ఈ వారం స్పెషల్

‘కారు’మేఘాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముద్దొచ్చే చిన్నకారు చూడటానికి, ప్రయాణించడానికి అందంగా, సౌకర్యంగానే ఉంటుంది. కానీ మనిషి ఆరోగ్యంపై ఇప్పుడు వాటివల్లే ‘కారు’మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఆ పరిణామం ప్రాణాంతకంగా మారుతోంది. అందుకే ఆ మబ్బుల్ని తొలగించే పనిలో పడింది ఈ లోకం. ‘కారు లేని లోకం’లో భయంలేని బతుకుకోసం తపిస్తోంది. అందుకే ‘కార్ ఫ్రీ’ ప్రాంతాల పేరుతో కాలుష్యం కాటేయని రూట్‌కోసం అంతా వెతుకుతున్నారు.
కాలుష్యాన్ని వెదజల్లుతున్న కార్లు, ఇతర వాహనాలవల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 70 లక్షలమంది ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డుప్రమాదాల మరణాలు ఇందులో కలపలేదు. అందుకే మనిషి భద్రమైన లోకంకోసం అనే్వషించడం ప్రారంభించాడు. ప్రపంచంలో పలు దేశాలు ఇప్పటికే ఆ బాటలో దూసుకుపోతూంటే మనం ఇప్పుడు అటువైపు నెమ్మదిగా అడుగులు వేస్తున్నాం. 1974లో కొలంబియా రాజధాని బొగొటలో తొలిసారిగా ‘కార్ ఫ్రీ జోన్’ ప్రయోగం జరిగి విజయవంతమైంది. ఇక అప్పట్నించి కార్లకు బ్రేక్‌లు పడటం ప్రారంభమైంది. ఇప్పుడు దిల్లీలో ఆ ప్రయోగం అమలు చేయడానికి రంగం సిద్ధమవుతోంది. జనవరి 1నుంచి సరి,బేసి సంఖ్యల వారీగా కార్లు రోజు విడిచి రోజు మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. కొన్ని మినహాయింపులు, కొన్ని నిబంధనల నడుమ ఇది అమలుకాబోతోంది. ఈ ఆలోచనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. అయితే ‘దిల్లీ’ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆలోచనల కంటే ముందుగానే ఈ ఉద్యమంలో గుర్‌గావ్ దారిచూపింది. హైదరాబాద్ అడుగులేసింది. ప్రజల్లో చైతన్యం వస్తే ‘కార్ ఫ్రీ జోన్’ సమాజం ఏర్పడం పెద్దకష్టమేమీకాదు.
అసలు సమస్య
ఒకప్పుడు వాతావరణం...ఒక పద్ధతి ప్రకారం మార్పులకు లోనయ్యేది. ఏ రోజుల్లో అది ఎలా ఉండేదో దాదాపు కచ్చితంగా చెప్పగలిగేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పంచభూతాలు కలుషితమైపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. భూతాపం పెరగడంవంటి పెద్దసమస్యకు కొన్నిదేశాల పాత్రే ప్రధాన కారణం. అందులో వాయుకాలుష్యం భాగం తక్కువేం కాదు. ఈమధ్య ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) 1600 నగరాల్లో వాయుకాలుష్యంపై సర్వేచేసింది. ఆ జాబితాలో మన రాజధాని దిల్లీ తొలిస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో చైనా రాజధాని బీజింగ్ ఉంది. ఇంతకూ అంత పెద్దనగరాలు చెత్తగా తయారవడానికి కారణమేంటి. అసలు వాయుకాలుష్యం ఏ స్థాయిలో ఉంది. ఈ విషయాలు తెలుసుకుంటే భయం వేస్తుంది.
