సెంటర్ స్పెషల్

ఒక్క తూటా చాలు- 19

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ వివరాలు తెలుసుకోవాలంటే ఏం చెయ్యాలి?’
‘ఆ సంవత్సరం రికార్డు చూడాలి’
అతనితోపాటు ఊరు మధ్య ఉన్న డిగ్రీ కాలేజీకి వెళ్లాడు యుగంధర్. ప్రిన్సిపాల్‌ని కలిసి విషయం చెప్పాడు. రికార్డులు చూపించడానికి అంగీకరించలేదతను. తన ఐడెంటిటీ కార్డు, కలెక్టర్ ఇచ్చిన లెటర్ అతని ముందుంచాడు యుగంధర్.
‘అవి చూడాల్సిన అవసరం నాకు లేదు’ విసుగ్గా అన్నాడు ప్రిన్సిపాల్. అతను మొండి మనిషని అంత తేలిగ్గా లొంగడని అర్థమయింది యుగంధర్‌కి. కార్డు, లెటరు జేబులో పెట్టుకుని ప్రిన్సిపాల్ వైపు నవ్వుతూ చూశాడు.
‘మీరు సాయంకాలం కాలేజి నుంచి ఇంటికి బయలుదేరినప్పుడు మీతో మాట్లాడే పని ఉందని చెప్ప స్టేషన్‌కి తీసుకెళ్లి మూడు నాలుగు గంటలు కూర్చోబెట్టే అధికారం మాకు ఉందని ఒప్పుకుంటారా?’ అడిగేడు యుగంధర్.
తీవ్రంగా చూశాడు యుగంధర్.
‘పాతికేళ్ల క్రితం ఈ కాలేజీలో చదువుతున్న అమ్మాయి అదృశ్యమయింది. మరో చోట ఆమె శవం దొరికింది. ఆ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారికి మీరు సహకరించలేదు. ఈ కారణం చూపుతూ పెట్టుకున్న పిటిషన్ మీద రికార్డుల్ని చూపించమని మేజిస్ట్రేట్ ఉత్తర్వులు ఇస్తే ఏం చేస్తారు? లేదా రికార్డులు మొత్తం తీసుకుని తన ఛాంబర్‌కి రమ్మని ఈ జిల్లా కలెక్టర్ ఫోన్ చేస్తే అప్పుడు కూడా కుదరదంటారా?’
ప్రిన్సిపాల్ బెల్ కొట్టి ప్యూన్ వచ్చాక చెప్పాడు.
‘వీళ్లని ఆఫీసులోకి తీసుకెళ్లి అడిగిన రికార్డులు చూపించమని చెప్పు...’
ఆఫీసు వైపు అడుగులు వేస్తూ యుగంధర్ వైపు నవ్వుతూ చూశాడు రిటైర్డ్ ఉద్యోగి. కాలేజీ ఆవరణలో ఓ మూల చిన్న గదిలో ఉంది ఆఫీస్. బీరువాలతో నిండిన ఆ గదిలో ఇద్దరు కూర్చుని పని చేసుకుంటున్నారు. ఓ డొక్కు ఫ్యాన్ చిన్నగా చప్పుడు చేస్తూ తిరుగుతోంది.
ఆ ఇద్దరిలో ఒకరికి ప్రిన్సిపాల్ చెప్పమన్నది చెప్పి వెళ్లిపోయేడు ప్యూన్.
‘ఏ సమాచారం కావాలి సార్?’ అడిగేడతను.
‘ఎనభై తొమ్మిది తొంభై మధ్య డిగ్రీ చదివిన విద్యార్థుల వివరాలు కావాలి’ చెప్పాడు యుగంధర్.
