హైదరాబాద్

అద్దెకు ఫుట్‌పాత్‌లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 20: మహానగరంలో రోజురోజుకి పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఎన్ని సంస్కరణలను ప్రవేశపెట్టినా, ఆధునిక రవాణా వ్యవస్థలను అందుబాటులోకి తెచ్చినా, పాదచారులకు కష్టాలు తప్పటం లేదు. పాదచారులు నడవాల్సిన ఫుట్‌పాత్‌లను రాజకీయ నేతలు చిరువ్యాపారులకు అద్దెకు ఇస్తూ అక్రమార్జనకు పాల్పడుతుంటే, మరోవైపు జిహెచ్‌ఎంసి సులాభ్ కాంప్లెక్సులు నిర్మించటం, విద్యుత్ శాఖ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేస్తుండటంతో ఫుట్‌పాత్‌లు కనుమరుగైపోతున్నాయి. సుమారు 9వేల కిలోమీటర్ల రోడ్డున్న నగరంలో కనీసం మూడు వందల కిలోమీటర్లు కూడా ఫుట్‌పాత్ లేకపోవటం శోచనీయమంటూ మంత్రి కెటిఆర్ చురకలు పెట్టినా, అధికారుల పనితీరులో మార్పు రాలేదు. నగరంలో ఏ ప్రధాన రహదారిని చూసినా, కిలోమీటరు దూరంలో యూ టర్న్, ఎక్కడ కూడా రోడ్డు దాటేందుకు అనుకూలమైన పరిస్థితుల్లేవు. ఫుట్‌పాత్‌ల పరిరక్షణ కోసం సరిగ్గా పదకొండేళ్ల క్రితం ప్రవేశపెట్టిన హకర్స్ పాలసీ ప్రకారం అధికారులు ఫుట్‌పాత్‌ను మూడు జోన్లుగా విభజించి, కొన్నింటిలో షరతులతో కూడిన వ్యాపారాలను అనుమతించాల్సి ఉంది. కానీ అధికారులు ఈ పాలసీని కేవలం బోర్డులకే పరిమితం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో నగరంలో అసలు ఫుట్‌పాత్ ఉందా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది నెలల క్రితం చార్మినార్ వద్ధ పాదచారుల క్షేత్ర పనులను పరిశీలించిన మంత్రి కెటిఆర్ హకర్స్ పాలసీ అమలుకు చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించినా, నేటికీ అతీగతీలేదు. నగరంలో గజం భూమి ఎక్కువ ధర పలికే కోఠిలో ఓ కాంగ్రెస్ నేత ఫుట్‌పాత్‌ను కబ్జా చేసుకుని చిరువ్యాపారులకు అద్దెకిస్తున్న ఆరోపణలుండగా, ఇదే ఫుట్‌పాత్‌పై వెలుస్తున్న చిన్నాచితక వ్యాపార సంస్థల నుంచి జిహెచ్‌ఎంసి అధికారులు సైతం అమ్యామ్యాలు వసూలు చేస్తూ చూసిచూడనట్టుగా వ్యవహారిస్తున్నారు. ఫుట్‌పాత్‌ల పరిరక్షణ విషయంలో పలు సార్లు కోర్టు అక్షింతలు వేసినా, అధికారుల్లో చలనం రావటం లేదు. ఇందుకు ఒక రకంగా రాజకీయ నాయకుల ఓటు బ్యాంకు రాజకీయాలు అధికారులపై తీవ్ర స్థాయిలో వత్తిడి తెస్తున్నాయని చెప్పవచ్చు. నగరంలో వివిధ ప్రమాదాలతో మరణిస్తున్న వారిలో దాదాపు నలభై శాతం మంది ఫుట్‌పాత్‌లు లేకపోవటం వల్లే ప్రమాదాల బారిన పడుతున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నా, జిహెచ్‌ఎంసి పనితీరులో మార్పు రాకపోవటం గమనార్హం.
దృష్టి మళ్లించేందుకేనా?
