భగత్‌సింగ్

మట్టి మీద ఒట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగత్‌సింగ్ - మొదటి భాగం
13 ఏప్రిల్ 1919.
వైశాఖి పర్వదినం. పంజాబీలకు అతి ముఖ్యమైన పంటల పండుగ.
దీపావళి, హోళీల్లాగే వైశాఖినీ హిందు, సిక్కు తేడా లేకుండా, కులభేదం పాటించకుండా అందరూ కలిసి కోలాహలంగా జరుపుకుంటారు. ఎప్పటిలాగే ఆ ఏడూ ఎక్కడెక్కడి పల్లెల వారు బండ్లు కట్టుకుని అమృత్‌సర్ చేరారు. కొత్త బట్టలు ధరించి, వీధుల్లో సంబరంగా తిరుగుతూ, రోడ్డు పక్క సంతల్లో పిల్లలకు మిఠాయిలు, బొమ్మలు కొనిపెడుతూ, స్వర్ణ దేవాలయం దర్శించి, ఊరిబయట పెద్ద మేళాలో ఆటపాటల్లో పాల్గొంటూ జనం దిలాసాగా ఉన్నారు.
ఇది ప్రతి ఏడూ మామూలే. కాని ఈసారి ఏదో చెప్పరాని వెలితి. ఊరివాళ్ల మొగాల్లో ఆందోళన. వాతావరణంలో ఉద్రిక్తత.
నాటికి నాలుగు రోజుల ముందు రౌలట్ చట్టాలకు వ్యతిరేకంగా శాంతియుత ఆందోళన పురికొల్పిన సైఫుద్దీన్, సత్యపాల్ అనే ఇద్దరు పుర ప్రముఖులను అరెస్టు చేసి, ఎక్కడికో తీసుకుపోయారు. దానిపై అమృత్‌సర్ అంతటా హర్తాళ్ జరిపి... మా నాయకులను ఏమి చేశారని అడగటానికి కలెక్టరు బంగళాకు వెళ్లిన గుంపు మీద పోలీసులలు పిచ్చెత్తినట్టు కాల్పులు జరిపారు. లెక్కలేనంత మందిని చంపేశారు. రెచ్చిపోయిన జనం యూరోపియన్ల బ్యాంకులను, పబ్లిక్ ఆస్తులను ధ్వంసం చేసి ఐదుగురు తెల్లవాళ్లను చంపారు. దాంతో తెల్లదొరతనం తోకతొక్కిన తాచులా బుసలు కొడుతున్నది. ఎప్పుడు ఏమవుతుందోనని ప్రజల్లో భయం.. భయం.
మూడు రోజుల కిందట పంజాబ్ అంతటా మార్షల్‌లా ప్రకటించారు. అమృత్‌సర్ కాపలా పని జనరల్ రెజినాల్డ్ ఎడ్వర్డ్ హెన్రీ డయ్యర్‌కి అప్పగించారు. అతగాడు వచ్చీరాగానే నగరమంతటా సభలూ సమావేశాలను నిషేధించాడు. ఆ సంగతి సామాన్య జనానికి తెలియదు. కరకు ఆంక్షలు విధించినవాడు ఆ వైనం ప్రజలందరికీ తెలియపరచాలన్న సంగతి మరచాడు. జలియన్‌వాలాబాగ్‌లో ఆ సాయంత్రం నాలుగున్నరకు నాయకుల నిర్బంధానికి నిరసనగా బహిరంగసభ జరుగనున్నదని వీధుల్లో చాటింపు అవుతున్నా వద్దు ఆ ప్రయత్నం మానుకోండని కనీసం నిర్వాహకులను పిలిచి హెచ్చరించాలని డయ్యర్ అనుకోలేదు.
