తూర్పుగోదావరి

రేపు మహా సంకల్పం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూన్ 6: నవ నిర్మాణ దీక్షలో భాగంగా ఈ నెల 8న జిల్లా స్థాయిలో మహాసంకల్పం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్టు కలెక్టర్ హనుమంతు అరుణ్‌కుమార్ చెప్పారు. జిల్లా కేంద్రం కాకినాడ కలెక్టరేట్‌లోని కోర్టు హాలులో వివిధ శాఖల అధికారులతో సోమవారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. నవనిర్మాణ దీక్ష సందర్భంగా వివిధ శాఖల ప్రగతిని సూచించే ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటుచేయాలని అధికారులకు సూచించారు. సంకల్ప సభకు జిల్లాలోని జన్మభూమి కమిటీ సభ్యులందరూ హాజరవుతారన్నారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సహా జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నట్టు తెలిపారు. మంగళవారం నిర్వహించనున్న నవ నిర్మాణ దీక్షలో భాగంగా వివిధ సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఎన్టీఆర్ జలసిరి పథకం కింద ప్రతి మండలంలో గుర్తించిన గ్రామాల్లో బోర్‌వెల్స్‌కు విద్యుత్తు సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. జిల్లాలోని రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో అతిథి గృహాల నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించే ప్రతిపాదనలను పరిశీలించాలని సూచించారు. అతిథి గృహాల నిర్వహణను మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో బెల్టుషాపులను తక్షణం అరికట్టాలని, ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యాన్ని విక్రయించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులకు సూచించారు. జిల్లాలో నవోదయం పథకం అమలు ద్వారా నాటుసారాను చాలావరకు అరికట్టామని, దీని వలన మద్యం విక్రయాలు పెరిగినట్టు ఎక్సైజ్ డిసి సత్యనారాయణ చెప్పారు. ఉపాధి హామీ పథకంపై కలెక్టర్ సమీక్షిస్తూ ఈ పథకంతో వివిధ శాఖల అనుసంధానం ద్వారా సిసి రోడ్లు, పంట కుంటలు, నూతనంగా మంజూరైన 850 అంగన్వాడీ భవనాల నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు సరఫరాచేసే ఆహారం నాణ్యతతో కూడినదై ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రోగులకు పంపిణీచేసే ఆహార నాణ్యతపై రోగుల నుండి వివరణ తీసుకుని, సరిగా లేని పక్షంలో సదరు కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లాలోని కమ్యూనిటీ ఆసుపత్రులు, 30 పడకల ఆసుపత్రుల్లో ఆహార పంపిణీకి మహిళా స్వయంశక్తి సంఘాల సహకారాన్ని తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్ సత్యనారాయణ, సంయుక్త కలెక్టర్-2 జె రాధాకృష్ణమూర్తి, డిఆర్‌డిఎ పిడి ఎస్ మల్లిబాబు, సిపిఒ మోహన్‌రావు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈవ్‌టీజింగ్, మహిళా వేధింపుల నిరోధానికి
అర్బన్ జిల్లాలో షీ టీంలు

రాజమహేంద్రవరం, జూన్ 6: ఈవ్‌టీజింగ్, మహిళా వేధింపుల నిరోధానికి హైదరాబాద్ తరహాలో షీ బృందాలను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు రాజమండ్రి అర్బన్ ఎస్పీ బి రాజకుమారి వెల్లడించారు. అర్బన్‌జిల్లాలో బ్లేడ్‌బ్యాచ్, రౌడీషీటర్ల గురించి ఆందోళన చెందవద్దని ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నేరాలు, రౌడీయిజాన్ని నిరోధిస్తామని భరోసా ఇచ్చారు. నేరాలకు మూల కారణాలను పరిశీలించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నట్లు చెప్పారు. నేరాల నిరోధంలో భాగంగా ప్రతీ ఆటోకు ట్రాఫిక్ నెంబర్లు వేయిస్తామన్నారు. లైసెన్సులు లేని ఆటోడ్రైవర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ప్రధాన మార్గాల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు. క్రైమ్ విభాగాన్ని పటిష్టం చేస్తామన్నారు. రాత్రి వేళల్లో గస్తీని ముమ్మరం చేస్తామని వివరించారు. నగరంలో మొత్తం 183 మంది రౌడీషీటర్లు ఉన్నట్లు చెప్పారు.
