అనంతపురం

అలరించిన యువజన సమ్మేళనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టపర్తి, జూలై 12: సత్యసాయి సన్నిధి ప్రశాంతినిలయంలో అంతర్జాతీయ యువజన సమ్మేళనం ఘనంగా ప్రారంభమైంది. మంగళవారం ఉదయం 8గంటలకు ప్రపంచ నలుమూలల నుంచి విచ్చేసిన సాయి యువత, వివిధ దేశాల ప్రతినిధులు, సాయి భక్తులు, ప్రముఖులతో ప్రశాంతినిలయం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. ఉదయం 8గంటలకు సుమారు 70 దేశాలకు చెందిన సాయి యువత వివిధ దేశాల జాతీయ పతాకాలను చేతబూని కవాతుగా సత్యసాయి మహాసమాధి చెంతకు చేరుకున్నారు. మహాసమాధికి ప్రత్యేక పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలనతో అంతర్జాతీయ యువజన సమ్మేళనాన్ని ప్రారంభించారు. అంతర్జాతీయ యూత్ సమన్వయకర్త శివేంద్రకుమార్ ప్రారంభోపన్యాసం చేశారు. సత్యసాయి ఇంటర్నేషనల్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ నరేంద్రనాథ్‌రెడ్డి, యువజన సమ్మేళన విశిష్టతను విశదీకరించారు. ఆలిండియా సేవా ఆర్గనైజేషన్ అధ్యక్షులు నిమీష్‌పాండె, సత్యసాయి బాబా ప్రపంచానికి ప్రసాదించిన ప్రేమ, సేవా నిరతిని గురించి సభికులకు వినిపించారు. వెనుజులా, దక్షిణ అమెరికా దేశానికి చెందిన మిడెస్టినో అనే పాటను యువజన సమ్మేళన స్ఫూర్తిగా ఆలపించారు. భగవాన్ సత్యసాయి బాబా ప్రసంగాన్ని డిజిటల్ స్క్రీన్ ద్వారా ప్రదర్శించారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ యువజన సమ్మేళనం ఉద్దేశించి సత్యసాయి బాబా సేవా నిరతిని ప్రపంచానికి ఆదర్శంగా వెలకట్టలేనిదిగా సుదీర్ఘ ప్రసంగం చేశారు. సుమారు 70దేశాలకు చెందిన 3వేల మంది యువత 25-35సంవత్సరాలలోపు వయసు కల్గిన 1800మంది మహిళా ప్రతినిధులు, 1200మంది పురుష ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సదస్సులో చర్చాగోష్టిలు, బృంద చర్చలు ఆధ్యాత్మిక మార్గదర్శక ప్రసంగాలను సభికులకు వినిపించారు. నేటి ప్రపంచానికి సత్యసాయి చూపిన మార్గమే పరమావధిగా సాయి యువత ప్రపంచానికి చాటి చెప్పాల్సిన బాధ్యత ఎంతైనా వుందని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అంతర్జాతీయ సొబగులు, ప్రత్యేక అలంకరణలు, కాంతులీనుతు సత్యసాయి మహాసమాధి, సాయి కుల్వంత్ సభామందిరం, అంతర్జాతీయ యువజన సమ్మేళనం దశ దిశ వ్యాప్తమయ్యే విధంగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథరెడ్డి, సత్యసాయి బాబా విద్యా, వైద్యం, తాగునీరువంటి బృహత్తర కార్యక్రమాలను వేల కోట్లు వెచ్చించి ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచిన దైవాంస సంభూతుడన్నారు. ఆయన చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించి సుఖమయమైన జీవితాన్ని గడపాలన్నారు. అనంతరం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, మంత్రి పల్లె రఘునాథరెడ్డిలు సత్యసాయి జ్యోతి మెడిటేషన్ విత్ యు ఫర్ ఎవర్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విశ్వ విఖ్యాత క్రికెటర్ వివి ఎస్.లక్ష్మణ్, సత్యసాయి ట్రస్టు ప్రతినిధులు ఆర్‌జె.రత్నాకర్, ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
భద్రతావలయంలో అంతర్జాతీయ సమ్మేళనం...
కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో పుట్టపర్తిలో మంగళవారం జరిగిన యువజన సమ్మేళనం భద్రతా వలయంలో జరిగింది. అనంతపురం రేంజి డిఐజి ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో పటిష్ట భద్రతను నిర్వహించారు. ఒక డిఎస్‌పి, ఇద్దరు సిఐలు, 10మంది ఎస్‌ఐలు, సుమారు 200మంది సిబ్బంది, 40మంది ప్రత్యేక పోలీసు బలగాలు, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్, చెక్‌పోస్టుల ఏర్పాటు, నిత్య తనిఖీల నడుమ యువజన సమ్మేళనానికి అసాధారణ భద్రతను కల్పిస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.