తూర్పుగోదావరి

హై టెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూన్ 9: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అరెస్టు నేపధ్యంలో అనంతర పరిణామాలపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య గురువారం సాయంత్రం కిర్లంపూడిలో ముద్రగడను ఆయన స్వగృహంలో సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు జరిగే సమయంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ముద్రగడ సహా ఆయన అనుచరులను చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి హుటాహుటిన తరలించారు. ఇదే సమయంలో సుమారు 50 మంది ముద్రగడ అనుచరులను జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని కిర్లంపూడి నుండి కాకినాడ నగరంలోని త్రిటౌన్ పోలీస్ స్టేషన్‌కు నేరుగా తరలించారు. ముద్రగడ అరెస్టుకు జిల్లాలోని కాపు నేతల్లో తీవ్ర కలకలం చెలరేగుతోంది. శుక్రవారం రాష్ట్ర బంద్‌కు కూడా కాపునేతలు పిలుపునిచ్చారు. ముద్రగడ కోలుకున్న అనంతరం ఆయనను కాకినాడ సిఐడి మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచే అవకాశాలున్నట్టు తెలిసింది. అయితే ఈ ప్రక్రియను శుక్రవారం నిర్వహించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. సిఐడి కోర్టులో ముద్రగడను హాజరుపరిచిన పక్షంలో రిమాండ్ విధించే అవకాశం ఉంది. ప్రస్తుతం ముద్రగడ ఆసుపత్రిలో ఉన్నప్పటికీ వైద్య చికిత్స పొందేందుకు నిరాకరిస్తున్నారు. రాత్రి పొద్దుపోయే వరకు ఆయనకు వైద్య చికిత్స అందించేందుకు వైద్యులు విఫలయత్నం చేశారు. రిమాండ్ విధించిన పక్షంలో ముద్రగడను జైలుకు పంపిస్తే ఆందోళన మరింత ఉద్ధృతమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. గురువారం దీక్షకు ఉపక్రమించే ముందు ముద్రగడ మీడియాతో మాట్లాడుతూ తనను అరెస్టు చేసినా దీక్షను మాత్రం జైల్లో సైతం కొనసాగిస్తానని చెప్పారు. జైల్లో సాగించే దీక్షలో మంచినీళ్లు కూడా ముట్టనని ఆయన ప్రతిజ్ఞ చేశారు. విడుదల కోసం బెయిలు కూడా తీసుకోనని తేల్చిచెప్పారు. అంటే ముద్రగడ జైలుకు తీసుకెళ్లిన పక్షంలో జైలులోనే గడపాల్సి ఉంటుంది. ఇదేగనుక జరిగితే ఆయన వైద్య పరీక్షలను కూడా నిరాకరించే అవకాశం ఉంటుందని, ఆయన చెప్పినట్టుగా ఆహారం కూడా తీసుకోని పక్షంలో ఆరోగ్యం పూర్తిగా క్షీణించే ప్రమాదముందని కాపు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఊహించినట్టే జైలు నాలుగు గోడల మధ్య ముద్రగడ దీక్ష సాగించిన పక్షంలో పరిణామాలు ఏవిధంగా దారితీస్తాయోనన్న ఆందోళనలో కాపునేతలు ఉన్నారు. ఈనేపధ్యంలో రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ బంద్‌ను విజయవంతం చేయాలని అన్ని వర్గాలను కోరుతున్నట్టు కాకినాడలో నాయకులు తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటంతో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ముఖ్య నాయకులను గృహ నిర్బంధం చేయాలని నిర్ణయించారు. అలా జరిగితే ఆయా ప్రాంతాల్లో నాయకులు కూడా ఇంటి వద్దే ముద్రగడకు మద్దతుగా దీక్షలు కొనసాగించాలని నిర్ణయించారు. ముద్రగడ స్వగ్రామం కిర్లంపూడి, ప్రత్తిపాడు, యర్రవరం, జగ్గంపేట తదితర ప్రాంతాల్లో పోలీస్ అవుట్‌పోస్టులను కొనసాగిస్తున్నారు. ఇతర జిల్లాల నుండి జిల్లా సరిహద్దుల్లో ప్రవేశిస్తున్న వాహనాల తనిఖీని కూడా పోలీసులు కొనసాగిస్తున్నారు. కాగా కాకినాడ త్రిటౌన్ పోలీస్ స్టేషన్లో అదుపులో ఉన్న సుమారు 50 మందితోపాటు శుక్రవారం మరికొందరినీ పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.