ఈ వారం స్పెషల్

క్యాన్సర్.. చైతన్యంతో చికిత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-బి.వి.ప్రసాద్
------------------
భయం మనిషిని మానసికంగా చంపేస్తుంది...
ప్రాణాంతకమైన రోగానికి ఆ భయం తోడైతే మనిషికి రోజులు దగ్గరపడ్డట్టే. క్యాన్సర్ విషయంలో దాదాపు ఇదే జరుగుతోంది. ఈ రోగంకన్నా, దానిపై అవగాహన లేక ఏర్పడే భయం రోగిని కుంగదీస్తోంది. ఫలితంగా ప్రాణాలమీదకు వస్తోంది. చక్కటి ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ, మెరుగైన జీవనశైలిని అలవర్చుకుని, మేలైన వైద్యచికిత్స తీసుకుంటే క్యాన్సర్‌ను ఎదుర్కోవడం సులభమే. కనీసం జీవితకాలాన్ని చాలామేరకు పొడిగించుకోవచ్చు. ఇది నిరూపించబడిన సత్యం...
ఓ యువరాజ్‌సింగ్...
ఓ ఏంజిలీన జూలీ..
ఓ మనీష కొయిరాలా..
ఓ గౌతమి... ఇలా ఎందరో క్యాన్సర్ బారిన పడినా...ఆత్మస్థైర్యంతో, మేలైన చికిత్సతో, అంతులేని ఆత్మవిశ్వాసంతో చక్కటి జీవితాన్ని గడుపుతున్నారు. ఇప్పటికిప్పుడు క్యాన్సర్‌ను పూర్తిగా నివారించే మార్గాలు లేకపోయినా ఆ రోగం దశనుబట్టి నివారించడం లేదా రోగి జీవితకాలాన్ని పెంచడం సాధ్యమవుతోంది. ఇక్కడ చికిత్సకన్నా క్యాన్సర్‌పై అందరికీ అవగాహన అవసరం.
ప్రస్తుతం.. అమ్మో క్యాన్సర్ అని భయపడే రోజులు పోయాయి. క్యాన్సర్ ఒకప్పుడు బాగా తాగినవారికి , ధూమపానం చేసే వారికి, దురలవాట్లు ఉండేవారికి వచ్చేది, కాని నేడు చిన్న పిల్లలకు, కొన్ని సందర్భాల్లో అప్పుడే పుట్టిన బిడ్డలకు సైతం క్యాన్సర్ సోకిన సంఘటనలు చూస్తున్నాం. అంటే క్యాన్సర్‌కు కారణం ఏదో ఒక్కటి మాత్రమే కాదు, జీవనశైలి, ఆహార అలవాట్లు, వాతావరణం ఇలా ఎన్నో కారణాలున్నాయ.
క్యాన్సర్ ఏ దశలో ఉన్నా ఆధునిక పద్ధతులతో చికిత్స చేసి అదుపుచేసే అవకాశాలు ఇప్పుడున్నాయి.
జాగ్రత్తలు తీసుకోవడం, జబ్బు వచ్చిందని గుర్తించిన వెంటనే తగిన చికిత్సను వెంటనే పొందడం, మానసికంగా దృఢంగా ఉండటం ద్వారా జీవన కాలాన్ని పెంచుకోవడమేగాక, కొత్త జీవితాన్ని పొందే వీలుంది.
క్యాన్సర్ రోగులే కాకుండా వారి కుటుంబ సభ్యులకు సైతం సమస్యపై అవగాహన చాలా అవసరం. దానివల్ల తోటి క్యాన్సర్ రోగులకు వారు తగిన సహాయాన్ని చేయూతను ఇవ్వగలుగుతారు. రోగిని భయపెట్టేకంటే వారికి తగిన చికిత్స అందించడం, ఎప్పటికపుడు రోగికి సహకరించడం, ధైర్యాన్ని ఇవ్వడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసాన్ని కల్పించిన వారవుతారు. ప్రపంచవ్యాప్తంగా ఇపుడిపుడే క్యాన్సర్‌పై అవగాహన పెరుగుతోంది. శరీరంలో ఎపుడు ఏ ప్రదేశంలో క్యాన్సర్ వస్తుందో తెలియదు. దానిని గుర్తించి నివారించుకోవడమే ముఖ్యం.