నిషేధాజ్ఞలు ఎరుగని జనం బహిరంగ సభ జరగబోతోందంటే కుతూహలం కొద్దీ వేల సంఖ్యలో జలియన్ వాలాబాగ్ చేరారు. పిల్లలను భుజాల మీద ఎత్తుకుని, చెరుకుగడలు నములుతూ, తారసపడ్డ పరిచయస్థులతో కబుర్లాడుతూ, మైకులో ప్రసంగాలను చెవిన వేసుకుంటూ అందరూ ఆదమరచి ఉన్నారు. వేటగాడిలా మాటు వేసి, జనరల్ డయ్యర్ 50 మంది రైఫిల్‌మెన్‌ను, నలభై మంది గూర్ఖా సిపాయిలను వెంట తీసుకుని సభా స్థలంలో ప్రవేశించాడు. అటు పాతిక మందినీ, ఇటు పాతిక మందినీ మెరక మీద బారుగా నిలబెట్టి, ఎలాంటి ముందస్తు హెచ్చరిక చేయకుండా డయ్యరాసురుడు అసుర సంధ్యవేళ ‘ఫైర్’ అన్నాడు.
చివరి తూటా ఖర్చయ్యేదాకా పల్లంలోని జనం మీద గురిపెట్టి యాభై రైఫిళ్లు గర్జిస్తూనే ఉన్నాయి. మొత్తం 1650 రౌండ్లు కాల్చారు. ఒక్క తూటా కూడా వృధా కాలేదు. ఊహించని ఉపద్రవానికి జనం బెంబేలెత్తి పరుగులు పెట్టారు. తూటాలు తగిలి ఎక్కడివారక్కడ నేలకూలారు. తొక్కిసలాటలో ఎందరో చిన్నపిల్లలు, బిడ్డ తల్లులు నలిగిపోయారు. తప్పించుకునేందుకు దారి లేదు. మొత్తం ఖాళీ స్థలం. మూడు వైపులా ఎత్తుగోడలు. వాటిని ఎక్కటానికి ప్రయత్నించిన వారినల్లా పోలీసులు గురిపెట్టి కాల్చారు. కాల్పులను తప్పించుకోవటానికి ఆవరణలోని బావిలో దూకిన వారెందరో అందులోనే సమాధి అయ్యారు.
ఆధికారికంగా చెప్పిన మృతుల సంఖ్య 379. నిజానికి అది రెండువేల పైమాటే. మారణకాండ ముగించి తెల్ల రాకాసి దండు మరలిపోయాకైనా ఒళ్లంతా గాయాలై, నెత్తుటి మడుగులో విలవిలలాడుతున్న వారిని లేవదీసిన వారు లేరు. చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న వారిని ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు, అలమటిస్తున్న క్షతగాత్రుల మొగాన కాసిని నీళ్లు చిలకరించేందుకు కూడా ఎవరినీ ఆ దరిదాపులకు అనుమతించలేదు. శవాల గుట్టల నడుమ బాధితుల ఆక్రందనలతో, ఆప్తులను కోల్పోయిన వారి గుండెలవిసే కేకలతో, రాబందుల చక్కర్లతో, పీక్కుతినే కుక్కల మొరుగుళ్లతో జలియన్ వాలాబాగ్ ఆ కాళరాత్రి దద్దరిల్లింది.
పిచ్చిపట్టినట్టు రెచ్చిపోయి ప్రభుత్వమే వేలాది అమాయక జనాన్ని పిట్టల్లా కాల్చి చంపిన కనీవినీ ఎరుగని కిరాతకం కరకు ఆంక్షల ఇనుప తెరలు దాటి బయటి ప్రపంచానికి తెలియడానికి చాలా రోజులు పట్టింది. గజగజ వొణుకుతూ వెనక్కి వచ్చిన బండ్ల ద్వారా చుట్టుపక్కల ప్రాంతాలకు దారుణ దుర్వార్త ఆ రాత్రే తెలిసిపోయింది. ఘోరాతిఘోరాన్ని విన్న వారికి ఆ రాత్రి కునుకు లేదు. వారి గుండెలను పిండిన వేదనకు అంతులేదు.
అలా విలవిలలాడిన వేలూ లక్షల జనంలో పనె్నండేళ్ల లాహోర్ బాలుడు ఒకడు.

