అనంతపురం

‘శ్రీమంతులు’ ఏరీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం : ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆకర్షణీయ (స్మార్ట్) గ్రామ, వార్డుల పథకం జిల్లాలో ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా మారింది. పథకం ప్రారంభించి సంవత్సరం పూర్తయినా ఇప్పటికీ చాలా పంచాయతీలు, వార్డులను దత్తత తీసుకునేవారే కరవయ్యారు. ఇక ఇప్పటి వరకూ దత్తత తీసుకున్న వార్డులు, పంచాయతీల వైపు ‘శ్రీమంతులు’ కనె్నతి చూడలేదు. జిల్లాలోని 1003 గ్రామ పంచాయతీలకు 748, 373 వార్డులకు 248 వార్డులు దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకున్న గ్రామాలు, వార్డుల్లో ప్రభుత్వం అనుకున్న 20 అంశాల్లో అభివృద్ధి చేయాలి. అలాకాకుండా కనీసం కొన్ని అంశాలనైనా అమలు చేసేలా ఒప్పందాలు చేసుకున్నారు. పంచాయతీలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి 444, కొన్ని అంశాలను అభివృద్ధి చేయడానికి 304 మంది ఒప్పందం కుదుర్చుకున్నారు. వార్డులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి 183, కొన్ని అంశాలను అభివృద్ధి చేయడానికి 65 మంది ముందుకొచ్చారు. ఆర్‌డిటి, రిడ్స్, మైరాడా, జన జాగృతి, శ్రీ రీసెర్చి అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ, ఇంటర్నేషనల్ యానిమల్స్ అండ్ బర్డ్స్ లాంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. ఇందులో కొన్ని స్వచ్ఛంద సంస్థలు జనరల్ భాగస్వాములుగా, మరికొన్ని సంస్థలు సెక్టోరియల్ భాగస్వాములుగా అభివృద్ధి చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. వీటితోపాటు ఐఎఎస్‌లైన జెసి శర్మ, ఎస్‌పి టక్కర్, జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, చిత్తూరు జెసి భరత్‌గుప్తా, రామ్‌శంకర్‌నాయక్, పి.వెంకటరామిరెడ్డి, డిజిపి జెవి రా ముడు, ప్రముఖులు పి.వెంకటరామిరెడ్డి, సుబ్బరాయుడు, హరీష్‌కుమార్‌గుప్తా, కృష్ణంరాజు, ఎఆర్ అనురాధ, సురేంద్రబాబు, కిషోర్‌కుమార్ పలు గ్రామ పంచాయతీలు, వార్డులను దత్తత తీసుకున్నారు. అలాగే జిల్లాలో ఉన్న పరిశ్రమలు అల్ట్రాటెక్, పెన్నా సిమెంట్స్, గెర్డావ్ స్టీల్స్, బిఎంఎం సిమెంట్స్, సిఫ్లాన్ డ్రగ్స్ సైతం కొన్ని గ్రామాలను దత్తత తీసుకున్నాయి. ఇక ప్రజాప్రతినిధులు, ధర్మవరం ఎమ్మెల్యే సూర్యనారాయణ, మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఎమ్మె ల్సీ గుండుమల తిప్పేస్వామి, అనంతపురం ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర చౌదరి, టిడిపి జిల్లా అధ్యక్షుడు బికె పార్థసారథి సైతం కొన్ని గ్రామ పంచాయతీలు, వార్డులను దత్తత తీసుకున్నారు. వీరందరితో పాటు బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ కనగానపల్లి మండలం ముత్తవకుంట్ల గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. అయితే దత్తత తీసుకున్న వారు సంవత్సరం పూర్తవుతున్నా అక్కడ చేపట్టిన చర్యలు దాదాపు శూన్యమనే చెప్పాలి. ఇప్పటికీ వారు తీసుకున్న గ్రామ పంచాయితీలు, వార్డుల్లో సమస్యలు తిష్ట వేసుకుని కూర్చున్నా ‘శ్రీమంతులు’ మాత్రం అటువైపు చూసిన దాఖలాలు లేవు.
