ఈ వారం స్పెషల్

‘శకల’ రోదసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోదసి అనంతం... ఓ అద్భుతం.
మిణుమిణుకుమనే తారలతో
చంద్ర కాంతులతో సూర్య కిరణాలతో
అనునిత్యం దివ్యంగా, దేదీప్యంగా
కనిపిస్తుంది. ఈ కనిపించే అందాల వెనుక కనిపించని ‘ప్రమాదం’ పొంచివుంది.
నిత్యం రోదసిని ఆస్వాదించే పుడమికే
ఈ ప్రమాదం పెనుముప్పును తేబోతోంది. అది ఇవాళా కావొచ్చు, రేపైనా కావొచ్చు. మరెప్పుడైనా కావొచ్చు. అయితే ఈ ప్రమాదం మాత్రం తథ్యం. అది గ్రహ
శకలాలు అనంతమైన వేగంతో పరిభ్రమిస్తూ గతి తప్పి పుడమిని ఢీకొనడం వల్ల
అయినా జరగొచ్చు, లేదా ఇప్పటివరకు అంతరిక్షంలోకి పంపిన ఉపగ్రహాలు
రాకెట్ వ్యర్థాలతోనైనా జరగొచ్చు.
**
పుడమి చుట్టూ ఆవహించిన, రోదసిలో అణువణువునా నిండిపోయిన అంతరిక్ష వ్యర్థాలు మానవాళికి తీవ్ర ఆందోళనే కలిగిస్తున్నాయి. ఎప్పటికప్పుడు అన్ని దేశాలూ తమ శాస్త్ర సాంకేతిక ప్రగతికి పదును పెట్టుకుంటూ రోదసి ప్రయోగాలతో దూసుకుపోతున్న నేపథ్యంలో అనంతమైన పరిమాణంలో పెరిగిపోతున్న ఈ వ్యర్థాల మాటేమిటి అన్నది ఆందోళన కలిగించేదే. వందల వేల టన్నుల మేర పేరుకుపోయిన ఈ వ్యర్థాలను తొలగించడమెలా? వీటినుంచి భూమికి తలెత్తే అవకాశమున్న ప్రమాదాన్ని నివారించడమెలా అన్నది ఖగోళవేత్తలకు ఎప్పటికప్పుడు సమాధానం లేని ప్రశ్నగానే కనిపిస్తోంది. ఎంతగా శాస్త్ర సాంకేతిక రంగాలను ఔపోసన పట్టినా వాటికున్న మరో పార్శ్వాన్ని విస్మరించడానికి వీల్లేదు. రోదసి లోతుల్లోకి దూసుకుపోయి మన సౌర వ్యవస్థ ఆవల వున్న గ్రహాలు, నక్షత్రాల కూటములను సైతం అవగతం చేసుకుంటున్న మానవుడు మన సమీప రోదసి ముంగిళ్లలో మేటవేసిన వ్యర్థాలను పట్టించుకోకపోతే అది ఎప్పటికైనా ప్రమాదమేనన్నది కళ్లకు కడుతున్న వాస్తవం. అంతరిక్షంలో ప్రవేశించిన రాకెట్లు, ఉపగ్రహాలు వాటి నిర్ణీత గడువు తీరిన తర్వాత అనంతమైన భ్రమణంలో తునాతునకలైపోతాయి. అంటే అప్పటికే చిన్న చిన్న ముక్కలుగా విడిపోయిన ఈ ఉపగ్రహ శకలాల తునకలు ఢీకొనడం వల్లే ఇవి ఛిద్రమైపోతున్నాయన్నది నిజం. మానవుడు ప్రయోగించే ఉపగ్రహాలను రాకెట్లను తిరిగి వెనక్కి తీసుకొచ్చే అవకాశం లేకపోవడం వల్ల వాటి అవసరం తీరిన తర్వాత అక్కడే వదిలివేయడం జరుగుతోంది. ఇలాంటి వాటి సంఖ్య వందలు, వేలు దాటడంతో రోదసి వ్యర్థాలు పెరిగిపోతున్నాయి. రోదసి