయోమెట్రిక్
* కలెక్టర్ కోన శశిధర్
అనంతపురం కల్చరల్, జనవరి 19: వచ్చే సోమవారం నుండి మండలస్థాయిలో నిర్వహించే మీ కోసం కార్యక్రమంలో వచ్చే సోమవారం నుండి అధికారులకు బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేయనున్నట్లు కలెక్టర్ కోన శశిధర్ పేర్కొన్నారు. ఈమేరకు ఆయన మంగళవారం మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను పరిష్కరించి, వారికి పారదర్శకమైన ప్రభుత్వ సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా అమలుచేస్తున్న మీ కోసం కార్యక్రమం రోజున అన్ని శాఖల మండలస్థాయి అధికారులు సోమవారం ఉదయం 9.30గం.లకు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. వచ్చే సోమవారం నుండి మండలస్థాయి అధికారుల హాజరును బయోమెట్రిక్ పద్ధతి ద్వారా తహశీల్దార్లు అటెండెన్స్ తీసుకుని జిల్లా రెవెన్యూ అధికారికి పంపాలని కలెక్టర్ తెలిపారు. గైర్హాజరయ్యే అధికారులు, ముందస్తు మంజూరు, అనుమతి లేకుండా సెలవుపై వెళ్లే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో మీ కోసం కార్యక్రమానికి ప్రతి శాఖ జిల్లా అధికారి తప్పనిసరిగా హాజరవుతున్నారని, మండలస్థాయిలో మాత్రం సంబంధిత అధికారులు గైర్హాజరవుతున్నట్లు పత్రికల్లో వార్తలొస్తున్నాయన్నారు. అందుకోసమే బయోమెట్రిక్ హాజరు విధానంతోపాటు ఆకస్మికంగా మీకోసం కార్యక్రమాన్ని తనిఖీ చేయనున్నట్లు వెల్లడించారు. మండలస్థాయిలో పరిష్కరించాల్సిన సమస్యలు అక్కడ పరిష్కారం కాకుండా అవే అర్జీలు మళ్లీ జిల్లా కేంద్రానికి రెండోసారి తీసుకువచ్చినా సంబంధిత మండల అధికారిపై చర్యలు తప్పవన్నారు. నిరుపేద ప్రజల సమస్యలను మానవత్వంతో పరిష్కరించి మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. అర్జీల పరిష్కారంలో జిల్లా నెం.1గా ఉన్న స్థానాన్ని నిరంతరం నిలబెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జెసి బి.లక్ష్మీకాంతం, జెసి-2 సయ్యద్ ఖాజామొహిద్దీన్, డిఆర్వో హేమసాగర్, అసిస్టెంట్ కలెక్టర్ సుమిత్ పాల్గొన్నారు.