క్యాన్సర్ అంటే...
మనిషి శరీరంలోని కణజాలం, ఏ అవయవంలోనైనాసరే ఒక నిర్దిష్ట క్రమంలో కాకుండా హానికరమైన, అపరిమితంగా పెరగడమే క్యాన్సర్. ఇది శరీరంలో ఏ భాగానికైనా రావచ్చు. శరీరంలో ఏ భాగంలో క్యాన్సర్ సోకుతుందో దానికి ఆ అవయవ క్యాన్సర్‌గా చెబుతుంటాం. ఊపిరితిత్తులకు క్యాన్సర్ వస్తే దానిని లంగ్ క్యాన్సర్ అంటారు. ఏ భాగానికి ముందుగా క్యాన్సర్ వచ్చిందో దానిని ప్రైమరీ క్యాన్సర్ అంటారు. ఇక క్యాన్సర్ అన్నది ఆ భాగానికే పరిమితం కాకుండా అలా ఎటుపడితే అటు విస్తరిస్తుందన్నది అందరికీ తెలిసిందే. ఇలా క్యాన్సర్ పెరగడానే్న ‘మెటా స్టాసిస్’ అంటారు. క్యాన్సర్ అన్నది తొలుత ఎముకల్లో మొదలైతే దానిని ప్రైమరీ బోన్ క్యాన్సర్ అంటారు. ఒకవేళ అది మెటాస్టిటైజ్ వల్ల సోకితే దానిని సెకండరీ బోన్ క్యాన్సర్ అంటారు. సాధారణంగా నేరుగా ఎముకలకు క్యాన్సర్ రావడం అరుదే అయినా రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటివి వచ్చి ఆ కణతులు పెరుగుతూ ఎముకలకు సోకి నిర్దిష్టమైన ఆకృతిలో సాఫీగా ఉండే ఎముకలపై కూడా కణతులు ఏర్పడతాయి. శరీరంలో మృదు కణజాలమైన చర్మం, కండరాలు, నరాలు వంటి వాటికి వచ్చే క్యాన్సర్లు మరో రకం.
క్యాన్సర్ అనేది దగ్గరి సంబంధం ఉన్న అనేక వ్యాధుల సముదాయం. ఇది శరీర నిర్మాణానికి కనీస అవసరమైన కణాల్లో మొదలవుతుంది. శరీరం అనేక రకాల కణాల సముదాయం. ఈ కణాలు పెరిగి విభజన చెందుతాయి. ఈ విభజన కణాల వృద్ధి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి చాలా అవసరం. కొన్ని సార్లు ఈ క్రమబద్ధీకరణ అదుపు తప్పుతుంది. శరీరానికి అవసరం లేకపోయినా, కొత్త కణాలు ఏర్పడతాయి. పాతకణాలు క్షీణించాల్సిన సమయంలో క్షీణించవు, ఈ విధంగా ఏర్పడిన కణాల సముదాయం కంతి మాదిరి ఏర్పడతాయి. దీనిని క్యాన్సర్ గడ్డ అని వ్యవహరిస్తారు. వాస్తవానికి ఈ కంతులు అన్నీ అపాయమైనవి కావు. కొన్ని నిరపాయకరమైనవి ఉంటాయి. నిరపాయకరమైన కంతులను శస్త్ర చికిత్స ద్వారా తొలగించవచ్చు.