శకం ప్రారంభమైనప్పటినుంచి ఇప్పటివరకు ఐదువేలకు పైగా అంతరిక్ష ప్రయోగాలు జరిగాయి. వీటన్నింటి కాలపరిమితి తీరిపోవడంతో నిరుపయోగమైన వ్యర్థాలుగానే మారిపోయాయి. అంటే ఈ రాకెట్లు, ఉపగ్రహాలు తమ పరిభ్రమణ గతినుంచి తప్పుకున్నాయి. వాటి స్థానే ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలను చేపట్టడం ద్వారా ప్రపంచ దేశాలు తమ రోదసి పరిశోధనలకు పదునుపెట్టుకుంటున్నాయే తప్ప నిరుపయోగంగా మారిన వాటి మాటేమిటన్నది విస్మరించాయి. ఇప్పటికే ఈ రకమైన రాకెట్లు ఉపగ్రహాలతో పుడమి పరిభ్రమణ గతి నిండిపోయింది. దాదాపు ఇరుకుమయంగా మారిపోయింది. ఒక రాకెట్‌ను మరొక రాకెట్ ఢీకొనబోతోందా, ఒక ఉపగ్రహ పరిభ్రమణకు మరో ఉపగ్రహం అడ్డు రాబోతోందా అన్న పరిస్థితి నిరంతరం ఖగోళవేత్తలను ఆందోళనలకు గురిచేస్తూనే వుంది. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం ఇటీవలి కాలంలో జరిగిన ఓ సంఘటనే. అంతరిక్షంలో అమెరికా సహా అనేక దేశాలు కలిసి ఓ అంతరిక్ష పరిశోధనా కేంద్రాన్ని నిర్మించాయి. ఐఎస్‌ఎస్‌గా పేర్కొనే ఈ అంతరిక్ష పరిశోధనా కేంద్రం అనంతమైన రోదసీ అధ్యయనానికి ఎంతగానో ఉపకరిస్తోంది. వంతులవారీగా ఈ కేంద్రానికి వ్యోమగాములు వెళుతున్నారు. నిర్ణీత కాలవ్యవధి పాటు పరిశోధనలు జరిపి వెనక్కి వస్తున్నారు. వారి ప్రయోగ, పరిశోధనల ఫలితాలు పుడమి అధ్యయనానికే కాకుండా ఎగువనున్న అంతరిక్షాన్ని పరిశీలించడానికి, ఇతర గ్రహాల్లో జీవానుకూల వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి ఎంతగానో దోహదం చేస్తున్నాయి. ఇలాంటి నిరుపమాన రోదసి ప్రయోగ కేంద్రానికే నిరంతరం ఈ అంతరిక్ష వ్యర్థాల వల్ల ముప్పు వాటిల్లుతూనే వస్తోంది. ఈ వ్యర్థాల తాకిడి నుంచి ఐఎస్‌ఎస్‌ను రక్షించేందుకు ఇటీవల దాని పరిభ్రమణ గతిని మార్చాల్సిన పరిస్థితి కూడా తలెత్తింది. కేవలం ఐఎస్‌ఎస్‌కే కాదు ఇటీవలి కాలంలో అత్యంత వ్యయ ప్రయాసలకోర్చి జరిపిన ఉపగ్రహ, రాకెట్ ప్రయోగాలకు ఈ వ్యర్థాలు పెనుముప్పునే కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు రోదసిలో మేట వేసిన వ్యర్థాల పరిమాణం ఎంత? వీటి ద్వారా తదుపరి ప్రయోగాలకు ప్రస్తుతం పరిభ్రమిస్తున్న ఉపగ్రహాలకు ప్రమాదం వాటిల్లకుండా తీసుకోవాల్సిన చర్యలేమిటన్నది మానవాళి ముందున్న కీలక సవాలు.
