ఉత్తరాయణం

ఎందుకీ రభస?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్షలాది మంది షిరిడీ సాయి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదు. మహమ్మదీయుడైన భక్తకబీరు రాముణ్ణి కొలవలేదా? స్వరూపానంద వంటి మత ప్రచారకుల తప్పుడు వ్యాఖ్యానాల వల్లే నేడు చాలామంది హిందూమతం నుంచి ఇతర మతాల్లోకి వలస పోతున్నారు. స్వామీజీలు, పీఠాధిపతులు లేనిపోని వివాదాలను రాజేసేబదులు మతమార్పిడులు జరగకుండా కృషి చేస్తే హిందూ మతానికి ఎంతో మేలు చేసినట్టవుతుంది.
-బి.రామచంద్రమూర్తి, విజయవాడ
వృద్ధులకు రక్షణ
నేడు చాలామంది వయోవృద్ధులు యాచకులుగా మారి రోడ్లపై దీనంగా కనిపిస్తున్నారు. కుటుంబ సభ్యులు నిర్లక్ష్యం చేయడం వల్లే కొందరు వృద్ధులు తమ జీవిత చరమాంకంలో యాచకులుగా మారుతున్నారు. వృద్ధులపై వివక్ష చూపిస్తే సంబంధ కుటుంబ సభ్యులను శిక్షించేలా చైనాలో చట్టాలున్నాయి. ఇలాంటి చట్టాలను మన దేశంలోనూ అమలు చేయాల్సి ఉంది. అనాథ వృద్ధులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చోట్లా ఓల్డేజ్ హోమ్‌లను ఏర్పాటు చేయాలి. వృద్ధుల ఆరోగ్య, ఆర్థిక సమస్యలను తేర్చేందుకు పాలకులు శ్రద్ధ వహించాలి.
-కోవూరు వెంకటేశ్వర ప్రసాదరావు, కందుకూరు
ప్రయాణికుల ఇబ్బందులు
హైదరాబాద్, వరంగల్ నగరాల్లో బస్సుల కోసం నిరీక్షించే ప్రయాణికులకు కూర్చొనే వీలు లేక, నిలువ నీడలేక నానా అవస్థలు పడుతున్నారు. ఎండైనా, వానైనా రోడ్డుపక్కన నిలబడి నిరీక్షించాల్సిందే. బస్టాప్‌ల వద్ద షెల్టర్లు, ప్రయాణికులు కూర్చోడానికి కుర్చీలు ఏర్పాటుచేయాలి. నిర్ణీత స్థలంలోనే బస్సులు ఆగేలా చర్యలు తీసుకొని, ప్రయాణికుల ఇబ్బందులను తొలగించాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం
తగ్గని అంతరాలు
నేడు అన్ని స్థాయిల్లోని ప్రజాప్రతినిధులూ విలాసవంతంగా జీవిస్తున్నారు. ఎన్నికల వేళ వీరు వాగ్దానాలు చేస్తున్నారు. అభివృద్ధి ఫలాలు కొన్నివర్గాలకే అందుతున్నాయి. ప్రభుత్వాలు ప్రకటిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు అగ్రకులాల్లోని పేదలకు అందడం లేదు. దీంతో సమాజంలో అంతరాలు మరింతగా పెరుగుతున్నాయి.
- గర్నెపూడి వెంకట రత్నాకరరావు, హన్మకొండ

దిల్లీ ఉక్కిరి బిక్కిరి..
మితిమీరిన కాలుష్యంతో దేశ రాజధాని దిల్లీలో జనజీవనం స్తంభించడం సిగ్గుచేటు. దట్టంగా ఏర్పడిన పొగమేఘాల కారణంగా స్కూళ్లకు, పరిశ్రమలకు సెలవులు ప్రకటించాల్సిన దుస్థితి తలెత్తడం నిజంగా స్వయంకృతం. దిల్లీలో వాయుకాలుష్యం ఒక్కరోజులో ఊడిపడిన ఉపద్రవం కాదు. ప్రభుత్వ ఉదాసీనత వల్ల దశల వారీగా విషమించిన వైపరీత్యం ఇది. వాయు, ధ్వని, జల కాలుష్యాలు హద్దులు మీరాయని నిపుణుల నివేదికలు ఘోషిస్తున్నా పాలకులు పకడ్బందీ చర్యలు తీసుకోలేదు. సరి, బేసి సంఖ్యలంటూ వాహనాలను నియంత్రించే అరకొర చర్యలే తప్ప దిల్లీలో కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలను అదుపు చేయలేదు. పచ్చదనాన్ని పెంచే చర్యలు తీసుకోలేదు. ఈ దుస్థితికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలే కారణం. పిల్లలు వ్యాధులకు గురవుతారని స్కూళ్లకు సెలవులైతే ఇచ్చారు గానీ ఇళ్లలో ఉండే వారికి ఎలాంటి రక్షణ కల్పిస్తారో పాలకులే చెప్పాలి. కాలుష్య నివారణకు కఠిన చర్యలు తీసుకోని పక్షంలో ఇకముందు ఇంటింటికీ ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ చేయాల్సి ఉంటుంది. మంచినీటి సీసాలను కొనుక్కుంటున్నట్లే గాలిసీసాలను కొనాల్సిందే. ఇరవై నాలుగు గంటలూ మాస్కులు ధరించి తిరగాల్సిందే. వాయుకాలుష్యంతో సగానికి సగం జనాభాను ఊపిరితిత్తుల వ్యాధుల వల్ల కోల్పోయే ప్రమాదం ఉంది. నాగరిక సమాజం తలదించుకోవాల్సిన విషయం ఇది. స్మార్ట్ సిటీలంటూ పాలకులు హడావుడి చేసే బదులు ముందుగా కాలుష్య రహిత నగరాలను తీర్చిదిద్దేలా కార్యాచరణను చేపట్టాలి. జల, వాయు కాలుష్యాలు ఇంకా మితిమీరితే దేశ భవిష్యత్‌ను ఊహించలేం.
-డా. డివిజి శంకరరావు, పార్వతీపురం