14 ఏప్రిల్ 1919
తెల్లవారింది. భగత్‌సింగ్ మామూలుగానే సంచి తీసుకుని డి.ఎ.వి. స్కూలుకు బయలుదేరాడు. బడికి వెళ్లే ఉద్దేశం అతడికి ఎంత మాత్రం లేదు. ఎవరికీ చెప్పాపెట్టకుండా ఎకాఎకి రైలుస్టేషనుకు నడుచుకుంటూ వెళ్లాడు. మొట్టమొదటి రైలు పట్టుకుని ముప్పై మైళ్ల దూరంలోని అమృత్‌సర్ చేరాడు.
వెళ్లాల్సిన చోటును కనుక్కోవడం భగత్‌సింగ్‌కి కష్టం కాలేదు. స్వర్ణ దేవాలయం దగ్గర్లోని జలియన్ వాలాబాగ్ అతడు బాగా ఎరిగిందే. మునుపు తండ్రితో కలిసి అక్కడ అనేక సభలకు తాను వెళ్లినవాడే.
వదులుగా చుట్టిన తలపాగా. నలిగిపోయిన చొక్కా పైజమా. ఎర్రబడిన కళ్లు. కుర్రవాడు వెళ్లేసరికే జలియన్ వాలాబాగ్ పరిస్థితి అవశేష యుద్ధరంగంలా నానా బీభత్సంగా ఉంది. కబురు తెలిసి, విలపిస్తూ అక్కడికి చేరి, ఆచూకీ తెలియని ఆప్తుల కోసం గోడుగోడున ఏడుస్తున్న వారు.. కానరాని అమ్మానాన్నల కోసం బిక్కుబిక్కుమంటూ వెతుకుతున్న పసివారు... ఏమి జరిగిందో చూసేందుకు వచ్చి రక్తంతో తడిసిన నేలను, గోడల నిండా నెత్తుటి చారికలను, కుళ్లుతున్న శవాలను నిర్ఘాంతపోయి చూస్తున్న తెరువరులు అక్కడక్కడ కనిపిస్తున్నారు. గేటు దగ్గర పోలీసు కాపలా గట్టిగా ఉంది. అటకాయించిన రక్షక భటులను మభ్యపెట్టి భగత్‌సింగ్ లోపలికి వెళ్లి హృదయ విదారక దృశ్యాలను విషణ్ణ వదనంతో తిరిగి చూశాడు.

From the pocket of his pyjamas, Bhagat Singh took out a small glass bottle which he had brought. ... He tried digging, but the small soil had hardened, despite the fact that the crust was somewhat moist with blood of hundreds of innocent people. He picked up a sharp edged brick and dug out the soil. Having filled the bottle he started at it. His eyes welled up with unshed tears. With unsure steps, he left the spot.
[Bhagat Singh - The Eternal Rebel,
Malwinder Jit Singh Waraich]

ఫైజమా జేబులోంచి భగత్‌సింగ్ చిన్న గాజు సీసా తీశాడు.... వేళ్లతో మట్టి తీయాలని ప్రయత్నించాడు. వేలాథి అమాయక ప్రజల నెత్తుటితో కాస్త తడిగా ఉన్నా నేల గట్టి పడింది. చుట్టూ వెతికి కోసుగా ఉన్న ఇటుక ముక్క తీసుకుని నేలను తవ్వాడు. మట్టి నింపాక సీసాను తేరిపార చూశాడు. కళ్లలో నీళ్లు తిరిగాయి. భారంగా అడుగులేస్తూ అతడు మరలిపోయాడు.

