భగత్‌సింగ్

విప్లవ కళాశాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగత్‌సింగ్ - 7
==========
తండ్రి వద్దన్నా వినకుండా బడిమాని, గాంధీయ ఉద్యమంలో చేరాడు. ఇప్పుడు గాంధీగారే ఉద్యమాన్ని చంపేశాడు. వస్తుందనుకున్న స్వరాజ్యం రాలేదు. చదువుతున్న చదువు ఏడాది పాడయింది. ఇప్పుడేం చేయాలి?
బడిని బహిష్కరించడానికి ముందు భగత్‌సింగ్ లాహోర్‌లో ఆర్య సమాజికుల డి.ఎ.వి. స్కూలులో 9వ తరగతి చదువుతున్నాడు. ఇప్పుడు కావాలనుకుంటే మళ్లీ అదే క్లాసులో చేరవచ్చు. తన సహాధ్యాయులు మెట్రిక్యులేషను పూర్తి చేసి కాలేజిల్లో చేరుతూండగా తాను మళ్లీ 9వ తరగతిలో కూచోవాలంటే నామోషీ.
కాలేజికి వెళ్లాలని భగత్‌కు ఉంది. అది కూడా బానిస చదువులు నేర్పే సర్కారీ లేక మిషనరీ కాలేజిల్లో కాదు. పంజాబ్ కేసరి లాలా లాజపత్‌రాయ్ జాతీయ విద్యను బోధించటం కోసం భాయి పరమానంద్‌తో కలిసి కొత్తగా ‘తిలక్ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్’ స్థాపించాడు. దాన్నే అందరూ ‘నేషనల్ కాలేజి’ అంటున్నారు. అందులో చేరాలని భగత్ కోరిక. కాని మెట్రిక్ పరీక్ష పాసవని వారిని అక్కడ కూడా చేర్చుకోరు. కనీసార్హత తనకు లేదు. మరి ఎలా?
దైవికంగా ఆ సమస్యా తీరింది.
నేషనల్ కాలేజిని నడిపే భాయి పరమానంద్ భగత్ తండ్రి, తాతలకు బాగా తెలుసు. అజిత్‌సింగ్ నడిపిన భారతమాత సొసైటీ కార్యకలాపాల్లో ఆయన కూడా చురుకుగా పాల్గొనేవాడు. ఆయనా ఆర్యసమాజికుడే. ‘మావాడు ఖాళీగా ఉన్నాడు; మెట్రిక్ కాలేదు; మీ దగ్గర చేరడానికి ఏమైనా అవకాశం ఉంటుందా?’ అని ఆయన్ని అడిగాడు కిషన్‌సింగ్.
‘రూలు ప్రకారం కుదరదు. అయినా చూస్తాను. ఒకసారి మీ వాడిని పంపించ’మన్నాడు పరమానంద్.
తన దగ్గరికి వచ్చిన భగత్‌సింగ్ చురుకు కళ్లను, ముఖ కవళికలను చూస్తే భాయి పరమానంద్‌కి ముచ్చటేసింది. చూడగానే అతడి పినతండ్రి అజిత్‌సింగ్ గుర్తొచ్చాడు. ‘ఇప్పటిదాకా ఏమి చదువుకున్నావు?’ అని కుర్రవాడిని అడిగాడు. వచ్చిన జవాబుకు విస్తుపోయాడు. భగత్ చెప్పిన పుస్తకాలు తరగతి గదిలో బోధించేవి కావు. ఆ ఈడు పిల్లలకు సాధారణంగా తెలిసేవీ కావు. వాటిలోని విషయాల గురించి ప్రశ్నలు వేస్తే భగత్ చకచకా బదులిచ్చాడు.
‘వజ్రంలాంటి కుర్రాడు. తప్పక కాలేజిలో చేర్చుకోవాలి’ అని పెద్దాయన మనసులో అనుకున్నాడు.
‘ఒక పని చెయ్. రేపటి నుంచి క్లాసులో కూచో. ఇప్పుడు నీకు కొన్ని పుస్తకాల పేర్లు చెబుతా. లైబ్రరీ నుంచి తెచ్చుకుని వాటిని ఇంట్లో చదువుకో. వాటిమీద రెండు నెలల తరవాత నీకు పరీక్ష పెడతాను. అందులో పాసయితే నీకు సీటు ఖరారు చేస్తా. అన్నట్టు ఇంగ్లిషులో వీక్‌గా కనపడుతున్నావ్. దాన్ని ఇంప్రూవ్ చేసుకో’ అన్నాడు పరమానంద్.
