భగత్‌సింగ్

మహాత్మాగాంధీకీ జై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగత్‌సింగ్ - 6
==========
జలియన్‌వాలాబాగ్ ఊచకోతతో తెల్లరాకాసుల రక్తదాహం తీరలేదు. ఆ తరవాత కూడా లాహోర్, గుజరన్‌వాలా, కసూర్ తదితర ప్రాంతాల్లో లెక్కలేని ఘోరాలు జరిగాయి.
లాహోర్‌లో రాత్రి 8 తరవాత ఎవరైనా వీధుల్లో కనిపిస్తే కాల్చేసేవారు. లేదా కొరడాలతో చితకబాదేవారు. రాత్రివేళ ఇంటిపక్క సందులో ఆవుకు మేత వేస్తున్న పెద్దమనిషిని పట్టుకుని కర్ఫ్యూను ధిక్కరించిన నేరానికి గొడ్డును బాదినట్టు బాదారు. దుకాణాలను నిరసన సూచకంగా ఎవరూ మూసివేయడానికి వీల్లేదని ఆజ్ఞాపించారు. మాట విననివారిని క్రూరంగా హింసించారు. విద్యావంతుల మీద, టీచర్లు, ప్లీడర్ల వంటి ఉన్నత వృత్తుల వారి మీద ప్రత్యేకంగా గురిపెట్టి కాల్చుకు తిన్నారు. ఎవరి ఇంటి గోడల మీద అంటించిన మార్షల్ లా నోటీసులను వారే కాపలా కాయాలన్నారు. కర్మంచాలక ఆ నోటీసు కాస్త చిరిగిందా, ఇంటివారి వీపులు చిట్లాయే. కాలేజి కుర్రవాళ్ల మీద తెల్లదొరతనం మరీ వక్రదృష్టి పెట్టింది. విద్యార్థులందరూ రోజుకు మూడుసార్లు మండుటెండలో మైళ్ల దూరం నడిచి వెళ్లి (సైకిళ్లు, ఇతర వాహనాలను అధికారులు ఏనాడో లాగేసుకున్నారు కాబట్టి నడకే గతి) మార్షల్‌లా అధికారుల ముందు హాజరు వేయించుకోవాలి. ఒకపూట నాగా పడిందా సొమ్మసిల్లేదాకా కొరడా దెబ్బలు తప్పవు.
లాహోర్‌లోనే ఉండి ఈ దారుణాలను భగత్‌సింగ్ కళ్ళారా చూశాడు. ఇంకా కాలేజి విద్యార్థి కాదు కాబట్టి దొరల ముందు ముప్పూటలా హాజరు వేయించుకోవలసిన కాళ్ల శని అతడికి తప్పింది. అయినా సాటి విద్యార్థులను, సామాన్య గృహస్థులను తెల్లవాళ్లు పిశాచాల్లా పీడిస్తున్న తీరుకు అతడి రక్తం మరిగేది. రోజూ సాయంత్రం తన తండ్రిని కలవడానికి వచ్చే రకరకాల ప్రముఖుల మాటలు వినడం ద్వారా ఎక్కడ ఏమి జరుగుతోందన్నది ఎప్పటికప్పుడు అతడికి తెలిసేది.
ఈ అఘాయిత్యాలను సహించి ఊరుకోరాదు; ఏదో ఒకటి చేయాలి; పంజాబ్ ఘోరాలను నిరసిస్తూ దేశమంతటా పెద్ద ఉద్యమమే రావాలి అని పెద్దవాళ్లు రోజూ మాట్లాడుకుంటూండేవారు. కాని అలాంటి ఆశ కనుచూపుమేరలో కనిపించేది కాదు. దేశమంతటినీ కదిలించటం గాంధీ మహాత్ముడివల్లే అవుతుంది. అసలు పంజాబ్ ప్రజలు తిరగబడి తెల్లవాళ్ల కోపాగ్నికి గురి అయిందే రౌలట్ బిల్లులకు వ్యతిరేకంగా గాంధీజీ ఇచ్చిన సత్యాగ్రహం పిలుపును అందుకుని! అయినా జలియన్‌వాలాబాగ్ ఘోరకలి తరవాత కూడా తెల్లదొరతనాన్ని పల్లెత్తుమాట అనడానికి గాంధీగారికి నోరు పెగలలేదు. 1919 డిసెంబరు ఆఖరులో అమృత్‌సర్‌లోనే జరిగిన కాంగ్రెసు సభలో గట్టి ప్రతిఘటనకు కాంగ్రెసు వాదులందరూ పట్టుబట్టినా మహాత్ముడు వారి ఆవేశం మీద నీళ్లుచల్లి, బ్రిటిషు సర్కారుకు అణగిమణగి ఉండాలనీ... వారు కొత్తగా ప్రవేశపెట్టిన సంస్కరణలను నమ్ముకుని, ప్రభుత్వానికి సహకరించాలనీ చెప్పి బలవంతంగా మెడలు వంచాడు. దాంతో తెల్ల దయ్యాలకు మరీ అలుసు అయింది. ప్రజల మీద ఆగడాలు, ఆంక్షలు ఇంకా ఎక్కువయ్యాయి. కర్మమిలా కాలిందేమిటని ఇంట్లో వచ్చీపోయే పెద్దవాళ్లలాగే భగత్‌సింగ్ కూడా డీలాపడ్డాడు.
అలాంటి సమయాన ఉన్నట్టుండి పరిస్థితి మారింది. మొదటి నుంచీ ముస్లిం పక్షపాతి అయిన మహాత్మాగాంధీకి మహమ్మదీయుల మెహర్బానీ పొందడానికి ఖిలాఫత్ అంశం వాటంగా దొరికేసరికి దిగ్గున లేచాడు. పంజాబ్‌లో దారుణ మారణకాండగానీ, స్వదేశంలో ప్రజలపై అత్యాచారాలుగానీ బొత్తిగా పట్టనివాడు టర్కీలో చెత్తకుండీలో పడిన ఖలీఫా ఆధిపత్యాన్ని నిలబెట్టటానికి ఖిలాఫత్ ఆందోళనను లంకించుకున్నాడు. భారతదేశానికి ఎలాంటి సంబంధమూ లేని, ప్రపంచంలోని ముస్లిం దేశాలు కూడా పట్టించుకోని ఖిలాఫత్‌ను సాధించి భారతీయ ముస్లింలను సంతోషపెట్టటం కోసం సహాయ నిరాకరణ బ్రహ్మాస్త్రాన్ని బయటికి తీశాడు. ఖిలాఫత్ కమిటీకి అధ్యక్షుడి హోదాలో తాను చేసిన నిర్ణయానికి, ఆ తరవాత కాంగ్రెసును కూడా పార్టీని చేసి పంజాబ్ గాయాలనూ డిమాండ్ల పద్దులో ఆలస్యంగా చేర్చాడు. దేశ స్వాతంత్య్రం సంగతే ఎత్తకపోతే జనం ఏడ్చిపోతారని దాన్ని కూడా ఇరికించారు.
అలా- ఎట్టకేలకు ఒక మహా ఉద్యమం మొదలైంది. 1920 ఆగస్టులో కలకత్తా ప్రత్యేక సమావేశాల్లో ఎఐసిసి ఆమోదముద్ర వేసిన సహకార నిరాకరణ ఉద్యమం యావద్భారతంలో గొప్ప కదలిక తెచ్చింది. జాతీయ శక్తుల్లో కొత్త ఉత్తేజం నింపింది. ఆలస్యం అయితేనేం, మొత్తానికి దేశమంతటా ఒక ఉద్యమమంటూ మొదలైంది కదా అని అందరూ సంతోషించారు. అంతా సహకరిస్తేగానీ సంవత్సరంలో స్వరాజ్యం సాధించలేము కాబట్టి తన మీద నమ్మకం ఉంచి కలిసి రావాలని గాంధీగారు కోరినదే తడవుగా ఎక్కడెక్కడి విప్లవకారులూ తమతమ కార్యకలాపాలను ఏడాదిపాటు కట్టిపెట్టి అసహాయోద్యమానికి అండదండలందించారు.