మళ్లీ రైలెక్కి ఇంటికి చేరేసరికి బాగా పొద్దు పోయింది. బడికి వెళ్లిన పిల్లవాడు ఎంతకూ తిరిగి రాలేదేమిటని ఇంట్లో వాళ్లు కంగారుపడుతున్నారు. జేవురించిన మొగంతో కాళ్లీడుస్తూ వస్తున్న అన్నను దూరం నుంచే చూసి ముద్దుల చెల్లెలు అమర్‌కౌర్ పరిగెత్తుకుంటూ ఎదురెళ్లింది. ‘ఇంతసేపూ ఎక్కడికెళ్లావన్నా? మామిడి కాయలు మాగాయి. నీకోసమే చూస్తున్నా. తిందాంరా త్వరగా’ అని తొందరపెట్టింది.
భగత్‌సింగ్‌కి మామిడి పళ్లు మహా ఇష్టం. మామూలుగా అయితే వాటి పేరు చెబితే ఉత్సాహపడేవాడే. కాని ఇవాళ పరిస్థితి వేరు. ‘నాకు తినాలని లేదు అమ్రో’ అనేసి తన గదిలోకి వెళ్లి కళ్లు మూసుకుని పడుకున్నాడు.
చెల్లెలు వదల్లేదు. ‘ఏమైంది? అలా ఉన్నావ్? ఎవరైనా తిట్టారా?’ అంటూ గుచ్చిగుచ్చి అడిగింది. అన్నయ్య జేబులోంచి రుమాల్లో కట్టిన సీసా తీసి చూపించాడు.
‘ఏమిటది? ఎర్ర సిరానా?’ అంది అమ్రో.
‘కాదు. నెత్తురుతో తడిసిన మట్టి. జలియల్ వాలాబాగ్‌లోది. ఇవాళ అక్కడికే వెళ్లా’ అని చెబుతూండగా తల్లి గదిలోకి వచ్చింది. అక్కడి దృశ్యాన్ని, కొడుకు వాలకాన్ని చూడగానే ఆమెకు విషయం అర్థమైంది. మంచంమీద కూచోగానే భగత్ తల్లిని చుట్టేసుకున్నాడు. ‘నీకు చెప్పకుండా అమృత్‌సర్ వెళ్లా. కోప్పడకమ్మా’ అంటూ.
‘జరిగిన ఘోరం నేనూ విన్నా. ముందుగా చెబితే నిన్ను వెళ్లనిచ్చేదాన్ని కాదు. అయినా నా మాట నువ్వు ఎప్పుడు విన్నావు గనుక’ అని బిడ్డ ముంగురులు సవరిస్తూ దగ్గరికి తీసుకుంది. ప్రేమగా అడిగి సంగతంతా రాబట్టింది. తన ఒళ్లో వెక్కివెక్కి ఏడ్చి, గుండె భారం దించుకున్నాక మరునాటికి కొడుకు పీడకలను మరచిపోయి మామూలుగా అయిపోతాడు అని తల్లి అనుకుంది.
కాని - మర్నాడు ఉదయం ఆమె మళ్లీ వచ్చి చూసేసరికి మట్టి సీసా మేజాబల్లపై తెల్లటి రుమాలు మీద కనిపించింది. దాని ముందు రెండు పువ్వులు. మట్టిని తదేకంగా చూస్తూ కుమారుడు.
ఆ వేళేకాదు. అది మొదలు ప్రతిరోజూ అది భగత్‌సింగ్ దినచర్య. సీసా ముందు రెండు పువ్వులు పెట్టి, వినమ్రంగా నిలబడేవాడు. ‘నా సోదరుల నెత్తుటితో తడిసిన ఈ మట్టి మీద ఆన. ఇంకోసారి ఇలా తెల్లవాళ్ల చేతుల్లో అమాయక ప్రజలు చావడానికి వీల్లేదు. ఆ రాక్షసులను మనమే వేటాడాలి. ప్రతీకారం తీర్చుకోవాలి’ అనుకుంటూ తనలో తాను కుతకుతలాడేవాడు. అతడి మనసులో ఒక విప్లవం మొదలైంది. తన మాతృభూమిని విదేశీ చెర విడిపించటానికి అతడు తన ప్రాణాలను ధారపోయటానికి కృతనిశ్చయుడయ్యాడు.
అంతపనీ చేశాడు. *