కాలుష్యం కోరల్లో దిల్లీ
ఇక్కడి గాలి ఎంతగా కలుషితమయిందో తెలుసుకుంటే గుండెలు గుభిల్లుమంటాయి. మనిషికి అవసరమైన స్వచ్ఛమైన గాలి ఇక్కడ లేనేలేదు. గాలిలో ధూళి ఉంటుందని అందరికీ తెలుసు. మన కంటికి కన్పించని ధూళి కణాలు అందులో కలిసి ఉంటాయి. పరిమిత సంఖ్యలో ఆ కణాలుంటే నష్టమేం లేదు. కానీ దిల్లీలో ఉన్న కాలుష్యం స్థాయి, సాధారణ స్థాయికన్నా 13 రెట్లు అధికంగా ఉంది. ‘పిఎం 2.5’ స్థాయిలో అక్కడ కాలుష్యం ఉంది. ఆ ధూళికణాలున్న గాలిని పీల్చడంవల్ల ఊపిరితిత్తులు, శ్వాసకు సంబంధించిన రోగాలు ముప్పిరిగొంటాయి. క్యాన్సర్, గుండెజబ్బుల ప్రమాదమూ ఉంది. దిల్లీలో గాలి ఇలా మారిపోవడానికి ఇంధనంతో నడిచే వాహనాలు కారణం. దేశ రాజధానిలో రోజూ 85 లక్షల వాహనాలు తిరుగుతున్నాయి. వీటిలో డీజిల్‌తో నడిచే వాహనాలు ఎక్కువ. వాటిలో కార్లు మరీ ఎక్కువ. ఈ వాహనాల్లో 65శాతం కార్లే. ఇవి వెదజల్లే కార్బన్‌డయాక్సైడ్ ఇప్పుడు ప్రాణాంతకంగా మారింది. పొగకమ్ముకుపోవడం, గాలి స్వచ్ఛత కోల్పోవడం, ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాలకు ఈ కార్లవల్ల కలిగే కాలుష్యం కారణమవుతోంది. దిల్లీ నగరంలో ఉన్న వాహనాలకు తోడుగా రోజూ 4500 కార్లు కొత్తగా రిజిస్టర్ అవుతున్నాయి. ఇలా ఈ సంఖ్య పెరుగుతూ వెడితే ఇక దిల్లీని ఎవరూ రక్షించలేరు. అందుకే ఇప్పుడు స్థానిక ప్రభుత్వం ఒక అడుగు ముందుకువేసి కార్లకు రెడ్‌సిగ్నల్ వేసే పనిలో పడింది.
కార్ ఫ్రి ప్రోగ్రామ్
వచ్చే ఏడాది మొదటిరోజునుంచి 15 రోజులపాటు దిల్లీలో ఆడ్‌ఈవెన్ నెంబర్ విధానంలో ‘కార్ ఫ్రీ జోన్’ విధానాన్ని అమలు చేయాలని దిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 7నుంచి రాత్రి ఏడు గంటలవరకు రోజు విడిచి రోజు కార్లు నడుపుతారు. మూడునెలల క్రితం ఇండియాగేట్ ప్రాంతంలో నిర్వహించిన ఈ తరహా ప్రయోగం వల్ల వచ్చిన ఫలితం ఇప్పుడు కొత్తవిధానానికి ఊతమిచ్చింది. బీజింగ్‌లో ఈ విధానం ఇప్పటికే అమల్లో ఉంది. కార్ల నెంబర్‌లో చివరి అంకె సరి సంఖ్య ఉన్నవన్నీ ఒకరోజు నడిస్తే బేసిసంఖ్య ఉన్న కార్లు మర్నాడు నడుపుతారు. దీనివల్ల కాలుష్యం బాగా తగ్గుడంతోపాటు, ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. అయితే వేలసంఖ్యలో కార్లలో ప్రయాణించేవారి గతేమిటి అన్నది ఇప్పటి ప్రశ్న. వారికోసం మెట్రో, బస్సు సర్వీసుల సంఖ్య పెంచాల్సి ఉంటుంది. ప్రపంచంలో ఇప్పటికే ఈ విధానం అమలవుతున్న దేశాల్లో తీసుకున్న చర్యలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి.