పారిశ్రామిక హబ్‌గా హిందూపురం
* ఎపిఐఐసి ఎండి శ్రీ్ధర్
హిందూపురం రూరల్, జనవరి 19 : జాతీయ పారిశ్రామిక పెట్టుబడుల కేంద్రంగా హిందూపురం ప్రాంతాన్ని తీర్చిదిద్దడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల వౌలిక సదుపాయాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ్ధర్ తెలిపారు. మంగళవారం హిందూపురం సమీపంలోని తూమకుంట పారిశ్రామిక వాడను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు పరిశ్రమలు నెలకొల్పడానికి భూ పరిశీలన నిమిత్తం ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ప్రపంచ పారిశ్రామిక వేత్తల సమావేశంలో పరిశ్రమల స్థాపన కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయని, ఇందుకోసం భూ లభ్యత వివరాలు సేకరించడానికి పర్యటన చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 12,500 ఎకరాల భూమి పరిశ్రమల స్థాపనకు అవసరం ఉందని, ఇందులో భాగంగా హిందూపురం, పాలసముద్రం, పుట్టపర్తి ప్రాంతాల్లో భూ లభ్యత పరిశీలిస్తున్నట్లు తెలిపారు. సోమందేపల్లి సమీపంలో అందుబాటులో ఉన్న 1100 ఎకరాల్లో వైద్య పరికరాల తయారీ సంస్థ భారత్ ఫోర్జ్ పరిశ్రమ నెలకొల్పడానికి ముందుకు వచ్చిందని తెలిపారు. అదేవిధంగా చిలమత్తూరు మండలం టేకులోడు వద్ద 200 ఎకరాల్లో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు, పాలసముద్రం వద్ద 264 ఎకరాల్లో ఎయిర్‌బస్ కర్మాగారం నెలకొల్పడానికి సన్నాహాలు సాగుతున్నాయన్నారు. అదేవిధంగా తూమకుంట పారిశ్రామిక సమీపంలో కొటిపి, గోళ్లాపురం వద్ద 870 ఎకరాల భూములను పరిశ్రమల విస్తరణకు గుర్తించినట్లు తెలిపారు. త్వరలో భూ లభ్యత నివేదికను ముఖ్యమంత్రికి అందజేయనున్నట్లు ఎండి శ్రీ్ధర్ తెలిపారు. ఈ సందర్భంగా పెనుకొండ ఆర్డీఓ రామ్మూర్తి తూమకుంట పారిశ్రామిక వాడ విస్తరణలో భాగంగా లభ్యమయ్యే భూముల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎపిఐఐసి జోనల్ మేనేజర్ చంద్రశేఖర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగుల క్రీడలు స్ఫూర్తిదాయకం
* కలెక్టర్ కోన శశిధర్
ఆంధ్రభూమిబ్యూరో
అనంతపురం, జనవరి 19 : ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులు క్రీడాపోటీల్లో పాల్గొనడం స్ఫూర్తిదాయకమని కలెక్టర్ కోన శశిధర్ అన్నారు. మంగళవారం స్థానిక ఆర్‌డిటి స్టేడియంలో జరుగుతున్న ప్రభుత్వ ఉద్యోగుల క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగుల్లో క్రీడ, సాంస్కృతిక తదితర నైపుణ్యాలు కలిగి ఉంటాయన్నారు. ఇలాంటి సందర్భాల్లో వారిలో దాగి ఉన్న ప్రతిభాపాటవాలు, క్రీడా, సాంస్కృతిక పటిమలు వెలుగు చూసే అవకాశం ఉంటుందన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసంతోపాటు దేహధారుడ్యాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగపడతాయన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ శాఖలు అన్నింటిలో రెవెన్యూ, వ్యవసాయ శాఖలు ఎంతో కీలకమైనవన్నారు. మొత్తం 39 బృందాలు పోటీల్లో పాల్గొనగా ఈ రెండు శాఖలు ఫైనల్‌కు చేరుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇది కేవలం స్నేహ పూర్వకంగా నిర్వహించే పోటీ మాత్రమే అన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరించాలన్నారు. అంతకుముందు పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం రెవెన్యూ, వ్యవసాయ శాఖ ఉద్యోగుల మధ్య క్రికెట్ పోటీ జరిగింది. జిల్లా రెవెన్యూ ఉద్యోగుల క్రికెట్ టీంకు ఎవిఎస్ ప్రసాద్ కెప్టెన్‌గా, వ్యవసాయ శాఖ టీంకు కృష్ణయ్య కెప్టెన్‌గా వ్యవహరించారు. రెవెన్యూ ఉద్యోగుల జట్టు 20 ఓవర్లలో141 పరుగులు చేయగా, ఎవిఎస్ ప్రసాద్ అత్యధికంగా 50 పరుగులు సాధించారు. వ్యవసాయ శాఖ టీం 20 ఓవర్లలో 101 పరుగులు చేసి ఆలౌటైంది. 