అనంతపురం

తగ్గిపోతున్న పశు సంపద!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జూన్ 10 : జిల్లా నెలకొంటున్న వరుస కరవుల నేపథ్యంలో ఏ ఏటికి ఆ ఏడు పశు సంపద తగ్గిపోతూనే ఉంది. జిల్లాలో నెలకొంటున్న వర్షాభావ పరిస్థితులతో పంటలు సరిగా పండటం లేదు. దీంతో భారీగానే పశుగ్రాసం కొరత ఏర్పడుతోంది. అంతేగాకుండా ఆఖరికి తాగునీటికి సైతం కటకటలాడాల్సిన పరిస్థితి. అటవీ ప్రాంతాల్లో సైతం జీవాలకు గ్రాసం లభ్యం కాని దుస్థితి. ఏటా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో చెరువుల్లో గ్రాసం పెంపకం, రైతులకు గ్రాసం విత్తనాలు ఉచితంగా సరఫరా చేయడం వంటి చర్యలు చేపడుతున్నా ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. దీంతో వేసవిలో గ్రాసం కొరత తీవ్రంగా వేధిస్తుండటం ప్రతిఏటా పరిపాటిగా మారింది. ఈ ఏడాది సైతం కరవు కారణంగా పనులు లేక, ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో అనేక గ్రామాల్లో పనులు కల్పించకపోవడం వల్ల బెంగళూరు, బళ్లారి, హైదరాబాదు, చెన్నై తదితర నగరాలకు ప్రజలు వలసలు వెళ్లారు. ఈ క్రమంలో పశువులకు సైతం మేత కరువై గత్యంతరం లేక కబేళాలకు తరలిస్తున్నారు. ఐదేళ్లకోమారు పశుగణనను పరిశీలిస్తే.... పశువులు(ఆవులు, ఎద్దులు) 2007లో 6,95,384 ఉండగా, 2012 నాటి గణాంకాల మేరకు 6,17,270కి తగ్గిపోయాయి. ఈ లెక్క మొత్తం 78,114 పశువులు తగ్గాయి. గడచిన రెండేళ్లలో వేలల్లోనే తగ్గిపోతున్నాయి. వీటిలో ఎద్దులు (మూడేళ్లు దాటినవి కలిపి) 2007లో 3,20,474 ఉండగా, 2012 నాటికి 1,81,203కు పడిపోయింది. అలాగే పెయ్య దూడలు, అవుల సంఖ్య 2,06,010 ఉండగా 2,55,345కు పెరిగింది. పాల దిగుబడి కోసం వీటిని పోషిస్తుండటంతో ఆవుల సంఖ్య పెరిగిందనే చెప్పొచ్చు. గేదెల విషయానికి వస్తే 4,10,604(2007) నుంచి 3,71,127కు తగ్గిపోయాయి. గొర్రెల సంఖ్య మాత్రం 2007-2012 పశు గణాంకాల మేరకు 19,05,972 ఉండగా, 38,79,840కి చేరింది. ఇక గాడిదల సంఖ్య 14,917 నుంచి 6,777కు గణనీయంగా తగ్గిపోయింది. ఆధునిక వసతులు అందుబాటులోకి రావడం, తమ వృత్తిపరంగా రజకులు సైతం ఎక్కువగా ద్విచక్ర వాహనాలను వినియోగిస్తుండటంతో గాడిదల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులు పశు గణాలు తగ్గిపోవడానికి ప్రధాన కారణం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుని పశు సంపదను సంరక్షించుకోకపోతే భవిష్యత్తులో తీరని నష్టం చవిచూడాల్సి వస్తుందని పలువురు అందోళన వ్యక్తం చేస్తున్నారు.