కొలంబియాలో తొలి అడుగు
‘కార్ ఫ్రీ జోన్’ ప్రయోగాన్ని ప్రారంభించిన తొలిదేశం కొలంబియా. ఈ దేశ రాజధాని బొగొటలో వారాంతంలో కార్లు నడపటం నిషేధం. దీనికి ప్రజలనుంచి బ్రహ్మాండమైన మద్దతు లభించింది. ఈ నగరంలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఇది అమలవుతోంది. వారాంతంలో కార్లకు బదులు సైకిళ్లు వాడతారు. వారికోసం 75 మైళ్ల నిడివిన సైకిల్‌పాత్‌లు నిర్మించారు. వారికోసం ప్రత్యేక సిగ్నలింగ్ వ్యవస్థను నెలకొల్పారు. చాలా ప్రాంతాలను సైకిళ్లపై చుట్టివచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఈ ఉద్యమాన్ని స్పానిష్ భాషలో ‘సైక్లోవియా’ అని ముద్దుగా పిలిచారు. అంటే ‘బైక్‌పాథ్’ అని అర్థం. ఇది 1974నాటి మాట.
పారిస్ ప్రయోగం
ప్రపంచంలో ఎక్కువసంఖ్యలో కార్లను వినియోగిస్తున్న నగరం పారిస్. ముఖ్యంగా డీజిల్‌తో నడిచే వాహనాల సంఖ్య అక్కడ ఎక్కువ. అందువల్ల వాయుకాలుష్యం చాలా ఎక్కువ. టూరిస్టుల రద్దీ అధికంగా ఉన్న నగరాల్లో ఇది మొదటి స్థానంలో ఉంది. అందుకే ఈ నగర వాతావరణం మెరుగ్గా ఉండాలని స్థానిక నగరపాలక సంస్థ నిర్ణయించింది. తొలిసారి పారిస్ మేయర్ అనె్న షిడల్లో వినూత్న ప్రతిపాదనలతో ‘కార్ ఫ్రీ జోన్’ పథకాన్ని అమలు చేసి భేష్ అన్పించుకున్నారు. పారిస్ నగరంలో రద్దీ ఎక్కువగా ఉండే కొన్ని ప్రాంతాల్లో దీనిని అమలు చేశారు. కారు యజమానులు వారాంతంలో నిర్దేశిత సమయాల్లో వాటిని ఉపయోగించకూడదు. అలాగే విశాలమైన సొంత పార్కింగ్ వ్యవస్థ ఉండాలి. అది లేని కారు యజమానులు పారిస్‌లో ఉండటానికి వీలులేదు. ఒకవేళ బొగ్గుపులుసువాయువును ఎక్కువగా విడుదల చేసే కార్లుంటే జరిమానాలు అధికంగా ఉంటాయి. ఇక కార్ ఫ్రీ జోన్‌లో ఉండేవారికోసం యోగా సెషన్స్ నిర్వహిస్తారు. ఆటలపోటీలు జరుగుతాయి. గెట్‌టుగెదర్ పార్టీలు నిర్వహిస్తారు. ఇలా ఈ కార్యక్రమంలో జనభాగస్వామ్యాన్ని తెలివిగా కల్పించారు షిడల్లో. నిజానికి యూరప్‌తోసహా అన్ని ఖండాల్లోనూ ఇలాంటి ప్రయోగాలు జరుగుతున్నాయి. కాకపోతే చాలాకొద్ది ప్రాంతానికి, కొద్దిసేపు మాత్రమే అది అమలు చేస్తున్నారు. ప్రపంచం మొత్తంమీద దాదాపు 5వేల నగరాల్లో ఈ ‘కార్ ఫ్రీ’ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అధికారికంగా సెప్టెంబర్ 22న కార్ ఫ్రీ డే నిర్వహిస్తున్నప్పటికీ, ఒక్కో ప్రాంతంలో, ఒక్కో తేదీన దీనిని జరుపుకుంటున్నారు.
కార్ ఫ్రీ జోన్‌లో ఏర్పాట్లు...