40 పరుగుల తేడాతో రెవెన్యూ ఉద్యోగుల టీం విజయం సాధించింది. విజేతలను డిఆర్‌ఓ పిహెచ్ హేమసాగర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం ఆర్‌డిఓ హుసేస్‌సాహెబ్, వ్యవసాయ శాఖ జెడి శ్రీరాంమూర్తి, క్రికెట్ క్రీడల ఆర్గనైజర్, జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు జయరామప్ప, రెవెన్యూ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అధ్యక్షులు భాస్కరరెడ్డి, రెవెన్యూ సొసైటీ అధ్యక్షులు రామాంజనేయ రరెడ్డి, డిఎస్‌డిఓ జగన్నాథరెడ్డి, ఆర్‌ఐ సంజీవరెడ్డి, అక్రం, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
లక్ష్యానికి మించి పోలియో చుక్కలు
* రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్
పుట్టపర్తి, జనవరి 19: రాష్ట్ర వ్యాప్తంగా పోలియో చుక్కలు వేయడంలో లక్ష్యాన్ని అధిగమించామని ఆరోగ్య వైద్య శాఖ జాయింట్ డైరెక్టర్ జెవి ఎస్‌కె.ప్రసాద్ తెలిపారు. మంగళవారం ఆయన పుట్టపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. పోలియో చుక్కల కార్యక్రమంపై డాక్టర్ నాగరాజు నాయక్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ పోలియో మల మూత్రంతో వైరస్ ద్వారా వ్యాపిస్తుందన్నారు. రాష్ట్రంలో 2008నాటికే పోలియో కేసులు లేవని, అయితే 2011లో ఒక కేసు నమోదైందన్నారు. మన దేశంలో పూర్తిగా పోలియోను అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికి పొరుగు దేశాలైన పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ నుండి ఈ వ్యాధి సంక్రమించే అవకాశం వుందన్నారు. కావున ప్రభుత్వం ఏటా పోలియో కార్యక్రమం చేపడుతోందన్నారు. గత మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా 52.45 లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయడం జరిగిందన్నారు. అనంతపురం జిల్లాలో 4.22 లక్షల మందికి పోలియో చుక్కల మందు వేయడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 37,206 బూత్‌లు ఏర్పాటుచేయగా జిల్లాలో 3602 బూత్‌లతోపాటు ప్రత్యేకంగా బస్టాండ్, రైల్వే స్టేషన్లలో శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో 97 శాతం, జిల్లాలో 99.1 శాతం పోలియో చుక్కలు వేశామన్నారు. ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 1నుండి కొత్తగా 5 ఆరోగ్య పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్, గర్భిణుల కోసం 102 కాల్ సెంటర్, ప్రైవేటు భాగస్వామ్యంతో ఉచిత వైద్య పరీక్షలు, ఆర్థోపెడిక్ విభాగంలో టెలీ రేడియాలజీ, కాలం చెల్లిన మందుల స్థానంలో కొత్త మందుల పంపిణీ తదితర పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ఈ పథకాలు ఇప్పటికే జిల్లా ఏరియా ఆస్పత్రిలలో అమలవుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఈఓ సత్యనారాయణ, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్, వాల్మీకి అడుగు జాడల్లో నడవాలి
* ఎమ్మెల్యేలు కాలువ, ఉన్నం, ఎమ్మెల్సీ శమంతకమణి
