హైదరాబాద్

పది దాటితే పరేషానే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 10: పేరుకే మహానగరం..రాత్రి పది గంటలు దాటిందంటే చాలు న్యూ సిటీ నుంచి ఓల్డ్ సిటీకి వెళ్లేందుకు ఒక్క ఆర్టీసి బస్సు కూడా అందుబాటులో ఉండదు. మరోవైపేమో ప్రయాణికుల సౌకర్యమే తమ లక్ష్యమంటూ ప్రకటనలు చేస్తున్న ఆర్టీసి అధికారులు రాత్రి పూట రైళ్లు, ట్రావెల్స్ బస్సులు, బస్ స్టేషన్లకు వచ్చే ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు తరలి వెళ్లేందుకు అవసరమైన సంఖ్యలో బస్సులను నడపలేకపోతున్నారు. రాత్రి పది గంటల తర్వాత సికిందరాబాద్ నుంచి కనీసం పాతబస్తీకి వెళ్లేందుకు కూడా ఆర్టీసి బస్సులు అందుబాటులో లేకపోవటంతో సికిందరాబాద్ పరిసర ప్రాంతాల్లోని వివిధ వ్యాపార సంస్థలు, ఇతర ప్రైవేటు కార్యాలయాల్లో షిఫ్టుల్లో పనిచేసే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. అంతేగాక, పగటి పూట రాకపోకలు సాగించే బస్సులో నాలుగో వంతైనా రాత్రిపూట అందుబాటులో ఉండటం లేదని వాపోయారు. ప్రధాన ప్రాంతాలైన ఆర్టీసి క్రాస్‌రోడ్డు, అఫ్జల్‌గంజ్, సికిందరాబాద్, అమీర్‌పేట, పంజాగుట్ట తదితర ప్రాంతాలకు కొన్ని బస్సులు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. ఇక సికిందరాబాద్ నుంచి పాతబస్తీ పరిసర ప్రాంతాలైన బహద్దూర్‌పురా, రాజేంద్రనగర్, గోల్కొండ, లంగర్‌హౌజ్ తదితర ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారికి కష్టాలు తప్పటం లేదు. ఈ క్రమంలో ప్రయాణికులు ప్రత్యామ్నాయంగా ప్రైవేటు క్యాబ్‌లు, ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని వీరు ఎక్కువ మొత్తంలో ఛార్జీలను డిమాండ్ చేస్తున్నట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. సికిందరాబాద్ రైల్వే స్టేషన్ నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు అరకొరగా బస్సులు రాకపోకలు సాగిస్తున్నా, వాటిని ఆపాల్సిన స్టాపుల్లో డ్రైవర్లు ఆపటం లేదని కొందరు వ్యాపారులు వాపోయారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు కుటుంబ సమేతంగా ఇరుగుపొరుగు జిల్లాలకు వెళ్లి, జూబ్లీ, గౌలీగూడ బస్ స్టేషన్లలో బస్సులు దిగినా, సికిందరాబాద్ రైల్వే స్టేషన్‌లో రైలు దిగినా, తమ ఇంటికెళ్లేందుకు బస్సులు అందుబాటులో లేకపోవటం, మరోవైపు క్యాబ్‌లు, ఆటోల్లో భద్రత ప్రశ్నార్థకంగా మారటంతో అర్థరాత్రి తమ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని ప్రయాణికులు వాపోతున్నారు. పైగా సికిందరాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్ల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే రైళ్ల సమయాలకు అంతంతమాత్రంగానే బస్సులు అందుబాటులో ఉంటున్నాయి. దశాబ్దాల క్రితం అప్పటి జనాభా, ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ఖరారు చేసిన రూట్లు, బస్సుల రాకపోకల షెడ్యూల్‌ను మరోసారి సవరించాలంటూ ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
పరిగెత్తే అక్షరాలతో ‘పాట్లు’
కొత్తగా అందుబాటులోకి వస్తున్న ఆర్టీసి బస్సుల్లో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ రూట్ బోర్డులు ప్రయాణికులను మరిన్ని కష్టాలు పాలు చేస్తున్నాయి. ఎల్‌ఇడి లైట్లతో ఏర్పాటు చేసిన ఈ బోర్డులోని అక్షరాలు వేగంగా పరిగెత్తటంతో బస్సు రూటు అర్థం గాక, వృద్థులు, చిన్నారులే గాక, యువకులు సైతం ఒకింత అయోమయానికి గురవుతున్నారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఏసి బస్సుల్లోని బోర్డులోని అక్షరాలు సైతం ఇలాగే పరిగెత్తుతున్నాయి.
‘మార్కోపోలో’ వెనక ఉంటే అంతే సంగతులు
కొంతకాలం క్రితం జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం నిధులతో నగరంలో అందుబాటులోకి వచ్చిన మార్కోపోలో కంపెనీ బస్సుల వెనక ప్రయాణిస్తే అంతే సంగతులు. ఈ బస్సులకు ఇంజన్ వెనకాభాగంలో ఉండటంతో అందులో నుంచి విపరీతమైన పొగ, శబ్దం రావటంతో బస్సు వెనకానున్న ద్విచక్ర వాహనదారులెదుర్కోనే ఇబ్బందులు వర్ణనాతీతం.