కొన్ని దేశాలు ఈ విషయాన్ని సీరియస్‌గానే తీసుకున్నాయి. కార్ల వాడకాన్ని నిషేధించిన ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. నిజానికి కొన్ని మైళ్ల విస్తీర్ణంలో మాత్రమే ఈ జోన్లు ఉంటున్నాయి కనుక ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో పెద్ద అసౌకర్యం ఏమీ ఉండటం లేదు. కార్లకు బదులు సైకిళ్లు (బైక్) వినియోగించడానికే అందరూ ఇష్టపడుతున్నారు. ఇక సౌరశక్తితో పనిచేసే చిన్నపాటి వాహనాలు, ఎలక్ట్రికల్ రిక్షాలు ఉపయోగిస్తున్నారు. సైక్లింగ్‌కోసం ప్రత్యేక మార్గాలు (బైక్‌పాథ్)లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ వాహనాలు తిరిగే మార్గాల్లో ప్రత్యేక సిగ్నలింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఇక బైక్‌పాథ్‌ల జంక్షన్లూ, ఇన్నర్ లింక్ పాథ్‌లు ఏర్పాటు చేసి సైక్లిస్ట్ ఎక్కడా వేరే వాహనం ఎక్కాల్సిన అవసరంకానీ, సైకిల్ దిగి రోడ్డు మారాల్సిన అవసరంకాని లేకుండా ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇక వారాంతంలోనే కాకుండా మామూలు రోజుల్లో కారున్నా వాడనివారికి ప్రత్యేక మనీకూపన్లు ఇచ్చి వారికి సొమ్ము చెల్లించే పథకాలను మరికొన్ని ఐరోపా దేశాలు అమలు చేస్తున్నాయి. కారును వారు వాడిందీ లేనిదీ తెలుసుకోవడానికి వారి వాహనంలోని డాష్‌బోర్డులో ఉండే ఒక సెన్సార్ ఈ వివరాలను నమోదు చేసి అధికారులకు పంపుతుంది. దానిని బట్టి చెల్లింపులు జరుగుతాయి. ఇక కార్ ఫ్రీజోన్ ప్రాంతాల్లో కార్లకు బదులు వాడుకునేందుకు సైకిళ్లు, బైక్‌లు, ఎలక్ట్రికల్ రిక్షాలను అద్దె ప్రాతిపదికన ప్రభుత్వమే అందజేసే వెసులుబాటును ఆయా ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. మాడ్రిడ్, మెక్సికోలో ఇలాంటి ఎలక్ట్రికల్ రిక్షాలు, సైకిళ్లు అందుబాటులో ఉంటాయి. నార్వేలోని ఓస్లోకూడా కార్ ఫ్రీ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. పలు దేశాలు.. సైకిల్స్, బైక్స్‌కోసం ప్రత్యేక పార్కింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నాయి.
దిల్లీలో ఏం చేస్తారు...
జనవరి 1నుంచి పదిహేనురోజులపాటు ‘కార్ ఫ్రీ’ నగరంగా ఆడ్-ఈవెన్ నెంబర్ విధానాన్ని అమలు చేస్తారు. రోజూ 85 లక్షల వాహనాలు నగరంలో తిరుగుతున్నాయి. వీటిలో దాదాపు మూడొంతులు కార్లే ఉన్నాయి. వీటిలో డీజిల్‌తో తిరిగే కార్లే ఎక్కువ. దీంతో కాలుష్యం ఎక్కువుతోంది. ఇక లారీలు, ఆటోలు అదనం. పగటిపూట వీటిని నగరంలోకి అనుమతించరు. ఇక సగానికి సగం కార్ల వినియోగం తగ్గుతుంది. అయితే కార్లపై ఆధారపడి తిరుగుతున్నవారు ఇకముందు ఎలా ప్రయాణిస్తారన్నది ప్రశ్న. వారికి అందుబాటులో ఇతర రవాణా సౌకర్యాలు ఏమున్నాయన్నది ఇప్పుడు వేధిస్తోంది. దిల్లీ ప్రభుత్వం మాత్రం అదనంగా 5 వేల బస్సులను తిప్పాలని భావిస్తోంది. ఇక మెట్రో సర్వీసులు, సామర్థ్యం పెంచాలని యోచిస్తోంది. ఇప్పుడు బస్సులద్వారా 50 లక్షలమంది రోజూ తిరుగుతున్నారు. మెట్రోపై 30 లక్షలమంది ఆధారపడుతున్నారు. కనీసం కోటిమందికోసం వీటి సామర్థ్యాన్ని పెంచాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టుకూడా కార్ ఫ్రీ విధానాన్ని సమర్థిస్తోంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కూడా తనవంతు పాత్ర పోషిస్తోంది. పదేళ్లు సర్వీసు పూర్తయిన డీజిల్ వాహనాల రెన్యువల్ వద్దని, ప్రభుత్వాలుకూడా డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్‌ను అనుమతించవద్దని, ప్రభుత్వం మున్ముందు ఇలాంటి వాహనాలను కొనుగోలు చేయవద్దని సూచించింది. ఇక లక్షల సంఖ్యలో స్కూలు పిల్లలను తరలించే కార్లు... ఇప్పుడు అందుబాటులో ఉండవుకనుక వారిని గమ్యస్థానాలకు చేర్చడం ఎలా అన్నదానిపై ఇప్పుడు చర్చిస్తున్నారు. కొన్నాళ్లపాటు స్కూళ్లకు సెలవు ఇచ్చి, కార్ ఫ్రీ కార్యక్రమం అమలు తరువాత ఫలితాన్ని అంచనావేసి నిర్ణయించుకోవాలని భావిస్తున్నారు.