అభివృద్ధిని మనం కాదనలేం. అది భూమిమీదైనా కావొచ్చు. అంతరిక్షాన్ని మధించి వివిధ గ్రహాల స్వరూప స్వభావాలను అధ్యయనం చేసి అక్కడే ఆవాసయోగ్యతను పరిశీలించడానికైనా కావొచ్చు. ఉపగ్రహ ప్రయోగాలన్నవి ఎంతగానో ఇన్ని దశాబ్దాల కాలంలో మానవాళికి ఎంతో మేలు చేశాయి. ఒక దశ దాటినతర్వాత ఏదైనా నిరుపయోగమే. అలాంటివే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ప్రయోగించిన రాకెట్లు, ఉపగ్రహాలు. ఈ ఉపగ్రహాలు అందించిన సమాచారం వల్లే భూమి వాతావరణాన్ని అన్నివిధాలుగా అధ్యయనం చేయటానికి సరికొత్త రీతిలో రుతుపవనాల రాకపోకలను గుర్తించడానికి ఆస్కారమేర్పడింది. నాలుగున్నర దశాబ్దాల క్రితమే ‘పుడమిపై వున్నవారికి అన్నం పెట్టలేని స్థితిలో ఉన్నప్పుడు కోటానుకోట్ల డాలర్ల వ్యయంతో ఈ ప్రయోగాలు అవసరమా?’ అన్న ప్రశ్న తలెత్తింది. అవసరమేనన్నది నేటి వాస్తవం. ఎందుకంటే భూసారాన్ని అధ్యయనం చేసి వైవిధ్యభరితమైన పంటలు వేయడానికి, పెరిగిపోతున్న ప్రపంచ జనాభా దాహార్తిని, క్షుద్బాధను తీర్చడానికి మనం సిద్ధంగా వున్నామంటే ఈ ప్రయోగాలే కారణం.
(7వ పేజీ తరువాయ)
ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలపై దృష్టి సారిస్తున్నట్లుగానే ఇప్పటికే ప్రయోగించిన వాటి అతీగతీ ఏమిటన్న దానిపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.రోదసిలోకి దూసుకెళ్లే రాకెట్లు తిరిగి భూమికి వచ్చే టెక్నాలజీ ఇంకా రాలేదు. అదేవిధంగా కాలపరిమితి తీరిన తర్వాత ఉపగ్రహాలను వెనక్కి తెచ్చుకునే అవకాశం లేదు. పాతవి ఏమయ్యాయో నిర్ధారించుకోకుండా కొత్తవాటిని ప్రయోగించుకుంటూ పోతే ఎంత అనంతమైనదైనా రోదసి కూడా ఉపగ్రహ సమ్మర్దంగా మారిపోయే అవకాశం ఉంటుంది. తునాతునకలయ్యే వీటి శకలాల వల్ల విశ్వం అంతా నిండిపోయే ప్రమాదమూ ఉంటుంది. ఈ వాస్తవాలను గుర్తించిన శాస్తవ్రేత్తలు విరుగుడూ కనిపెట్టారు. జపాన్ అయితే ఏకంగా ఈ రోదసి చెత్తను ఏరిపారే టెక్నాలజీతో ముందుకు వస్తోంది. అమెరికా ఇప్పటికే హవాయిలో అత్యంత శక్తివంతమైన టెలిస్కోప్‌ను ఇందుకోసమే ఏర్పాటుచేసింది. 3.68 మీటర్ల ఈ టెలిస్కోప్‌లో అత్యంత శక్తివంతమైన స్పెన్సర్లు ఉన్నాయి. ఇవి నిరంతరం ఉపగ్రహాలను, ఉపగ్రహ శకలాలను, వ్యర్థాలను గమనిస్తూనే ఉంటాయి. ఓ టెన్నిస్ బంతి కంటే ఎక్కువ పరిమాణం కలిగిన లక్షలాది రోదసి వ్యర్థాలను అమెరికా అంతరిక్ష నిఘా నేత్రాలు కనుగొన్నాయి. ఒక మిల్లీమీటర్ కంటే ఎక్కువ పరిమాణం కలిగిన వ్యర్థాలు వందల మిలియన్ల కంటే ఎక్కువగానే ఉన్నట్లు అంచనా వేసింది. ఇవి అత్యంత సూక్ష్మమైనవి కావడమే కాకుండా వాటి వేగం అనంతం కావడం వల్ల ఏ క్షణంలో ఏ ఉపగ్రహానికి ముప్పు వాటిల్లుతుందో పసిగట్టడమే కష్టమని శాస్తవ్రేత్తలు ఇప్పటికే తేల్చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త ఉపగ్రహాలను ప్రయోగించడం మాట ఎలా వున్నా ఇప్పటికే పరిభ్రమణంలో ఉన్న ఉపగ్రహాల సేవలను పూర్తిస్థాయిలో అందుకోవడం సాధ్యమా అన్న అనుమానాలకు ఆస్కారం ఏర్పడుతోంది. మామూలుగా అయితే అంతరిక్షంలో గురుత్వాకర్షణ ఉండదు కాబట్టి ఏదీ పూర్తి వేగంతో ప్రయాణించే అవకాశం ఉండదన్నది వాదన. కానీ రోదసి వ్యర్థాల విషయంలో ఇది ఎంతమాత్రం నిజం కాదు. అవి ఓ గమ్యం లేకుండా తిరుగాడుతూనే ఉంటాయనుకోవడం భ్రమేనని, వాటివల్ల ముప్పు ఎప్పటికైనా తథ్యమన్నది వాస్తవమని ఖగోళవేత్తల వాదన. సినిమాల్లో చూపించినట్లుగా - ఐఎస్‌ఎస్‌కు వెళ్లే వ్యోమగాములు మరమ్మతు వంటి వాటిని చేపట్టడానికి గాలిలో తేలుతున్నట్లుగా నెమ్మదిగా వెళ్లడమన్నది ఊహే తప్ప వాస్తవం కాదని అంటున్నారు.