భగత్‌సింగ్‌కి అంతకంటే కావలసింది ఏముంది? కాలేజితోబాటు లాజపత్‌రాయ్ నెలకొల్పిన ద్వారకాదాస్ లైబ్రరీ నుంచి కావలసిన పుస్తకాలు తెచ్చుకుని ఏకదీక్షగా చదివాడు. రెండు నెలలకు ఎంట్రెన్స్ పరీక్ష అవలీలగా పాసయ్యాడు.
లాహోర్ నేషనల్ కాలేజి దానికదే సాటి. మామూలు కాలేజిల్లా స్కాలర్లను తయారుచేయడం మాత్రమేగాక, వారిని దేశభక్తుల్లా తీర్చిదిద్దేందుకు వెలసిన పోరాటాల పాఠశాల అది. మిగతా కళాశాలల్లా సర్కారీ కొలువుకు కావలసిన మెకాలే మార్కు విద్యను బోధించటం కాకుండా విద్యార్థి మానసిక వికాసానికి, విజ్ఞానానికి కావలసిన దేశీయ విద్యను అక్కడ నేర్పించేవారు. మామూలు పాఠ్యాంశాలను కూడా జాతీయ దృక్కోణం నుంచి బోధించేవారు. చదువు నేర్చేవారిలో ఎక్కువమంది అసహాయోద్యమంలో చదువులు కట్టిపెట్టి సత్యాగ్రహాలు చేసినవారు. ఇక వారికి పాఠాలు చెప్పేవారు స్వయానా విప్లవకారులు. దేశభక్తి, పోరాట తత్వం నరనరాన నిండినవారు.
పంజాబ్ కేసరి లాలాలాజపత్‌రాయ్ కళాశాల పెట్టి ఊరుకోలేదు. వీలున్నప్పుడల్లా విద్యార్థులకు రాజకీయ శాస్త్రం క్లాసులు తీసుకునేవాడు. భాయ్ పరమానంద్ కాలేజికి చీఫ్ అడ్మినిస్ట్రేటరుగా ఉంటూనే పిల్లలకు హిస్టరీ బోధించేవాడు. ఆయనంటే విద్యార్థులందరికీ మహాభక్తి. ఆర్య సమాజంవారు తమ ధర్మ ప్రచారం కోసం ఆయనని దక్షిణాఫ్రికా పంపించారు. అక్కడి నుంచి తిరిగొస్తూ మధ్యలో ఆగి, లండన్ లైబ్రరీలో కూర్చుని రిసెర్చి చేసి భారతదేశ చరిత్రను రాశాడు. దాన్ని చూసి బ్రిటిషు ప్రభుత్వానికి గంగవెర్రులెత్తి, ఆయన వెంటపడింది. అప్పట్లో ఉద్ధృతంగా లేచిన గదర్ ఉద్యమంలో పరమానంద్ చురుకుగా పాల్గొని, కర్తార్‌సింగ్ లాంటి ఎందరో విప్లవకారులకు దిశా నిర్దేశం చేశాడు. ప్రవాస భారతీయులను కదిలించడానికి లాలాహర్‌దయాళ్‌ను పురికొల్పి అమెరికా పంపించింది ఆయనే. మొదటి లాహోర్ కుట్ర కేసులో బ్రిటిషు వారు ఆయనను ఇరికించారు. ఆ కేసులో కర్తార్‌సింగ్‌తోబాటు ఆయనకు కూడా ఉరిశిక్ష పడింది. అది అన్యాయమని మదన్‌మోహన్ మాలవీయ, సి.ఎఫ్.ఆండ్రూస్ వంటి వారు వైస్రాయ్‌కి మొర పెట్టుకున్న మీదట దాన్ని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చి అండమాన్‌లో భూలోక నరకమైన సెల్యులార్ జైలుకు తరలించారు. తరవాత బ్రిటిషు సర్కారుకు ఎందుకో విజ్ఞత కలిగి, ఐదు నెలలు తిరక్కుండా ఆయనను విడిచిపెట్టారు.
భగత్‌సింగ్‌కి భాయ్ పరమానంద్ అంటే మహా ఇష్టం. ఎందుకంటే తన అభిమాన హీరో అయిన గదర్ విప్లవ సింహకిశోరం కర్తార్‌సింగ్ సరబాకూ పరమానందే గురువు; మార్గదర్శి. యూరోపియన్ చరిత్రను బోధిస్తూ ఒక విప్లవం తరవాత ఒక విప్లవం గురించి ఆ విప్లవకారుడు కళ్లకు కట్టినట్టు వివరిస్తూంటే విద్యార్థులు మంత్రముగ్ధుల్లా వినేవారు.