గుర్‌గావ్‌తో మొదలు
మనదేశంలో హర్యానాలోని గుర్‌గావ్‌లో తొలిసారి ‘కార్ ఫ్రీ’ ప్రయోగం అమలు చేశారు. దిల్లీ శివారు ప్రాంతమైన గుర్‌గావ్ ఐటీ సెక్టర్‌కు కేంద్రం. ఇక్కడికి వచ్చిపోయేవారంతా కార్లపైనే ఆధారపడతారు. దీంతో అక్కడ అది పెద్దసమస్యగా మారిపోయింది. ఈ సమస్యనుంచి బయటపడటానికి ‘రాహ్‌గిరి డే’ కార్యక్రమాన్ని అమలు చేశారు. వారంలో ఒకరోజు ఈ ప్రాంతంలో కార్లు తిరగవు. రోడ్లు మూసేస్తారు. పిల్లాపాపలతో రోడ్డుపైనే కాలక్షేపం చేస్తారు. తిండీతిప్పలు, ఆటపాటలు, యోగా కార్యక్రమాలు అన్నీ రోడ్డుపైనే. దీంతో మేలైన వాతావరణ మార్పులు నమోదయ్యాయి. కాలుష్యం గణనీయంగా తగ్గింది. ఒక్కరోజులో ఎంతమార్పు వచ్చిందో గమనించారు. ప్రజలనుంచి పెద్దఎత్తున మద్దతు లభించడంతో ఆ తరువాత రాహ్‌గిరి డేకు తోడుగా కార్ ఫ్రీ కార్యక్రమాన్ని అమలు చేశామంటున్నారు రాహ్‌గిరి స్వచ్చంద సంస్థ సహవ్యవస్థాపకురాలు సారిక పండాభట్.
దేశంలోని పలు ప్రాంతాల్లో..
నిజానికి గుర్‌గావ్ ప్రయోగంతో ఊపొచ్చినా అంతకుముందే పంజాబ్‌లోని ఫజిల్లాలో ఈ కార్యక్రమాన్ని అమలు చేశారు. సిటీసెంటర్‌నుంచి క్లాక్ టవర్ మార్గంలో కార్లను నిషేధించారు. ఆ తరువాత సిమ్లాలోని హిల్‌మార్కెట్ నుంచి మాల్ రోడ్డు వరకు కార్లు వాడకాన్ని అనుమతించలేదు. ఇప్పటికీ అది అక్కడ అమలవుతోంది. ఇక కోయంబత్తూరులో ఆగస్టు 9న కార్ ఫ్రీ డేను అమలు చేస్తారు. అహ్మదాబాద్‌లలో ఏడాదికోసారి, కొన్ని ప్రాంతాల్లో ఇది అమలు చేస్తున్నారు. మహారాష్టల్రోని మథేరాన్ హిల్‌స్టేషన్‌లో కార్లకు బదులు గుర్రాలు, టాంగాలు, సైకిళ్లు వాడటం సంప్రదాయంగా వస్తోంది. బెంగళూరు, చెన్నై, కోల్‌కతావంటి నగరాల్లో ఇంకా సంప్రదాయం ఊపందుకోలేదు.
జనచైతన్యంతోనే...
