ఉత్తరాయణం

అవార్డుల ప్రహసనం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట మున్సిపాలిటీని ‘బహిరంగ మల,మూత్ర విసర్జన రహిత పట్టణం’గా గుర్తించి- ఈనెల 1వ తేదీన మునిసిపల్ చైర్‌పర్సన్ దిల్లీలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అవార్డును అందుకొన్నారు. కాగా, సూర్యాపేటలో లక్షకు పైగా జనాభా ఉన్నా ఒక్కటైనా పబ్లిక్ మూత్రశాల లేదు. స్థానికులే గాక పరిసర గ్రామాల నుండి వచ్చే ప్రజలు రోడ్ల పక్కన మురుగునీటి కాలువలలో, ఇండ్ల మధ్యనున్న ఖాళీ స్థలాల్లో బహిరంగ మూత్ర విసర్జన చేస్తుంటారు. మెయిన్‌రోడ్‌లో మునిసిపల్ ఆఫీస్ ఎదురుగా పోలీస్‌స్టేషన్ ముందున్న కాలువలో కూడా మూత్ర విసర్జన చేసి శరీర బాధ తీర్చుకొంటారు. వాస్తవ పరిస్థితి యిది. ఇదే మాదిరిగా కొన్ని సంవత్సరాల క్రితం సూర్యాపేట ఉత్తమ మునిసిపాలిటీగా ప్రకటించబడి జాతీయ అవార్డును అప్పటి చైర్‌పర్సన్ అందుకున్నారు. వాస్తవంగా ఇది ఉత్తమ మునిసిపాలిటీ కాదు. మున్సిపాలిటీగా ఏర్పడి ఏళ్లు గడిచినా ఇంకా అథమ స్థాయిలోనే ఉంది. పట్టణంలోని రోడ్లు గుంతల మయమై, చెత్తకుప్పలతో నిండి ఉంటాయి. విచ్చలవిడిగా తిరిగే పశువుల మల మూత్రాలతో వీధులు కంపరం పుట్టిస్తుంటాయి. మురుగు కాలువలు అనేక రకాల వ్యర్థ పదార్థాలతో నిండిపోయి క్రిములు, దోమలకు నిలయంగా మారిపోయి ప్రజల ఆరోగ్యానికి భంగకరంగా ఉంటాయి. వర్షం వచ్చిన సమయాల్లో రోడ్లు కాలువలుగా మారుతాయి. ముఖ్యంగా పట్టణంలో కూరగాయల మార్కెట్ లేదు. పట్టణం అంతటికీ ఒకేచోట రోడ్డుమీద మురుగుకాలువల పక్కన, చెత్తకుప్పల మధ్య కూర్చొని నానా అవస్థలు పడుతూ వ్యాపారులు కూరగాయలు అమ్ముతుంటారు. రోడ్డుమీదే చేపలను తరిగి, నిప్పుల్లో కాల్చి అమ్ముతుంటారు. వర్షం వస్తే చాలు రోడ్లపై నీరు నిలిచిపోవడంతో జనం నరకాన్ని చవిచూస్తుంటారు. ఇటువంటి పట్టణాన్ని ఉత్తమమైనదిగా ప్రకటించి అవార్డు ఇవ్వవలసినదిగా ఎవరు సిఫారసు చేస్తారో? ఆ పురస్కారంతో ప్రజలకు జరిగే మేలు ఏమిటో సామాన్యుడికి మాత్రం అర్థం కావడం లేదు.
- బి.సత్యప్రకాశ్, సూర్యాపేట

ఇంటర్నెట్ మాయాజాలం
ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చేసిన అంతర్జాలం పలు ప్రయోజనాలతో పాటు అనేక దుష్ట్భావాలను మోసుకువస్తోంది. విద్యార్థులు లాప్‌టాప్‌లు, టాబ్‌లు, స్మార్ట్ఫోన్లలో వినోదానికి పరిమితం అవుతుండటంతో శారీరక శ్రమకు దూరమైపోతున్నారు. దేశంలో 70 శాతం యువత డిజిటల్ ప్రపంచంలో అతుక్కుపోతున్నారని, ప్రతిరోజు 4 నుంచి 6 గంటల సేపు ఇంటర్నెట్‌తోనే గడుపుతున్నారన్న గణాంకాలు పరిస్థితి తీవ్రతను తెలియచేస్తున్నాయి. యువతలో ధైర్యసాహసాలు నశించి సవాళ్లు సమస్యలను ఎదుర్కొనే శక్తి సన్నగిల్లుతోందన్నది మానసిక నిపుణుల విశే్లషణ. విద్యార్థులు ఇంట్లో, పాఠశాలల్లో ఆరోగ్యకరమైన జీవన విధానం ఆచరించేలా మేధావి వర్గం, ప్రభుత్వం కృషిచేయాలి.
- వులాపు బాలకేశవులు, గిద్దలూరు
ఉద్యమకారులకు రక్షణ ఏదీ?
సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో వజ్రాయుధం. పాలనలో పారదర్శకత పెంచి, అవినీతిని నిర్మూలించి, జవాబుదారీతనం పెంచేందుకు ఇది దోహదం చేస్తుంది. ఈ చట్టం అమలులోకి వచ్చి 11 ఏళ్లు గడుస్తున్నా గ్రామీణ ప్రజలకు దీనిపై పూర్తి అవగాహన లేదు. ఇక పట్టణ ప్రాంతాలు, నగరాల్లో స.హ చట్టం కింద ఎంతోమంది కార్యకర్తలు అవినీతిని నిర్మూలించేందుకు కృషి చేస్తున్నారు. ఫలితంగా వీరు కొన్ని వర్గాల నుంచి బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. రాజకీయ పార్టీల నేతలు, మాఫియా లీడర్లు, అవినీతి అధికారులు సహ చట్టం ఉద్యమకారులను టార్గెట్ చేసి దాడులకు దిగుతున్నారు. సహ చట్టం ఉద్యమకారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన రక్షణ కల్పించాలి.
- కామిడి సతీష్‌రెడ్డి, జడలపేట
కూల్చడం ఎందుకు?
హైదరాబాద్‌లోని ప్రస్తుత సచివాలయాన్ని కూల్చివేసి కొత్త భవనాలను నిర్మించాలన్న సిఎం కెసిఆర్ ఆలోచన సరికాదు. ఈ భవనాలు ఇంకా ఎంతోకాలం పనికొస్తాయి. కాంట్రాక్టర్ల లబ్ధి కోసం కొత్త భవనాలను నిర్మించరాదు. తెలంగాణలో ఆవిర్భవించిన 21 కొత్త జిల్లాల్లో అనేక భవనాలను నిర్మించాల్సి ఉంది. ఈ విషయాన్ని వదిలేసి సచివాలయానికి కొత్త భవనాలు నిర్మించాలనుకోవడం విడ్డూరంగా ఉంది. కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాల్లో తగినన్ని భవనాలను నిర్మించాక సచివాలయం భవనాల గురించి ఆలోచించడం ఉత్తమం. ప్రభుత్వ నిధులను వృథా చేయడం కన్నా అవసరం ఉన్న చోట భవనాలను నిర్మించాలి.
-వేముల ప్రభాకర్, సికింద్రాబాద్