‘శ్రీమంతుల’ వెతుకుతున్న మండల కమిటీలు
ఇప్పటికీ దత్తతకు నోచుకోని 255 గ్రామ పంచాయతీలు, 125 వార్డులు దత్తత తీసుకునే వారికోసం ఆయా మండల కమిటీలకు నేతృత్వం వహిస్తున్న ఎంపిడివోలు వెతుకులాట ప్రారంభించారు. జిల్లా నుంచి ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న (ఎన్‌ఆర్‌వి)లను ప్రాథమికంగా 1205 మంది, ఇతర దేశాల్లో ఉంటున్న (ఎన్‌ఆర్‌ఐ) ప్రాథమికంగా 65 మంది ఉన్నట్లు గుర్తించి వారి ద్వారా ఆయా గ్రామ పంచాయతీలు, వార్డులను అప్పగించడానికి నానా తంటాలు పడుతున్నట్లు తెలుస్తోంది. కాగా పథకం ప్రవేశపెట్టి సంవత్సరం పూర్తవుతున్నా ఏమాత్రం అడుగు ముందుకు పడకపోవడంతో నేరుగా కలెక్టర్ నేతృత్వంలో సుమారుగా 50 వరకూ గ్రామ పంచాయతీలు, వార్డులను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దత్తత పూర్తయి అభివృద్ధికి నోచుకుని వాటిపై దృష్టి సారించినట్లు సమాచారం. ఏదిఏమైనా పథకం ప్రారంభించి సంవత్సరం పూర్తవుతున్నా ఇప్పటికీ ప్రణాళికలు రూపొందించడం, శ్రీమంతులను వెతుకులాడ్డంతోనే గడచిపోతూ ఉండటం చూస్తే ఆకర్షణీయ గ్రామ, వార్డుల అభివృద్ధిలో ఏ మాత్రం పురోగతి సాధించలేదని చెప్పవచ్చు.
సింహ వాహనంపై ఖాద్రీశుడు
కదిరి, మార్చి 20: ఖాద్రి లక్ష్మి నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీవారు సింహ వాహనంపై భక్తులకు దర్శన భాగ్యం కల్గించారు. ముందుగా యాగశాలలో శ్రీవారికి ఉదయం పుణ్యాహవచనం జరిపి, వాస్తు, అగ్ని ప్రతిష్టగావించారు. కాగా మానవుల్లో గల జంతు స్వభావికను ప్రవృత్తిని అదుపు చేసుకోవడానికి నారశింహుడు సింహ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వడం జరిగింది. రాత్రి ఆలయంలోని అలంకరణశాలలో శ్రీవారికి సింహ వాహనంపై ఆశీనులను గావించి ప్రత్యేక పూజలు, హారతులు ఇచ్చి అక్కడి నుంచి శ్రీవారిని ఉత్సవ రథంపై చేర్చి, ఆలయ ప్రదక్షిణగావించి, ఆలయ ప్రధాన గోపురం ముందుకు చేర్చారు. అక్కడ ఆలయ గొడుగులను అమర్చి, ప్రత్యేక విద్యుత్తు దీపాల కాంతులు నడుమ సింహ వాహనంపై తిరువీధులనందు ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వడం జరిగింది. ఈ సందర్బంగా భక్తులు భారీ సంఖ్యలో స్వామివారికి కాయ కర్పూరం సమర్పించి శ్రీవారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ పట్టెం గురుప్రసాద్, పలువురు పుర ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఉత్సవం ఉభయదారులుగా ఎన్ లక్ష్మిదేవమ్మ, రుక్మిణమ్మ, నిరంజన్ బెంగళూరు, మాడిశెట్టి వీరయ్య, నిర్మలమ్మ, మాడిశెట్టి నరసయ్య, విజయలక్ష్మి కదిరి వారు వ్యవహరించారు. ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్బంగా వివిధ కళాకారులచే నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి.