యూరప్, ఆఫ్రికా దేశాల్లో ‘కార్ ఫ్రీ’ ప్రయోగానికి జనంనుంచి మంచి మద్దతు లభించింది. ఆరోగ్యంకోసం వారంతా ఒక్కటయ్యారు. ప్రభుత్వాలుకూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఘనంగా, ప్రణాళికా బద్ధంగా చేస్తోంది. నిర్ణీత కాల వ్యవధిలో పూర్తిగా కార్లను నిషేధించేందుకు స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెడుతున్నాయి. ఇక మనదేశంలో ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్న ఈ ఉద్యమం విజయవంతం అవ్వాలంటే ప్రజల్లో మార్పు రావాలి. అప్పుడే ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుంది. కారుమబ్బులు తొలగిపోయి...హాయిగా ఊపిరిపీల్చుకోగలుగుతాం.
*
*****************

కారొద్దంటున్న టాప్ టెన్ దేశాలివే
మాడ్రిడ్ (స్పెయిన్)
ఈ నగరంలోని 500 ఎకరాలను కారు లేని ప్రాంతంగా ప్రకటించారు. ఈ ప్రాంతంలో నివసించేవారికి సొంత కారు ఉన్నా కర్బన ఉద్గారాలు విడుదల చేయకుండా ఉండాలి. ఒకవేళ ఆ వాయువులు విడుదలైతే జరిమానా విధిస్తారు. ప్రత్యేక పార్కింగ్ ప్లేస్ ఉండాలి. కారువాడని వారికోసం 150 ప్రాంతాల్లో 1500 ఎలక్ట్రికల్ బైక్‌లు అద్దెకు అందుబాటులో ఉంచుతారు.
పారిస్ (ఫ్రాన్స్)
ఈ మహానగరంలోని కొన్ని ప్రాంతాల్లో డీజిల్‌తో నడిచే వాహనాలు నిషేధించారు. ఇక్కడ నివసించేవారు వారాంతంలో కార్లను ఉపయోగించకూడదు. కారులేనివారికి ప్రాధాన్యం ఇస్తారు. 2001లో ఇక్కడ కారులేనివారు 40శాతం ఉంటే ఇప్పుడు 60శాతంమంది ఉన్నారు.
చెంగ్డు (చైనా)
అత్యాధునిక రవాణా వ్యవస్థ ఇక్కడి ప్రత్యేకత. కార్లకు నిషేధం. సౌర, వాయు, విద్యుత్ సహాయంతో నడిచే ఆధునిక రవాణా సాధనాలు అందుబాటులో ఉంచారు.
హంబర్గ్ (జర్మనీ)
2034కల్లా పూర్తిగా కార్లు లేని నగరంగా తీర్చిదిద్దాలని లక్ష్యం. కాలిబాటలు, సైకిల్‌లైన్లు ఇక్కడి ప్రత్యేకత. భూతాపంవల్ల ఇక్కడ సముద్ర నీటిమట్టం గత 60 ఏళ్లలో 20 సెంటీమీటర్లు పెరిగింది. వేడీ అదేస్థాయిలో పెరిగింది. దీంతో ఇక్కడి ప్రజలకు వాతావరణం బాగుండాలన్న స్పృహ పెరిగింది.
కోపెన్‌హెగన్ (డెన్మార్క్)
ఇక్కడ జనంకంటే సైకిళ్లు ఎక్కువ. రోజూ 36వేల సైకిళ్లు నడుస్తాయి. కార్గొబైక్‌లో కుటుంబ సమేతంగా వెళ్లి పిల్లల్ని స్కూలుకు దింపడం ఇక్కడ సర్వసాధారణం. ఇక్కడ తిరిగే వాహనాల్లో సగానికి సగం సైకిళ్లు లేదా ఇలాంటి ఎలక్ట్రిక్ రిక్షాలు, కార్గొబైక్‌లే. 2020నాటికి కర్బన ఉద్గారాలు లేని నగరంగా తీర్చిదిద్దాలని లక్ష్యం. ఇక్కడ 390 కి.మీ. పొడువున సైకిల్ లైన్స్ వేశారు.