కళ్యాణదుర్గం, జనవరి 19: నేటి యువత అంబేద్కర్ అడుగు జాడల్లో ముందుకు సాగాలని ఎమ్మెల్యేలు, విప్ కాలువ, ఉన్నం హనుమంతరాయ చౌదరి, ఎమ్మెల్సీ శమంతకమణి పిలుపునిచ్చారు. మున్సిపల్ పరిధిలోని దొడగట్ట గ్రామంలో మారెమ్మ జాతర సందర్భంగా పట్టణ అధ్యక్షుడు దొడగట్ట నారాయణచౌదరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాల్మీకి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్, వాల్మీకి నాడు చేసిన కృషితోనే నేడు రిజర్వేషన్లు అమలవుతున్నాయన్నారు. కనుక నేటి యువత వారి అడుగు జాడల్లో ముందుకు సాగాలన్నారు. రిజర్వేషన్లు అమలులో ఉండటంతో అనేక మంది పదవుల్లో ఉన్నారన్నారు. అంతేగాకుండా విద్య, ఉద్యోగాల్లో సైతం బడుగు, బలహీన వర్గాల వ్యక్తులు ఉన్నారన్నారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని, అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా చైర్మన్ మోహన్, మార్కెట్ యార్డు చైర్మన్ బాదన్న, మున్సిపల్ చైర్మన్ వైపి రమేష్, ఎంపీపీ మంజుళాకొల్లప్ప, వైస్ ఎంపీపీ వెంకటేసులు, జడ్పీటీసీ కొల్లాపురప్ప, నియోజక వర్గంలోని జడ్పీటీసీలు, ఎంపీపీలు తదితరులు, తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, వాల్మీకి సోదరులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
అనంతపురం సిటీ, జనవరి 19: సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ ఆత్మహత్యకు నిరసనగా ఎస్కేయూలో మెయిన్ గేట్ వద్ద ఎఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను మంగళవారం దహనం చేశారు. ఈ సందర్భంగా ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బయన్న మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రభుత్వం ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలను మతోన్మాద శక్తుల అడ్డాగా మార్చి పరిపాలన చేయడం చాలా దారుణమన్నారు. ప్రభుత్వ విధానాలను, అధికారుల అవినీతిని ప్రశ్నించే ప్రజాస్వామిక, వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులపై దాడులు చేసి, పరిశోధక విద్యార్థులకు వచ్చే ఫెలోషిప్స్ సైతం నిలిపేసేందుకు కేంద్రం నిరంకుశ వైఖరికి నిదర్శనమన్నారు. విద్యార్థి నాయకులను హెచ్‌సియు నుండి బహిష్కరించడం కేంద్ర ప్రభుత్వ పోకడలకు పరాకాష్ట అని విమర్శించారు. ఇప్పటికైనా రోహిత్ మృతికి కారకులైన విసిని, బిజెపి మంత్రులను, ఎబివిపి నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్‌ఎఫ్ నాయకులు జాన్సన్‌బాబు, నాగర్జాన, మంజునాథ్, సుబ్బరాయుడు, రమణ్య, చంద్రశేఖర్‌రెడ్డి, విశ్వనాథ్, వేమన తదితరులు పాల్గొన్నారు.
ఆర్‌డిటి స్టేడియంను పరిశీలించిన శాప్ చైర్మన్ పిఆర్ మోహన్
అనంతపురం సిటీ, జనవరి 19: ఆర్‌డిటి స్డేయంను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాప్ ఛైర్మెన్ పిఆర్ మోహన్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్‌టిడిలాంటి స్వచ్ఛంద సంస్థ చక్కటి క్రీడా గ్రామాన్ని నిర్మించి, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో రాణించేలా క్రీడాకారులను ప్రోత్సహించడం చాలా సంతోషకరమన్నారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి కృషి చేస్తామని, 2019 జాతీయ క్రీడా పోటీలు ఎపిలో నిర్వహిస్తున్నామని తెలిపారు. శాప్ ఛైర్మెన్‌తోపాటు ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి, క్రికెట్ సంఘం కార్యదర్శి ప్రసన్న, నగర కార్పొరేటర్లు ఉమామహేశ్వర్, పి.రాజారావు తదితరులు పాల్గొన్నారు.