చట్టసభలను, న్యాయస్థానాలను, విద్యా సంస్థలను బహిష్కరించాలన్నది సహాయ నిరాకరణ ఉద్యమంలోని ప్రధానాంశం. బ్రిటిషు ప్రభుత్వం ఇచ్చిన బిరుదులను వెనక్కి ఇచ్చెయ్యడం; ఆధికారిక వేడుకలకు దూరంగా ఉండటం; విదేశీ వస్తువులను బహిష్కరించటం కూడా ఆందోళన కార్యక్రమంలో భాగమే. సంవత్సరానికల్లా స్వరాజ్యాన్ని బిరబిరా లాక్కొచ్చేందుకు తలపెట్టిన ఈ బహిష్కరణల మహామంత్రాన్ని ప్రజలందరికీ ఉపదేశించేందుకు మహాత్ముడు దేశమంతటా సుడిగాలిలా తిరిగాడు. అదే సందర్భంలో ఆయన లాహోర్‌కూ వచ్చి పెద్ద సభలో మాట్లాడాడు. దానికి హాజరైన అశేష జనంలో పదిహేనేళ్ల భగత్‌సింగ్ ఒకడు.
‘ప్రజలని ఘోరంగా పీడిస్తున్న విదేశీ ప్రభుత్వాన్ని అంతమొందించడానికే ఈ ఉద్యమం. ఇది ఏ ఒక్కరికోసమో కాదు. మొత్తం దేశాన్ని, భారతీయులందరినీ ఉద్ధరించడానికి ఉద్దేశించినది. మన రాజ్యం మనకు సంవత్సరం తిరక్కుండా రావాలంటే బహిష్కరణలను గట్టిగా అమలుజరపాలి. విద్యార్థులు చదువులు కట్టిపెట్టి ఉద్యమంలో చేరాలి. విదేశీ వస్తువులను రాశిపోసి తగులబెట్టాలి...’ అంటూ గాంధీజీ ఇచ్చిన ఉపన్యాసం భగత్‌కి బాగా నచ్చింది. జలియన్‌వాలాబాగ్ నెత్తుటి మడుగులను ప్రత్యక్షంగా చూసినప్పటి నుంచీ అతడి మనసును దహిస్తున్న అశాంతికి సమాధానం దొరికినట్టయింది. తన జాతిని యమయాతన పెడుతున్న విదేశీ రాక్షస ప్రభుత్వం పీడ విరగడ చేయటానికి ఆవురావురుమంటున్న వాడికి ఇన్నాళ్లకు సరైన ఆయుధం చేతికందిందన్న ఆనందం కలిగింది.
సభలోని లక్షల మందితో గొంతు కలిపి ‘మహాత్మాగాంధీకీ జై’ అని ఎలుగెత్తి అరిచాడు భగత్‌సింగ్. నాటి నుంచి ఆ నినాదమే అతడికి ప్రణవ నాదమైంది. అప్పుడతడు లాహోరు డి.ఎ.వి. స్కూలులో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. సభనుంచి రాగానే ఇక చదువు మానేస్తున్నానని ప్రకటించాడు. స్కూలు ఫైనలు పరీక్ష అయ్యేదాకా ఆగరాదా అని తల్లి వారించినా వినలేదు. ‘స్కూలు బహిష్కరణ వల్ల స్వరాజ్యం వస్తుందని మహాత్ముడు చెబుతున్నాడు కదా? మరి బహిష్కరణ వాయిదావేస్తే స్వాతంత్య్రం ఆలస్యం కాదా? చదువుదేముంది? తరవాతైనా కొనసాగించవచ్చు’ అని ఖండితంగా చెప్పాడు.