హెల్సింకి (్ఫన్లాండ్)
2050కల్లా సేఫ్‌సిటీగా మార్చాలని లక్ష్యం. ఇక్కడ బైక్, కార్గొబైక్‌లు, ఎలక్ట్రికల్ వాహనాలు అందుబాటులో ఉంటాయి. వారంలో కొన్నిరోజులు, కొన్నివేళల్లో కార్లపై నిషేధం ఉంది. ఆ సమయంలో ప్రత్యామ్నాయ సౌకర్యాల గురించి తెలుసుకునేందుకు ప్రభుత్వమే ఒక యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
మిలన్ (ఇటలి)
ఉదయం 7.30నుంచి రాత్రి 7.30వరకు కారు వాడనివారికి ప్రభుత్వం 1.5 యూరోల మొత్తానికి కూపన్ బహుమతిగా ఇస్తుంది. వారు కారును వాడిందీ లేనిదీ తెలుసుకునేందుకు ఒక ప్రత్యేకవ్యవస్థతో వారి వాహనం అనుసంధానమై ఉంటుంది.
డబ్లిన్ (ఐర్లాండ్)
ప్రపంచంలో అతి ఇరుకైన నగరంగా పేరుపొందిన ఈ నగరంలో కార్ ఫ్రీ పథకం అమలు చేస్తున్నారు. జనంనుంచి మంచి మద్దతు లభిస్తోంది.
మస్దర్ సిటి (యుఎఇ)
ఈ ఎడారి నగరం ఆధునిక సాంకేతిక ప్రగతికి అద్దంపడుతుంది. కర్బన ఉద్గారాల ఊసేలేని ఇది జీరోవేస్ట్ నగరంగానూ ఉంది. ఇక్కడ కార్లు వాడరు. ఎలక్ట్రోపవర్డ్ ఆటోమేటిక్ సింగిల్‌కేబిన్ రాపిడ్ ట్రాన్సి సిస్టమ్ అందుబాటులో ఉంటుంది. దీనిని ఫ్యూచర్ టౌన్‌గా పిలుస్తున్నారు. సోలార్, విండ్, థర్మల్ ఎనర్జీతో ఈ వాహనాలను నడుపుతారు.

***********************

సైకిల్‌వాలా జిందాబాద్..
ఆ మధ్య శ్రీమంతుడు సినిమాలో హీరో మహేష్‌బాబు సైకిల్‌పై చక్కర్లు కొడితే జనం చప్పట్లు కొట్టారు గుర్తుందా...ఈ మధ్య దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బృందంకూడా సైకిల్‌పై సవారీ చేస్తూ జనసామాన్యాన్ని ఉత్తేజపరిస్తే దేశం మొత్తం ఆయనవెన్నంటి నడిస్తే ఆశ్యర్యపోయుంటారు. కానీ ప్రపంచంలో చాలామంద్రి సుఖమైన, భద్రమైన, వ్యయంలేని రవాణాసాధనంగా సైకిల్‌నే ఎంచుకుంటున్నారు. కారు వద్దన్నప్పుడు వారు ఎంచుకునే దీటైన వాహనం సైకిలే. వ్యాయామం, ఖర్చు లేకపోవడంతో వారికి ఇది పుష్పకవిమానమైపోయింది. సైకిల్ లభించనప్పుడు మాత్రమే వారు ఎలక్ట్రికల్ కార్లను వాడుతున్నారు. అయితే సైకిళ్లపై ఒకరు లేదా ఇద్దరే ప్రయాణించే అవకాశం ఉంది. నలుగురైదుగురు ఉండే కుటుంబం ప్రయాణించాలంటే ఎలక్ట్రికల్ కార్లను ఎంచుకుంటున్నారు.
