హైదరాబాద్

వసూళ్ల తిప్పలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 1: మహానగర పాలక సంస్థకు మున్ముందు పొంచి ఉన్న ఆర్థిక సంక్షోభాన్ని అధికారులు కాస్త ముందుగానే పసిగట్టి, దాన్ని అధిగమించేందుకు చర్యలు ప్రారంభించారు. ప్రధాన ఆర్థిక వనరైన ఆస్తిపన్ను వసూళ్లను మెరుగుపర్చుకోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా కార్పొరేషన్‌కు ప్రధాన ఆర్థిక వనరైన ఆస్తిపన్నును ప్రతి ఆర్థిక సంవత్సరం కేవలం ఫిబ్రవరి, మార్చి మాసాల్లోనే గాక, ఏడాది మొత్తం కూడా సక్రమంగా వసూలు చేసుకుంటే కలెక్షన్ పెరిగే అవకాశాలున్నట్లు అధికారులు గుర్తించారు. గడిచిన ఆర్థిక సంవత్సరం 2015-16లో పన్ను పెంచకుండానే అప్పటి కమిషనర్ సోమేశ్‌కుమార్ ఆస్తిపన్ను వసూళ్లను వెయ్యి కోట్లు దాటించి, ప్రదాని నరేంద్రమోదితో భేష్ అన్పించుకున్న సంగతి తెలిసిందే! ప్రస్తుత కమిషనర్ డా.బి. జనార్దన్ రెడ్డి కూడా ఆ రికార్డుకు ధీటుగానే పన్ను వసూలు చేసేందుకు పలు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. స్టేట్ బ్యాంట్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) సహకారంతో నగదు బహుమతులను ప్రదానం చేస్తున్నారు. గత కొద్ది సంవత్సరాల క్రితం వరకు కూడా జిహెచ్‌ఎంసి అధికారులు ఆస్తిపన్ను వసూళ్లను ఏ మాత్రం పట్టించుకోకుండా, కేవలం ఫిబ్రవరి, మార్చి మాసాల్లో హడావుడి చేసేవారు. బకాయిదారులకు కూడా ఇదే అలవాటుగా మారి, వారు కూడా ఫిబ్రవరి, మార్చి మాసాల్లోనే చెల్లించేవారు. కానీ ఈ సారి ప్రజలు స్వచ్ఛందంగా వారంతట వారే పన్ను చెల్లించేందుకు ముందుకొచ్చేలా ఆఫర్లను సిద్ధం చేస్తున్నారు.
గతంలో కొన్ని సార్లు ప్రజల నుంచి ముక్కుపిండి, ఇంటి ముందు చెత్తాచెదారం వేసి కూడా తమ టార్గెట్లకు తగిన విధంగా పన్ను వసూలు చేసుకునే వారు. కానీ గడిచిన రెండేళ్ల నుంచి ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన మొదటి నెలలోనే ఏప్రిల్ మాసంలో పన్ను చెల్లించే బకాయిదారులకు ఏకంగా అయిదు శాతం రిబేటు ఇస్తూ అమలు చేసిన ఎర్లిబర్డ్ స్కీంతో అధికారుల చక్కటి ఫలితాలు సాధించారు. అంతటితో ఆగని కమిషనర్ జనార్దన్ రెడ్డి కేవలం మే మాసంలో 29 నుంచి 31వ తేదీ వరకు పన్ను చెల్లించిన సుమరు 10వేల 775 మంది బకాయిదారులతో ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా డ్రా నిర్వహించి విజేతలకు రూ. 5లక్షల నగదు బహుమతులను ప్రదానం చేయనున్నారు. ఇందుకు సంబంధించి విజేతల ఎంపిక కోసం బుధవారం డ్రా నిర్వహించారు. అంతటితో ఆగని కమిషనర్ మున్ముందు వారానికోసారి కూడా ఆ వారం రోజుల్లో పన్ను చెల్లించిన బకాయిదారులను ఎంపిక చేసి, వారికి డ్రా నిర్వహించి, బంపర్ బహుమతిగా రూ. లక్ష, ఆ తర్వాత రూ. 50వేలు, రూ. 25వేలు, రూ. 12వేల 500, రూ. 5వేలు, రూ. 2500లతో పాటు రూ. వెయ్యి వంద కన్సోలేషన్ బహుమతులను కూడా అందించనున్నట్లు కమిషనర్ జనార్దన్ రెడ్డి బుధవారం ప్రకటించారు.