ఆ రోజు నుంచీ భగత్‌సింగ్ స్కూలు గడప తొక్కలేదు. తోటి పిల్లలను కూడగట్టి ‘మహాత్మాగాంధీకీ జై’ అని నినదిస్తూ ఇంటింటికీ తిరిగేవాడు. స్వరాజ్యం కావాలంటే విదేశీ ప్రభుత్వాన్ని, విదేశీ వస్తువులను పూర్తిగా బహిష్కరించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పేవాడు. సహాయ నిరాకరణ ఉద్యమం మీద అప్పటిదాకా ఆసక్తిలేనివారు కూడా ఆ కుర్రవాడు చెప్పే తీరుకు, అతడి దీక్షా తత్పరతకు ముచ్చటపడి ఇంట్లోని మిల్లు బట్టలను, సీమ సరకులను ఇచ్చేసేవారు. అలా సేకరించిన వాటన్నిటినీ వీధి కూడలిలో పోగుచేసి ‘భారత్‌మాతాకీ జై’, ‘మహాత్మాగాంధీకీ జై’ అని అరుస్తూ కుర్రవాళ్లు నిప్పంటించేవారు. జనం పెద్ద సంఖ్యలో గుమికూడి ఆ దహనకాండను ‘రామ్‌లీల’ వేడుకలా తిలకించేవాళ్లు.
అసహాయోద్యమం అగ్గి అతి త్వరలో దేశమంతటా అంటుకుంది. విద్యార్థులు స్కూళ్లు, కాలేజిలు వదిలిపెట్టారు. న్యాయవాదులు బంగారంలాంటి ప్రాక్టీసును విడిచారు. బ్రిటిషు సర్కారు ఇచ్చిన పదవులను, బిరుదులను ఎంతోమంది తిప్పికొట్టారు. విద్యార్థులు, మేధావులు, వివిధ జీవన రంగాల ప్రముఖులు, సామాన్య ప్రజలు లక్షల సంఖ్యలో ఉద్యమ శ్రేణుల్లో కలిసి, ప్రభుత్వాన్ని దాదాపు స్తంభింపజేశారు. రజకులు, క్షురకులు, పరిచారకులు తెల్లవారికి పని చేయటం మానేశారు. మహిళలు మద్యం దుకాణాలను మూయించారు. ఎన్నో లక్షల రైతులు, కార్మికులు కూడా అసహాయోద్యమంలో పాలుపంచుకుని తెల్లదొరతనానికి కునుకు లేకుండా చేశారు. ఆంధ్రలోని పెదనందిపాడు వంటి చోట్ల పన్నుల చెల్లింపు నిరాకరణలు ముమ్మరంగా సాగాయి. రైల్వే ఉద్యోగులు కూడా సమ్మెలో చేరదలిచినట్టు తెలిసిందని తన తాత అర్జున్‌సింగ్‌కు రాసిన ఉత్తరంలో భగత్‌సింగ్ తెలిపాడు. పోలీసులు పిచ్చెత్తినట్టు లాఠీలతో చితకబాదినా ఆందోళనకారులు జంకలేదు. అహింసా వ్రతాన్ని చాలించి తిరగబడలేదు. దేశంలోని జైళ్లన్నీ సత్యాగ్రహులతో కిక్కిరిశాయి. శాంతియుతంగా ధర్నాలు చేసి వేలకు వేల సంఖ్యలో అరెస్టయ్యే ఉద్యమకారులను ఎక్కడ నిర్బంధించాలన్నది సర్కారుకు సమస్య అయింది.
ఇలా యావద్భారతం ఒక్క తాటి మీద నిలిచి ఉద్ధృతంగా ఉద్యమించగా సంవత్సరం గడచింది. మహాత్ముడు ఆశపెట్టిన స్వరాజ్యం జాడలేదు. అయినా అది రాలేదన్న నిస్పృహ ఆందోళనకారులకు కలగలేదు. కడదాకా అలాగే సర్వశక్తులూ ఒడ్డి, ప్రాణాలు ధారపోసైనా భయానక కష్టనష్టాలకోర్చి స్వరాజ్యం సాధించి తీరాలని భగత్‌సింగ్ లాంటి లక్షలాది దేశభక్తులు పళ్లబిగువున పోరాడుతూండగా - కలనైనా ఊహించనిది జరిగింది.