అపాయకరమైన కంతులు శరీరంలో నియంత్రణ లేకుండా విభజన జరిగి పెరిగిపోతూ మనిషి ప్రాణానికే ముప్పుగా తయారవుతాయి. ఇవి తమ చుట్టూ ఉన్న కణాల్లోకి చొచ్చుకుపోయి వాటిని విచ్ఛిన్నం చేస్తాయి. ఈ క్యాన్సర్ కణాలు కంతుల నుండి విడిపోయి దూరంగా రక్తప్రసరణ వ్యవస్థలోకి, లేదా శోషరస వ్యవస్థలోకి చేరుతాయి. రక్తనాళాల చివర నిర్మాణంలో రక్త నాళికలు సిరలు, ధమనులు అన్నీ కలిపి ఉంటాయి. వీటి ద్వారానే రక్తం శరీరంలోని అన్ని భాగాలకూ వెళ్తుంది.
అపాయకరమైన కంతులు ఏర్పడటానికి అనేక కారణాలున్నాయి. కణాలలోని జన్యువులలో కలిగే మార్పుల వల్ల సాధారణంగా విభజన జరగడం, లేదా క్షీణించడం వంటి అంశాలపై నియంత్రణ కోల్పోతాయి. ఈ క్రమంలోనే సాధారణంగా ఉండాల్సిన జన్యువులు క్యాన్సర్ పెరగడానికి అనుమతించేవిగా మారుతాయి. ఈ విధమైన జన్యుమార్పులకు కారణాలు అనేకం ఉన్నాయి. అందులో ప్రధానమైనది ధూమపానం, ఆహారపు అలవాట్లే. అదే విధంగా సూర్యరశ్మిలోని అయినీకరణ వికిరణాలు కూడా కారణమవుతాయి. కొన్ని రకాల క్యాన్సర్లు అనువంశికంగా రావచ్చు.
చాలా వ్యాధులు మాదిరి క్యాన్సర్ అంటువ్యాధి మాత్రం కాదు, అపాయకరమైనది అని చెప్పవచ్చు. క్యాన్సర్ ఒకరి నుండి మరొకరికి వ్యాపించదు, గాయాలు, దెబ్బల నుండి క్యాన్సర్ పుట్టదు. అయితే ఇటీవలికాలంలో క్యాన్సర్ అనువంశికమని కొత్త సిద్ధాంతాలు వస్తున్నాయి. అయితే ఈ విషయాలు ఇంకా రూఢీ అవ్వాల్సి ఉంది.
ఇలా గుర్తించొచ్చు...
క్యాన్సర్‌ను గుర్తించే ఎన్నో ఆధునిక పద్ధతులు నేడు అందుబాటులో ఉన్నా, కచ్చితంగా నివారించే ఒకే ఒక పద్ధతి అంటూ లేదు. అయితే వ్యాధి వల్ల వచ్చే అపాయాన్ని కొంత మేరకు నిరూపించుకోవచ్చు. జ్వరం, వణుకు, రాత్రుళ్లు చెమటపోయడం, ఇతర ఇన్‌ఫ్లూయింజాలు, బలహీనత, అలసట, ఆకలి లేమి, రక్తం కారడం, చిన్న కంతులు శరీరంలో రావడం, పుట్టు మచ్చల్లో మార్పులు రావడం, చికిత్సకు మానని పుండ్లు, గొంతులో గరగర, విడవకుండా కొనసాగే అజీర్తి, బరువులో అర్ధం లేని మార్పులు, అసాధారణ రక్తస్రావం గుర్తించినపుడు దానిని క్యాన్సర్‌గానూ, క్యాన్సర్ సంబంధిత రోగంగా గుర్తించాలి
క్యాన్సర్ నివారణకు శస్త్ర చికిత్స పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. కొన్నింటిని అయినీకరణ చికిత్స ద్వారా, మరికొన్నింటిని మందులతోనూ, ఇంకొన్నింటిని మందులు, హార్మోన్ల ద్వారా నివారించవచ్చు. అలాగే క్యాన్సర్ నిరోధానికి ప్రకృతి చికిత్స ఉంది, ఇందుకోసం వైద్యులు ముందు క్యాన్సర్ సోకిన శరీరభాగాన్ని గుర్తించాల్సి ఉంటుంది. అది ఇతర శరీర భాగాలకు సోకిందా లేదా అన్నది కూడా పరిశీలిస్తారు. రోగి వయస్సు, శారీరక, మానసిక స్థితి తదితర అంశాలను గుర్తించి చికిత్సను ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ చికిత్సలో భాగంగా ఆరోగ్యకరమైన కణాలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కొంత మందికి చికిత్స కన్నా మందుల వల్ల కలిగే దుష్ప్రభావాలు కూడా ఎక్కువగా ఉండొచ్చు. అందువల్ల రోగి, వైద్యుడు పరస్పరం ఎప్పటికపుడు మాట్లాడుకుంటూ చికిత్స మొదలుపెట్టాలి. శరీరం మందులను స్వీకరిస్తున్న పద్ధతి, శరీర మార్పులు, ఆరోగ్య స్థితిని ఎప్పటికపుడు సమగ్రంగా విశే్లషించుకోవాలి.