All the students of National collage were young men who had responded to the appeal of Mahatma Gandhi. When these students learnt about the events of European history, as taught by Bhai Paramanand, they became skeptical of how Mahatma Gandhi could claim that he could secure independence through peaceful and non-violent means, when other countries of the world had to resort to armed violence to stave off the bridle of slavery. The students often asked themselves the question, why was Mahatma Gandhi building castles in air?
[Shaheed Bhagat Singh, Omesh Saigal, p.52]

(నేషనల్ కాలేజి విద్యార్థులందరూ మహాత్మాగాంధి పిలుపుకు స్పందించిన యువకులు. భాయి పరమానంద ముఖతః యూరోపియన్ చరిత్రలోని ఘటనలు వింటూంటే వాళ్లకి గాంధీపైన అనుమానాలు రేకెత్తేవి. బానిసత్వ బంధాలను తెంచేందుకు ప్రపంచంలోని మిగతా దేశాలు సాయుధ హింసకు దిగుతూంటే మహాత్మాగాంధి మాత్రం శాంతియుత అహింసాత్మక పద్ధతుల్లో స్వాతంత్య్రం తీసుకొస్తానని ఎలా చెబుతున్నాడు? ఆయన గాలిలో మేడలు కడుతున్నాడా- అని విద్యార్థులు తరచుగా మాట్లాడుకునేవారు.)

జయచంద్ర విద్యాలంకర్ అని ఇంకో అధ్యాపకుడు ఉండేవాడు. ఆయన కాంగ్డీ గురుకులంలో స్వామి శ్రద్ధానందకు ప్రియశిష్యుడు. స్వయంగా తానే చరిత్రకారుడు కావడంతో చరిత్ర పాఠాలు రసవత్తరంగా చెప్పేవాడు. ఆయనకు శచీంద్రనాథ్ సన్యాల్ వంటి బెంగాలీ విప్లవకారులతో రహస్య సంబందాలు ఉండేవి. సన్యాల్‌ను భగత్‌సింగ్ మొట్టమొదట కలిసింది జయచంద్ర ఇంట్లోనే. విప్లవవీరుడిగా భగత్‌ని మలచిన తొలి గురువు జయచంద్ర విద్యాలంకారే. ఆయన పాఠాలు విన్నాకే, భగత్‌సింగ్‌లో భారతదేశ విముక్తికి సాయుధ పోరాటమే మార్గమన్న అభిప్రాయం దృఢపడింది.
మామూలు కళాశాలల్లాగా నేషనల్ కాలేజిలో ప్రత్యేకంగా పాఠ్య గ్రంథాలు అంటూ ఉండేవికావు. లెక్చరర్లు ఒక్కో పాఠాన్నీ జాతీయ దృక్కోణం నుంచి, దేశభక్తిని, పోరాటతత్వాన్ని రంగరించి మనసుకు హత్తుకునేలా పిల్లలకు బోధించి, దానికి సంబంధించిన సమాచారం ఏఏ గ్రంథాల్లో దొరికేదీ చెప్పేవారు. విద్యార్థులు గ్రంథాలయం నుంచి ఆ పుస్తకాలు తీసుకుని నోట్సు తయారుచేసుకునేవారు. తరగతి గదుల్లో పాఠాలు చెప్పటంతోబాటు టీచర్లు బయట కూడా విద్యార్థులతో స్నేహంగా ఉండేవారు. సాయంత్రాలు విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎక్కడో కలుసుకుని రష్యన్ విప్లవం, ఐర్లండ్ ఉద్యమం లాంటి వాటి గురించి ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకునేవారు. వెనె్నల రాత్రులు రావినది ఒడ్డున కూచుని, పడవల్లో తిరుగుతూ ప్రిన్సిపల్ ఛబీల్‌దాస్, జుగల్ కిషోర్, విద్యాలంకర్ వంటి టీచర్లతో జాతి విముక్తి పోరాటాలూ భారతదేశంలో అనుసరించదగిన విప్లవ వ్యూహాల గురించి గంటల తరబడి కబుర్లాడేవారు.