భూమి చుట్టూ వేలాది ఉపగ్రహాలు నిరంతరం పరిభ్రమిస్తున్నాయి. వీటి వేగమూ అత్యధిక స్థాయిలోనే ఉంటుంది. అంటే ఒక ఉపగ్రహ పరిభ్రమణ వేగాన్ని మరో ఉపగ్రహంతో పోల్చడానికి వీల్లేదు. ఇవన్నీ కూడా ఒకే మాదిరి వేగంతో, ఒకే దిశలో ప్రయాణిస్తుంటాయి. కొన్నింటి వేగంమధ్య తేడా కూడా ఉండే అవకాశం ఉంటుంది. వీటిలో దేని వేగం తగ్గినా మరో ఉపగ్రహం దాన్ని ఢీకొనడం అనివార్యమే అవుతుంది. ఈ వేగంతో రెండు ఉపగ్రహాలు ఢీకొన్నా దాని పర్యవసానాలు తీవ్రంగానే ఉంటాయి. అదే జరిగితే వాటినుంచి ఉద్భవించే శిథిలాలు పరిభ్రమణంలో ఉన్న ఇతర ఉపగ్రహాలను దెబ్బతీసే అవకాశం ఉంటుంది. అంటే ఒక్కసారిగా ఈ వ్యర్థాల ప్రవాహం వెల్లువెత్తుతుందన్నమాట. ఇదే విషయాన్ని ‘గ్రావిటీ’ అనే సినిమాలో కళ్లకు కట్టినట్లుగా చూపించారు. దీన్ని కేవలం సినిమాకే పరిమితమైన ఇతివృత్తంగా భావించడానికి వీల్లేదు. 2009లో ఈ రకమైన సంఘటన జరిగింది. అప్పటికే కాలం చెల్లిన రష్యా ఉపగ్రహం మరో ఇరిడియం ఉపగ్రహాన్ని అత్యంత వేగంతో ఢీకొంది. దాని ప్రభావం వల్ల రెండు ఉపగ్రహాలు ధ్వంసమైపోయాయి. అంతేకాదు, అవి తునాతునకలై వాటి వ్యర్థాలు భిన్న దిశల్లో దూసుకుపోయాయి. ఇలాంటి ఘటనలు ఇప్పటికే ఎన్నో జరిగి ఉండవచ్చు. శాస్తవ్రేత్తల దృష్టికి వచ్చింది ఇదొక్కటే అయి వుండొచ్చు. ఈ యాభై సంవత్సరాల కాలంలో ఈ రకమైన ఉపగ్రహాలు ఢీకొనడం కాలం చెల్లిన ఉపగ్రహాలు తునాతునకలై పోవడమన్నది నిరంతర ప్రక్రియగానే కొనసాగుతూ వస్తోంది. ఏవిధంగా చూసినా రోదసి వ్యర్థాలను వాటి కారణంగా అంతరిక్షంలో ప్రమాదకరంగా మారుతున్న కాలుష్యాన్ని విస్మరించడానికి వీల్లేదు. ఇప్పటికిప్పుడు కాకపోయినా ఎప్పటికైనా ఈ వ్యర్థాల వల్ల ముప్పేనన్న విషయాన్ని శాస్తవ్రేత్తలు ఎన్నో సందర్భాల్లో స్పష్టం చేశారు. ముఖ్యంగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) ఈ వ్యర్థాలను తొలగించే విషయంలో వినూత్న శాస్త్ర సాంకేతిక విజ్ఞానంతో పాటు ఖగోళ పటిమను కూడా రంగరించి ముందుకు సాగుతోంది. అలాగే ఐరోపా అంతరిక్ష పరిశోధనా కేంద్రం కూడా ఈ దిశగా తనదైన రీతిలో చర్యలు చేపడుతోంది. డి-ఆర్బిట్ అనే ఓ ఉపగ్రహాన్ని ప్రయోగించడం ద్వారా రోదసి వ్యర్థాల ముప్పు తీవ్రతను తగ్గించాలన్నది ఐరోపా స్పేస్ ఏజెన్సీ ఆలోచన. అయితే ప్రస్తుతం ప్రతిపాదన దశలోనే ఉన్న ఈ ఉపగ్రహ నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందన్నది స్పష్టం కావడం లేదు. దీనికి ఆ దేశ రోదసి సంస్థ ఆమోదం లభిస్తే రోదసి వ్యర్థాలను భారీ పరిమాణంలో సంచుల్లో వేసుకుని వాటిని అత్యంత తీవ్రమైన ఉష్ణోగ్రత కలిగిన భూ వాతావరణంలోకి తీసుకొచ్చి ధ్వంసమయ్యేలా చేయడమన్నది ఈ ఉపగ్రహ లక్ష్యం. ఓ మోస్తరు పరిమాణం కలిగిన వ్యర్థాలను పసిగట్టే అవకాశం ఉన్నా అంతకంటే చిన్నగా ఉండేవాటివల్లే ఎక్కువ ప్రమాదం పొంచివుంది. అంటే వీటి పరిమాణం ఓ సెంటీమీటరు మేర కూడా ఉండదు. ఇవే రోదసిలో అత్యధికంగా ఉన్నాయి. లేజర్ కిరణాలను ఉపయోగించి ఈ రకమైన వ్యర్థాలను దగ్ధం చేయాలని, అలాగే వాటి గమనానే్న మార్చాలని శాస్తవ్రేత్తలు భావిస్తున్నారు. అలాగే వీటిని భూ వాతావరణంలోకి తీసుకురావడం ద్వారా వాటంతటవే నాశనమయ్యేలా చేయాలని ఆలోచిస్తున్నారు. ఈ విషయంలో జపాన్ కొత్త ఆలోచన చేస్తోంది. విద్యుదయస్కాంత క్షేత్రాన్ని సృష్టించడం ద్వారా ఈ రకమైన వ్యర్థాల గతిని మార్చాలన్నది జపాన్ ఆలోచన. అంతేకాదు, ఈ టెక్నాలజీ వల్ల ఒకవేళ ప్రమాదం జరిగితే తక్కువ స్థాయిలోనే వ్యర్థాలుగా మారే ఉపగ్రహాలను సృష్టించేందుకు ఆస్కార మేర్పడుతుంది. ఇదే ఆలోచనతో ఐరోపా అంతరిక్ష సంస్థ ముందుకు వెళుతోంది. ఎవరు ఏ దిశగా ప్రయాణం చేసినా అంతిమ లక్ష్యం ప్రయోగించిన ఉపగ్రహాలను పరిరక్షించుకోవడమే. అన్నింటికంటే మించి పుడమిని కాపాడుకోవడమే. *

గత ఐదు దశాబ్దాలుగా ఎనలేని రీతిలో అంతరిక్ష
ప్రయోగాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం 2,271 ఉపగ్రహాలు అంతరిక్ష కక్ష్యలో ఉన్నాయి. అత్యధిక స్థాయిలో రష్యానే వీటిని ప్రయోగించింది. రష్యా ఉపగ్రహాల సంఖ్య 1324 కాగా, 658 ఉపగ్రహాలతో అమెరికా రెండో స్థానంలో ఉంది. ఇప్పటికీ 50వ దశకంలో ప్రయోగించినై వాంగార్డ్ అనే ఉపగ్రహం పరిభ్రమణంలోనే ఉన్నట్లుగా భావిస్తున్నారు. స్పుత్నిక్-1, 2, ఎక్స్‌ప్లోరర్-1 తర్వాత ఈ ఉపగ్రహాన్ని రష్యా ప్రయోగించింది. ఇది సౌరశక్తితో పనిచేసే తొలి ఉపగ్రహం. 1964లోనే ఈ ఉపగ్రహం నుంచి సమాచారం రావడం ఆగిపోయినప్పటికీ ఇది ఇంకా అంతరిక్ష కక్ష్యలోనే ఉందని, ఎక్కడో అక్కడ తిరుగుతూనే ఉంటుందని రోదసి నిపుణులు చెబుతున్నారు. రోదసి వ్యర్థాల కారణంగా అంతరిక్ష కాలుష్యం మితిమీరిపోతోంది. అంటే భూమి చుట్టూ అత్యంత దళసరిగా ఇది ఆవరించి వుంది.