పాతకక్షలే రమేష్ హత్యకు కారణం:
నిందితులంతా ఆటోడ్రైవర్లే
రెండు వర్గాల మధ్య నెలకొన్న పాతకక్షలే రాజేంద్రనగర్‌కు చెందిన ధనాల రమేష్ హత్యకు దారితీశాయని ఎస్పీ రాజకుమారి వెల్లడించారు. ఈహత్య కేసులో 11 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. సోమవారం పోలీసు అతిధిగృహంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ గతనెల 26న ఉదయం స్థానిక సుబ్రహ్మణ్యమైదానంలో సమావేశమై పాతకక్షలను దృష్టిలో ఉంచుకుని రమేష్, అతని స్నేహితులను హత్య చేయాలని తీర్మానించారన్నారు. ఆటోలు, మోటార్‌సైకిళ్లపై వెళ్లి ప్రకాష్‌నగర్‌లోని ఆటోస్టాండ్ వద్ద కనిపించిన ధనాల రమేష్‌ను చితకబాది, అనంతరం ఆదెమ్మదిబ్మకు తీసుకెళ్లి అక్కడ కూడా కొట్టారన్నారు. మృతి చెందినట్లు నిర్ధారించుకుని రమేష్ మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రి మార్చురీ వెనుక పారేసి పరారయ్యారన్నారు. ఈకేసులో కరణం శివ, చల్లా భరత్, చల్లా శరత్, గారా రవితేజ, వెంట్రపాటి మహేష్, లావేటి ఉమమహేష్, దల్లి మురళి, యర్రా సాయికిరణ్, లాలం తరుణ్‌లను అరెస్టు చేసినట్లు చెప్పారు. కరణం శివ, వెంట్రపాటి మహేష్‌లపై పలు కేసులు ఉన్నాయన్నారు. నిందితులంతా ఆటోడ్రైవర్లేనని చెప్పారు. వీరి లైసెన్సులను పరిశీలించి, రద్దుకు సిఫార్సు చేస్తామని ఎస్పీ తెలిపారు. ఈకేసును సవాల్‌గా స్వీకరించి పరిశోధించామన్నారు. ఈసందర్భంగా అదనపు ఎస్పీ ఆర్ గంగాధర్, డిఎస్పీ జె కులశేఖర్, సిబ్బందిని అభినందించారు. సిబ్బందికి రివార్డులు సిఫార్సు చేస్తామన్నారు.
ఉద్యమం వెనుక ఉన్నది ఆకలి కేకలే
పెదపూడి, జూన్ 6: కాపు ఉద్యమం వెనుక ఏవో శక్తులున్నాయని కొందరు ఆరోపిస్తున్నారని, కేవలం ఆకలి కేకలు మినహా వేరెవరూ వెనక లేరని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యానించారు. పేద బలిజ, ఒంటరి, తెలగ, కాపులకు బిసి రిజర్వేషన్ కల్పిస్తానంటూ ఎన్నికల ముందు గడప గడపకు ప్రచారం చేసి గెలిచిన ముఖ్యమంత్రి హోదా వచ్చిన తరువాత ఇచ్చిన హామీని విస్మరించడం వల్లే కాపులంతా ఉద్యమిస్తున్నారన్నారు. సోమవారం ఆయన పెద్దాడలో ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు గృహంలో విలేకరులతో మాట్లాడుతూ ఉద్యమానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకోవడానికి రాష్టమ్రంతా తిరుగుతున్నామన్నారు. దీనిలో భాగంగా తన చిరకాల మిత్రుడైన భాస్కర రామారావును కలిశానన్నారు. కాపు రిజర్వేషన్ తాము అడగలేదని, పాదయాత్రకు వచ్చినపుడు చంద్రబాబు నాయుడు పేద కాపుల బాధలు చూడలేకపోతున్నానని, అందువల్ల ప్రభుత్వం రాగానే ముందుగా కాపులకు కార్పొరేషన్ ఏర్పాటుచేసి రిజర్వేషన్లు కల్పిస్తానని పదేపదే హామీలు గుప్పించడం వల్లే ఇపుడు తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. తాము ఏ పార్టీకి అనుకూలం కాదు, వ్యతిరేకం కాదన్నారు. ఆగస్టు నెలలో కమిటీ నివేదిక రావలసి ఉందని, ఎట్టి పరిస్థితుల్లో అనుకూల నిర్ణయం రాకపోతే మరోసారి రోడ్డెక్క వలసిన పరిస్థితి ఉంటుందని ఆయన హెచ్చరించారు. తాము ఎవరి రిజర్వేషన్లు తగ్గించి ఇవ్వమనడం లేదని, ఉన్నదానిలోనే పేద కాపులకు సదుపాయం కల్పించాలని కోరుతున్నామన్నారు. ఆయన వెంట కాపు నాయకులు వాసిరెడ్డి ఏసుదాసు, ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణుమూర్తి, స్థానిక నాయకులు యార్లగడ్డ అమ్మన్నచౌదరి, యార్లగడ్డ నారాయణరావు, గుండా ఈశ్వరరావు, బొడ్డు శ్రీను, కోసూరి వాసు, సానా రాంబాబు తదితరులున్నారు.