నేటి నుంచి ‘పది’ పరీక్షలు
* కేంద్రాల వద్ద 144సెక్షన్
* హాజరుకానున్న 51,543 మంది విద్యార్థులు
అనంతపురం సిటీ, మార్చి 20 : పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు నేటి నుండి జిల్లా వ్యాప్తంగా 204 పరీక్ష కేంద్రాల్లో జరుగుతున్నాయి. ఇందుకు సంబందించి అన్ని పరీక్ష కేంద్రాల్లో పక్బందీ ఏర్పాట్లును జిల్లా విద్యా శా ఖాధికారులు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద పరీక్ష సమయంలో 144 సెక్షన్‌ను విధించనున్నారు. 204 పరీక్ష కేంద్రా ల్లో 51,543 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో 1916 మంది ప్రైవేటు విద్యార్థులు కాగా మిగిలిన వారు ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు హాజరవుతున్నారు. పరీక్ష ఉద యం 9 గంటల నుండి 12 గంటల వరకు జరుగుతుంది. విద్యార్థులు పరీ క్ష కేంద్రానికి 8:30 గంటలకే చేరుకోవాలని, మొదటి రోజు మాత్రం 9 గం టల వరకు ఆలస్యమైనా అనుమతి ఉంటుందని అధికారులు విద్యార్థులకు తెలియజేస్తున్నారు. రెండవ రోజు నుండి ఆలస్యమైతే పరీక్ష కేంద్రంలోకి అనుమతించమని తెలియజేస్తున్నారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు అన్ని మూసివేయించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవడానికి ఆర్‌టిసి బస్సులో హాల్‌టికెట్ చూపితే ఉచిత ప్రయాణం చేయవచ్చును. జిల్లా వ్యాప్తంగా 204 పరీక్ష కేంద్రాల్లో దాదాపు 2700 మంది ఇన్విజిలేటర్లు పనిచేయనున్నారు. జిల్లాలో పది పరీక్షలను పర్యవేక్షించడానికి ఆర్‌జెడి ప్రేమానందం ప్రత్యేక పర్యవేక్షకుడిగా వస్తున్నారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, వెలుతురు, ఫ్యాన్లు, బెంచీలు ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షల నిర్వహణకు విద్యా శాఖ అధికారులు పక్బందీగా ఏర్పాట్లును పూర్తి చేశారు.
తగ్గని భానుడి ప్రతాపం
* 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత
ఆంధ్రభూమిబ్యూరో
అనంతపురం, మార్చి 20 : జిల్లాలో భానుడి భగభగలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారం ఏకంగా 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడంతో ప్రజలు తల్లిడిల్లిపోయారు. ఉదయం ఎనిమిది గంటల నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో జనాలు ఇళ్లలో నుంచి బయటికి రావాలంటే జంకుతున్నారు. జిల్లాలోని సుమారు 43 మండలాల్లో 40 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగిలిన 20 మండలాల్లో సైతం 39 నుంచి 40 డిగ్రీలు నమోదయ్యాయి. జిల్లావ్యాప్తంగా గడచిన నాలుగు రోజుల నుంచీ తీవ్రమైన ఎండలు కాస్తుండడంతోపాటు రాత్రి సమయంలో వడగాల్పులు వీస్తున్నాయి. ఆదివారం అత్యధికంగా యాడికి మండలంలో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పుట్టపర్తిలో 42, తాడిపత్రిలో 41.9, బుక్కరాయసముద్రంలో 41.7, రాయదుర్గంలో 41.8, బత్తలపల్లిలో 41, ముదిగుబ్బలో 41.4, అనంతపురంలో 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదివారం సెలవుదినం కావడంతో జనం ఇళ్లలో నుంచి బయటకు రాకపోవడంతో నగరంలోని ప్రధాన కూడళ్లు నిర్మాణుష్యంగా మారాయి. రాబోయే రెండు రోజుల పాటు ఇదే రకమైన పరిస్థితి నెలకొంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