రోజూలాగే ఆ పూటా విదేశీ వస్తువుల దహనం కోలాహలంగా జరుగుతున్నది. ఖరీదైన మిల్లుబట్టలు, సీమలో తయారైన కాలిజోళ్లు, గడియారాలు గట్రా రావణకాష్ఠంలా తగలబడుతున్నాయి.
ఇళ్ల నుంచి మోసుకొచ్చిన బరువు దించుకుని ‘్భగత్! ఇంకో మూట మంటల్లో పడింది’ అని అరిచాడు జయదేవ్.
జయదేవ్ జట్టు ఇళ్ల వెంబడి తిరిగి గృహస్థులను అడిగి విదేశీ వస్తువులు తీసుకురావటం, ఒక మూట తగలబడగానే ఇంకో లాటు కోసం జనావాసాలకు వెళ్లడం మూడు రోజులుగా జరుగుతున్నది. మొదలెట్టిన దహనకార్యం ఆగకుండా సాగుతుండటం చూసి భగత్‌సింగ్ సంతోషపడ్డాడు. భగ్గున జ్వలిస్తున్న అగ్నికీలల్లో అతడికి భారతజాతి క్రోధం, విదేశీ పెత్తనాన్ని తుత్తునియలు చేయాలన్న ప్రజల కృతనిశ్చయం అతడికి కనపడుతున్నాయి. తరువాయి విడత ‘ఇంధనం’ కోసం మిత్రులు తలోదిక్కు వెళ్లగా వారి రాక కోసం ఎదురుచూస్తూ భారతజాతి ఆగ్రహాగ్ని తెల్లదొరతనాన్ని మసిచేసే సుందర దృశ్యాన్ని ఊహించుకుంటూ, సమిధలను సమంగా తగలబెడుతూ భగత్‌సింగ్ ఒక్కడే ఉండిపోయాడు.
వెళ్లిన వాళ్లు ఎంతకూ తిరిగిరాలేదు. ఏమైందబ్బా అని భగత్ కంగారు పడుతూండగా జయదేవ్ జట్టు ఒట్టి చేతులతో నీరసంగా వచ్చింది. ‘బట్టలు ఏవీ?’ అని భగత్ అడిగితే ఎలా చెప్పాలా అన్నట్టు వాళ్లు మొగాలు చూసుకున్నారు.
‘పోనే్ల. ఎవరూ ఇవ్వకపోతే మీరేం చేస్తారు. ఇక్కడ కాకపోతే రేపు వేరే ఊళ్లో మొదలెడదాం. దానిదేముంది?’ అన్నాడు భగత్‌సింగ్ బింకంగా.
‘ఇక మనం ఎక్కడికీ వెళ్లనక్కర్లేదులే’ అన్నాడు జండాసింగ్ ఏడుపుమొగంతో.
‘అంత తేలిగ్గా చేతులెత్తేస్తే ఎలారా? చేయాల్సింది ఇంకా చాలా ఉంది’ అని భగత్ సముదాయించబోతే
‘అది కాదురా బాబూ! మన ఉద్యమమే ఆగిపోయింది’ అన్నాడు జండాసింగ్ పీల గొంతుతో. అతడేమంటున్నదీ భగత్‌కి అర్థం కాలేదు. జయదేవ్ విడమర్చి చెప్పాడు.
‘గాంధీజీ ఉద్యమాన్ని ఉన్నపళాన ఆపేశాడు’
భగత్‌సింగ్ అదిరిపడ్డాడు.
‘ఆపేయడం ఏమిటి? ఎందుకు?’