సంబురాలకు సిద్ధం
సర్వాంగ సుందరంగా ముస్తాబైన నగరం విద్యుత్ కాంతులతో ట్యాంక్‌బండ్ కళకళ
ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ విద్యుత్ కాంతులు
హెచ్‌ఎండిఏ పార్కుల్లో నేడు ఉచిత ప్రవేశం అలంకరణతో పురాతన భవనాలకు శోభ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 1: భాగ్యనగరం వేదికగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ సంబురాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ముఖ్యంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అంతేగాక, అసెంబ్లీ వంటి చారిత్రక భవనాలు ప్రత్యేక అలంకరణతో మరింత శోభను సంతరించుకున్నాయి. వివిధ శాఖల ఆధ్వర్యంలో ఈ వేడుకలు వేర్వేరుగా, అన్ని శాఖలను కలుపుతూ ప్రభుత్వం ఆధ్వర్యంలో పరేడ్‌గ్రౌండ్స్‌లో, ట్యాంక్‌బండ్‌పై కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నా, గడిచిన రెండురోజులుగా విద్యుత్ కాంతులతో ధగధగలాడుతున్న ట్యాంక్‌బండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ట్యాంక్‌బండ్ చుట్టు పరిసర ప్రాంతాల్లో ఉన్న సచివాలయం, జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయం, అసెంబ్లీ భవనాలకు ముస్తాబు చేయటంతో పాటు ఫ్లైఓవర్లను కూడా అలంకరించారు. కాగా, గురువారం రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని నగరంలోని లుంబినీ, సంజీవయ్య పార్కు, ఎన్టీఆర్ పార్కు, బుద్ధ పూర్ణిమ, నారాయణగూడ మెల్కోటే పార్కు, సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్ వంటి ఇతరత్ర పార్కుల్లో ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం ముఖ్యమంత్రి కెసిఆర్ సచివాలయం ముందు అమరవీరుల స్మృతి వనానికి, అమర వీరుల స్మారం స్థూపం ఏర్పాటు వంటి ముఖ్యమైన పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.
రూ.1.21కోట్లతో గ్రేటర్ ఏర్పాట్లు
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భవ ఉత్సవాలకు రూ. కోటి 21లక్షల వ్యయంతో భారీ ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా జిహెచ్‌ఎంసి పరిధిలోని వారసత్వ భవనాలు, పలు ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ ధీపాలతో అలంకరించటంతో పాటు నగరంలోని ఇటీవల రీ కార్పెటింగ్ చేసిన 569 రోడ్లపై లేన్ మార్కింగ్ చేశామని తెలిపారు. లేన్ మార్కింగ్ పనులు, స్టడ్‌లను అమర్చే పనులు, బ్లాక్‌టాపింగ్ రోడ్లపై తెల్లటి ఎనామిల్ పెయింట్ ద్వారా లేన్ మార్కింగ్, రోడ్ డివైడర్లు, మలుపులు, చీకట్లో స్పష్టంగా తెలియజేసే విధంగా రేడియం స్లడ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేయటం వంటి ఇతర పనులను చేపట్టినట్లు కమిషనర్ జనార్దన్ రెడ్డి వివరించారు. గ్రేటర్ పరిధిలోని ప్రధాన జంక్షన్లలో ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేశారు. సుమారు 400 ఓల్టుల సామర్థ్యం కల్గిన దాదాపు 2247 ఫ్లడ్ లైట్లు, 530 కలర్ లైట్లు, వెయ్యి ఓల్టుల సామర్థ్యం కల్గిన మరో 240 హలోజన్ లైట్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మరో వెయ్యి 721 ఫార్‌క్యాన్స్ ఎల్‌ఇడి లైట్లను, మరో 9529 సిరీస్ లైట్లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
కలెక్టరేట్ ఆధ్వర్యంలో...
రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవ సంబరాలను వివిధ శాఖల వారీగా సమన్వయంగా, ఘనంగా జరుపుకోవాలని కలెక్టర్ రాహుల్ బొజ్జా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా నగరంలో పేదలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో ప్రత్యేక వైద్యరోగ్య శిబిరాలను నిర్వహించాలని కూడా సూచించారు. అంతేగాక, సర్కారు ఆసుపత్రుల్లో పండ్లు, స్వీట్లను పంపిణీ చేయటంతో పాటు పేదలు ఎక్కువగా నివసించే మురికివాడల్లో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించి, పేదలకు వైద్యం అందించాలని కలెక్టర్ జిల్లా వైద్యా ఆరోగ్య శాఖ, హాస్పిటల్స్ సర్వీసెస్ జిల్లా కో ఆర్డినేటర్ సంయుక్త్ధ్వార్యంలో వైద్య శిబిరాలను నిర్వహించాలన్నారు. అంతేగాక, కలెక్టరేట్ కార్యాలయాన్ని ఇతర ఆఫీసులను విద్యుత్ ధీపాలతో అలంకరించాలని ఎలక్ట్రిక్, రోడ్లు, భవనాల శాఖ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్‌ను ఆదేశించారు. పాఠశాల, జూనియర్, డిగ్రీ, కళాశాల విద్యార్థులకు వ్యాసరచన, వ్యక్తృత్వం, క్రీడలు, ఆటలు తదితర పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను ప్రధానం చేయాలని, ఆయా పాఠశాలల విద్యార్థులతో ర్యాలీలు, రన్స్ వంటి కార్యక్రమాలను నిర్వహించి, బహుమతులను ప్రదానం చేయనున్నారు.
డివిజన్ల స్థాయిలో పండుగ చేయండి
హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవాన్ని ప్రతి డివిజన్ స్థాయిలో కార్పొరేటర్లు పండుగగా నిర్వహించాలని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పేదలకు అన్నదానం, రోగులకు పండ్ల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలని ఆయన ఆదేశించారు. దీంతో పాటు గురువారం నగరంలోని ప్రతి హోటల్‌లోనూ తెలంగాణ వంటకాలను తక్కువ ధరకు ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు యజమానులను కోరగా, వారు సానుకూలంగా స్పందించారని మంత్రి తెలిపారు.