తాగునీటికి రూ.13.06 కోట్లు
* మంత్రి పల్లె రఘునాథరెడ్డి
పుట్టపర్తి, మార్చి 20: వేసవిలో తాగునీటి సమస్య తీర్చేందుకు జిల్లాకుగాను తక్షణ నిధుల కింద రూ.13.06 కోట్లు మంజూరైందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి వెల్లడించారు. ఆదివారం పుట్టపర్తి మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్లతో తాగునీటి సమస్యపై ఆయన చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా తగిన అన్ని చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసిందన్నారు. అవసరమైన పైపులైన్లు, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు వెంటనే ఏర్పాటు చేయాలని ఆ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. జిల్లాలో రూ.40 లక్షల మంది జనాభాకు తాగునీరు అందిస్తామని, ఎన్ని నిధులు ఖర్చు అయినా మంజూరు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సంసిద్ధంగా వున్నారన్నారు. జిల్లాలో 13,940 ప్రాంతాలకుగాను 9 వేల బోర్లు పనిచేస్తున్నాయన్నారు. సిపిడబ్ల్యూఎస్ కింద 57, ఆర్‌డబ్ల్యూఎస్ కింద 38, సత్యసాయి వాటర్ సప్లై కింద 19 పథకాలు పనిచేస్తున్నాయన్నారు. 13 మండలాల్లో 41 గ్రామాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొందని, వాటికి ట్యాంకర్లకు నీరందిస్తామన్నారు. పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా బోర్లు, పైపులైన్ల కోసం రూ.1.85 కోట్లు మంజూరైందన్నారు. నల్లమాడ, ఓడిసి మండలాల్లోని రెడ్డిపల్లి, నల్లమాడ, కుంట్లపల్లి, నల్లగుట్ల పల్లి, చారుపల్లి, పుట్టపర్తి మండలంలో వెంకటగారిపల్లి, కొత్తచెరువు మండలంలో పైపులైన్ల ఏర్పాటుకు రూ.10.63 కోట్లతో పనులు చేపట్టడానికి టెండర్లు పిలిచామన్నారు. జిల్లాలో 3 తాగునీటి రిజర్వాయర్లకు అవసరమైన నీటిని అందిస్తున్నామన్నారు. నగర పంచాయతీల్లో 2,266 మరుగుదొడ్లు మంజూరుకు రూ.2.57 కోట్లు బిల్లులు మంజూరు చేశామన్నారు. వాటిలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయని, విచారణ జరిపించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. పుడాలో అవినీతిపై విచారణ జరిపి ప్రక్షాళన చేస్తామన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ పిసి.గంగన్న, వైస్ చైర్మన్ కడియాల రాము, పుడా చైర్మన్ కడియాల సుధాకర్, దేశం నాయకులు రామాంజనేయులు, గూడూరు ఓబులేసు, చెన్నకేశవులు, మహమ్మద్ రఫి, మున్సిపల్ కమిషనర్ సాహెబ్‌పీరా, ఏఈ నరసింహమూర్తి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు
* 25న ఉలికల్లు ఇసుక రీచ్‌లు, 26న ఐఒసి వద్ద ధర్నా
* ఏప్రిల్‌లో హంద్రీనీవా పరివాహక ప్రాంతాల్లో సదస్సులు
* సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీష్