క్లాసు రూములో బోధనతోబాటు విద్యార్థుల ఆలోచనా శక్తిని పెంచేందుకు కాలేజిలో డిబేటింగులు తరచు పెట్టేవారు. వాటిలో సమకాలీన రాజకీయాల మంచి చెడ్డలు ఘాటుగా చర్చించేవారు. ఆ సందర్భాల్లో గాంధీ వైఖరిలోని వైరుధ్యాలను భగత్‌సింగ్, సుఖ్‌దేవ్ లాంటి వారు నిశితంగా నిగ్గుతేల్చేవారు. చౌరీచౌరాలో కొద్దిమంది పోలీసులను రెచ్చిపోయిన గుంపు నరికేస్తే అహింసా వ్రతం మైలపడిందని గుండెలు బాదుకుని, పండంటి ఉద్యమాన్ని ఠక్కున ఆపేసిన మహాత్ముడు అదే చౌరీచౌరా నిందితులపై బ్రిటిషు సర్కారు పగబట్టి తప్పుడు కేసులు పెట్టి ఏకంగా 172 మందికి మరణశిక్ష విధింపజేస్తే కనీసం అది అన్యాయమని నోరు తెరిచి ఖండించనే లేదేమిటి? ఎంతసేపూ ప్రజల తప్పులే తప్ప తెల్లదొరతనం రాక్షస కృత్యాలు ఆయన కంటికి ఆనవా? అలాగే - ఎక్కడో ఏదో ఊళ్లో ఎవరో హింసకు హింసతో జవాబు చెప్పారన్న నెపంతో దేశవ్యాప్త ఉద్యమాన్ని ఆపేసిన కాంగ్రెసు వారు ఆ తరవాత చేసిందేమిటి? ఉద్యమకాలంలో ఎగవేసిన పన్నులను జమీందార్లకు, ప్రభుత్వానికి వెంటనే కట్టెయ్యాలని బార్డోలీ తీర్మానంలో అంత నొక్కి చెప్పాల్సిన అవసరమేమిటి? తాము జమీందార్లకు ఎప్పుడూ వ్యతిరేకం కాదని, వారికి పన్నులు సక్రమంగా చెల్లించి, సమస్యలను సామరస్యంగా తేల్చుకోవాలనే తాము ప్రజలకు సర్వదా చెబుతామని ఆ తీర్మానంలో ఎందుకు వివరణ ఇచ్చుకున్నారు? ప్రజలను పీడించే భూస్వామ్య వర్గాల కొమ్ము కాసేందుకే కాంగ్రెసు ఉన్నదని దీన్నిబట్టే తెలియడం లేదా- అని కాలేజి డిబేట్లలో భగత్‌సింగ్ వాడిగా, వేడిగా వాదించేవాడు.
దేశభక్తిని, విప్లవ భావాలను వ్యాప్తి చేయటానికి నాటకం మంచి సాధనమని తోచి, భాయి పరమానంద్, ప్రిన్సిపాల్ ఛబీల్‌దాస్ విద్యార్థులను ప్రోత్సహించి ‘నేషనల్ డ్రామాటిక్ క్లబ్’ను పెట్టించి తరచూ నాటకాలు వేయించేవారు. ఇతివృత్తం చరిత్రాత్మకం అయినా ప్రేక్షకులకు తమ జాతి చరిత్ర పట్ల గౌరవాన్ని, సమకాలిక సమస్యల పట్ల అవగాహనను, పోరాట తత్వాన్ని కలిగించడమే ప్రధానాశయం. అందరిలోకీ

నదరుగా, చలాకీగా ఉండటంవల్ల ప్రధాన నాయక పాత్ర ఎప్పుడూ భగత్‌సింగ్‌కే దక్కేది. సామ్రాట్ చంద్రగుప్త, రాణాప్రతాప్, శివాజీ లాంటి పాత్రల్లో లీనమై అతడు అద్భుతంగా నటించేవాడు. ఒకసారి ‘సామ్రాట్ చంద్రగుప్త’ నాటకంలో వౌర్య చంద్రగుప్తుడిగా భగత్‌సింగ్ అభినయాన్ని చూసి, భాయి పరమానంద సంతోషం పట్టలేక, స్టేజి మీదే గట్టిగా కౌగిలించుకుని ‘భారతదేశానికి భావి చంద్రగుప్తుడు ఇతడే’ అని తెగ మెచ్చుకున్నాడు.