అతను లేచి చివరగా ఉన్న ఓ బీరువా తెరిచి పాత రిజిస్టర్లు కొన్ని తెచ్చి టేబుల్ మీద ఉంచాడు. ముందుగా ఎనభై తొమ్మిది రిజిస్టర్లు ఒక్కొక్కటి చూడటం ప్రారంభించాడు యుగంధర్. బి.ఏ ఫస్టియర్‌లో ఓ రాజరాజేశ్వరి ఉంది. అడ్మిషన్ నెంబర్, సీరియల్ నెంబర్, ఇంటి పేరుతో సహా నోట్‌బుక్‌లో రాసుకున్నాడు. బి.కాం.లో కూడా మరో రాజరాజేశ్వరి ఉండటంతో ఆ వివరాలు కూడా నోట్ చేసుకున్నాడు.
తొంభైలో కూడా ఆ పేర్లు కంటిన్యూ కావడంతో ఆలోచనల్లో మునిగిపోయాడు. తొంభై ఒకటి రిజిస్టర్లు తెప్పించి చూశాడు. ఆ ఇద్దరూ అక్కడ డిగ్రీ కంప్లీట్ చేశారు. నిజానికి ఎనభై తొమ్మిదిలో రాజరాజేశ్వరి కాలేజీ మానేసింది. అంటే వీళ్లిద్దరూ కాదు. రాజరాజేశ్వరి డిగ్రీ చదివి ఉంటుందన్న తన ఊహ తప్పా?
ఫస్టియర్ రిజిస్టర్లు అందుకుని మళ్లీ చూడసాగేడు. వరుసగా ఉన్న పిల్లల పేర్ల మీద అతని దృష్టి చురుగ్గా కదులుతోంది. ఎనభై తొమ్మిది బిఎస్సీ ఫస్టియర్‌లో పి.ఆర్.రాజేశ్వరి పేరు దగ్గర ఆగాడు. ఆ పేరు పక్క కాలమ్‌లో డిస్కంటిన్యూ అని రాసుంది. తలపంకించి క్లర్కుతో చెప్పాడు.
‘ఈ అమ్మాయి వివరాలు కావాలి’
అతను విసుగ్గా బీరువా వైపు కదిలాడు. ఎనభై ఎనిమిది అడ్మిషన్స్ రిజిస్టర్ వెతకడానికి కొంత సమయం పట్టింది. ఎనభై ఎనిమిది జూన్‌లో పాత్రో రాజరాజేశ్వరి ఫస్టియర్‌లో చేరింది. గార్డియన్ చిరునామా నోట్ చేసుకున్నాడు యుగంధర్.
జూన్ నెలలో చేరిన రాజరాజేశ్వరి తర్వాత సంవత్సరం ఫిబ్రవరి పదిన కాలేజీ మానేసింది. అదే నెల ఇరవై అయిదున విశాఖపట్నంలో ఇల్లు కొన్నాడు సాహు. సో... తనకి కావాల్సిన రాజరాజేశ్వరి చిరునామా దొరికింది. ఆమె బంధువుల గురించి తెలుసుకుంటే తన పని పూర్తవుతుంది. అదృష్టవశాత్తూ తన ఆలోచన ఫలించింది. లేదంటే సాలూరులోనే మొత్తం స్కూల్స్ వెతకాల్సి వచ్చేది. ఒక్కొక్కసారి గాలిలోకి వదిలిన బాణం కూడా లక్ష్యాన్ని ఛేదిస్తుంది.
ఊపిరి పీల్చుకున్నాడు యుగంధర్.
* * *
రూము ముందు నిలబడి కాలింగ్ బెల్ కొట్టాడా యువకుడు.
‘కమిన్...’ లోపల నుంచి వినిపించింది.
డోరు తెరిచి లోపలికి అడుగేశాడతను. ఎదురుగా కుర్చీలో నలభై ఏళ్ల వ్యక్తి కూర్చుని ఉన్నాడు. లుంగీ, బనియన్‌తో సాధారణంగా ఉన్నాడు తప్ప ఇంటర్వ్యూ నిర్వహించే వ్యక్తిలా కనిపించడం లేదు.
‘నీ పేరు రానా కదూ?’ అడిగేడతను.