పాదచారుల భద్రత కోసం ఫుట్‌పాత్ పరిరక్షణ విషయంలో చిత్తశుద్ధితో వ్యవహారించని జిహెచ్‌ఎంసి అధికారులు ప్రజల దృష్టి మళ్లించేందుకే పాదచారుల భద్రత అంటూ ఫుటోవర్ బ్రిడ్జిలను తెరపైకి తెచ్చారు. నగరంలో వివిధ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసినా, ఒక్క దిల్‌సుఖ్‌నగర్ ఎఫ్‌వోబి మాత్రమే పూర్తి స్థాయిలో ప్రజలకు ఉపయోగపడుతుందే తప్పా, మిగిలినవి నిరుపయోగంగా, ప్రైవేటు సంస్థలు, రాజకీయనేతలు ఫ్లెక్సీలు పెట్టుకునేందుకే పనికొస్తున్నాయి. అంతేగాక, వీటి అవసరం ఎక్కువగా ఉన్న సరోజినిదేవి కంటి ఆసుపత్రి, మహావీర్, ఉస్మానియా ఆసుపత్రుల వద్ధ వీటిని ఏర్పాటు చేయకపోవటం అధికారుల విధి నిర్వాహణకు నిదర్శనం. ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు, కబ్జాలను సమన్వయంతో తొలగించాల్సిన బల్దియా, నగర ట్రాఫిక్ పోలీసులు విధి నిర్వహణలో సమన్వయం మాట దేవుడెరుగు కానీ అమ్యామ్యాలు వసూలు చేసుకోవటంలో చక్కటి కో ఆర్డినేషన్‌తో ముందుకెళ్తున్నారు. పాదచారులు నడవాల్సిన ఫుట్‌పాత్‌పై వ్యాపారాలు వెలుస్తుంటే, అది తమకు సంబంధం లేదని ట్రాఫిక్ పోలీసులు చెబుతుండగా, స్థానిక నేతలు అడ్డుపడుతున్నారంటూ చెబుతూ జిహెచ్‌ఎంసి కూడా చేతులెత్తేస్తోంది. ఫలితంగా కోఠి, ఆబిడ్స్, సికిందరాబాద్, అమీర్‌పేట, పంజాగుట్ట ఇతర ప్రాంతాల్లో స్థానిక ట్రాఫిక్ పోలీసులు, రాజకీయ నేతలు ఫుట్‌పాత్‌పై వ్యాపారాలను అనుమతిస్తూ వారి నుంచి నెలసరి అద్దెలను తీసుకుంటున్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
పాతబస్తీలో మరీ దారుణం
ట్రాఫిక్ సమస్యకు సంబంధించి పాతబస్తీలో మాత్రం దేవుడు దిగి వచ్చినా పరిస్థితులు మారే అవకాశాలు కన్పించటం లేదు. ఫుట్‌పాత్ కబ్జాతో పాటు సగం రోడ్డును వ్యాపార సంస్థలు, తోపుడు బండ్లు కబ్జా చేసుకుని వ్యాపారాలు కొనసాగిస్తున్నందున అత్యవసర పరిస్థితుల్లో కనీసం 108, 104 వంటి అంబులెన్స్‌లు కూడా ముందుకు కదలని పరిస్థితులు నెలకొన్నాయి. నగర రోడ్లపై కనీసం అంబులెన్స్ కూడా దారివ్వలేని పరిస్థితులుండగా, సిటీ ఎలా గ్లోబల్ సిటీ అవుతోందంటూ కొద్దిరోజుల క్రితం మున్సిపల్ మంత్రి కెటిఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే! ముఖ్యంగా అఫ్జల్‌గంజ్ మొదలుకుని, పత్తర్‌గట్టి, మదీనా, చార్మినార్, బహద్దూర్‌పురా, ఖిల్వత్, మొఘల్‌పురా, ఛిత్రినాఖ, తలాబ్‌కట్టా, లాల్‌దర్వాజ, ఇంజన్‌బౌలీ, ఫలక్‌నుమా తదితర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా పాదచారులు రాకపోకలు సాగించాల్సిన ఫుట్‌పాత్‌లు కబ్జాల పాలై కన్పిస్తున్నాయి. అంతేగాక, వాహనాల పార్కింగ్ కోసం మహానగర పాలక సంస్థ కేటాయించిన స్థలాన్ని సైతం కబ్జా చేసి కొందరు వ్యాపారులు షాపులను నిర్మించుకున్నా, కనీసం వారిని ప్రశ్నించేందుకు బల్దియా అధికారులు గానీ, ట్రాఫిక్ పోలీసులు గానీ ముందుకు రావటం లేదు. స్థానికంగా పలుకుబడి కల్గిన కొందరు రాజకీయ నేతల నుంచి ఎలాంటి పరిణామాలెదురవుతాయోనన్న భయంతోనే పోలీసులు పాతబస్తీలో ఫుత్‌పాత్‌లు, రోడ్లు, పార్కింగ్ స్థలాలు కబ్జా పాలవుతున్నా, చూసీచూడనట్టుగా వ్యవహారిస్తున్నారు. ట్రాఫిక్‌పై స్థానికుల్లో నెలకొన్న అవగాహన రాహిత్యం, పోలీసు ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే ఫుట్‌పాత్‌ల కనుమరుగుకు కారణమన్న వాదన ఉంది. నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు వేల కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేసిన సర్కారు ఫుట్‌పాత్‌ల పరిరక్షణపై కూడా దృష్టి సారించకపోతే ప్రభుత్వం ఎన్ని కోట్లు వెచ్చించి స్కైవేలు, మల్టీ లెవెల్ ఫ్లై ఓవర్లను నిర్మించినా మున్ముందు పాదచారులు రాకపోకలు సాగించలేని దుస్థితి తలెత్తే అవకాశముంది.