ఉత్తరాయణం

అపరిశుభ్రతతో అవస్థలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణలో దాదాపు అన్ని ఆర్టీసీ బస్ స్టేషన్లలో మరుగుదొడ్లు అపరిశుభ్రతతో ప్రయాణీకుల్ని హడలెత్తిస్తున్నాయి. మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్వహణపై అధికారులకు ఎలాంటి శ్రద్ధ లేనందున బస్ స్టేషన్లలో నిలబడాలంటేనే భయం వేస్తుంది. గతిలేక ఈ మరుగుదొడ్లను వాడుతున్న వారు అనారోగ్యానికి గురవుతున్నారు. బస్సుల కోసం నిరీక్షించే వారు దుర్వాసనతో నరకయాతన అనుభవిస్తున్నారు. ఇకనైనా అధికారులు, రవాణాశాఖా మంత్రి స్పందించి బస్ స్టేషన్లలో మరుగుదొడ్లు, మూత్రశాలలు శుభ్రంగా వుండేలా చర్యలు తీసుకోవాలి.
-కామిడి సతీష్‌రెడ్డి, జడలపేట
ఇందుకేనా అవార్డు!
విజయవాడలోని రహదారులు నరకాన్ని తలపిస్తున్నాయి. గతుకులు, గుంటలతో రోడ్లు పాడైనందున వర్షం పడితే ప్రమాదాలు జరుగుతూ పాదచారులు, వాహన చోదకులు గాయాలపాలవుతున్నారు. పుష్కరాల సందర్భంగా కొన్ని ప్రధాన రోడ్లు బాగుపడినా, నగరంలో చాలారోడ్లు ఇంకా అధ్వాన పరిస్థితిలోనే ఉన్నాయి. సూర్యారావుపేట బ్రాంచి పోస్ట్ఫాసు ఎదుట వర్షం పడితే బురద పేరుకుపోయి నడిచేందుకు వీలుండదు. పోస్ట్ఫాసుకు వచ్చిపోయేవారు ఇబ్బంది పడుతున్నారు. ప్రజల పాట్లు అటు కార్పొరేషన్‌కి, ఇటు పోస్టల్ శాఖకు పట్టవు. స్వచ్ఛ్భారత్ కార్యక్రమానికి సంబంధించి విజయవాడ కార్పొరేషన్‌కి అవార్డు వచ్చిందట. అది ఎట్లా ఇచ్చారో, ఎందుకిచ్చారో ఎవరికెరుక..?
- బి.ఆర్.సి.మూర్తి, విజయవాడ-2
దెబ్బతిన్న రోడ్లు
ఇటీవలి వర్షాలకు అనేక ప్రాంతాల్లో ప్రధాన రహదారులు దారుణంగా దెబ్బతిన్నాయి. పలుచోట్ల వంతెనలు, కల్వర్టులు శిథిలావస్థకు చేరాయి. చాలా ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. గతుకుల రోడ్లపై ప్రయాణం నరక ప్రాయమవుతున్నది. ప్రయాణ సమయం పెరగడమేగాక వాహనాలూ దెబ్బతింటున్నాయి. ప్రభుత్వం సత్వరమే యుద్ధప్రాతిపదికన రోడ్ల పునర్నిర్మాణ పనులను చేపట్టాలి. రోడ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా, దీర్ఘకాలం రోడ్లు పాడైపోకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం
ప్రకటనలతో మోసం
‘29 రూపాయలకే నెలంతా సరిపోయే ఇంటర్నెట్.. ఫలానా నంబరుకు డయల్ చేయండి’- అంటూ ఫోన్‌లో వస్తున్న మెసేజ్‌లు, పత్రికల్లో వస్తున్న ప్రకటనల్లో ఒక తిరకాసుంది. ఆ నంబరుకు డయల్ చేసి ఇంటర్నెట్ కావాలని కోరితే- మన ఖాతాలోంచి 29 రూపాయలు తగ్గిపోతుంది తప్ప ఇంటర్నెట్ సదుపాయం రాకపోవచ్చు. ఇది 4జి ఫోన్లకు మాత్రమే పరిమితం. ఆ విషయం వినియోగదారులకు స్పష్టంగా చెప్పకపోవడం మోసం చేయడమే. సొమ్ము చెల్లించి కూడా ఇంటర్నెట్ పొందనివారు వేల సంఖ్యలో వున్నారు. ఇలాంటి మెసేజీలు, ప్రకటనలు చూసి ఎవరూ మోసపోవద్దు.
- లక్ష్మీప్రసన్న, పేర్రాజుపేట
శాసనసభ ఆమోదం వద్దా?
ఒక కొత్త రాష్ట్రం ఏర్పాడాలంటే పార్లమెంటు ఉభయసభల ఆమోదం తప్పనిసరి. కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేస్తే శాసనసభ ఆమోదం అక్కర్లేదా? తెలంగాణ ప్రభుత్వం నెలల తరబడి కసరత్తు చేసి కొత్తగా 21 జిల్లాలను ఏర్పాటు చేసింది. శాసనసభ ఆమోదం పొందిన తరువాత జిల్లాల ఆవిర్భావం జరిగి ఉంటే బాగుండేది. శాసనసభలో అన్ని రాజకీయ పక్షాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని జిల్లాల ఏర్పాటు జరిగిఉంటే ఎలాంటి విమర్శలు ఉండేవికావు.
- కెహెచ్ శివాజీరావు, చైతన్యపురి
పోలీసుల ఆత్మహత్యలు..
పోలీసులను చూస్తే సామాన్య ప్రజలు సాధారణంగా భయపడుతుంటారు. అటువంటిది పై తమ శాఖలోని అధికారుల వేధింపులతో గత మూడేళ్లుగా తెలంగాణలోనే నలుగురు కింది స్థాయి పోలీసు ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పోలీసు ఉద్యోగాల్లో పని వత్తిడి అధికం. ఇది కూడా ఒక సామాజిక సమస్యే. కేరళలో కూడా కొందరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అందరూ అధికారుల వేధింపులే కారణమని సూసైడ్ నోట్‌లో రాశారు. ఉన్నతాధికారులు, ప్రభుత్వం ఇటువంటి దురదృష్ట సంఘటనలు పునరావృతం కాకుండా సత్వర చర్యలు చేపట్టాలి.
-ఎన్.రామలక్ష్మి, సికింద్రాబాద్
తెలుగుకు శుభఘడియలు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రాచీన తెలుగు భాషా కేంద్రానికి అవసరమైన భవనాన్ని సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం శుభపరిణామం. ఈ మేరకు ఎపి సి.ఎం. చంద్రబాబు కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాశ్‌జావదేకర్‌కు లేఖరాయడం సంతోషదాయకం. ఈ నేపథ్యంలో మైసూరులోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ (సి.ఐ.ఐ.ఎల్) ఆధీనంలోని తెలుగు ప్రాచీన భాషా కేంద్రాన్ని సి.ఎం. సూచించిన మేరకు నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఏర్పాటుచేయవచ్చు. నిజానికి 2012లో ఈ అవకాశం వచ్చినప్పటికీ అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఇక చెన్నయ్ హైకోర్టు కూడా తెలుగు భాషకు ప్రాచీన హోదాపై అనుకూలంగా తీర్పునిచ్చింది. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నాగార్జున వర్సిటీలో తెలుగు భాషా కేంద్రాన్ని ఏర్పాటుచేయాలి.
- వాండ్రంగి కొండలరావు, పొందూరు