గుంతకల్లు, మార్చి 20 : కేంద్ర, రాష్ట్రాల ప్రజా వ్యతిరేక విధానాలపై రానున్న రోజుల్లో ప్రత్యక్ష పోరాటాలు చేస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీష్ హెచ్చరించారు. ఆదివారం స్థానిక సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్‌లో తగ్గిన చమురు ధరలకు అనుగుణంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించకుండా మరింత పెంచి ప్రజలపై భారం విధించినందుకు నిరసనగా ఈనెల 26వ తేదీ గుంతకల్లు ఐఓసిల వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు బారెల్ ధర 133 డాలర్ల నుంచి 29 డాలర్లకు పడిపోయిందన్నారు. అయితే దేశంలో మాత్రం ఇంధన ధరలు మరింత పెరుగుతున్నాయన్నారు. బంగ్లాదేశ్, పాకిస్థాన్, నేపాల్ తదితర దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.30 నుంచి 35 వరకు విక్రయిస్తున్నారన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న ట్యాక్స్‌ల కారణంగా మనదేశంలో విపరీతంగా ధరలు పెరిగడంతో అదేస్థాయిలో రవాణా చార్జీలు సైతం పెరిగాయన్నారు. ఫలితంగా నిత్యావసర ధరలు పెరిగి పేద, మధ్య తరగతి ప్రజలపై అధిక భారం పడుతోందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు నియంత్రించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 26న స్థానిక ఐఒసి, హెచ్‌పిసిల వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఇసుక ఉచితంగా అందజేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అయితే ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట వేసేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యంత్రాలను ఉపయోగించి ఇసుక తవ్వకాలు సాగించడం వల్ల భూగర్భజలాలు ఎండిపోయో ప్రమాదం ఉందన్నారు. వాటిని నియంత్రించి మనుషులతో తవ్వకాలు సాగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈమేరకు ఈనెల 25న ఉలికల్లు రీచ్‌ల్లో ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా హంద్రీనీవా కాలవ డిస్ట్రిబ్యూటరీలను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. కాలవ నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయించకపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. కాంట్రాక్టర్లకు దాదాపు రూ.154 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. రూ.2 వేల కోట్ల అవసరమైన హంద్రీనీవాకు కేవలం రూ.500 కోట్లు కేటాయించడం బాధాకరమన్నారు. వెంటనే నిధులు కేటాయించి హంద్రీనీవా కాలవకు డిస్ట్రిబ్యూటరీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ మొదటి వారంలో హంద్రీనీవా పరివాహక ప్రాంతాల్లో ఏర్పాటు చేసి ప్రజలను సమీకరించి ఆందోళనలు ఉద్దృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఐ నియోజక వర్గ కన్వీనర్ గోవిందు, జిల్లా సమితి సభ్యులు పిసి రామాంజినేయులు, పట్టణ కార్యదర్శి వీరభద్రస్వామి, నాయకులు ఎస్‌ఎండి గౌస్ తదితరులు పాల్గొన్నారు.
ఖాద్రీశుని దర్శించుకున్న జెసి
కదిరి, మార్చి 20: జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మికాంతం కుటుంబ సమేతంగా ఆదివారం శ్రీమత్ ఖాద్రి లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి స్థానిక ఆలయ అధికారులు, అర్చకులు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జెసి దంపతులకు శ్రీవారి బ్రహ్మోత్సవాల విశేషాలను ఆలయ అర్చకులు వివరించారు. తీర్థ ప్రసాదాలు అందచేశారు. జెసి వెంట ఆర్డీవో రాజశేఖర్, కదిరి తహశీల్దార్ నాగరాజు, ఆలయ ఈఓ పట్టెం గురుప్రసాద్ తదితరులు వున్నారు.
