ఉత్తరాయణం

ప్రజాసంక్షేమానికి టిటిడి నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్పొరేట్ సంస్థల ఆధిపత్యం పెరగడంతో నేడు ప్రభుత్వరంగంలో విద్య, వైద్య సేవలు లభించక సామాన్య, మధ్య తరగతి ప్రజలు నానాపాట్లు పడుతున్నారు. పేదవర్గాల వారు ఖరీదైన ఆస్పత్రులకు, కార్పొరేట్ పాఠశాలలకు వెళ్లే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో బడుగువర్గాల సంక్షేమానికి తిరుమల తిరుపతి దేవస్థానం ముందుకువచ్చి తగినన్ని నిధులను కేటాయించాలి. వైద్యచికిత్స చేయించుకునే స్థోమత లేనివారు తమిళనాడు వెళుతున్నారు. ‘మానవ సేవే మాధవ సేవ’ అనే ఆర్యోక్తికి అనుగుణంగా టిటిడి తనవంతు బాధ్యతగా విద్య, వైద్య రంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. భక్తుల విరాళాల ద్వారా టిటిడికి ఏటా వేల కోట్ల రూపాయల ఆదాయం లభిస్తోంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు, మాధవుడి నిధుల్లో కొంత భాగం మానవ సేవకు వినియోగించాలి. క్రైస్తవ మిషనరీ సంస్థలు దశాబ్దాల తరబడి మన దేశంలో విద్య, వైద్యరంగాల్లో సేవలందిస్తున్నాయి. టిటిడి కూడా పలు ప్రాంతాల్లో విద్యాలయాలు, ఆస్పత్రులను ప్రారంభించి పేదలను ఆదుకోవాలి. హిందువుల జనాభా తగ్గపోతోందని, నలుగురైదుగురు సంతానాన్ని కనాలని వివాదాస్పద ప్రకటనలు ఇచ్చే స్వామీజీలు, మఠాధిపతులు తమ సంస్థల ద్వారా ప్రజాసేవ చేస్తూ హైందవ ధర్మ రక్షణకు పాటుపడాలి.
-తిరుమలశెట్టి సాంబశివరావు, నర్సారావుపేట
పోరాటంతో రైల్వే జోన్ సాధ్యం
అధికారంలోకి రాకముందు విశాఖకు ప్రత్యేక రైల్వేజోన్ ఇస్తామని బిజెపి నాయకత్వం వాగ్దానాల వర్షం కురిపించింది. అయితే, ఈసారి కేంద్ర బడ్జెట్‌లో కూడా విశాఖకు రిక్తహస్తమే మిగిలింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో నోరు మెదపకపోవడం శోచనీయం. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కొత్త రైలుమార్గాలు, రైల్వే కర్మాగారాలు ఆంధ్రాలో ఒక్కటి కూడా ప్రారంభించలేదు. కొత్త రైల్వేజోన్ ఏర్పడితే పారిశ్రామిక ప్రాంతమైన విశాఖలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ప్రస్తుతం ఈస్ట్‌కోస్ట్ జోన్‌లో ఉన్న విశాఖ ప్రాంతంపై ఒడిశా అధికారుల పెత్తనం కొనసాగుతోంది. రైల్వే పరంగా అన్ని విషయాలకు భువనేశ్వర్‌పై ఆధారపడాల్సి వస్తోంది. అన్ని రైళ్లను భువనేశ్వర్‌కు పొడిగించడంతో బెర్తుల కోటా గణనీయంగా తగ్గిపోయింది. అత్యధిక ఆదాయం ఇస్తున్నప్పటికీ వాల్తేరు రైల్వే జోన్‌పై వివక్ష చూపుతున్నారు. ఇకనైనా, అన్ని రాజకీయ పార్టీలు విభేదాలను విస్మరించి రైల్వేజోన్ కోసం సమైక్యంగా పోరాడాలి.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం
రోజాను అవమానించడం తప్పే
ఏపిలో ఇటీవల అట్టహాసంగా నిర్వహించిన ‘జాతీయ మహిళా పార్లమెంటు’ సదస్సుకు ప్రముఖ మహిళా నేతలతో పాటు సినీనటి, వైకాపా ఎమ్మెల్యే రోజాను ఆహ్వానించి అవమానించడం సరికాదు. సదస్సు సందర్భంగా గొడవ చేస్తుందేమోనన్న మిషతో ఆమెను విజయవాడ విమానాశ్రయంలో అరెస్టు చేయడం ఏపి సర్కారుకు తలవంపులు తెచ్చిపెట్టే చర్య. రోజా గొడవ చేస్తుందనే అనుమానం ఉంటే ఆమెకు ఆహ్వానం పంపడం ఎందుకు? పిలిచి మరీ అవమానించడం ఎందుకు? మహిళల సమస్యలపై, హక్కులపై ఎంతోమంది గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చారు. పార్లమెంటులో మహిళా బిల్లును ఆమోదించాలని అందరూ కోరారు. ఇదే సందర్భంలో మహిళా ఎమ్మెల్యే రోజాను అవమానించడం రాజకీయ ద్వేషానికి పరాకాష్ఠగా నిలిచింది.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
విద్యాసాగర్ నిర్ణయం భేష్
తమిళనాడులో అన్నాడిఎంకె శాసనసభా పక్షం నేతగా ఎన్నికైన వెంటనే శశికళ చేత ముఖ్యమంత్రిగా గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించక పోవడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని సిపిఐ నేత నారాయణ వ్యాఖ్యానించడం సరికాదు. అక్రమాస్తుల కేసును అడ్డం పెట్టుకుని గవర్నర్ విద్యాసాగరరావు కాలయాపన చేశారని, ఎమ్మెల్యేలు ఎన్నుకున్న శశికళకు అవకాశం ఇవ్వకపోవడం ఏమిటని నారాయణ విమర్శించడం విడ్డూరం. అక్రమాస్తుల కేసులో సుప్రీం కోర్టు రాబోతోందని తెలిసి గవర్నర్ ఎంతో వివేకవంతంగా వ్యవహరించారని తమిళ ప్రజలు సైతం ప్రశంసిస్తున్నారు. సిఎంగా బాధ్యతలు చేపట్టాక శశికళ జైలుకు వెళితే- ఆమె అనుచరులు ఎంతగా రెచ్చిపోయేవారో? ఎంతటి విధ్వంసం సృష్టించేవారో? శాంతిభద్రతలు క్షీణించకుండా గవర్నర్ సముచిత నిర్ణయం తీసుకోవడం నారాయణ వంటి నేతలకు ఇష్టం లేదా?
- కెఎల్ ప్రసన్న, కాకినాడ