అనంతపురం

సిబ్బంది కొరతతో పరిశ్రమల శాఖ కుదేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, అక్టోబర్ 16 : క్షేత్ర స్థాయి సిబ్బంది కొరతతో జిల్లా పరిశ్రమల కేంద్రం కునారిల్లుతోంది. అరకొర సిబ్బందితో కాలాన్ని నెట్టుకొచ్చే పరిస్థితి దాపురించింది. సిబ్బంది తక్కువ... పని ఎక్కువ కావడంతో పారిశ్రామికాభివృద్ధి కాగితాలకే పరిమితమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో సొంతంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ముందుకొస్తున్న ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఇబ్బంది పడుతున్నారు. ఇందుకు ముఖ్య కారణం క్షేత్రస్థాయిలో ప్రధాన పాత్ర పోషించే ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్స్(ఐపీఓ) కొరత ఉండటమే. అయితే వీరి నియామకం పట్ల ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. జిల్లాలో గత రెండు, మూడేళ్లలో చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహికులు దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో విద్యుత్ శాఖ 25,000 కనెక్షన్లు మంజూరు చేస్తూ మీటర్లు అందింది. ఈ జాబితాను జిల్లా పరిశ్రమల కేంద్రానికి పంపింది. వీటి ఆధారంగా జిల్లాలో ఎన్ని పరిశ్రమలు ఏర్పాటయ్యాయి? ఎన్ని పని చేస్తున్నాయి? అన్న విషయాలపై గత కొన్ని నెలలుగా సర్వే కొనసాగుతోంది. ఇప్పటి వరకు 15,000 విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి సర్వే పూర్తయినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. మిగతా విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి సర్వే ఎన్నటికి పూర్తవుతుందో అధికారులే చెప్పలేకపోతున్నారు. ఈ పని చేసేందుకు ఇండస్ట్రియల్ ప్రమోషన్ అధికారుల(ఐపీఓలు)కు తలకుమించిన భారం అయ్యింది. దీంతో కలెక్టర్ జీ.వీరపాండియన్ ఆదేశాల మేరకు వెలుగు సిబ్బందిని కూడా వినియోగించుకుంటూ సర్వే కొనసాగిస్తున్నారు. వాస్తవంగా జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన పోస్టుల మేరకు 15 మంది ఐపీఓలను నియమించాల్సి ఉంది. ప్రస్తుతం జిల్లా అంతటికీ కలిపి ఐదుగురు మాత్రమే ఉన్నారు. 63 మండలాల పరిధిలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు సూచనలు, సలహాలు, పరిశ్రమ ఏర్పాటు, వేగవంతం చేయడం వంటివి పర్యవేక్షించాల్సి వస్తోంది. ఒక్కొక్కరికి 12, 13 మండలాల పర్యవేక్షణ తప్పడం లేదు. వీరితో పాటు పరిశ్రమల స్థాయిని బట్టి ఏడీ, డీడీలు, జనరల్ మేనేజర్‌లు పర్యవేక్షిస్తారు. మెగా పరిశ్రమల విషయంలో పనులు వేగవంతంగా సాగుతున్నా, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే ఔత్సాహికులతో సకాలంలో పని ప్రారంభించడం, లేదా ఉత్పత్తి మొదలు పెట్టించడానికి ఐపీఓలు తంటాలు పడక తప్పడం లేదంటే అతిశయోక్తి కాదు. నెలవారీ జిల్లాలోని పరిశ్రమల పురోగతిపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నా సిబ్బందిని నియామకంలో మీనమేషాలు లెక్కిస్తోంది. ఈ పరిస్థితుల్లో చిన్న, మద్య తరహా పరిశ్రలు ఏర్పాటు చేసుకుని తాము ఉపాధి పొందుతూ, మరికొందరికి పని కల్పించే సంకల్పంతో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకునే వారికి క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా జిల్లాలో వ్యవసాయాధిరిత పరిశ్రమలు, ఖనిజ ఆధారిత, పశు సంపద ఆధారిత, వస్త్ర, సేవారంగ పరిశ్రమలతో పాటు డిమాండ్ ఆధారిత పరిశ్రమలైన బ్రెడ్, బేకరి, సిమెంట్ జాలీలు, స్తంభాలు, ఇన్‌స్టంట్ ఫుడ్, పొటాటో చిప్స్, కంప్యూటర్ స్టేషనరీ, పేపర్ ప్లేట్స్, కప్స్, పవర్‌లూమ్స్, ఆటోమొబైల్ అనుంబంధ పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. ఈ నేపథ్యంలో సింగిల్ డెస్క్ సిస్టమ్-2015 మేరకు దరఖాస్తుదారుడు ఎంచుకున్న పరిశ్రమకు ఆన్‌లైన్‌లో అనుమతులు