ఉత్తరాయణం

మోదీ మంత్రదండం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవినీతి వల్ల పుట్టుకొచ్చిన దొంగడబ్బును ప్రధాని మోదీ కొత్తనోట్లతో చిత్తుకాగితాలు చేశాడు. లాకర్లలోనూ, పరుపుల కిందా వున్న నోట్లకట్టలతో ఇక భోగిమంట వేసుకోవచ్చు. క్షణంలో అమీరులు గరీబులు అయిపోయారు. ఆకాశహర్మ్యాలకు (రియల్ ఎస్టేట్), ఒకటి కొంటే రెండోది ఉచితం అనే వారికి, పేస్టు కొని ఉచితంగా ఇచ్చేదాన్ని కారులో తీసుకెళ్లండని చెప్పేవారికి, చైనా వస్తువుల్ని మన నెత్తిన రుద్ది అంటగట్టే అమ్మకాలకు- ఇట్లా అన్ని అవినీతి వ్యాపారాలకు మిన్ను విరిగి మీదపడ్డట్టు అయ్యింది. ఇది ఆరంభం మాత్రమే. అంతం జరగాలంటే అన్ని రంగాల్లోనూ మూలమూలకు చొచ్చుకుపోయి అవినీతిని పెల్లగించటానికి మాత్రం పెద్ద మంత్రాన్ని మోదీ ప్రయోగించాలి. దాన్ని ‘సాహస నాయకుడు’ మోదీ ఆలోచిస్తారని ఆశిద్దాం. అదిసరే.. పాత ఏలిక పార్టీ ‘ఏమిటీ అన్యాయం.. అక్రమం..’ అంటూ గణచారి గంతులు వేస్తోంది. తాను చెయ్యనిదాన్ని మోదీ చేసినందుకా..? ప్చ్..!
-గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు, ఏలూరు

వేదాలకు అనుకూలమే..
ఆర్య సమాజం వేద వ్యతిరేకం కాదు, ఇది వేద ఉద్ధరణ గావించిన సంస్థ. తొడిమేటి చక్రపాణిరావు(వేదాద్రి) ‘షిరిడీ సాయి భక్తులు హిందువులు కారు’ శీర్షికన ‘ఉత్తరాయణం’లో-‘మొదటి నుంచీ వేద వ్యతిరేక భావాలున్న ఆర్యసమాజ్, బ్రహ్మ సమాజ్, బ్రహ్మకుమారీస్ వంటి మతాలకు హిందూ మతం ఎంతో ఉదారంగా దారి ఇస్తూనే ఉంది’ అని వ్రాశారు. స్వామి దయానంద సరస్వతి ముఖ్యంగా వేద ప్రచారం కోసమే ఆర్య సమాజాన్ని స్థాపించారు. వేదాలను విస్మరించడం వల్లే దేశం అధోగతిపాలు అగుచున్నదని గ్రహించి దానిని స్థాపించినారు. వేదాల గురించి వారు చాలా పరిశోధన చేసి, భాష్యములు వ్రాశారు. ఆర్య సమాజ దశ నియములలో మూడవది- ‘వేదము సమస్త సత్య విద్యల పుస్తకము. వేదమును చదువుట, చదివించుట, వినుట, వినిపించుట ఆర్యులందరి పరమ ధర్మం’. ఆర్యుడు అనగా శ్రేష్ఠుడు, ఉత్తముడు. ఆర్య సమాజం ఒక మతం కాదు. మతం అంటే మానవుని మస్తిష్కంలో పుట్టిన ఆలోచన. తాను కొత్తగా ఏమీ చెప్పడం లేదని, వేదాల్లోని విషయాలనే వెల్లడిస్తున్నానని, వేదాల ప్రకారం మానవులు జీవిస్తే ఉద్ధరించబడుతారని తద్వారా దేశం ఉన్నతి పొందుతుందని దయానంద సరస్వతి ఉద్ఘాటించారు.