శస్త్ర చికిత్స అనంతరం రోగి శారీరకంగా అనేక మార్పులను గమనించవచ్చు, వాటన్నింటినీ వైద్యుడే ముందుగానే వారికి కౌన్సిలింగ్ చేయాలి, దానివల్ల అనవసరపు ఆందోళన లేకుండా ముందుగానే రోగి అన్ని విషయాలపై మానసికంగా సన్నద్ధంగా ఉంటాడు. చికిత్స అనంతరం రోగికి నొప్పి పెరగవచ్చు, మరికొంత మందికి క్యాన్సర్ శరీరం అంతా పాకవచ్చు, లేదా శరీరంలో క్యాన్సర్ చాలాకాలం పాటు ఉండొచ్చు. జుత్తు రాలిపోవచ్చు.
శరీరంలో ఏ శరీర భాగానికి క్యాన్సర్ సోకిందో దానికి విభిన్నమైన శస్తచ్రికిత్సా పద్ధతి అమలులో ఉంది.
లుకేమియానే మనం రక్తక్యాన్సర్ అంటున్నాం. రక్తోత్పత్తి అయ్యే అవయవాలు ముఖ్యంగా మజ్జ, శోషగ్రంధులు, ప్లీహానికి ఇది సోకుతుంది. బ్లడ్‌క్యాన్సర్‌లో అపరిపక్వమైన తెల్ల రక్తకణాలు అధిక సంఖ్యలో ఉత్పత్తి అవుతాయి. సాధారణ, ఆరోగ్యమైన తెల్లరక్తకణాలను స్థానభ్రంశం చేసి ఎముకల్లోని మజ్జకు హాని కలిగిస్తాయి. దీనివల్ల రక్తం గడ్డకట్టడం లేదా రక్త పట్టకలు తగ్గిపోవడం జరుగుతుంది. లేదా గాయాలు తగిలినప్పుడు రక్తస్రావం, శరీరం కమిలినట్టుగా కనిపించడం, చర్మం మీద ఎర్రని దద్దుర్లు వంటి లక్షణాల వల్ల మనం ఈ సమస్యలను గుర్తించవచ్చు.
నిజానికి మన రక్తంలోని తెల్లరక్తకణాలు వ్యాధికారకమైన సూక్ష్మజీవులతో నిరంతరం పోరాడుతునే ఉంటాయి. క్యాన్సర్ వ్యాధి సోకితే తెల్ల రక్తకణాలు అణచివేయబడతాయి. లేదా వాటి పనిని సక్రమంగా నిర్వర్తించలేకుండాపోతాయి. పర్యవసానంగా రోగి నిరోధక వ్యవస్థపైనా, ఇతర శరీర భాగాలపైనా వ్యాధికారకమైన సూక్ష్మజీవుల దాడి ప్రారంభం అవుతుంది.
