హైదరాబాద్

పండుగకు పస్తులే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 26: తెల్లవారే కల్లా రోడ్లను పరిశుభ్రంగా ఊడ్చే కార్మికులు వారు. నగరాన్ని శుభ్రపరిచేందుకు అర్థరాత్రి తమ ప్రాణాలను ఫణంగా పెట్టి, నడిరోడ్డుపై విధులు నిర్వహిస్తుంటారు. కానీ పండుగొచ్చినా వారికి పస్తులు తప్పటం లేదు. భాగ్యనగరానికి క్లీన్ సిటీ, గ్రీన్ సిటీ వంటి ప్రతిష్ఠాత్మకమైన అవార్డులు వచ్చేందుకు ముఖ్య కారుకులు వీరే. అయినా నగరం మొత్తం బోనాల పండుగను ఘనంగా జరుపుకుంటుంటే వీరు మాత్రం పండుగకు పస్తులుండాల్సిన దుస్థితి. అర్దాకలితో రోజులు గడుతున్న ఈ కార్మికులు పండుగలొచ్చినా, పబ్బం వచ్చినా అన్నమోరామచంద్రా అంటూ అలమటించాల్సిన దుస్థితి. వీరిలోనే ఒక వర్గానికి చెందిన కార్మికులకు వారి పండుగ ఉందంటూ కాస్త ముందుగా జీతాలు చెల్లించటం వీరిని మనస్తాపానికి గురి చేస్తోంది. చెత్త,చెదారంలో పనులు చేస్తూ తమ ఆరోగ్యాన్ని, ఆయుశ్శును అర్పిస్తున్న ఈ కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించటంలో కాంట్రాక్టర్లు, జిహెచ్‌ఎంసి అధికారులు అసలత్వం వహిస్తున్నారు. ఒక్కరోజు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం చేపడితే చేతులకు గ్లౌజ్‌లు, కాళ్లకు బూట్లు వేసుకుంటారు.
అలాంటిది ఎప్పటికీ చెత్తలోనే పని చేస్తూ ఏ మాత్రం ఛీ కొట్టని పారిశుద్ధ్య కార్మికులకు రెండు నెలలుగా జీతాలు అందటం లేదని తెలిసింది. పర్మినెంటు ఉద్యోగుల మాట అలా ఉంచితే ప్రస్తుతం జిహెచ్‌ఎంసిలో విధులు నిర్వహిస్తున్న వారిలో అత్యధిక మంది కార్మికులు ప్రైవేటు, ఔట్‌సోర్సు ప్రాతిపదికన పనిచేస్తున్న వారే. వీరిలో పార్కు, చెత్తను తరలించే వాహనాలు నడిపే డ్రైవర్లు, శానిటరీ ఫీల్డు అసిస్టెంటు పనులు చేసే కార్మికులను నియమించిన కాంట్రాక్టర్లకు ఎప్పటికపుడు బిల్లులు చెల్లించే అధికారులు కనీసం కార్మికులకు నెలకోసారైన జీతాలు అందుతున్నాయా? అన్న విషయాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ఇదే కార్మికుల నెలసరి జీతాల్లో క్షేత్ర స్థాయి సిబ్బంది కోతలు విధిస్తూ, అసిస్టెంటు మెడికల్ ఆఫీసర్లు, డిప్యూటీ కమిషనర్ల ద్వార అదనపు కమిషనర్లకు సైతం నెలకు లక్షలాది రూపాయల ముడుపులు అందుతోన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యంగా పార్కు విభాగంలోని 181 మంది కార్మికులు, అలాగే చెత్తను తరలించే వాహనాలను నడిపే 740 మంది డ్రైవర్లలో 300 మంది లైట్ మోటార్ వెహికల్ డ్రైవర్లు కాగా, మిగిలిన వారు భారీ వాహనాలు నడిపే వారున్నారు. వీరితో పాటు 840 మంది ఎస్‌ఎఫ్‌ఏలకు కూడా గడిచిన రెండు నెలలుగా జీతాలు అందటం లేదని తెలిసింది. వీరితో పాటు ఔట్‌సోర్సు ప్రాతిపదికన పనిచేస్తున్న సిస్టమ్ ఆపరేటర్లు, అటెండర్లు వంటి కార్మికులకు కూడా రెండు నెలలుగా జీతాలు అందటం లేదని తెలిసింది. కాంట్రాక్టు సంస్థ గడువు ముగిసినా, దాన్ని పొడిగించటమో, కొత్తగా టెండర్ల ప్రక్రియను చేపట్టడమో గానీ చేయకపోవటం వల్లే రెండు నెలలుగా కార్మికులకు జీతాలు అందటం లేదు.
అడ్డదారిలో అక్రమ నియామకాలు
ప్రైవేటు, ఔట్‌సోర్సు ప్రాతిపదికన పనిచేసే ఉద్యోగం కోసం ఎవరైనా డబ్బులిస్తామంటే చాలు జిహెచ్‌ఎంసి అధికారులు తమ పరిధిలో పనిచేస్తున్న కార్మికులను నిర్దాక్షిణంగా తొలగించి, వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తున్నారు. సర్కిల్ 7 పరిధిలో అదనపు కమిషనర్ తన పలుకుబడిని ఉపయోగించి బుగ్గయ్య అనే ఓ హెల్త్ ఇన్‌స్పెక్టర్ అక్కడ అవసరం లేకపోయినా నియమించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పదిహేనేళ్ల పాటు వర్క్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన మల్లన్న అనే కార్మికుడికి మల్కాజ్‌గిరికి బదిలీ అయిందని చెప్పి, విధుల్లో నుంచి తప్పించి ఆయన స్థానంలో ఇటీవలే మరొకర్ని నియమించిన ఘటన వెలుగుచూసింది.
కార్మిక శాఖకు జిహెచ్‌ఎంఇయు ఫిర్యాదు
కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించటంలో ఎలాంటి అభ్యంతరాలు చెప్పని అధికారులు కాంట్రాక్టు, ఔట్‌సోర్సు ఉద్యోగులకెందుకు సకాలంలో జీతాలు చెల్లించటం లేదంటూ ఎనిమిది కాంట్రాక్టు సంస్థలపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు ఊదరిగోపాల్ ప్రశ్నించారు. ఈ మేరకు కాంట్రాక్టర్లపై కార్మిక శాఖకు ఫిర్యాదు చేసినట్లు కూడా ఆయన తెలిపారు. కార్మికులకు సక్రమంగా జీతాలు చెల్లించాలని, ఒక్క కార్మికుడినైనా అన్యాయంగా తొలగిస్తే ఊరుకునేది లేదని కూడా గోపాల్ హెచ్చరించారు.