ఇక్కడ సైకిళ్లు ఎక్కువ
ప్రపంచంలో సైకిళ్లు ఎక్కువగా వాడే నగరాలు కొన్ని ఉన్నాయి. అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్ అందులో ఒకటి. ఇక్కడ తిరిగే వాహనాల్లో 6శాతం సైకిళ్లే. వీటిని తొక్కేవారికోసం ప్రత్యేకంగా సైకిల్‌పాథ్‌లు ఏర్పాటు చేశారు. లోస్పీడ్ బైక్‌లైన్స్‌కూడా నిర్మించారు. అలాగే మరో అమెరికా నగరం మినెపోలిస్‌కూడా సైకిల్ వినియోగంలో అగ్రస్థానంలో ఉంది. ఈ విషయాన్ని బైసైకిల్ మ్యాగజైన్ పేర్కొంది. డెన్నార్క్‌లోని కోపెన్‌హెగన్‌లో 30శాతం వాహనాలు సైకిళ్లే. నెదర్లాండ్స్‌లోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం అమెస్టర్‌డాంలో సైకిళ్లే ప్రధాన ఆకర్షణ. బ్రెజిల్‌లోని కుంటిబా, ఆస్ట్రేలియాలోని పెర్త్, జపాన్‌లోని క్యోటో, తైవాన్‌లోని కవోసియంగ్, జర్మనీలోని బెర్లిన్ వాసులకు సైకిళ్లంటే మహామోజు. బెర్లిన్‌లో అయితే సైక్లిస్టులకోసం ఏకంగా కార్ పార్కింగ్ ప్లేస్‌లకన్నా రెండింతలు సైకిల్ పార్కింగ్ ప్లేస్‌లు ఉన్నాయి. ఏకంగా 400 మైళ్ల పొడవున బైక్‌పాథ్‌లు ఏర్పాటు చేయడం అక్కడి విశేషం.

*************************
గుర్‌గావ్-సైబరాబాద్
‘కార్ ఫ్రీ’ నగరంగా భాసిల్లాలని తపించే నగరాలు రెండున్నాయి. ఒకటి గుర్‌గావ్. రెండు హైదరాబాద్. ఇప్పుడు వాటి సరసన దిల్లీ చేరాలనుకుంటోంది. గుర్‌గావ్ ఐటీ సెక్టార్ పోగుపడిన హర్యానా పట్టణం. దిల్లీకి సమీపంలో ఉంది. ఇక్కడ ప్రతి మంగళవారం కార్ల వినియోగం ఉండదు. రోజూ 60వేల కార్లలో 3 లక్షలమంది ప్రయాణిస్తారు. ఆ రోజు మాత్రం పట్టణంలోని ఐదు జోన్లలో కార్లవాడకం నిషేధం. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఇది అమలవుతుంది. పోలీసు, గుర్‌గావ్ మున్సిపల్ కార్పొరేషన్, హర్యానా డెవలప్‌మెంట్ అథారిటి కలసి దీన్ని అమలు చేస్తాయి. డిఎల్‌ఎఫ్ సైబర్ సిటీ, ఉద్యోగవిహార్-ఎలక్ట్రిక్ సిటి, గోల్ఫ్‌కోర్స్ రోడ్, డిఎల్‌ఎఫ్ సైబర్ హబ్, హుడా సిటీ సెంటర్-మెట్రోస్టేషన్-సుభాష్‌చౌక్ ప్రాంతాల్లో ఇది అమలు చేస్తున్నారు.
ఇక హైదరాబాద్‌లో ఐటి రంగం కేంద్రీకృతమైన హైటెక్‌సిటీ (సైబర్‌సిటి) ప్రాంతంలో ప్రతి గురువారం కార్ల వినియోగం తగ్గించాలని నిర్ణయించారు. గత ఆగస్టులో తొలిసారిగా ఇది ప్రయోగాత్మకంగా అమలు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, తెలంగాణ ఆర్టీసి, హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రెన్యుయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇది అమలు చేస్తున్నారు. రోజూ ఇక్కడ 40వేల కార్లలో కొన్ని లక్షలమంది ప్రయాణిస్తున్నారు. ముఖ్యం ఐటీ ఉద్యోగుల రాకపోకలన్నీ కార్లపైనే సాగుతాయి. గురువారం కనీసం పదివేల కార్లను తగ్గించి నడపాలని మొదట నిర్ణయించారు. ఆ రోజు ఆర్టీసి అదనంగా కొన్ని బస్సులను నడుపుతోంది. కార్ల వినియోగం తగ్గడంవల్ల లక్ష లీటర్ల ఇంధనం ఆదా అవుతుండగా రోజుకు 273 టన్నుల కార్బన్‌డయాక్సైడ్ విడుదల నివారించబడుతోంది.

-రామానుజం