జాతీయ వార్తలు

హిందూత్వవర్గాలకు బిజెపి వల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తన ఉనికిని బలంగా చాటుకునే దిశగా బిజెపి అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా హిందూ గ్రూపులను బలంగా ఆకట్టుకోవాలని, ఆ రకంగా ఈ రెండు రాష్ట్రాల్లోనూ బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలని భావిస్తోంది. ఏప్రిల్, మే నెలల్లో ఈ రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 21న ప్రధాని నరేంద్ర మోదీ కోల్‌కతాలోని గౌడ్యామఠాన్ని సందర్శించనున్నారని, అది ఒక రకంగా బిజెపి ఎన్నికల ప్రచారానికి నాంది అవుతుందని చెబుతున్నారు. మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని హిందూత్వ శక్తులను సమీకృతం చేయాలన్నది బిజెపి ఆలోచనగా కనిపిస్తోంది. ఇందుకు ప్రధాని పర్యటనను అన్ని విధాలుగా సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. అలాగే ముస్లిం అనుకూల వైఖరిని అవలంబిస్తోందంటూ తృణమూల్‌పై విమర్శలు గుప్పించడం ద్వారా హిందూ వర్గాలకు గాలం వేయాలన్నది బిజెపి రాజకీయ వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది. గౌడ్యామఠం, రామకృష్ణ మఠం, ఇస్కాన్‌లలో కోటీ యాభై లక్షల మంది సభ్యులున్నారని, ప్రధాని పర్యటన ద్వారా వీరందరినీ తమవైపు తిప్పుకుంటామని బిజెపి వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటు బ్యాంకు రాజకీయ కారణంగా పశ్చిమ బెంగాల్‌లోని హిందూ ఓటర్లలో ఆందోళన మొదలైందని, సరళహిందూత్వ విధానాల ద్వారా టిఎంసి ప్రభుత్వంపై విరుచుకుపడతామని బిజెపి వర్గాలు తెలిపాయి. ఇమామ్‌లు, ఇతర ముస్లిం సంస్థలకు అనేక రకాలుగా మమతా బెనర్జీ రాయితీలు ఇస్తున్నారని, మాల్దాలో జరిగిన హింసకు బాధ్యులైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని బిజెపి సీనియర్ నేతలు తెలిపారు. ఇవన్నీ కూడా హిందూత్వ పథంలో ఎన్నికల ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి బిజెపికి అనువైన పరిస్థితులేనని అన్నారు. అలాగే కేరళలో కూడా రాజకీయంగా తన ఉనికిని చాటుకునేందుకు ఈ ఎన్నికలను బలమైన అవకాశంగా భావిస్తున్నట్టు తెలిపారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ కేరళలోని ఓ యాగంలో పాల్గొనడం, అలాగే హిందూ వర్గాలకు చేరువ కావాలంటూ బిజెపి అధ్యక్షుడు అమిత్ షా పిలుపివ్వడం ఈ వ్యూహంలో భాగమేనని అన్నారు. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ అటు పశ్చిమ బెంగాల్, ఇటు కేరళ రాష్ట్రాల్లో బిజెపి ఒక్కసీటు కూడా గెలుచుకోలేకపోయింది. అయితే 2014లో ఈ రెండు రాష్ట్రాల్లో బిజెపి ఓట్ల శాతం గణనీయంగా పెరిగింది. బెంగాల్‌లో రెండు లోక్‌సభ స్థానాలను సైతం బిజెపి గెలుచుకోగలిగింది.