క్రీడాభూమి

భారత్, పాక్ సిరీస్‌కు బ్యాకప్ కేంద్రంగా బంగ్లాదేశ్ లేదా శ్రీలంక?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 22: భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌కు ఇరు దేశాల ప్రభుత్వాల నుంచి ఆమోద ముద్ర లభిస్తే, వేదిక ఎక్కడ ఉండాలనే అంశంపై చర్చ జరుగుతోంది. గత ఏడాది కుదిరిన ఒప్పందం ప్రకారం తమ దేశానికి టీమిండియా రావాల్సి ఉంటుందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) స్పష్టం చేస్తున్నది. అయితే, చాలాకాలంగా హోం సిరీస్‌లన్నీ తాము యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లో ఆడుతున్నందువల్ల భారత జట్టు కూడా అక్కడే సిరీస్ ఆడక తప్పదని వాదిస్తున్నది. భారత్‌లో సిరీస్ ఆడేందుకు వస్తే భారీ మొత్తంలో పారితోషికం చెల్లిస్తామని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) చైర్మన్ రాజీవ్ శుక్లా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్న విషయం తెలిసిందే. భారత్‌లో సిరీస్‌కు రావాల్సిందిగా బిసిసిఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ ఇప్పటికే పిసిబికి ప్రతిపాదించాడు. అయితే, పిసిబి మాత్రం భారత్‌లో మ్యాచ్‌లకు ససేమిరా అంటున్నది. ఇలావుంటే, అటు యుఎఇ, ఇటు భారత్ కాకుండా మరో తటస్థ వేదికను ఎంపిక చేసుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా వ్యక్తమవుతున్నది. దుబాయ్‌లో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) సమావేశం జరిగినప్పుడు పిసిబి అధ్యక్షుడు షహర్యార్ ఖాన్‌తో మనోహర్ భేటీ అవుతాడన్న వార్తలు వినిపించాయి. కానీ, వారు కలవలేదు. చర్చలు జరపలేదు. పదేపదే భారత్ వెంటపడుతూ, సిరీస్ ఆడాల్సిందిగా బతిమిలాడుకోవడం ఏమిటని పాక్ మాజీ క్రికెటర్లు, ప్రముఖులు పిసిబిని నిలదీస్తున్న నేపథ్యంలో షహర్యార్ ఎటూ తేల్చుకోలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఇరు దేశాల్లో క్రికెట్ అభిమానులు ఎక్కువగా ఉన్నందున, ద్వైపాక్షిక సిరీస్ అవసరమన్న వాదన వ్యక్తమవుతున్నది. ఐసిసి నిబంధనలను అనుసరించి, ముందుగా కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఆయా జట్లపై ఉంటుంది. ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ అండ్ ఫిక్చర్స్‌లో అనుసరిస్తున్న విధానం ప్రకారం, సిరీస్‌కు ఆతిథ్యమిచ్చే అవకాశం ఒక్కోసారి ఒక్కో దేశానికి వస్తుంది. దాని ప్రకారం చూస్తే, వచ్చేనెల సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్‌కు టీమిండియా వెళ్లాలి. పాక్ హోం సిరీస్‌లను యుఎఇలో ఆడుతున్నది కాబట్టి, అక్కడ సిరీస్‌ను ఆడాలి. కానీ, అసలు పాక్‌తో ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలకు కేంద్రం అనుమతిస్తుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఒకవేళ సుముఖత వ్యక్తం చేసినా యుఎఇలో మ్యాచ్‌లకు అంగీకరించకపోవచ్చు. అలాగని భారత్‌లో సిరీస్ ఆడేందుకు పాక్ సుముఖంగా లేదు. అందుకే, ఇరువురికీ ఇబ్బంది లేకుండా బంగ్లాదేశ్ లేదా శ్రీలంకలో సిరీస్‌ను కొనసాగిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో క్రికెట్ అధికారులు ఉన్నాయి. దీనిపై ఒక స్పష్టత లభిస్తే, పిసిబితోపాటు కేంద్రం ముందు కూడా ఈ ప్రతిపాదన ఉంచాలని క్రికెట్ అధికారులు నిర్ణయించినట్టు సమాచారం.

శుక్లా మెలిక
న్యూఢిల్లీ: లాహోర్‌లో సిరీస్ ఆడేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించిన రాజీవ్ శుక్లా అక్కడ తీసుకోవాల్సిన చర్యలంటూ కొన్ని షరతులు విధించాడు. స్టేడియానికి సమీపంలోనే ఆటగాళ్లు బస చేసేందుకు వీలుగా హోటల్‌ను నిర్మించాలని సూచించాడు. అదే విధంగా కట్టుదిట్టమైన భద్రతను కల్పించాలన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) నుంచి అనుమతి పొందాలని అన్నాడు. భద్రతకు ఎలాంటి ఇబ్బంది లేదని పాక్ ప్రభుత్వం స్వయంగా ఐసిసికి భరోసా ఇవ్వాల్సి ఉంటుందన్నాడు. ఇప్పటికిప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్‌ను నిర్మించడం సులభంకాదు. ప్రత్యామ్నాయ మార్గాలను అనే్వషించినప్పటికీ, పాక్ ప్రభుత్వం నుంచి ఐసిసికి భరోసా ఇప్పించడం దాదాపు అసాధ్యం. కాబట్టి డిసెంబర్‌లో ద్వైపాక్షిక సిరీస్ జరిగే అవకాశానికి తెరపడినట్టే. భవిష్యత్తులో ఎప్పుడు సిరీస్ జరగాలన్నా వేదిక ఎక్కడ అన్న ప్రశ్న తలెత్తుతుంది కాబట్టి ముందుగానే ప్రత్యామ్నాయాలను సిద్ధం చేసుకొని ఉంచుకోవాలన్నది భారత క్రికెట్ అధికారుల అభిప్రాయం.