రాగానే వివిధ ప్రభుత్వ శాఖల అనుమతులు పొందాల్సి ఉంటుంది. అలాగే నూతన పారిశ్రామిక పెట్టుబడి విధానం 2015-20 మేరకు రాయితీలు లభిస్తాయి. స్వచ్ఛాంద్ర రాయితీలు కూడా ప్రభుత్వం ఇస్తోంది. ఎస్‌సీ, ఎస్‌టీలకు పలు రకాల పథకాలు అమలులో ఉన్నాయి. ప్రధానమంత్రి ఉపాధి కల్పనా పథకం(పీఎంఈజీపీ) ద్వారా కూడా రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు పెట్టుబడితో పరిశ్రమలు స్థాపించుకునే అవకాశం ఉంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి చట్టం-2006 మేరకు ఉత్పత్తి, సేవా రంగ పరిశ్రమలను రూ.10 లక్షల నుంచి రూ.10 కోట్ల వరకు పెట్టుబడితో ఏర్పాటు చేసుకునే వీలుంది. వీటి విషయంలో ఔత్సాహికులకు సరైన అవగాహన కల్పించడం, పరిశ్రమలను వేగవంతంగా ఏర్పాటు చేసేలా చేయడానికి క్షేత్ర స్థాయి సిబ్బంది పాత్ర అధికంగా ఉంటోంది. సిబ్బంది కొరతతో ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు అవస్థలు తప్పడం లేదు. ప్రభుత్వం ఐపీఓలతో పాటు ఖాళీగా ఉన్న ఇతర పోస్టుల్ని కూడా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుని కరవు జిల్లా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సహాయకారికాగా ఉంటుందో, లేదో వేచి చూడాల్సిందే.

కలెక్టరేట్ ముట్టడికి కార్మికుల యత్నం
* నేతల ముందస్తు అరెస్టు
అనంతపురంటౌన్, అక్టోబర్ 16: జి.ఓ.279 రద్దు కోరుతూ 13వ రోజైన మంగళవారం కలెక్టరేట్ ముట్టడికి కార్మిక సంఘాలు యత్నించాయి. అయితే సోమవారం మంత్రి కాలువ ఇంటి ముట్టడి పరిణామాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టారు. అరెస్టులు మూడు విడతలుగా జరిగాయి. కార్పొరేషన్ కార్యాలయం దగ్గర కార్మికులు, కొంతమంది ద్వితీయ శ్రేణి నేతలను అరెస్టు చేశారు. అలాగే కార్మిక సంఘాల నేతలు గోపాల్, రాజారెడ్డి తదితరులను హౌస్ అరెస్టు చేయటానికి యత్నించారు. రాజారెడ్డి హౌస్ అరెస్టు కాగా, గోపాల్ వారి రాకను పసిగట్టి ఇంటి నుంచి ముందుగా వెళ్లిపోయారు. కలెక్టరేట్‌కు వెళ్లే ప్రయత్నంలో కార్మిక సంఘాల నేతలను అరెస్టు చేశారు. కార్మికులకు మద్దతుగా కలెక్టరేట్ దగ్గర వామపక్ష నేతలు కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ తదితరులు కలెక్టరేట్ ముట్టడికి యత్నించబోగా భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. కలెక్టరేట్ గేట్లను సమీపించక మునుపే రాంభూపాల్ తదితరులను పోలీసు అధికారులు పట్టుకునే నేపథ్యంలో పెనుగులాట చోటు చేసుకుంది. దీనితో కొంత ఉద్రిక్తత ఏర్పడింది. నేతలను పోలీసులు ఎక్కడికక్కడే అరెస్టు చేసి వ్యాన్లలోకి తరలించారు. రాంభూపాల్‌ను శతవిధాలా వ్యానులోకి ఎక్కించ విఫలయత్నం చేశారు. పోలీసుల యత్నాలను ఆయన ప్రతిఘటించారు. ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గడచిన 13 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారని అన్నారు. అందులో భాగంగా సోమవారం మంత్రి కాలువ శ్రీనివాసులు ఇంటి ముట్టడిలో పాల్గొన్న కార్మికులపై పోలీసులు పాశవికంగా వ్యవహరించారన్నారు. నలుగురు కార్మికులు గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అన్నారు. పోలీసులను దుర్భాషలాడిన టీడీపీ ప్రజా ప్రతినిధిపై కేసులు పెట్టలేక చేతులు ముడుచుకు కూర్చున్నారని అన్నారు. రోజుకొక అధికారి సస్పెన్షన్‌కు గురవుతున్నారని అన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలు కూడా పోలీసులకు అవసరమవుతాయని ఆయన హెచ్చరించారు. జి.ఓ 279 ద్వారా కాంట్రాక్టర్ల చేతులలోకి కార్మికుల ఉపాధి పోతుందన్నారు. తద్వారా కార్మికులు వెట్టిచాకిరీకి గురవుతారని అన్నారు. ఇప్పటికైనా పోలీసులు కార్మికుల ఉద్యమం పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. అలాగే పోరాటం చేస్తున్న కార్మిక నేతలను హౌస్ అరెస్టులు చేయటం సరికాదని సూచించారు.