‘చౌరీచౌరా అనే ఊళ్లో పోలీసు కాల్పులకు రెచ్చిపోయిన ఆందోళనకారులు మొనె్నప్పుడో ఠాణాకు నిప్పంటించి, 22 మంది పోలీసులను నరికేశారట. దాంతో అహింసావ్రతం మైలపడిందని గాంధీజీ మొత్తం ఉద్యమాన్ని నిలిపేశాడు’
భగత్‌సింగ్ కాళ్ల కింద నేల కదిలినట్టయింది. నమ్ముకున్న మహాత్ముడు ఎందుకిలా చేశాడు? ఏదో ఊళ్లో ఎవరో చేసిన పిచ్చి పనికి మొత్తం దేశాన్ని ఎందుకు శిక్షించాడు? ఇంత విశాల దేశంలో రోజూ ఏదో ఒక మూల హింస తలెత్తుతూనే ఉంటుంది. ఎన్ని విధాల నేర్పించినా అహింసా తత్వాన్ని గాంధీగారిలా అందరూ ఒంటబట్టించుకోలేరు. ఎక్కడ ఏ మాత్రం హింస లేచినా పోరాటం ఆపేస్తానంటే బ్రిటిషు వాళ్లతో ఎప్పటికైనా పోరాడగలమా? ఎన్ని జీవితకాలాలకైనా స్వరాజ్యం సాధించగలమా? తెల్లవాళ్లు ఎంత పిశాచాల్లా పీక్కుతింటున్నా ప్రజలు మాత్రం తిరగబడటానికి ససేమిరా వీలులేదా? క్షణికావేశంలో ఎవరైనా రెచ్చిపోతే చాలు చక్కగా నడుస్తున్న ఉద్యమాన్ని నట్టేట ముంచుతాడా? ఇదేమి నాయకుడు?

ఇదెక్కడి అహింసావ్రతం?
‘మనం స్కూలు, ఇల్లు, అన్నీ వదులుకుని స్వరాజ్యం కోసం ఉద్యమంలో చేరాం! నడిమధ్యలో దాన్ని ఆపేస్తే ఇప్పుడు మనమంతా ఏమికావాలి? ఏమి చెయ్యాలి?’ అన్నాడు ఇంకో మిత్రుడు దిగాలుగా.
ఏమి చెప్పాలో భగత్‌సింగ్‌కి తోచలేదు. అతడు దీర్ఘాలోచనలో పడ్డాడు.
ఉద్యమ ధ్యేయాన్ని కానకుండా, అంతిమ లక్ష్యం కోసం సర్వశక్తులూ ఒడ్డి ఏకదీక్షగా పోరాడకుండా అహింస పేరుతో ఉద్యమం చేతులు కట్టివేయటం దేశ ప్రయోజనాలకు ద్రోహం చేయటమే. ఎలా చూసినా గాంధీ చేసింది పెద్ద తప్పు అనే భగత్‌కి అనిపించింది. అతడికి తెలియకుండానే అతడి ఆలోచనలు గదర్ విప్లవంలో ధీరోదాత్తంగా ఉరికంబమెక్కిన తన అభిమాన వీరుడు కర్తార్‌సింగ్ మీదికి మళ్లాయి.

Suddenly, excited, Bhagat said, "To follow the path of dedicated non violence is beyond me. I have seen the massacre of Amritsar... They killed and tortured unarmed people. I will definitely teach them a lesson. I shall avenge the death of the martyrs. Let the bonfire die out. But I shall not allow the Yagyakund to die out till I am alive'
[The Life and Times of Bhagat Singh, Mahesh Sharma, p.42]
భగత్ ఉన్నట్టుండి ఉథ్వేగంగా అన్నాడు. ‘అహింసా మార్గానికే అంకితం కావడం నా వల్ల కాదు. నేను అమృత్‌సర్ హత్యాకాండను చూశాను. నిరాయుధులైన జనాన్ని క్రూరంగా చంపారు. చిత్రహింసలు పెట్టారు. వాళ్లకు నేను పాఠం చెప్పి తీరుతా. అమాయకుల మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటా. ఈ మంట చల్లారనీ. కానీ నా యజ్ఞకుండాన్ని నేను బతికున్నంత వరకూ చల్లారనివ్వను’

అహింస నుంచి హింసకు భగత్‌సింగ్ ప్రస్థానం మొదలైంది. అతడిలోని విప్లవకారుడు జూలు విదిలించాడు.

***

ఎం.వి.ఆర్. శాస్త్రి