లేపాక్షి ఆలయాన్ని సందర్శించిన
కర్నాటక హైకోర్టు జడ్జి
లేపాక్షి, మార్చి 20 : ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లేపాక్షి ఆలయాన్ని కర్నాటక రాష్ట్ర హైకోర్టు జడ్జి ఎన్‌కె పాటిల్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ ప్రధానార్చకులు సూర్యప్రకాష్‌రావు, నరసింహశర్మలు పూర్ణకుంభ స్వాగతం పలికి ఆలయ చరిత్రను వివరించారు. అనంతరం ఏడు పడగల నాగేంద్రుడు, అసంపూర్తి కల్యాణమంటపం, లతా మంటపం, నాట్య మంటపంలోని శిల్పాలు, తైలవర్ణ చిత్రాల విశిష్టత గురించి తెలుసుకున్నారు. తర్వాత దుర్గామాత, వీరభద్రస్వాములకు ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట తహశీల్దార్ ఆనంద్‌కుమార్, సిఐ రాజగోపాల నాయుడు తదితరులు ఉన్నారు.
లక్ష్మీనృసింహుడికి
తోమాల సేవ, ఆల్వార్ల అభిషేకం
ఆత్మకూరు, మార్చి 20: మండల పరిధిలోని పంపనూరు కొండపై శ్రీ లక్ష్మీనృసింహ స్వామివారికి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం నవగ్రహ పూజలు, స్వామివారికి తోమాల సేవ, ఆల్వార్ల అభిషేకం నిర్వహించారు. వై.కొత్తపల్లి వాసులు కొండపై బ్రహ్మోత్సవాల్లో భక్తుల సౌకర్యార్థం ఆదివారం అదనంగా కొన్ని విద్యుత్ స్తంభాలు ఏర్పాటుచేసి విద్యుత్ బల్బులు అమర్చారు. పరిశుభ్రతపై ప్రత్యేక చొరవ చూపుతున్నారు. కొండ కిందిభాగంలో ఇప్పటికే కొందరు అంగళ్లు ఏర్పాటు చేసుకున్నారు. 24 వరకు కల్యాణ, రథోత్సవ, పరుష వేడుకలు జరుగుచున్నందున వ్యాపార సంస్థలు అంగళ్లు ఏర్పాటులో నిమగ్నమయ్యారు.
హంద్రీనీవా పనులు పరిశీలన
ఆత్మకూరు, మార్చి 20: హంద్రీ నీవా కాలువ రెండవ దశ పనులకు సంబంధించి వై.కొత్తపల్లి వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణం పనులను ఆదివారం జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం పరిశీలించారు. కాలువ పనులు చేయిస్తున్న కాంట్రాక్టర్, ఇంజినీర్లతో కలిసి పనులు జరుగుతున్న తీరు పరిశీలించారు. వై.కొత్తపల్లి వద్ద నుంచి పంపనూరు వరకు కాలువ పనులను జెసి పరిశీలించారు.
పుడా విసి కర్నూలు కోర్టుకు తరలింపు
పుట్టపర్తి, మార్చి 20: అవినీతి నిరోధక శాఖకు పట్టుబడిన పుడా వైస్ చైర్మన్ రామాంజనేయులును కర్నూలు ఎసిబి కోర్టుకు తరలించారు. శనివారం ఎసిబి దాడుల్లో బిల్డర్ నుంచి రూ.2 లక్షలు తీసుకుంటు పట్టుబడిన రామాంజనేయులును ఆదివారం నాడు కర్నూలు కోర్టుకు తరలించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం ఇక్కడి నుండి ఆయనను తరలించారు. ఈ సందర్భంగా ఏసిబి కేంద్ర దర్యాప్తు విభాగం డిఎస్‌పి ప్రసాద్‌రావు మాట్లాడుతూ పుడా వైస్ చైర్మన్ నివాసాల్లో సోదాలు పూర్తి అయ్యాయని తెలిపారు. అదేవిధంగా పుడా కార్యాలయంలో కూడా రికార్డులను పరిశీలించామని, పలు రికార్డుల్లో అవకతవకలు చోటు చేసుకున్నట్లు తనిఖీల్లో బయటపడిందన్నారు. ఇంకా దర్యాప్తు పూర్తికానందున ఆస్తుల వివరాలు వెల్లడించలేమన్నారు. ఏసిబి కోర్టులో నిందితున్ని హాజరుపరుస్తామన్నారు. రామాంజనేయులు సన్నిహితుడు పట్టణానికి చెందిన ప్రైవేటు వైద్యులు ఇంటిని ఏసిబి అధికారులు సీజ్ చేసినప్పటికి ఆయన ప్రమేయం ఇందులో లేదని, కేవలం సన్నిహితులుగా వుండడం తమకు వచ్చిన సమాచారం మేరకే అలా చేయాల్సి వచ్చిందన్నారు. సీజ్ చేసిన సదరు డాక్టర్ ఇంటిని తెరచి అతనిని కాసేపు విచారించి పంపినట్లు తెలిపారు. విసి రామాంజనేయులుకు చెందిన బ్యాంకు లాకర్ల తాళాలు సైతం వారు సోదాలు చేసినట్లు సమాచారం.
