క్రీడాభూమి

దుమ్ము రేపిన భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ, ఫిబ్రవరి 12: శ్రీలంక యువ జట్టుతో మూడు మ్యాచ్‌ల అంతర్జాతీయ ట్వంటీ-20 సిరీస్‌లో భాగంగా ఇంతకుముందు పుణే జరిగిన తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న భారత జట్టు రెండో మ్యాచ్‌లో జూలు విదిల్చి ఘీంకరించింది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సొంత గడ్డ రాంచీలో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు 69 పరుగుల తేడాతో శ్రీలంకను మట్టికరిపించి ప్రతీకారం తీర్చుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టులో నాన్‌స్ట్రైకింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ దూకుడుగా ఆడి అర్థ శతకంతో సత్తా చాటుకోగా, టాప్ ఆర్డర్‌లో మిగిలిన బ్యాట్స్‌మన్లంతా చక్కగా రాణించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు సాధించిన భారత జట్టు, అనంతరం శ్రీలంక జట్టును 20 ఓవర్లలో 127/9 స్కోరుకే కట్టడిచేసి సిరీస్‌ను సమం చేసింది. అయితే భారత ఇన్నింగ్స్ చివర్లో శ్రీలంక బౌలర్ థిసార పెరీరా ‘హ్యాట్రిక్’ వికెట్లతో సత్తా చాటుకున్నాడు.
అంతకుముందు టాస్ గెలిచిన శ్రీలంక జట్టు కెప్టెన్ దినేష్ చండీమల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు ఆరంభం నుంచే ధాటిగా ఆడింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ క్రీజ్‌లో నిలదొక్కుకుని శ్రీలంక బౌలర్ల భరతం పట్టారు. ముఖ్యంగా శిఖర్ ధావన్ ఎంతో దూకుడుగా ఆడి స్కోరు బోర్డును పరుగులు తీయించడంతో పాటు 75 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. ఎడాపెడా షాట్లతో విరుచుకుపడి కేవలం 25 బంతుల్లో రెండు సిక్సర్లు, మరో ఏడు ఫోర్ల సహాయంతో 51 పరుగులు సాధించిన ధావన్ 7వ ఓవర్‌లో దుష్మంత చమీర వేసిన చివరి బంతిని ఎదుర్కోబోయి వికెట్ల వెనుక దినేష్ చండీమల్‌కు దొరికిపోయాడు. ఆ తర్వాత రెండో వికెట్‌కు మరో 47 పరుగులు జోడించిన రోహిత్ శర్మ (36 బంతుల్లో ఒక సిక్సర్, రెండు ఫోర్లు సహా 43 పరుగులు) కూడా చమీర బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇవ్వగా, కొద్దిసేపటికే రహానే (25) సచిత్ర సేనానాయకే బౌలింగ్‌లో దిల్షాన్ చేతికి చిక్కాడు. దీంతో భారత జట్టు 127 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. అనంతరం కొద్దిసేపు దూకుడుగా ఆడిన సురేష్ రైనా (30), హార్దిక్ పాండ్యా (27)లతో పాటు యువరాజ్ సింగ్ (1)ను థిసార పెరీరా వరుస బంతుల్లో పెవిలియన్‌కు చేర్చి హ్యాట్రిక్ సాధించగా, రవీంద్ర జడేజా (1) అజేయంగా నిలిచాడు. దీంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు సాధించింది. శ్రీలంక బౌలర్లలో పెరీరా 3 వికెట్లు, దుష్మంత చమీర 2 వికెట్లు, సచిత్ర సేనానాయకే ఒక వికెట్ రాబట్టారు.
అనంతరం భారీ లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక జట్టును భారత బౌలర్లు సమర్ధవంతంగా నిలువరించారు. ముఖ్యంగా రవిచంద్రన్ అశ్విన్ (3/14), జస్‌ప్రీత్ బుమ్రా (2/17), రవీంద్ర జడేజా (2/24), ఆశిష్ నెహ్రా (2/26) నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడ్డారు. వీరి జోరును ప్రతిఘటించడంలో శ్రీలంక బ్యాట్స్‌మన్లు ఘోరంగా విఫలమయ్యారు. ఫలితంగా ఓపెనర్లు ధనుష్క గుణతిలక (2), తిలకరత్నె దిల్షాన్ (0) సహా ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ సీక్కుగె ప్రసన్న (1) త్వరత్వరగా పెవిలియన్‌కు పరుగెత్తగా, మిగిలిన వారిలో కెప్టెన్ దినేష్ చండీమల్ (31), చమర కపుగెదర (32), మిలిండా సిరివర్ధన (28-నాటౌట్), దుసాన్ షనక (27) మినహా ఎవరూ రెండంకెల స్కోర్లు సాధించలేకపోయారు. దీంతో 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టానికి 127 పరుగులు మాత్రమే రాబట్టిన శ్రీలంక జట్టు 69 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.

సంక్షిప్తంగా స్కోర్లు
భారత్ ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 196/6 (శిఖర్ ధావన్ 51, రోహిత్ శర్మ 43, సురేష్ రైనా 30, హార్దిక్ పాండ్యా 27, అజింక్యా రహానే 25). వికెట్ల పతనం:1-75, 2-122, 3-127, 4-186, 5-186, 6-186. బౌలింగ్: థిసార పెరీరా 3/33, దుష్మంత చమర 2/38, సచిత్ర సేనానాయకే 1/40.
శ్రీలంక ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 127/9 (చమర కపుగెదర 32, దినేష్ చండీమల్ 31, మిలిండా సిరివర్ధన 28, దుసాన్ షనక 27). వికెట్ల పతనం: 1-2, 2-3, 3-16, 4-68, 5-68, 6-116, 7-117, 8-119, 9-119. బౌలింగ్: రవిచంద్రన్ అశ్విన్ 3/14, హార్దిక్ పాండ్యా 2/17, రవీంద్ర జడేజా 2/24, ఆశిష్ నెహ్రా 2/26.