సంపాదకీయం

కలహాల ‘మండలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవ చరిత్రలో ఓ మహా ఉపద్రవం కోవిడ్-19 అనే ప్రాణాంతక మహమ్మారి యావత్ ప్రపంచం అభివృద్ధి పరుగులు పెడుతున్న తరుణంలో ఓ పెను విలయంగా ఈ వైరస్ విశ్వాన్ని చుట్టుముట్టింది. 200కు పైగా దేశాలకు అవహించడంతో పాటు 10 లక్షల మందికి పైగా మరణించడానికి దారి తీసింది. ఇది విలయమా? విపత్తా? మానవ తప్పిదమా? ఉద్దేశపూర్వక ప్రయత్నమా? అన్న మీమాంసను పక్కన పెడితే యావత్ మానవాళి మనుగడను ముప్పుముంగిళ్ళకు నెట్టేసిన మృత్యు విలయతాండవం ఇది. ఇలాంటి మహా విపత్తులను ఎన్నింటినో మానవాళి ఎదుర్కొన్న సవాళ్ళన్నింటికీ ఎన్నో రేట్ల తీవ్రతతో అనూహ్య వేగంతో ఈ వైరస్ కబళిస్తోంది. మనుషులంతా ఒక్కటే ఈ మహమ్మారిని తుదముట్టించకపోతే, విబేధాలు, సిద్ధాంతాలకు అతీతంగా దీని కోరలు దించకపోతే అందరి మనుగడ ప్రమాదమయమేనన్నది కళ్ళకు కడుతున్న వాస్తవం. ఈ విపత్తును ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ సంస్థలు ఏ మేరకు సమాయత్తమయ్యాయన్నది సందేహంగానే కనిపిస్తోంది. ముఖ్యంగా అభివృద్ధిలో మేటిగా ఉన్న అగ్రరాజ్యమే ఈ వైరస్ మృత్యుఘాతానికి తల్లడిల్లిపోతోంది. ఈ వైరస్‌కు చైనాయే కారణమంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన విమర్శలు ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితికి దారితీశాయి. ఇప్పటికే వాణిజ్య యుద్ధంతో పరస్పరం సెగలు కక్కుకున్న ఈ రెండు దేశాల మధ్య ఈ వైరస్ సృష్టించిన అగాధం అనంతమైన వైరుథ్యాన్ని సృష్టించింది. భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలుగా ఉన్న వీటి మధ్యే మంటలు రేగుతున్న తరుణంలో ఈ అంతర్జాతీయ సంస్థ చేయగలిగేది ఏమిటన్నది అనుమానాలను రేకెత్తిస్తున్నది. అమెరికా, చైనాల మధ్య పరిస్థితులు చక్కబడితే తప్ప ప్రకృతి మహావిలయాన్ని తట్టుకునేందుకు భద్రతా మండలి ఏ మాత్రం ముందుకు వెళ్ళే అవకావం లేదు. ముఖ్యంగా ప్రపంచ దేశాల సమస్యలను తీర్చాల్సిన ఐక్యరాజ్య సమితి చేయగలిగేది కూడా ఏమీ ఉండదన్నది కాదనలేని నిజమే. అంతర్జాతీయంగా తనపై వస్తున్న విమర్శల నేపథ్యంలో చైనా కూడా మంకుపట్టుతోనే వ్యవహారిస్తోంది. ఈ సంక్షోభంపై సమగ్ర రీతిలో చర్చించి తక్షణ ప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సిన తరుణం ఇది. అయితే మండలిలో దీనిపై జరగాల్సిన చర్చను చైనా అడ్డుకోవడం అన్నది తీవ్ర అలజడికి కారణమవుతోంది.
గత నెలలో ఐరాస భద్రతా మండలికి సారథ్యం వహించిన చైనా కోవిడ్‌పై చర్చను అడ్డుకోవడంలో ఉద్దేశ్యం ఏమిటన్నది ప్రపంచ వ్యాప్తంగా కొత్త అలజడికి కారణమైంది. ఇప్పటికే లక్ష మందికి పైగా కోవిడ్‌కు బలి కావడం మరి కొన్ని లక్షల మంది ఈ వైరస్ బారిన పడడం వంటివి ప్రపంచ భవిష్యత్తునే ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. ప్రస్తుత అవసరాలను దృష్టిలో పెట్టుకుని మండలి తగిన రీతిలో చర్యలు చేపడుతున్నదన్న ఆశావాహ పరిస్థితి ఇటీవలి పరిణామాలతో అడుగంటిపోయింది. ముఖ్యంగా వైరస్ ఆవిర్భవించిన నాటి నుంచి ప్రస్తుతం సాగిస్తున్న మృత్యుహేల వరకూ అన్నింటి వషయంలోనూ అమెరికా, చైనాల మధ్య విబేధాలు పెరుగుతూనే వచ్చాయి. ఈ నేపథ్యంలో భద్రతా మండలి సమావేశం నిరర్థకమేనన్న అభిప్రాయం కూడా వ్యక్తమైంది. సంక్షోభంపై చర్చించి నివారణ మార్గాన్ని తెరపైకి తేవాల్సిన భద్రతా మండలి సమావేశం ఎలాంటి ఫలితం లేకుండా ముగిసిందంటే ఈ రెండు దేశాల విబేధాల ప్రభావం దానిపై ఎంతగా ఉందో స్పష్టపరిచేదే. మార్చి నెలలో భద్రతా మండలికి రొటేషన్ ప్రాతిపదికన చైనా సారథ్యం వహించినంత కాలం కోవిడ్-19పై చర్చకు ఏ మాత్రం అవకాశం ఏర్పడలేదు. ఏప్రిల్‌లో మండలి సారథ్యం మారిన తర్వాతే కరోనా వైరస్ సృష్టిస్తున్న సంక్షోభంపై చర్చకు ఆస్కారం ఏర్పడింది. అయితే ఏ దేశానికి ఆ దేశం వైరస్ కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్న తరుణంలో పరస్పర అనుమాన పరిస్థితులు ఏర్పడుతున్నాయే తప్ప ఉమ్మడిగా ఈ విపత్తును ఎదుర్కొనే అవకాశాలు కనిపించడం లేదు. ఈ పాటికే వైరస్ విలయతాండవంపై మండలి సారథ్యంలో ప్రపంచ దేశాలు ఓ ఉమ్మడి వ్యూహంతో ముందుకు రావాల్సి ఉంది. కానీ ఇంతగా ప్రాణ నష్టం జరిగినా, అమెరికా సహ అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు పేక మేడల్లా కూలిపోతున్నా అంతర్జాతీయంగా ఓ ఉమ్మడి కార్యాచరణ దిశగా ఒక్క అడుగు కూడా పడకపోవడం విచారకరం. ఈ మహమ్మారిని అరికట్టాలంటే లోపరహితమైన రీతిలో శాస్తబ్రద్ధంగా వైరస్ మూలాలు, లక్షణాలకు సంబంధించి పారదర్శక రీతిలో వివరాల సేకరణ జరగాలని అమెరికా పట్టుబడుతోంది. ముఖ్యంగా ఈ వైరస్ వ్యాప్తి తీరును కూడా అగ్ర రాజ్యం సందేహిస్తోంది. అయితే ఈ వాదనను వ్యతిరేకిస్తున్న చైనా తనను బలిపశువును చేయాలన్న వ్యూహంతోనే మిగతా దేశాలు ప్రయత్నిస్తున్నాయన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తోంది. వైరస్ ఎక్కడ పుట్టింది?, ఎలా వ్యాపించిందన్న అంశంపైనే దృష్టి పెట్టాలన్న వాదనను చైనా తిరస్కరిస్తోంది. ఇది కూడా ఆ దేశంపై అనుమానాలు పెరగడానికి ఆస్కారం ఇచ్చే పరిణామమే.
వైరస్ ఎక్కడ పుట్టినా, ఎలా వ్యాపించినా కూడా ప్రస్తుతం అంతర్జాతీయ సహకారంతోనే దీనిని అంతం చేయాలని చైనా చేస్తున్న వాదన అమెరికాకు రుచించడం లేదు. ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు మిగతా దేశాలన్నింటికీ సహకరించేందుకు తాము సిద్ధం అని చైనా నాయకత్వం ప్రకటిస్తున్నా, అందుకు ఏ దేశమూ ముందుకు రావడం లేదు. అమెరికా-చైనాల మధ్య ఇదే రకమైన ప్రతికూల వాతావరణం కొనసాగితే ప్రాణ నష్టం, ఆర్థిక నష్టంతో పాటు అది అంతిమంగా శాంతి భద్రతల పరమైన సమస్యలకు కూడా దారి తీస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఐక్యరాజ్య సమితి క్రియాశీలక జోక్యానికి కూడా ఇది ఎంత మాత్రం దోహదం చేయదు. ‘వీటో’ అదికారం కలిగిన ఐదు శాశ్వత సభ్య దేశాలు సమిష్టిగా వ్యవహరించి నిర్ణయం తీసుకుంటే తప్ప భద్రతా మండలి సజావుగా పని చేసే అవకాశం ఉండదు. అంటే ఈ ఐదు సభ్య దేశాల మధ్య ఎలాంటి తొట్రుపాటు లేకుండా వ్యవహారం సాగితేనే అంతర్జాతీయంగా ఉమ్మడి చర్యలు తీసుకోవడానికి మండలికి వీలుంటుంది. లేనిపక్షంలో మండలి ఎన్నిసార్లు సమావేశమైనా అది తూ.తూ మంత్రమే అవుతుంది తప్ప ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. ఒక్క కోవిడ్ విషయంలోనే కాదు గతంలో ఎన్నో అంతర్జాతీయ సంక్షోభాలు తలెత్తినా మండలిలోని ఐదు శాశ్వత సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం అన్నది ఎండమావి చందంగానే సాగింది.
ముఖ్యంగా గత దశాబ్దకాలంలో చైనా, అమెరికాల మధ్య పెరిగిన వైరుధ్యాలు, విబేధాలు ఈ అంతరాన్ని మరింతగా పెంచాయి. ముఖ్యంగా రష్యా కూడా తమ సొంత అవసరాలను దృష్టిలో పెట్టుకుని చైనా మాటకే మొగ్గు చూపే పరిస్థితికి చేరుకుంది. ఓ పక్క అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తుండడంతో డొనాల్డ్ ట్రంప్ వాటిపైనే దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటు చైనా కూడా తనపై వేసిన నిందను మాపుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు దేశాల మధ్య సఖ్యత పెరిగే కంటే విబేధాలు శృతి మించేందుకే ఎక్కువ ఆస్కారం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ సహ ఇతర అంతర్జాతీయ సంస్థలు కరోనా వైరస్‌పై ఉమ్మడి పోరుకు ఏ మేరుక సమాయత్త అవుతాయన్నది సమాధానం లేని ప్రశ్నలు. ఇది విబేధాల సమయం కాదు. జనహితాన్ని దృష్టిలో పెట్టుకుని మానవాళి మనుగడ కోసం అన్ని దేశాలు నడుం బిగించాల్సిన తరుణం. విబేధాలతో కాలక్షేపం చేస్తే కరోనా విలయం అదుపు తప్పడం ఖాయమన్నది ఇప్పటికే ప్రపంచం నేర్చుకున్న పాఠం.