హైదరాబాద్

చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 7: మృగశిరకార్తెను పురస్కరించుకుని ఆస్తమా రోగులకు బత్తిని సోదరులు ఉచితంగా చేప ప్రసాదం పంపిణీ చేసేందుకు సర్వం సిద్దమైంది. నేడు ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచి మరుసటి రోజైన బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల వరకు సుమారు ఇరవై నాలుగు గంటల పాటు ప్రసాదాన్ని నిరాటంకంగా పంపిణీ చేసేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. బత్తిని కటుంబీకులు సుమారు అయిదు లక్షల మందికి అందేలా ప్రసాదం తయారు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచే గాక, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా ఈ ప్రసాదం కోసం జనం వచ్చే అవకాశముండటంతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ విభాగాలు భారీగా ఏర్పాట్లు చేశారు. కానీ ప్రసాదం పంపిణీ కోసం సోమవారం రాత్రి నుంచే పెద్ద సంఖ్యలో ఆస్తమా రోగులు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు చేరుకున్నారు.
మంగళవారం మధ్యాహ్నం నుంచే ప్రజలు క్యూ లైన్‌లో ఉన్నారు. అంతేగాక, ప్రసాదం కోసం వచ్చే ప్రజలకెలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలను సమన్వయం చేసేందుకు ప్రత్యేక కంట్రోల్ రూంను కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా తొక్కిసలాట జరగకుండా, ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా 32 క్యూ లైన్లు, ప్రసాదం పంపిణీ నిమిత్తం 40 టోకెన్ కౌంటర్లు, మరో 30 చేప పిల్లల కౌంటర్లను ఏర్పాటు చేశారు. రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో కౌంటర్లు, రూట్లు, టొకెన్ కౌంటర్లు, లక్ష చేప పిల్లల నిల్వ కోసం డ్రమ్ములను, చేప ప్రసాదం పంపిణీ క్యూ లైన్ల కోసం బ్యారికేడ్లు ఏర్పాటు చేయటం, విద్యుత్ సరఫరా అగిపోతే ప్రత్యామ్నాయంగా జనరేటర్లు, షామియానాలు, లైటింగ్, సిసి టివిలను ఏర్పాటు చేశారు. పురుషులకు, మహిళలకు, వికలాంగుల సౌకర్యార్థం ప్రత్యేకంగా బ్యారికేడ్లను ఏర్పాటు చేసి, విఐపిలకు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ప్రజలు కొర్రమీను చేప పిల్లలను కొనుగోలు చేసేందుకు మత్స్యశాఖ ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేసింది. జలమండలి అధికారులు ప్రజలకు తాగునీరు ప్యాకేట్లను ఉచితంగా సరఫరా చేయటంతో పాటు మంచినీటి ట్యాంకర్లను అందుబాటులో ఉంచింది. ఆర్టీసి అధికారులు రైల్వే, బస్ స్టేషన్లు, ఇతర ప్రధాన కూడళ్ల నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేసింది.
జిహెచ్‌ఎంసి ఏర్పాట్లు..
మహానగర పాలక సంస్థ ఆధ్వర్యంలో కూడా చేప ప్రసాదం పంపిణీ జరిగే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో తాత్కాలిక టాయిలెట్లు ఏర్పాటు చేయటంతో పాటు వేలల్లో జనం వచ్చే అవకాశమున్నందున, చెత్తాచెదారాన్ని ఎప్పటికపుడు తొలగించేందుకు వీలుగా మూడు షిఫ్టుల్లో సిబ్బందిని అందుబాటులో ఉంచనున్నారు. వైద్య ఆరోగ్య శాఖ వారు కూడా అత్యవసర మెడికల్ టీమ్స్, మొబైల్ యూనిట్లు, అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆరోగ్యశిబిరాలు..అంబులెన్స్‌లు
ఈ ఏటా చేప ప్రసాదం స్వీకరించేందుకు ఎక్కువ మంది వచ్చే అవకాశాలున్నట్లు చెబుతున్న అధికారులు, ముందు జాగ్రత్తగా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో నాలుగు వైద్య శిబిరాలను, మూడు అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచారు. ఏదైనా జరగరాని సంఘటన జరిగితే అత్యవసర సేవలందించేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ప్రశాంతంగా స్వీకరించి..సురక్షితంగా వెళ్లండి
కలెక్టర్ రాహుల్ బొజ్జా
చేప ప్రసాదం కోసం వచ్చిన ఆస్తమా రోగులు ఎలాంటి తొందరపాటు లేకుండా ప్రశాంతంగా ప్రసాదం స్వీకరించి, సురక్షితంగా తమ ప్రాంతాలకు తరలి వెళ్లాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా సూచించారు. ప్రసాదం పంపిణీకి సంబంధించి ప్రజలకెలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గత కొద్దిరోజులుగా అన్ని శాఖలను కలుపుకుని భారీ ఏర్పాట్లు చేశామని వివరించారు. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చే వారికి అర్థమయ్యే భాషల్లో ప్రకటనలిచ్చేందుకు అనౌన్సర్లను కూడా ఏర్పాటు చేశామన్నారు. అంతేగాక, ప్రసాదం పంపిణీ కార్యక్రమం ప్రశాంతంగా జరిగేందుకు గాను 35 సిసి కెమెరాలతో పోలీసులు ఎప్పటికపుడు పరిస్థితులను పర్యవేక్షిస్తుంటారని కూడా కలెక్టర్ వెల్లడించారు.