ఆ యువకుడు తలూపేడు.
‘కూర్చో...’ కుర్చీ చూపించాడు.
కూర్చుని చేతిలోని ఫైలు కాళ్ల మీద పెట్టుకున్నాడు ఆ యువకుడు. అతనికి చాలా ఆశ్చర్యంగా ఉంది. హోటల్ రూమ్‌లో ఇంటర్వ్యూ అనేసరికి అక్కడ ఎంతో హడావిడిగా ఉంటుందని భావించాడు. దానికి భిన్నంగా ఉంది పరిస్థితి. ఓ మోసపూరిత ప్రకటన చూసి తను వచ్చాననే ఆలోచన మనసులో కలిగింది.
‘ఏం చేస్తున్నావ్?’ ఆ వ్యక్తి అడిగేడు.
‘ఎం.టెక్ చదువుతున్నాను’
‘మీదే ఊరు?’
‘పద్మనాభం’
‘తల్లిదండ్రులు ఏ చేస్తారు?’
‘వ్యవసాయ కూలీలు’
అతను తలపంకించి అడిగేడు.
‘పార్ట్‌టైమ్ జాబ్ చెయ్యాలని ఎందుకనుకున్నావ్?’
‘మాది చాలా పేద కుటుంబం. నా చదువు కోసం ఉన్న ఎకరం అమ్మేశాడు నాన్న. ఇప్పుడు కూలి పనికి వెళుతున్నాడు. హాస్టల్ ఖర్చు భరించే శక్తి లేదు. అందుకని నలుగురితో కలిసి ఓ రూములో ఉంటున్నాను. నా అవసరాల కోసం పార్ట్‌టైమ్ జాబ్ చేస్తూ చదువుకోవాలని నిర్ణయించుకున్నాను’ చెప్పాడు ఆ యువకుడు. అతని గొంతులో విచారం ధ్వనించింది.
‘గుడ్.. కాని నేనిచ్చే ఉద్యోగం నువ్వు చెయ్యలేవని నాకనిపిస్తోంది’
‘చేస్తాను సార్!’
‘నువ్వెప్పుడయినా ఇంటర్ కోర్సులో పాల్గొన్నావా?’
ఆ యువకుడు తెల్లబోయి చూసేడు.
‘నువ్వు విన్నది కరెక్టే! జవాబు చెప్పు?’
‘లేదు సార్!’
‘అయితే నువ్వెళ్లొచ్చు...’ చెప్పి వెనక్కి వాలేడు ఆ వ్యక్తి.
మతిపోయిన వాడిలా ఉండిపోయాడు ఆ యువకుడు. కొన్ని క్షణాలకి తేరుకుని అడిగేడు.
‘ఉద్యోగానికి మీ ప్రశ్నకి సంబంధం ఏమిటి సార్?’
ఆ వ్యక్తి చిన్నగా నవ్వేడు.
‘సంబంధం ఉంది కాబట్టే అడిగాను. నేనిచ్చే ఉద్యోగంలో బరువులు మొయ్యక్కర్లేదు. గంటల తరబడి అకౌంట్స్ రాయక్కర్లేదు. నీట్‌గా తయారై గంట రెండు గంటలు లేదా ఓ రాత్రి అందమైన ఆడదాన్ని సంతోషపెట్టి రావాలి. ఇంతకంటే మంచి ఉద్యోగం ఇంకెక్కడా దొరకదు’
షాక్ తగిలినట్టు ఉండిపోయాడు ఆ యువకుడు.
‘ఇందులో రిస్క్ ఏ మాత్రం లేదు. ప్లేస్, టైమ్ ముందుగా తెలుస్తుంది. అక్కడికి వెళ్లి పని ముగించుకుని వచ్చేయాలి. వెంటనే ప్రతిఫలం నీ అక్కౌంట్‌కి జమ అవుతుంది. మళ్లీ నన్ను చూసే అవకాశం నీకుండదు. అలాగే ఈ ఉద్యోగపరంగా నినె్నవరూ కలవరు. నువ్వు చేస్తున్న పని నీకు తప్ప మరొకరికి తెలియదు. అప్పగించిన పని సరిగ్గా చెయ్యకపోయినా, ఏదైనా కంప్లైంట్ వచ్చినా నీ ఉద్యోగం ఊడిపోతుంది. ఉద్యోగం తొలగించిన విషయం కూడా నీకెవరూ చెప్పరు’
‘మీరు చెప్పిన దాన్ని బట్టి ముక్కూ, మొహం తెలియని ఆడవాళ్ల దగ్గరికి నేను వెళ్లాలి. అక్కడ నాకేదయినా ప్రమాదం జరిగితే...’
అతడు మందహాసం చేశాడు.
‘మంచి ప్రశ్న అడిగావు. ఓ అమ్మాయిని రమ్మని నువ్వు పిలిస్తే ఏర్పాట్లు నువ్వే చెయ్యాలి. ఆమెని తిరిగి క్షేమంగా పంపేవరకూ బాధ్యత తీసుకోవాలి. కాని ఇక్కడ పరిస్థితి అది కాదు. ఒక అమ్మాయి నిన్ను సెలెక్ట్ చేసుకుని నీతో గడపాలని నిశ్చయించుకున్నాక సాధారణంగా ఖరీదైన హోటల్లో రూమ్ బుక్ చేస్తుంది. ఎవరూ లేనప్పుడు ఇంటికి పిలిపించుకునే వాళ్లు కూడా ఉంటారు. ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఇలా సుఖపడాలని కోరుకునేది హైక్లాస్ లేడీస్ మాత్రమే. అందుచేత నీకెలాంటి ప్రమాదం కలగదు’
‘నా చదువుకి ఆటంకం కలుగుతుందేమో?’ సందేహం వ్యక్తం చేశాడు ఆ యువకుడు.
‘ఏమీ కలగదు. వారానికి ఒకసారి మాత్రమే నీకు పని ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఆఫర్స్ అంగీకరించరు.’
‘నేను మీకు ఏదైనా చెప్పాల్సిన అవసరం కలిగితే ఎవర్ని కాంటాక్ట్ చెయ్యాలి?’
అతను ఓ క్షణం ఆలోచించి చెప్పాడు.
‘నీతో అవసరం పడినప్పుడు ప్లేస్, టైమ్ చెప్పడానికి కాల్ వస్తుంది. అప్పుడు చెబితే ఆ తర్వాత నేను కాంటాక్ట్ చేస్తాను. అన్నట్టు చెప్పడం మరిచాను, రేపు నువ్వు డాక్టర్ని కలవాలి...’
‘దేనికి?’ ఆశ్చర్యపోయాడు యువకుడు.
‘ఆరోగ్యంగా ఉన్నావని తెలుసుకోవడానికి’
ఆ యువకుని నుండి ఫైలు తీసుకుని సర్ట్ఫికెట్స్, రేషన్ కార్డు జిరాక్స్ పరిశీలించాడు. ఆ యువకుని ఫొటోల నుండి నాలుగు ఎన్నిక చేశాడు. సెల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకున్నాడు. ఫైలుతోపాటు చిన్న కవరు ఒకటి అందించి చెప్పాడు.
‘గుడ్‌లక్... ఆ కవరు నీ ఖర్చుల కోసం. రేపు కాల్ చేసి ఏ డాక్టర్ని కలవాలో చెబుతాను’
ఆ యువకుడు లాడ్జి నుంచి బయటకొచ్చి రోడ్డు మీద నడవసాగేడు. అది జగదాంబ సెంటర్ కావడంతో ట్రాఫిక్ అధికంగా ఉంది. జనంలో కలిసిపోయి ఎడమవైపునకు తిరిగి సిటీ బస్టాప్‌లో నిలుచున్నాడు. ఓ నిముషం కూడా గడవకముందే ఒక సుమో వచ్చి అతని ముందు ఆగింది. ఆ యువకుడు మాట్లాడకుండా ఎక్కి కూర్చున్నాడు. రైట్ టర్న్ తీసుకుని పది నిమిషాల్లో కంట్రోలు రూము చేరుకుంది సుమో. డ్రైవర్‌తోపాటు సెకెండ్ ఫ్లోర్‌లోని ఓ రూమ్‌లోకి ప్రవేశించాడు యువకుడు.