దేశసేవలో భాగస్వాములు కండి
* ఆర్మీ రిక్రూట్‌మెంట్ శిక్షణకు అనూహ్య స్పందన
హిందూపురం టౌన్, జనవరి 19 : యువత సైన్యంలో చేరి దేశ సేవలో భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్‌పర్సన్ రావిళ్ల లక్ష్మి పిలుపునిచ్చారు. మంగళవారం మెప్మా, రక్షా అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్మీ రిక్రూట్‌మెంట్ ఎంపిక మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశానికి సేవ చేసే అవకాశం అందరికీ రాదన్నారు. కొంతమందికి మాత్రమే వస్తుందని, అలాంటి అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎంపికైన అభ్యర్థులు కృషి, పట్టుదల, క్రమశిక్షణతో శిక్షణ పూర్తి చేసుకోవాలన్నారు. రక్షా అకాడమీ నిర్వాహకులు మాట్లాడుతూ ఎంపికైన అభ్యర్థులకు మూడు నెలల పాటు ఆర్మీ రిక్రూట్‌మెంట్‌కు అవసరమైన శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ సమయంలో ఉచిత వసతి, భోజన సౌకర్యాలతోపాటు స్ట్ఫైండ్ చెల్లించనున్నట్లు తెలిపారు. కాగా ఈ రిక్రూట్‌మెంట్ శిక్షణకు వివిధ ప్రాంతాల నుండి అనేక మంది యువకులు తరలివచ్చారు. దాదాపు 370 మంది అభ్యర్థులు రాగా ఒరిజినల్ సర్ట్ఫికెట్ల పరిశీలన, దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించి 127 మందిని శిక్షణ కోసం ఎంపిక చేశారు. ఎంపికైన అభ్యర్థులకు మున్సిపల్ కమిషనర్ ఎవివి భద్రరావు ఎంపిక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జీవనోపాదుల అధికారి వాసుదేవరెడ్డి, స్థానిక టిపిఆర్‌ఓ విజయభాస్కర్, రక్షా సెక్యూరిటీ సర్వీసెస్ ప్రతినిధులు పాల్గొన్నారు.

అనుమానాస్పదంగా యువకుడి మృతి
కుందుర్పి, జనవరి 19 : మండలంలోని బండమీదపల్లి గ్రామానికి చెందిన సోమనాథ్(26) అనుమానాస్పదంగా మృతి చెందినట్లు ఎస్సై వేణుగోపాల్‌రావు పేర్కొన్నారు. ఆయన తెలిపిన వివరాల మేరకు బండమీదపల్లికి చెందిన సోమనాథ్ అదే గ్రామానికి చెందిన నవీనమ్మతో గత ఆరు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. అయితే వారం రోజుల క్రితం తల్లిదండ్రుల నుంచి విడిపోయి భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలతో అత్తవాళ్లింట్లో కాపురం పెట్టాడురు. ఈనేపథ్యంలో మంగళవారం ఉదయం గ్రామ శివారు ప్రాంతంలో చెట్టుకు పంచెతో ఉరేసుకుని మృతి చెందడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. గ్రామస్థుల ద్వారా సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు శవం వద్దకు చేరుకుని శవాన్ని కిందకు దించారన్నారు. శవానికి కాళ్ల వెంబడి రక్తం కారిందని, సోమనాథ్‌ను హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించారని మృతుడి తండ్రి గంధం సుబ్బన్న ఆరోపించారు. శవాన్ని కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
అప్పుల బాధకు ఆగిన నేతన్న గుండె