రేపు నవనిర్మాణ దీక్ష ముగింపు
కాకినాడ సిటీ, జూన్ 6: నవ నిర్మాణ దీక్షా కార్యక్రమం ఈ నెల 8వ తేదీతో ముగియనుందని జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ తెలియజేశారు. ఈ ముగింపు కార్యక్రమాలను సిఎం చంద్రబాబు ఆదేశాల ప్రకారం నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేయాలని ఎంపిడిఓలను ఆదేశించారు. సోమవారం రాత్రి కలెక్టరేట్ కోర్టు హాలునందు ఆర్డీఒలు, ఎంపిడివోలతో మండల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, వివిధ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి అధికారులు 8వ తేదీన జరిగే నవ నిర్మాణ దీక్ష కార్యక్రమంను ఆయా నియోజకవర్గాల్లోనే ఏర్పాటుచేయాలని సూచించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని, ఈ విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులకు, జన్మభూమి కమిటీ సభ్యులకు తెలియజేసి, వారిని సమాయత్తం చేయాలన్నారు. ఈ నెల 8వ తేదీన జరిగే నవ నిర్మాణ దీక్ష కార్యక్రమం ముగింపు సభ అయినందున, మినిట్ టు మినిట్ కార్యక్రమం తయారు చేసి, మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వివరించాలన్నారు. ఆరోజు సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు కడప నుండి ప్రసంగిస్తారని, ఈ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం జరుగుతుందని, ప్రదర్శనకు తగు చర్యలు చేపట్టాలన్నారు.

పంట కాలువ ఖానా పరిశీలన
రాయవరం, జూన్ 6: మండల పరిధిలోని కురకాళ్లపల్లి, కూర్మాపురం పరిధిలో ఉన్న పంట కాలువ ఖానా ఇరుకవడంతో దిగువ రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు సోమవారం ఆ ఖానాను పరిశీలించారు. కురకాళ్లపల్లి, కూర్మాపురం, కె గంగవరం, వెంటూరు గ్రామాల రైతులు ఖానాకు దిగువ భూమిని సాగుచేస్తున్నారు. ఖానా 18 అంగుళాల వెడల్పు ఉండవలసి ఉండగా 12 అంగుళాలకు పూడుకుపోవడంతో నీటిపారుదల తక్కువై దిగువ ఆయకట్టు రైతులు నీరందక తీవ్ర ఇబ్బందులు పడుతూ పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ డిఇఇ సురేష్‌బాబు ఆధ్వర్యంలో ఎఇ ప్రవీణ్ యాదవ్ ఖానా వద్దకు వచ్చి పరిశీలించారు. రికార్డుల ప్రకారం ఖానా ఉండవలసిన రీతిలో ఉందా లేదా అని పరిశీలించి, ఖానాను రికార్డుల ప్రకారం 18 అంగుళాలు ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ పేర్లా
ఆంధ్రభూమి బ్యూరో
అమలాపురం, జూన్ 6: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి, నిధులు మంజూరు చేస్తుంటే ఆ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా పేర్లు పెట్టుకుని ప్రచారం నిర్వహించుకోవడంపై భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు యెనిమిరెడ్డి మాలకొండయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అమలాపురం కాటన్ గెస్టు హౌస్‌లో సోమవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాలకొండయ్య మాట్లాడుతూ రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్లు నిర్మించాలనే లక్ష్యంతో అంబేద్కర్ జయంతి రోజున కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరుచేస్తే నేటికీ ఒక్క ఇంటిని కూడా నిర్మించలేదని ఆరోపించారు. కార్మిక సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం పింఛన్ పథకాన్ని ప్రవేశపెడితే దానిని చంద్రన్న పథకంగా పేరు మార్చి ప్రచారం నిర్వహించుకుంటున్నారన్నారు. అలాగే పేద మహిళలకు కేంద్రం ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తే వాటిని దీపం పథకంగా మార్చి ప్రచారం నిర్వహించుకుంటున్నారన్నారు. ఉపాధి హామీ పథకం కూడా కేంద్ర ప్రభుత్వందేనని, దానిని కూడా సొంత పథకంగా ప్రకటించుకుని ప్రచారం నిర్వహించడంపై మండిపడ్డారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేటుకూరి సూర్యనారాయణరాజు, బత్తుల లక్ష్మీకుమారి, రాష్ట్ర నాయకులు నల్లా పవన్, ఆకుల వీరబాబు, ఈతకోట బాలస్వామి, బసవా సింహాద్రి, దేశినీడి కిరణ్, జి గంగన్నస్వామి, కె సూర్యారావు, కొండేటి ఈశ్వరబాబు, ఎ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
గ్రోమోర్ షాపునకు రైతుల తాళం
శంఖవరం, జూన్ 6: మండలంలోని కత్తిపూడిలో గల గ్రోమోర్ షాపులో గతేడాది ఆర్‌పి బయో విత్తనం కొనుగోలు చేసి నష్టపోయిన రైతులు సోమవారం షాపునకు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. గతేడాది ఖరీఫ్ సీజన్‌లో గ్రోమోర్ షాపులో ఆర్‌పి బయో అనే వరి విత్తనం సాగు చేయడం ద్వారా కలుపు తక్కువగా వస్తుందని, పెట్టుబడి తక్కువ అవుతుందని, దిగుబడి అధికంగా వస్తుందని నమ్మించి అమ్మకాలు చేశారని రైతులు ఆరోపించారు. గ్రోమోర్ షాపు వారి మాటలు నమ్మి పంట సాగు చేశారు. అయితే పంట పెరిగేకొద్దీ రోజుకొక రకంగా పలు విత్తనాలు కలబోసినట్టు(కేళి)గానూ, తెగుళ్ళ బెడద, దిగుబడి లేకపోవడం, పంట నిరుపయోగంగా మారడంతో నాడే రైతులు వ్యవసాయాధికారికి గ్రోమోర్ పైన, విత్తనం పైన ఫిర్యాదులు చేశారు. దీంతో వ్యవసాయ శాస్తవ్రేత్తలు కత్తిపూడిలో పంటను పరిశీలించి, నష్టపరిహారానికి సిఫార్సు చేస్తామన్నారు. నాటి నుండి నష్టపరిహారం వస్తుందని, చేసిన అప్పుల నుండి కొంతైనా విముక్తి కలుగుతుందని భావించిన రైతులకు ఏడాది గడిచినా స్పందన లేకపోయింది. ఈ క్రమంలో మరలా ఖరీఫ్ సీజన్ ఆరంభం కావడంతో తమ నష్ట పరిహారం సంగతేంటని ఆగ్రహించిన రైతులు గ్రోమోర్‌కు తాళం వేశారు. దీనిపై వ్యవసాయాధికారి వైవి గంగాధర్‌ను వివరణ కోరగా పంటకు నష్టం వాటిల్లడంతో శాస్తవ్రేత్తలు పరిశీలించి నివేదికను ఉన్నతాధికారులకు పంపించారని, నష్టపరిహారం మంజూరు కావాల్సి ఉందన్నారు. రైతుల ఆగ్రహాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
గిరిజన పారిశ్రామికవేత్తలను బ్యాంకర్లు ప్రోత్సహించాలి

