హైదరాబాద్

శివారులో నేర సామ్రాజ్యం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 5: హైదరాబాద్ నగర శివారు అంతర్రాష్ట ముఠాలకు, దొంగలకు అడ్డాగా మారింది. శివారులోని నిర్మానుష్య ప్రాంతాలను నివాసముంటూ యథేచ్ఛగా కార్యకలాపాలు సాగిస్తున్నారు. పోలీసుల నామమాత్రపు పర్యవేక్షణతోనే శివారు ప్రాంతాలు అసాంఘిక శక్తులు రాజ్యమేలుతున్నాయనే విమర్శలు సర్వత్రా వినవస్తున్నాయి. ఏళ్లతరబడి అక్కడే తిష్టవేసి నేరాలకు పాల్పడుతున్నా గుర్తించే సామర్థ్యం అంతంత మాత్రమే. కార్డన్ సెర్చ్‌లు నిర్వహించినా, నేరస్తుల వివరాలు సేకరిస్తూ తనిఖీలు నిర్వహిస్తున్నా అసాంఘిక శక్తుల ఆగడాలు అగడం లేదు. బంగ్లాదేశ్ నుంచి స్వేచ్ఛగా కరెన్సీ, ఉత్తరప్రదేశ్, బీహార్‌ల నుంచి అక్రమంగా చేరే దేశవాళి తుపాకులతో ఇక్కడ నేరస్తులు రెచ్చిపోతున్నారు. అప్పట్లో దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల సూత్రధారులు, యావజ్జీవ ఖైదు శిక్షకు గురైన స్నేక్ గ్యాంగ్ ఆగడాలు ఇక్కడి నుంచే మొదలయ్యాయి. నకిలీ పాస్‌పోర్టులతో ఉగ్రవాదులను దేశ సరిహద్దులు దాటిన మహమ్మద్ నజీర్ రెండేళ్లుగా భార్యా, పిల్లలతో ఇక్కడే మకాం వేశాడు. పాస్‌పోర్టు వ్యవహారం వెలుగులోకి వచ్చిన తరువాతే.. అతడు ఉగ్రవాది అనే విషయం వెలుగుచూడకపోవడం విశేషం.
శివారు ప్రాంతాల్లో కొండలు, గుట్టలు, నిర్మానుష్య ప్రాంతాల్లోని కాలనీలు, బస్తీల్లో నివాసం ఉంటున్న క్రిమినల్ గ్యాంగ్‌లను గుర్తించడం కష్టంగా మారింది. రాజేంద్రనగర్, శంషాబాద్, పహడీషరీఫ్ ప్రాంతాల్లో అసాంఘిక శక్తులు తిష్టవేస్తున్నాయి. కోల్‌కత్త, పాట్నా, గుల్బర్గా, నాగపూర్, బీదర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే వారే అధిక సంఖ్యలో ఉంటున్నారు. బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి వచ్చిన శరణార్థులు అక్రమంగా తిష్టవేస్తున్నారు. అక్రమంగా వలస వచ్చిన విదేశీయులు 3000 వరకు ఉంటారని ఇటీవల అధికారులు లెక్కలు వేశారు. శరణార్థులు కొందరికి అనుమతి పత్రాలు కూడా జారీ చేశారు. వలసదారుల్లో సుమారు 18వందల మందిని మాత్రమే పోలీసులు గుర్తించారు. మిగిలిన వారు ఎక్కడున్నారనేది తెలుసుకోలేకపోతున్నారు. విదేశీయులే కాకుండా పలు ప్రాంతాల నేరస్తులు, రౌడీషీటర్లు కూడా ఇక్కడే మకాం వేస్తున్నారు. సైబరాబాద్ పరిధిలో సుమారు 430 మంది రౌడీషీటర్లుంటే వారిలో శంషాబాద్ జోన్‌లోనే అధికంగా 154 మంది ఉన్నారు. భూ కబ్జాలు, ప్రైవేటు పంచాయతీలతో అలజడి సృష్టిస్తున్నారు శంషాబాద్ జోన్ పరిధిలోని షాహీన్‌నగర్, ఎర్రకుంట, జల్‌పల్లి, మైలార్‌దేవ్‌పల్లి, పహాడిషరీఫ్‌లలో వలస వచ్చిన నేరస్తులు తిష్టవేస్తున్నారు. కల్తీ నెయ్యి, నూనె, పాన్ మసాలాలు, గరం మసాలాలు, పప్పు దినుసులు వంటి వాటితో కల్తీ రాయుళ్లు రాజ్యమేలుతున్నారు. కాగా ఈ అరాచకాలన్నీ పోలీసుల పర్యవేక్షణ లోపంతోనే జరుగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఆధునిక టెక్నాలజీతో నేరస్తుల ఆగడాలను అరికడతున్నామని చెబుతున్న పోలీసులు తనిఖీలు ముమ్మరం చేయాలని, అసాంఘిక శక్తుల ఆట కట్టించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
నిబంధనలు తూచ్!