-యామా జనార్దన్, సూర్యాపేట
యాచకుల బెడద
నేడు ఎక్కడ చూసినా బిచ్చగాళ్ళ బెడద ఎక్కువగా వుంది. నడిరోడ్డు, బస్టాండు, రైల్వేస్టేషన్, కూడళ్ళు, గుళ్లు గోపురాలు.. ఇలా ఎక్కడ పడితే అక్కడ యాచకుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనాలకు అడ్డుపడుతూ వీరు సమస్యలు సృష్టిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. బిచ్చగాళ్ళ వేషంలో కొందరు దొంగతనాలకు పాల్పడుతున్నా పోలీసులలో స్పందన శూన్యం. ఇక హిజ్రాల సమస్య కూడా ఎక్కువగా వుంది. చిన్నపిల్లలను కూడా యాచక వృత్తిలోనికి దించడం, పసిపిల్లలను మండుటెండలో నిల్చోబెట్టి అడుక్కోవాలని కొందరు అలవాటు చేస్తున్నారు. నానాటికీ సామాజిక సమస్యగా రూపాంతరం చెందుతున్న యాచకవృత్తిని నిర్మూలించేందుకు ప్రభుత్వం కృషిచేయాలి.
-సి.ప్రతాప్, శ్రీకాకుళం
జీవోలను సవరించాలి
తెలంగాణలో భాషా పండితుల, పిఇటిల అప్‌గ్రేడేషన్ కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం మేలుచేసింది. 2,487 మంది భాషా పండితుల, 1,047 పిఇటిలను స్కూల్ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. అయితే జి.ఓ.11,12లను సవరించి అప్‌గ్రెడేషన్ పోస్టులను భాషాపండితుల, పిఇటిలకే పదోన్నతుల ద్వారా ఇస్తే బాగుంటుంది. విద్యార్థులకూ న్యాయం చేకూరుతుంది. లేకుంటే విద్యాప్రమాణాలు దెబ్బతింటాయి. తక్షణమే జి.ఓ.లను సవరించి వారికి న్యాయం చేయాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం
ప్రజల హక్కులకు దిక్కెవరు?
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు సమాచార కమిషన్, తెలంగాణకు మానవ హక్కుల కమిషన్‌ను కేంద్రం కేటాయించింది. 2015 జూలై 17న ఆంధ్రప్రదేశ్ ప్రధాన సమాచార కమిషనర్ పదవీ విరమణ చేశారు. సుమారు 14నెలలు గడిచినా ఈ పోస్టుకు కొందరు మేధావులు దరఖాస్తుల్ని సమర్పించినా నియామక ప్రక్రియ జరపలేదు. ఈ పోస్టును భర్తీ చేయాలని ప్రజలు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇదే పరిస్థితి మానవహక్కుల కమిషన్‌లోనూ నెలకొంది. ఈ రెండు ప్రధాన పోస్తులను భర్తీ చేయనందున సమాచార కమిషన్‌లో, మానవ హక్కుల కమిషన్‌లో 10 వేలకు పైగా ఫిర్యాదులు అపరిష్కృతంగా ఉండటంతో తమ హక్కులకు దిక్కెవరంటూ జనం ప్రశ్నిస్తున్నారు.
- వులాపు బాలకేశవులు, గిద్దలూరు
ఇదేమైనా బాగుందా..?
తమవాళ్లు దగ్గర లేకనో, పెరిగిపోతున్న ఆస్పత్రి బిల్లు కట్టలేమన్న భయంతోనో, ట్రీట్‌మెంట్ సరిగా లేదనో ఇన్‌పేషెంట్లుగా వున్నవారు- వాడాల్సిన మందులు రాయించుకుని ఇంక ఇంటికి వెళ్ళిపోదాం. అనుకోవడం సహజం. ప్రఖ్యాత కార్పొరేట్ ఆస్పత్రులు తామే డ్రాఫ్ట్‌చేసిన డిశ్చార్చి లెటర్స్‌లో రోగుల నుంచి సంతకాలు తీసుకుంటున్నాయి. అందులో పదజాలం చూసి నవ్వాలో, ఏడ్వాలో తెలియటం లేదు. ఆస్పత్రి నుంచి ఇంటికెళ్ళే లోపు ఏదైనా జరిగితే మేం బాధ్యులం కాము- అని రాయంచుకుంటున్నారు. అసలు ఏదైనా ప్రమాదం రోగులకు ఎందుకు జరగాలి? కార్పొరేట్ ఆస్పత్రులలో జ్యోతిష్కుల్ని నియమించారా? చిన్నాస్పత్రుల్లో.. కిందిస్థాయ సిబ్బందికి నో టిప్స్ అని బోర్డులు పెడుతున్నారు. కార్పొరేట్ ఆస్పత్రులలో ఇలాంటివి కన్పించవేం? కంట్లో డ్రాప్స్ వేస్తే టిప్పు.. రోగులకు డ్రెస్సింగ్ చేస్తే టిప్పు.. కార్పొరేట్ ఆస్పత్రుల తీరు మారదా..?
-బి.ఆర్.సి.మూర్తి, విజయవాడ