వ్యాపారం కోసం విరివిగా రుణాలు
* టౌన్ బ్యాంక్ అధ్యక్షుడు జెఎల్.మురళీధర్
అనంతపురం కల్చరల్, మార్చి 20: నగరంలోని సామాన్య ప్రజలకు వారి సామర్థ్యాన్ని బట్టి చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించుకునేందుకు విరివిగా రుణాలు మంజూరు చేస్తున్నట్లు టౌన్ బ్యాంక్ అధ్యక్షులు జెఎల్.మురళీధర్ పేర్కొన్నారు. ఈమేరకు సుభాష్ రోడ్‌లోని బ్యాంకు ప్రధాన కార్యాలయంలో ఆదివారం జరిగిన మహాజన సర్వసభ్య సమావేశానికి మురళీధర్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టౌన్ బ్యాంకు సామాన్యుల బ్యాంకు అన్నారు. నిజాయితీగా వ్యాపారం నిర్వహించుకునే వారు నేరుగా సంబంధిత బ్యాంకు అధికారిని సంప్రదించాలన్నారు. వంద సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా త్వరలో వంద ఆటోలకు రుణాలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. బ్యాంకు నుండి రుణాలు పొందిన వారు క్రమం తప్పకుండా రుణ వాయిదాలను చెల్లించాలన్నారు. ఈ సమావేశంలో బ్యాంకు ఉపాధ్యక్షులు లింగమయ్య, సిఇఓ శ్రీరాములు, డైరెక్టర్లు సుంకర రమేష్, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.
ప్రతిపల్లెకూ చంద్రన్న బాట
* మంత్రి పల్లె రఘునాథరెడ్డి
ఓబుళదేవరచెరువు, మార్చి 20: జిల్లా వ్యాప్తంగా ప్రతి పల్లెకు చంద్రన్న బాట కార్యక్రమం కింద రోడ్లు వేయడం జరుగుతుందని రాష్ట్ర ఐటి, సమాచార, మైనార్టీల శాఖల మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి పేర్కొన్నారు. రోడ్డు సౌకర్యం లేని పల్లె అంటూ వుండకూడదనేది ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమన్నారు. ఆదివారం మండల ఎంపిడివో కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ పుట్టపర్తి నియోజకవర్గంలో గల అన్ని గ్రామాలకు రోడ్లు వేయడం జరుగుతుందన్నారు. అంతేగాక ప్రసుత్తం వేసవి కారణంగా ఎక్కడ కూడా తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇదే సందర్బంలో విద్యుత్ సమస్యపై కూడా ప్రత్యేక శ్రద్ధవహించి రైతులకు ఎలాంటి కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని, ఎక్కడ ఏ సమస్య ప్రభుత్వపరంగా వున్నా తన దృష్టికి తెస్తే అందుకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ప్రస్తుతం సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పదవ తరగతి విద్యార్థులకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. విద్యార్థుల హాల్‌టికెట్ వుంటే చాలని అదే వారికి టికెట్‌గా భావించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని మంత్రి తెలిపారు.