సెల్లార్లు..బహుళ అంతస్తులతో అక్రమ నిర్మాణాలు
బోడుప్పల్, పీర్జాదిగూడలో జోరు
పురపాలక సంఘాలకు రూ.కోట్లల్లో నష్టం
ఉప్పల్, జూన్ 5: నగర శివారు బోడుప్పల్, పీర్జాదిగూడ పురపాలక సంఘాల పరిధిలో అక్రమ నిర్మాణాలు జోరుగా జరుగుతున్నాయి. ప్రభుత్వ పర్యవేక్షణా లోపం, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో అనుమతి లేకుండా నిబంధనలు ఉల్లంఘించి చేపట్టిన నిర్మాణాల వల్ల ప్రభుత్వ ఆదాయానికి రూ.కోట్లల్లో గండి పడుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. అనుమతికి విరుద్ధంగా సెల్లార్లు, బహుళ అంతస్తులతో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలు మరో హైటెక్ సిటీని తలపిస్తున్నాయి.
ఒకవైపు తాగునీరు, భూగర్భ డ్రైనేజీ వంటి వౌలిక వసతులు లేక ప్రజలు అవస్థలు పడుతుంటే ఆదాయానికి గండిపడే అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించడమేమిటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రధాన రహదార్లలో చేపట్టిన నిర్మాణాలతో ట్రాఫిక్ సమస్యకు దారితీస్తుందని ఆరోపణలు ఉన్నాయి. బోడుప్పల్-హేమానగర్, మల్లాపూర్ పారిశ్రామిక వాడ రహదారి, వరంగల్ జాతీయ రహదారికి ఇరువైపులా, చెంగిచర్ల ప్రధాన రహదారిలో, బొల్లిగూడం రహదారిలో అక్రమ ఇంటి నిర్మాణాలు జోరందుకున్నాయి.
పీర్జాదిగూడ పురపాలక సంఘం పరిధిలో మేడిపల్లి ప్రధాన రహదారిలో, సాయిబాబా గుడి పర్వతాపూర్ రహదారిలో, పి అండ్ టి కాలనీ, మజీద్ రహదారిలో, పీర్జాదిగూడ పాతబస్తీ-పర్వతాపూర్ రహదారిలో సెల్లార్లతో నిర్మాణాలు జరుగుతున్నాయని వాపోతున్నారు. నిబంధనలు ఉల్లంఘించి చేపట్టిన నిర్మాణాల వల్ల తామందరం ఇబ్బందులు పడుతున్నామని పక్కన నివసిస్తున్న ఇళ్ల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనుమతి గ్రౌండ్ ప్లస్ రెండు ఉంటే అదనంగా మరో రెండు, మూడు అంతస్థులు, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టినా అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పేదోడు అనుమతి లేకుండా ఇల్లు నిర్మించుకుంటే చర్యలు తీసుకుంటామని బెదిరించే అధికారులు పలుకుబడి కల్గిన వ్యక్తులు అనుమతికి విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నిస్తున్నారు. అక్రమ నిర్మాణాల వెనుక కొందరు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు సమాచారం.
ప్రధాన రహదార్లలో నిబంధనలు ఉల్లంఘించి సెట్‌బ్యాక్ లేకుండా చేపట్టిన అక్రమ నిర్మాణాల కారణంగా ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.