‘కూర్చో...’ టక్ చేసుకున్న వ్యక్తి చెప్పాడు.
‘ఏం జరిగింది?’ యువకుడు కూర్చున్నాక అడిగేడతను.
లాడ్జి రూమ్‌లోకి ప్రవేశించిన దగ్గర నుంచి బయటకొచ్చేవరకూ జరిగింది మొత్తం వివరించేడు యువకుడు. అతని దగ్గరున్న కవరు తెరిచి చూశాడు టక్ చేసుకున్న వ్యక్తి. అందులో రెండు అయిదు వందల నోట్లున్నాయి. నొసలు ముడివేసి అడిగేడు.
‘రూమ్‌లో ఇంకెవరయినా ఉన్నారా?’
‘లేరు సార్!’
‘్ఫన్ నెంబర్ కాని చిరునామా కాని ఇచ్చాడా?’
‘రేపు డాక్టర్ని కలిసి చెక్ చేయించుకోమన్నాడు. ఉదయం ఫోన్ చేసి ఏ డాక్టర్ని కలవాలో చెబుతానన్నాడు’ చెప్పాడు యువకుడు.
సిటీలో అత్యంత రహస్యంగా హైటెక్ వ్యభిచారం జరుగుతున్నదనే సమాచారం ఉంది పోలీసు డిపార్ట్‌మెంట్ దగ్గర. పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరిట పేపర్ ప్రకటన ఇచ్చి యువతీ యువకుల్ని ఇంటర్వ్యూ చేస్తారు. అనుకూలంగా స్పందించిన వారిని తీసుకుంటారు. ఆ తర్వాత అంతా ఫోన్ల మీద జరిగిపోతుంది.
పేపర్ ప్రకటన వెలువడిన వెంటనే ఆ యువకుడ్ని రెడీ చేసింది డిపార్ట్‌మెంట్. అతను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు కాబట్టి ఓ ఆధారం చిక్కింది. దీని ద్వారా సమాచారం సేకరించాలంటే కొంత సమయం పడుతుంది. అంతవరకూ వేచి ఉండాలి.
తలపంకించాడు టక్ చేసుకున్న అధికారి.
ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి అనుచరుడు ఆ యువకుడ్ని వెంబడించాడని, అతను సుమో ఎక్కడం గమనించి ఆటోలో అనుసరించాడని, తను పప్పులో కాలేసానని ఆ అధికారికి తెలియదు.
* * *
‘వివేక్ ఉన్నాడాండీ?’ అడిగేడు రాజేష్, ఇంటి బయట కూర్చున్న ముసలతన్ని.
‘లేడండి.. మీరెవరు?’ కళ్లు చిట్లించేడతను.
‘ఏదైనా ఉద్యోగం ఉంటే చూడమన్నాడు. ఫోన్ చేస్తానని చెయ్యలేదు. నేను చేస్తుంటే ఎత్తడం లేదు’
‘రెండు రోజుల నుంచి ఇంటికి రాలేదు బాబూ! అందరం కంగారుపడుతున్నాం’
రాసమణి నుంచి తీసుకున్న సెల్ నెంబర్ ద్వారా ఆ చిరునామా తీసుకున్నాడు రాజేష్. డబ్బు ఖర్చు పెడితే అలాంటి పనులు తేలిగ్గా అవుతాయి.

(మిగతా వచ్చే వారం)

-మంజరి 9441571994