గాళ గ్రంథులు వాపును మనం లుకేమియా అని చెప్పవచ్చు. తెల్ల రక్తకణాలు చాలా మందిలో కనిపించేంతగా వాస్తవానికి ఉండకపోవచ్చు. దీనిని ఎలుకీమియా అంటారు. రక్తక్యాన్సర్ రెండు రకాలుగా వైద్యులు చూస్తారు. ఒకటి ఆకస్మికంగా వచ్చేది. రెండోది దీర్ఘకాలం పాటు ఉండేది. అపరిపక్వమైన రక్తకణాలు వేగంగా వృద్ధి చెందుతూ పోతాయి. ఈ కణాలు గుంపులు గుంపులుగా ఎముక మజ్జలో ఏర్పడి ఎర్రరక్తకణాల ఉత్పత్తి చేసే వీలు లేకుండా చేస్తాయి. ఈ రకమైన రక్తక్యాన్సర్ పిల్లల్లో, యవ్వనంలో ఉండే వారిలో వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. దీనికి తక్షణ చికిత్స చాలా అవసరం. ఎందుకంటే ఈ రకం రక్త క్యాన్సర్‌లో కణాలు వేగంగా పెరిగిపోయి గుంపులు గుంపులుగా చేరి, రక్త ప్రసరణలోకి వచ్చి ఇతర అవయవాలకు వ్యాపిస్తాయి. దీంతో కేంద్ర నాడీ వ్యవస్థ ప్రభావితం అవుతుంది. కేంద్రనాడులకు దానివల్ల పక్షవాతం వచ్చే అవకాశాలు ఉంటాయి.
రక్త క్యాన్సర్‌లో వేరే క్యాన్సర్ల మాదిరి జన్యు పదార్ధ శరీర నిర్మాణంలో అనేక మార్పులు వస్తాయి. ఈ మార్పులు మామూలు కణాలను, క్యాన్సర్ కణాలుగా అణచివేసే జన్యువులను నిస్తేజపరుస్తాయి. ఇంకా నియమబద్ధంగా జరగాల్సిన కణ విభజన, ఏర్పాటు, కణ క్షీణత వంటి ప్రక్రియలు అన్నీ తారుమారైపోతాయి. ఈ జన్యువు ఉత్పరివర్తనాలు అకస్మాత్తుగా జరగవచ్చు.

రక్త క్యాన్సర్ మాదిరి రొమ్ము క్యాన్సర్, స్తనంలోని కంతులు, రొమ్ములోని గడ్డలు కూడా క్యాన్సర్ రూపాలే. స్ర్తీలలో వచ్చే క్యాన్సర్‌లలో సాధారణమైనవి రొమ్ము క్యాన్సర్. క్యాన్సర్ వల్ల స్ర్తిలలో కలిగే మరణాలలో రెండోస్థానం రొమ్ము క్యాన్సర్‌దే. ఈ రకమైన వ్యాధికి కుటుంబ చరిత్ర చాలా ముఖ్యమైనది. ముందుగా జన్యుమార్పులు రావడం, బహిష్టు ఆగిపోవడం, పిల్లలు కలుగకపోవడం తదితర ప్రమాదాలు ఉంటాయి. అయితే రొమ్ము క్యాన్సర్‌కు సంబంధించి అనేక అపోహలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ప్రతి మహిళా రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కలిగి ఉండాలి. రొమ్ములో కనిపించే గడ్డలన్నీ క్యాన్సర్ గడ్డలు కాదు. కొంత మంది పురుషులకూ ఈ క్యాన్సర్ రావడానికి అవకాశాలు లేకపోలేదు.