కేవలం కాలేజిలోనేగాక లాహోర్ నగరంలో... ల్యాల్‌పూర్, గుజరన్‌వాలా, రావల్పిండి లాంటి బయటి ప్రాంతాల్లో కూడా భగత్ బృందం, ప్రబోధాత్మక నాటకాలను ప్రదర్శించి జనాలను ఉర్రూతలూపేది. పంజాబ్‌లోని అనేక ఇతర కళాశాల విద్యార్థులలో, యువతరంలో భగత్‌సింగ్ తన నటనా కౌశలంతో వందల సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నాడు. అప్పటికింకా అతడి విప్లవ జీవితం మొదలే కాలేదు.
విశేషం ఏమిటంటే- రాబోయే కాలంలో భగత్‌సింగ్‌తో కలిసి విప్లవ ప్రస్థానంలో ప్రయాణించబోయే సహచరులు చాలామంది నేషనల్ కాలేజిలోనే అతడికి పరిచయమయ్యారు. వారిలో మొదట చెప్పుకోవలసినవాడు సుఖ్‌దేవ్ థాపర్. అతడు భగత్ క్లాస్‌మేటే కాదు. బెంచిమేటు కూడా. పంజాబ్‌లోని లూధియానా పట్టణంలో పుట్టిన సుఖ్‌దేవ్ భగత్‌సింగ్ కంటే మూడు నాలుగు నెలలు పెద్దవాడు. తెల్లవారి అకృత్యాలను, అత్యాచారాలను చూసి చిన్నతనంలోనే అతడు తిరుగుబాటు దారిని ఎంచుకున్నాడు.
భగత్‌సింగ్‌ను కొత్తగా కాలేజిలో చేరగానే సుఖ్‌దేవ్ పక్కన కూచోమన్నారు. ఆ రోజున భారతదేశ స్థితిగతులూ, వాటి కారణాల గురించి క్లాసులో వివ్లేషణ జరుగుతున్నది. అందరిలోకీ లెక్చరరును ఎక్కువ ప్రశ్నలు వేసిందీ, అభ్యుదయ భావాలతో విలక్షణ పరిష్కారాలను సూచించిందీ భగత్, సుఖ్‌దేవ్‌లు ఇద్దరే. ఒకరి జ్ఞానాన్ని, తెలివితేటలను చూసి ఒకరు ముచ్చటపడ్డారు. మానసికంగా బాగా దగ్గరయ్యారు. జాతీయ భావం, దేశభక్తి, విప్లవ తత్వం, త్యాగనిరతి ఇద్దరికీ సమానంగా ఉండటంతో మొదటిరోజే ఇద్దరూ అతుక్కుపోయారు. ఎప్పుడూ కలిసే తిరుగుతూ ఏదో ఒక అంశాన్ని సీరియస్‌గా చర్చించుకుంటూ ఉండేవారు. చివరికి కలిసే ఉరికంబమెక్కారు.
భగవతీ చరణ్ బోహ్రా, శివవర్మ, యశ్‌పాల్, బటుకేశ్వర్‌దత్, రామ్‌చరణ్ వంటి విప్లవ సహచరులు కూడా భగత్‌సింగ్‌కు నేషనల్ కాలేజిలోనే కలిశారు. అందరూ కలిసిమెలిసి తిరిగేవారు. ఆ రోజుల్లోదే యశ్‌పాల్ చెప్పిన ఈ ముచ్చట:

పడవలో మేమిద్దరమే ఉన్నాం. ఆ ఆలోచన ఎలా వచ్చిందో తెలియదు. ‘‘దేశం కోసం మన జీవితాల్ని అంకితం చేద్దాం’’ అన్నాను నేను. భగత్‌సింగ్ మొహం ఉన్నట్టుండి గంభీరంగా మారింది. ‘‘ఔను. నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను’’ అన్నాడు ఉద్వేగంతో. ఇద్దరం ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని చాలాసేపు వౌనంగా ఉన్నాం. సూర్యాస్తమయమైంది. చీకటి పడుతూండగా ఒడ్డుకు చేరాం. పడవను సొంతదారుకు అప్పగించి వెనక్కి మరలాం. దేశానికి జీవితాలను సమర్పించుకున్న భావావేశ తీవ్రతలో చాలాసేపు మా నోట మాట రాలేదు.
[Bhagat Singh and His Times, Manmathnath Gupta, PP.82-83]

*

రైటప్ లాహోర్ నేషనల్ కాలేజీ గ్రూప్ ఫోటో. పై వరస వలయంలో ఉన్నథి భగత్‌సింగ్

-ఎం.వి.ఆర్. శాస్త్రి