వ్యక్తి ఆత్మహత్య
గుత్తి, మార్చి 20 : మండల పరిధిలోని చెట్నేపల్లి గ్రామానికి చెందిన ఏడుకొండలు(36) ఆదివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పెయింటర్‌గా జీవనం సాగిస్తున్న ఏడుకొండలు గత కొంతకాలంగా తాగుడుకు బానిసయ్యాడు. దీంతో సంపాయించిన మొత్తాన్ని తాగేందుకే ఖర్చు చేసేవాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి తాగడానికి డబ్బులు ఇవ్వాల్సిందిగా తల్లిని డిమాండ్ చేశాడు. అయితే ఆమె తన దగ్గర డబ్బులు లేవని కేవలం రూ.30 మాత్రమే ఇచ్చింది. మరో రూ.20 ఇవ్వాలని లేకుంకే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించినట్లు తల్లి వాపోయింది. ఇప్పటికే అనేకమార్లు ఇలా బెదిరిస్తుండటంతో సముదాయించి పడుకోమని చెప్పింది. దీంతో ఇంట్లోకి వెళ్లిన ఏడుకొండలు ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు గుత్తి పోలీసులు తెలిపారు.
పాముకాటుకు మహిళ మృతి
ఉరవకొండ, మార్చి 20 : మండలంలోని నెరమెట్ల గ్రామానికి చెందిన గంగమ్మ(55) ఆదివారం రాత్రి పాముకాటుతో మృతి చెందింది. ఇంటి వరండాలో నిద్రిస్తుండగా పాము కాటు వేయడంతో గమనించిన బంధువులు ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఉరవకొండ పోలీసులు తెలిపారు.
వ్యక్తి ఆత్మహత్య
హిందూపురం రూరల్, మార్చి 20 : మండల పరిధిలోని నందమూరినగర్‌లో చిరంజీవి (35) ఆదివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పదిహేళ్ల క్రితం కొటిపి పంచాయతీ ఇస్లాంపురానికి చెందిన నాగమణితో చిరంజీవికి వివాహమైంది. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆయన కుటుంబ పోషణ కోసం అప్పులు చేశాడు. అప్పులు తీర్చే విషయమై శనివారం రాత్రి భార్యతో గొడవపడ్డాడు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రూరల్ పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
నల్లచెరువులో...
నల్లచెరువు : మండల పరిధిలోని జోగన్నపేట వద్ద శివాలయం సమీపంలో గల వేప చెట్టుకు గుర్తుతెలియని వ్యక్తి(55) ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న నల్లచెరువు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతుని వివరాలు సేకరిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
యువకుడి దారుణహత్య
తాడిపత్రి, మార్చి 20: స్థానిక నంద్యాల రోడ్‌లో ఆదివారం చిన్న నరసింహులు(25)ని గుర్తుతెలియని వ్యక్తులు కిరాతకంగా కత్తులతో పొడిచి దారుణ హత్యకు పాల్పడ్డారు. మృతుడి తండ్రి బాల నరసింహులు తెలిపిన వివరాల మేరకు సంజీవనగర్ 10వ రోడ్‌లో నివశిస్తున్న చిన్న నరశింహులు జులాయిగా తిరిగే వాడని తెలిపారు. నంద్యాల రోడ్‌లో ఆదివారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు కత్తులు చేతపట్టుకొని చిన్న నరసింహులును వెంటపడగా, ప్రాణ రక్షణకు హెయిర్‌స్టైల్ షాపులోకి వెళ్లిన చిన్న నరసింహులుపై విచక్షణారహితంగా కత్తులతో పొడిచి పారిపోయారని, తీవ్ర గాయాలపాలైన చిన్న నరసింహులును 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చిక్తిత్స చేస్తుండగా మృతి చెందాడు. పట్టణ ఎస్సై రామకృష్ణారెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.