హైదరాబాద్

10న బిజెపి బహిరంగ సభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 7: నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 10న సూర్యాపేటలో భారతీయ జనతాపార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ వెల్లడించారు. ఈ సమావేశానికి బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ముఖ్య అతిధిగా హాజరుకానున్నట్లు కూడా లక్ష్మణ్ తెలిపారు. మంగళవారం బర్కత్‌పురాలోని సిటీ బిజెపి ఆఫీసులో గ్రేటర్ బిజెపి అధ్యక్షుడు బి. వెంకట్‌రెడ్డి అధ్యక్షతన బిజెపి నగర పదాధికారులు, అసెంబ్లీ నియోజకవర్గాల కన్వీనర్లు, డివిజన్ అధ్యక్షుల సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన డా.కె.లక్ష్మణ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, ఇప్పటి వరకు వివిధ రకాల అభివృద్ధి పనులకు సంబంధించి కేంద్రం రాష్ట్రానికి విడుదల చేసిన నిధుల అంశాన్ని బిజెపి కార్యకర్తలు, నేతలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల ముందు మంత్రి కెటిఆర్ ఎన్నో వాగ్దానాలు చేసి ఓట్లు దండుకున్నారని, ఆ తర్వాత కూడా వంద రోజుల ప్రణాళిక అంటూ ప్రజలను మభ్య పెట్టారే తప్పా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేసిన దాఖలాల్లేవన్నారు. రోజుకో కొత్త ప్రణాళికలతో ప్రజలను మభ్యపెడుతూ టిఆర్‌ఎస్ పార్టీ ముందుకు సాగుతుందన్నారు. ఈ రకమైన అధికారి వ్యవహారాన్ని బిజెపి పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త అడ్డుకోవాల్సిన అవసరముందన్నారు. సర్కారు అలసత్వం పుణ్యమాని చిన్న గాలి వాన వచ్చినా నగరం మొత్తం తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటుందని, ఇటీవల కురిసిన వర్షాల బీభత్సమే ఇందుకు నిదర్శనమని ఆయన వివరించారు. విశ్వనగరం అంటే చిన్న గాలివానకు అస్తవ్యస్తంగా మారటమేనా? అని లక్ష్మణ్ ప్రశ్నించారు. మంత్రి కెటిఆర్ గడిచిన రెండు నెలలుగా విదేశీ పర్యటనలకు చేస్తూ నగరాన్ని ఏ మాత్రం పట్టించుకోవటం లేదని విమర్శించారు. ఇచ్చిన వాగ్దానాలేవీ పూర్తిగా అమలు చేయటం లేదని, డబుల్ బెడ్ రూం స్కీం, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు తయారయ్యాయన్నారు. బిజెపి కార్యకర్తలు, నేతలు టిఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రజల మద్దతు కూడగట్టుకుని ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, రాష్ట్రానికిస్తున్న నిధులు వంటి అంశంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో నేతలు వెంకటరమణి, శ్యాంసుందర్‌గౌడ్, నగర ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి భవర్‌లాల్ వర్మ, ఉమామహేంద్ర, మహిళా నాయకురాలు బండారి రాధిక పాల్గొన్నారు.