*
వ్యర్థాల పరిమాణం ఎంత?
రోదసిలో పేరుకుపోయిన వ్యర్థాల పరిమాణంపై భిన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు ఐదులక్షలకు పైగా అతి సూక్ష్మ పరిమాణం నుంచి ఓ మోస్తరు పరిమాణం వరకు రోదసి వ్యర్థాలు ఉన్నట్లు అంచనా. వీటి సగటు వేగం గంటకు 17,500 కి.మీ. అంటే ఓ చిన్న రోదసి వ్యర్థపు తునక ఢీకొన్నా ఏకంగా పరిభ్రమణంలో ఉన్న ఓ ఉపగ్రహం తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఈ వ్యర్థాల పరిమాణం చిన్నదే అయినప్పటికీ అది ప్రయాణించే వేగం వేల కి.మీ కాబట్టి అది ఢీకొంటే దాని ప్రభావం కచ్చితంగా ఎంత పెద్ద ఉపగ్రహాన్నైనా తీవ్ర స్థాయిలో దెబ్బతీసే అవకాశం ఉంటుందన్నది వాస్తవం. ఉపగ్రహానే్న కాదు, వ్యోమనౌకను సైతం ఈ వ్యర్థాలు ఢీకొని వాటి గతిని, గమనాన్ని తప్పించే అవకాశం ఉంటుందని ఖగోళవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యర్థాల పరిమాణం 1.27 సెం.మీ. మేర ఉండవచ్చునని, అలాగే మరికొన్నింటి పరిమాణం నాలుగు అంగుళాల వరకు ఉంటుందని చెబుతున్నారు. వీటన్నింటినీ అమెరికా రోదసి నిఘా నెట్‌వర్క్ నిరంతరం గమనిస్తూనే ఉంది.
*
ఈ చిత్రంలో కనిపిస్తున్నది పైపులైన్ కాదు... భారీ ఉపగ్రహ శకలం. ఆకాశం నుంచి హఠాత్తుగా భూమిపై పడి భీతావహుల్ని చేసింది. మయన్మార్‌లో గత ఏడాది నవంబర్ 10న ఆకాశం నుంచి ఈ భారీ శకలం భూమిపై పడింది. కచిన్ జిల్లా హకాంత్‌లోని ఓ నిర్జన ప్రదేశంలో పడటంతో ఎలాంటి ప్రాణాపాయం సంభవించలేదు. చైనా అక్షరాలున్న ఈ శకలం పొడవు 15 అడుగులు, వెడల్పు 4 అడుగులు. దీనికన్నా చిన్న పరిమాణంలో మరో శకలం కూడా భూమిని తాకింది. ఇవి నేలపై పడినప్పుడు
భారీ శబ్దం వినిపించిందని, యుద్ధం జరుగుతోందా అనే రీతిలో భయభ్రాంతులకు గురయ్యామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. రోదసిలో శకలాలు ఏ మేరకు ఉన్నాయో తెలిపేందుకు
ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే.
**
బి. రాజేశ్వరప్రసాద్

బి. రాజేశ్వరప్రసాద్