ధర్మవరం, జనవరి 19: అప్పుల బాధకు మరో నేతన్న గుండె ఆగిన సంఘటన మంగళవారం స్థానిక గీతా నగర్‌లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా వున్నాయి. గీతా నగర్‌కు చెందిన సత్యనారాయణ(35) అనే నేతన్న కుటుంబ పోషణ నిమిత్తం తీసుకున్న దాదాపు రూ.3 లక్షల అప్పు తీర్చలేక కుటుంబాన్ని ఎలా పోషించాలోనన్న దిగులుతో గత కొద్ది రోజులుగా తీవ్ర మనస్తాపానికి గురై మనదపడేవాడు. ఈ నేపథ్యంలో మంగళవారం మనస్తాపం చెంది బాధపడుతూ గుండె ఆగి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఆ వార్డు కౌన్సిలర్ ఎర్రిస్వామి, గుండా ఈశ్వరయ్య తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
బాలిక ఆత్మహత్యాయత్నం
ధర్మవరం, జనవరి 19: అనంతపురంలో ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్న స్థానిక ఎస్‌బిఐ కాలనీకి చెందిన ఓ బాలిక మంగళవారం ఉదయం బాత్‌రూంలోని ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాలు ఇలా వున్నాయి. సత్యసాయి నగర్‌కు చెందిన నరేష్, బాలిక ప్రేమ వివాహం చేసుకున్నారు. దీనిపై తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అమ్మాయిని సోమవారం సాయంత్రం పోలీసులు పిలిపించి రాత్రి బాల సదన్‌కు అప్పగించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం మరుగుదొడ్డికి వెళ్లి వస్తానని చెప్పిన బాలిక అక్కడున్న ఫినాయిల్‌ను తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే బాలికలను చికిత్సకై స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా ఈ కేసుకు సంబంధించి మైనర్ అయినందున అమ్మాయిని కోర్టుకు అప్పజెపుతామని పట్టణ సిఐ విజయభాస్కర్‌గౌడ్ తెలిపారు.
గుర్తు తెలియని వృద్ధుడి మృతి
హిందూపురం టౌన్, జనవరి 19 : స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహ ఆవరణలో 70 ఏళ్ల వయస్సు పైబడిన గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందినట్లు వన్‌టౌన్ సిఐ ఇదుర్‌బాషా తెలిపారు. గత నాలుగు రోజుల క్రితం వృద్ధుడి కాలికి గాయం కావడంతో చికిత్సల నిమిత్తం ఆసుపత్రికి వచ్చినట్లు తెలుస్తోందన్నారు. అయితే నడవడానికి చేత కాకపోవడంతో అతిథి గృహ ఆవరణలో ఉండిపోయినట్లు స్థానికుల ద్వారా తెలిసిందన్నారు. స్థానికులు ఇచ్చిన ఆహార పదార్థాలను తింటూ తనది గుడిబండ మండలం మోరుబాగల్ ప్రాంతంగా కన్నడ బాషలో పేర్కొన్నట్లు చెబుతున్నారన్నారు. వృద్ధాప్యం, అనారోగ్యంతో బాధ పడుతూ మంగళవారం మృతి చెందడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మృతుడి స్థానికులతో చెప్పిన మేరకు ఆనవాళ్లు గుర్తించేందుకు గుడిబండ పోలీసుస్టేషన్‌కు సమాచారం ఇచ్చినట్లు సిఐ చెప్పారు.

జీవన బీమా యోజన ఏజెంట్ ఆత్మహత్య
అమడగూరు, జనవరి 19: మండల పరిధిలోని చినగానిపల్లి గ్రామానికి చెందిన జీవన యోజన ఏజెంట్ శిరిపురం శ్రీనివాసులు (55) మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వృత్తిరీత్యా వ్యవసాయం చేసుకునే శ్రీనివాసులు అదనపు పని కింద జీవన యోజన ఏజెంటుగా పనిచేస్తూ ప్రజల నుంచి సుమారు రూ. 30 లక్షల మేర ఖాతాదారుల నుంచి సేకరించి డిపాజిట్లు చేయించాడు. అయితే సంస్థ బోర్డు తిప్పివేయడంతో ఖాతాదారులు అతనిపై వత్తిడి తెచ్చి తమ సొమ్ము చెల్లించాలని కోరడంతో దిక్కుతోచని పరిస్థితిలో మంగళవారం తన వ్యవసాయ పొలం వద్దే పురుగులు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై వెంకటప్రసాద్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.