స్ర్తిలలో వచ్చే మరో క్యాన్సర్ సెర్వికల్ క్యాన్సర్. ఇది హెచ్‌పివీ వైరస్ వల్ల వస్తుంది. పురుషుల్లో ఈ వైరస్ ఉన్నా వారికి ఇబ్బంది ఏమీ లేకున్నా స్ర్తిలకు మాత్రం ముప్పుగా పరిణమిస్తుంది. గర్భాశయ ముఖ ద్వారానికి వచ్చే ఈ క్యాన్సర్ వేగంగా విస్తరించడానికి కారణం అవగాహన లేకపోవడమే. ఈ వైరస్ సోకినప్పుడు కొన్ని ప్రాథమిక లక్షణాలు కనిపిస్తాయి. నొప్పిగా ఉండటం, రక్తస్రావం, పీరియడ్స్ ఎక్కువ రోజులు ఉండటం, సంభోగం తర్వాత రక్తస్రావం, మధ్యలో అదనంగా పీరియడ్స్ రావడం, మూత్రపిండాల వాపు, లివర్‌కు ఇబ్బందులు కలగడం అయినా వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల పరిస్థితి చేయి దాటిపోతుంది. ఈ వైరస్ వల్ల యోనికి, గర్భాశయానికి మధ్య ఉన్న ప్రాంతంలో క్యాన్సర్ సోకుతుంది. జననాంగాల ప్రాంతంలో శుభ్రత పాటించని వారికి, ఎక్కువ మందితో లైంగిక సంబంధాలు పెట్టుకున్న వారికి ఈ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలో వాడే కొన్ని రకాల మాత్రల వల్ల కూడా ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. సెర్వికల్ క్యాన్సర్‌లో ఎక్కువగా స్కమస్ సెల్ కార్సినోనో ఎక్కువగా వస్తుంది.
సెర్వికల్ క్యాన్సర్ సోకినపుడు మొదటి రెండు దశల్లో ఆపరేషన్ ద్వారా నయం చేయించవచ్చు. రాడికల్ హిస్టరెక్టమీ అనే ఆపరేషన్ ద్వారా గర్భాశయం, యోని పైభాగం, అండాశయాలు, పెల్వికోనోడ్స్‌ను తొలగిస్తారు. మూడు నాలుగో దశలో గుర్తించినపుడు రేడియేషన్, కీమోథెరపీ ఇవ్వాల్సి ఉంటుంది.
సెర్వికల్ క్యాన్సర్‌కు నాలుగు దశలు ఉంటాయి. వాటిని మనం గుర్తించగలిగి తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే క్యాన్సర్ నుండి బయటపడవచ్చు.
చాలా సందర్భాల్లో కణితి ముదిరేవరకూ ఎటువంటి లక్షణాలు కనిపించవు, తొలి దశలో ఉన్న క్యాన్సర్ కణితని వెతికిపట్టుకోవడానికి వచ్చిన కొత్త పరికరమే హై డెఫినిషన్ పెట్ స్కేన్ మార్కెట్‌లోకి వచ్చింది. పెట్ స్కాన్ చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో ఏది అవసరమో అదే చికిత్స చేయవచ్చు.
క్యాన్సర్స్‌లో మరో రకం ఎముక క్యాన్సర్. బయటకు కనిపించే శరీరాకృతి అలా నిలబెట్టి ఉంచడానికి తోడ్పడేది ఎముకులే, దానికే క్యాన్సర్ సోకితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. శరీరంలో ఏ భాగానికి క్యాన్సర్ సోకినా చికిత్స వ్యయంతోను, శారీరక, మానసిక శ్రమతోనూ కూడుకున్నదిగా ఉంటుంది. సన్నిహితుల ధైర్యం నూరిపోసి, వెన్నంటి ఉంటే చికిత్స సులువవుతుంది. క్యాన్సర్ ఉందనగానే బెంబేలుపడిపోవడం సహజమే అయినా అది పరిష్కారం కాదు. వ్యాధి లక్షణాలు, తీవ్రత, చికిత్సపై సరైన అవగాహన చేసుకుని ధైర్యంగా ముందుకు వెళితే జీవనకాలం పెంచుకోవచ్చు. క్యాన్సర్ రాకుండా ఉండాలంటే మేలైన జీవనశైలి ముఖ్యం. ఆ విషయానే్న చాటడానికే ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. కేవలం ఉత్సవాలకే పరిమితం కాకుండా ప్రతి ఒక్కరూ క్యాన్సర్‌పై అవగాహన పెంచుకుంటే మన ఆరోగ్యంతోపాటు ఇతరులనూ రక్షించినవాళ్లం అవుతాం. *