రంపచోడవరం, జూన్ 6: గిరిజన పారిశ్రామికవేత్తలను బ్యాంకర్లు ప్రోత్సహించి రాయితీలతో చేయూతనందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ సత్యనారాయణ బ్యాంకర్లకు సూచించారు. సోమవారం స్థానిక ఐటిడిఎ సమావేశపు హాల్లో నవనిర్మాణ దీక్షా కార్యక్రమంలో భాగంగా పరిశ్రమలు, సేవారంగాల్లో ప్రగతి, భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికలపై సదస్సు నిర్వహించారు. ఏ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ప్రజలు భాగస్వామ్యం ఎంతో ముఖ్యమన్నారు. పరిశ్రమల స్థాపనకై ముడి సరుకుల లభ్యత, సాంకేతిక వృత్తినైపుణ్యం, పర్యావరణ అనుమతులు, మార్కెటింగ్ ప్రధానమైనవన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం వంటి జాతీయ ప్రాజెక్టును సాధించినట్టు తెలిపారు. రెండంకెల అభివృద్ధి సాధన దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ఐటిడిఎ పిఒ చక్రధరబాబు మాట్లాడుతూ నవనిర్మాణ దీక్షా కార్యక్రమంలో ఏజెన్సీలో మంచి ఒరవడికి నాంది పలుకుతోందన్నారు. జిసిసి ఉత్పత్తుల విక్రయాలకై రైల్వే స్టేషన్లలోను, మున్సిపల్, కార్పోరేషన్లలో ఔట్‌లెట్‌లకు ప్రోత్సహిస్తున్నామన్నారు. జీడిపప్పు, ఆయిల్ తయారీ పరిశ్రమల స్థాపనకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఎస్సీఎస్టీ మోనటరింగ్ సెల్ సభ్యుడు స్టాలిన్‌బాబు మాట్లాడుతూ సామాజిక పరిస్థితులకు అనుగుణంగా అన్ని రంగాల్లో ఏ విధమైన చర్యలు తీసుకోవలసి ఉందోననే అంశంపై నవనిర్మాణ దీక్షలు సాగుతున్నాయన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శీతంశెట్టి వెంకటేశ్వరరావు, సబ్ కలెక్టర్ రవి, సర్పంచ్ నిరంజనీదేవి, పిహెచ్‌ఒ శ్రీనివాసరావు, అడిషనల్ డిఎంహెచ్‌ఒ ప్రసాద్‌బాబు పాల్గొన్నారు.
అంకితభావంతో పనిచేయాలి
చింతూరు, జూన్ 6: రాష్ట్ర విభజన చారిత్రక తప్పిదమని, ఆంధ్రాలో విలీనమైన మండలాల్లో అధికార్లు అంకితభావంతో పనిచేయాలని అరకు ఎంపి కొత్తపల్లి గీత కోరారు. సోమవారం చింతూరు ఐటిడిఎలో విలీన మండలాల అధికార్లతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మండలాల్లో ఆరోగ్యం, విద్య, ఉపాధి, మహిళా శిశు సంక్షేమం, ఆర్‌డబ్ల్యుఎస్ శాఖల్లో నెలకొన్న సమస్యలను ఆయా అధికార్లను అడిగి తెలుసుకున్నారు. ఆయా శాఖల్లో నేటికీ పరిష్కారం కాని సమస్యల నివేదిక తయారుచేసి, తనకు అందించాలని అధికార్లను ఆదేశించారు. సమస్యల పరిష్కారానికి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నానని ఎంపి గీత పేర్కొన్నారు. అనంతరం ప్రజలు సమస్యలు పరిష్కరించాలంటూ గీతకు విన్నవించుకున్నారు. ఉపాధి కూలీ కరక రామ్మూర్తి చింతూరులోని మానే బుచ్చయ్య చెరువులో నాలుగు వారాలపాటు ఉపాధి పనులు చేస్తే, ఒక్కొక్కరికి రోజుకు రూ.12 అధికార్లు లెక్కకట్టారని ఎంపి దృష్టికి తీసుకువచ్చాడు. అధికార్లను పిలిపించి, వివరణ అడిగి, కూలీలకు పనికి తగ్గ కూలి ఇవ్వాలని ఎంపి ఆదేశించారు. ఈ సమావేశంలో ఎపిఒలు పివిఎస్ నాయుడు, పి వెంకటేశ్వరరావు, డిఎఫ్‌ఒ ప్రసాదరావు, సిఐ దుర్గారావు, తహసీల్దార్ మాధవరావు, ఎంపిడిఒ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.