------------------------------
పొగాకు...పగాకు
మానవాళి ప్రాణాలను క్యాన్సర్ రూపంలో కబళిస్తున్న అనేక అంశాలకన్నా పొగాకువల్లే ముప్పు ఎక్కువగా ఉంది. క్యాన్సర్ మరణాల్లో 20శాతం పొగాకే కారణం అవుతూండగా ఊపిరితిత్తుల క్యాన్సర్ మరణాల్లో 70శాతం దానివల్లే జరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఒక సిగరెట్‌లో 4800 రకాల రసాయనాలుంటాయి. అందులో 69 క్యాన్సర్‌కు కారణమవుతాయి. ఇక ధూమపానం చేసేవారికి క్యాన్సర్ ముప్పు ఎంతుంటుందో అర్ధమవుతుందికదా...అన్నట్లు ఆసియాలో చైనా, ఇండియా, పాకిస్తాన్ పొగాకు వాడకం ఎక్కువ కావడంవల్ల ఇక్కడ లంగ్ క్యాన్సర్ ఎక్కువ. నేపాల్, బూటాన్‌లలో క్యాన్సర్ ముప్పు దాదాపు లేదనే చెప్పాలి.
స్నిఫర్‌డాగ్..క్యాన్సర్‌ను గుర్తిస్తుంది
మనిషికి ప్రొస్టేట్ క్యాన్సర్ ఉంటే ఆ విషయాన్ని శిక్షణ పొందిన జాగిలం గుర్తించగలుగుతుందట. అదీ 98శాతం కచ్చితత్వంతో. ఇది నిరూపించిన సత్యం. అన్నట్లు మొక్కలకూ క్యాన్సర్ సోకుతుందట తెలుసా.

‘హు’ ఏం చెబుతోందంటే...
క్యాన్సర్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ పోరాటం చేస్తోంది. క్యాన్సర్‌కు ప్రధానంగా ఐదు కారణాలున్నాయని చెబుతోంది. శరీరంలో హైబాడీ మాస్ ఇండెక్స్ పెరగడం, ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు తగినంతగా తినకపోవడం, శరీరానికి వ్యాయామం లేకపోవడం, ఇంటిపట్టునే ఎక్కువసేపు ఉండిపోవడం (సూర్యరశ్మి తగలకపోవడం), పొగాకు, మద్యం సేవించడం, అధికబరువుతో ఉండటంవల్ల క్యాన్సర్ ముప్పు ఎక్కువ.

డెన్మార్క్...డేంజర్
ప్రపంచంలో క్యాన్సర్ ప్రమాదాన్ని ఎక్కువగా ఎదుర్కొంటున్న దేశం డెన్మార్క్. అక్కడ ప్రతి లక్షమందిలో 330మంది క్యాన్సర్ బాధితులే. క్యాన్సర్ ముప్పు అధికంగా ఉన్న దేశాల జాబితాలో ఆ దేశం అగ్రస్థానంలో ఉంది. అక్కడి వారి జీవనశైలి క్యాన్సర్‌కు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఇక ఐర్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యుఎస్, బెల్జియం, నార్వే, కెనడా, చెక్ రిపబ్లిక్ ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. క్యాన్సర్ ముప్పు అతి తక్కువగా ఉన్న దేశాల జాబితాలో నైజీరియా అగ్రస్థానంలో ఉంది. అక్కడ ప్రతి లక్షమందిలో 79మందికి మాత్రమే క్యాన్సర్ పీడిస్తోంది. గాంబియా, కేప్ వెర్డి, బూటాన్ ఎమన్, నేపాల్ తదితర దేశాలు అతి తక్కువ నిష్పత్తి క్యాన్సర్ రోగులతో ఉన్నాయి. ఇక ఆసియాలో ఇండియా, చైనా అగ్రస్థానంలో ఉన్నాయి.
*