హైదరాబాద్

విజయవంతంగా పల్స్ పోలియో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, జనవరి 17: రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. ఉదయం నుంచే చిన్నారులకు పోలియో చుక్కలను వేయించేందుకు చిన్నారుల తల్లిదండ్రులు ఆయా కేంద్రాల వద్ద బారులు తీరారు. సర్కిల్ పరిధిలోని రాజేంద్రనగర్, అత్తాపూర్, మైలార్‌దేవ్‌పల్లి, శాస్ర్తిపురం, సులేమాన్‌నగర్ డివిజన్లలోని పలు బస్తీల్లో పోలియో చుక్కల పంపిణీ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని బాబుల్‌రెడ్డినగర్ బస్తీలోని అంగన్‌వాడీ కేంద్రంలో పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో నవజ్యోతి యూత్ క్లబ్ సభ్యులు ఏర్వ కుమారస్వామి పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలను వేశారు. ఏర్వ కుమారస్వామి మాట్లాడుతూ.. పోలియో రహిత రాష్ట్రంగా తయారు చేయడానికి ఉద్యమంగా ముందుకు కదలలన్నారు. క్లబ్ సభ్యులు బాశెట్టి వెంకటేశ్వర్‌రావు, రమేష్‌రెడ్డి, కిరణ్, అరవింద్, సుమన్, అంగన్‌వాడీ టీచర్లు లక్ష్మి, అనిత పాల్గొన్నారు.
వికారాబాద్‌లో..
వికారాబాద్: పోలియోరహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ విశ్వనాథం సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం మున్సిపల్ పరిధిలోని వెంకటాపూర్ తాండ, టెలిఫోన్ ఎక్స్చేంజ్, ఎనె్నపల్లిలో పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికి చుక్కలు వేయించి పోలియో మహమ్మారిని తరిమి కొట్టాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మహ్మద్ అలి, డిసిసిబి డైరక్టర్ ఎన్.కిషన్‌నాయక్, మున్సిపల్ వైస్‌చైర్మన్ హెచ్.సురేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎ.సుధాకర్‌రెడ్డి, నాయకుడు శంకర్ పాల్గొన్నారు.
తాండూరులో..
తాండూరు: తాండూరు డివిజన్, పట్టణ ప్రాంతాల్లో పల్స్‌పోలియో విజయవంతమైంది. తాండూరు జిల్లా ఆసుపత్రిలో ఆదివారం ఉదయం పల్స్‌పోలియోను మున్సిపల్ చైర్‌పర్సన్ విజయలక్ష్మీ ప్రారంభించారు. డివిజన్‌లో సుమారు 12వేల మంది ఐదేళ్లలోపు పిల్లలకు పోలియోచుక్కలు పంపిణీ చేశారు. సోమవారం ఇంటింటికి వెళ్లి పోలియోచుక్కలను వేయించుకోని వారిని గుర్తించి పంపిణీ చేస్తామని ఇన్‌చార్జి డాక్టర్ శ్రీనివాస్ వెల్లడించారు.

నేరేడ్‌మెట్, జనవరి 17: గ్రేటర్ హైదారాబాద్ ఎన్నికల నామినేషన్‌ల ప్రక్రియకు ఆదివారం చివరి రోజు కావడంతో వివిధ పార్టీల అభ్యర్థులు తమ మద్దతుదారులతో ర్యాలీగా తరలివచ్చి మల్కాజిగిరి సర్కిల్ కార్యాలయంలో నామినేషన్‌లు దాఖలు చేశారు. నామినేషన్‌లకు చివరి రోజు కావడంతో ఆరు డివిజన్‌లకు అన్ని పార్టీల నుంచి వంద నామినేషన్‌లు దాఖలైనట్టు రిటర్నింగ్ అధికారి తెలిపారు. నేరేడ్‌మెట్ డివిజన్ నుండి 21, వినాయకనగర్ డివిజన్-13, వౌలాలి డివిజన్-14, ఈస్ట్ ఆనంద్‌బాగ్-22, మల్కాజిగిరి-19, గౌతంనగర్ డివిజన్ నుంచి 11 నామినేషన్‌లు దాఖలు అయ్యాయి.
భారీ ర్యాలీలుగా తరలివెళ్లి..
రాజేంద్రనగర్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఆదివారంతో ముగియడంతో అన్ని రాజకీయ పార్టీల నాయకులు నామినేషన్లు వేసేందుకు నువ్వా నేనా అనే రీతిలో భారీ స్థాయిలో ర్యాలీలు నిర్వహించి నామినేషన్లు వేశారు. ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు సైతం పోటీ పడుతూ ర్యాలీలు నిర్వహించి తమ సత్తా చాటారు.
మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌లో..
గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఆదివారం ముగియడంతో తెదేపా పార్టీ అభ్యర్థి టి.ప్రేమ్‌దాస్‌గౌడ్ దుర్గానగర్‌లోని దుర్గామాత ఆలయంలో ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ నుంచి ఓపెన్ టాప్ జీపులో 10వేల మందితో భారీ ర్యాలీగా దుర్గానగర్ మీదుగా మున్సిపల్ కార్యాలయంలోకి తరలివెళ్లి నామినేషన్ వేశారు. టిఆర్‌ఎస్ అభ్యర్థి తోకల శ్రీనివాస్‌రెడ్డి తన తండ్రి శ్రీశైలంరెడ్డితో కలిసి భారీగా టపాసులు పేలుస్తూ, భాజభజంత్రీల మధ్య మైలార్‌దేవ్‌పల్లి హనుమాన్ దేవాలయంలోకి పాదయాత్రగా వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్యతో కలిసి భారీ ర్యాలీగా నామినేషన్‌ను వేయడానికి మున్సిపల్ కార్యాలయానికి తరలివెళ్లారు. కాంగ్రెస్ అభ్యర్థి సానెం శ్రీనివాస్‌గౌడ్ తన అనుచరవర్గంతో మణికంఠహిల్స్‌లోని అయ్యప్ప దేవాలయం, కాటేదాన్‌లోని హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భారీ ర్యాలీగా ఓపెన్ టాప్ జీపులో ఊరేగింపుగా తరలివెళ్లి మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి వసంత కుమారికి నామినేషన్ పత్రాలను అందజేశారు.
రాజేంద్రనగర్ డివిజన్‌లో..
నామినేషన్ల ప్రక్రియ ఆదివారంతో ముగియడంతో డివిజన్‌లోని అన్ని రాజకీయ పార్టీలు తన బలాన్ని నిరూపించుకోవడానికి భారీ ర్యాలీలు నిర్వహించి నామినేషన్లను వేశారు. టిడిపి తరపున అప్పారెడ్డిగూడెం మాధవి భీమయ్య తన అనుచరవర్గంతో భారీ ఎత్తున ర్యాలీగా తరలివచ్చి నామినేషన్ పత్రాన్ని అందజేశారు. టిఆర్‌ఎస్ నుంచి కోరణి శ్రీలత పార్టీ నాయకులు, కార్యకర్తలతో భారీగా తరలివచ్చి మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి దివ్య ఇంద్రారెడ్డి ట్రస్ట్ చైర్మెన్ పి.కార్తీక్‌రెడ్డితో తరలివచ్చి నామినేషన్ పత్రాన్ని అందజేశారు.
అత్తాపూర్ డివిజన్‌లో..
అత్తాపూర్ డివిజన్ తెదేపా అభ్యర్థులుగా ఇద్దరు పోటీ పడుతూ తమ నామినేషన్లను భారీ ర్యాలీగా తరలివచ్చి వేశారు. తెదేపా నుంచి మాధవి, వసుంధర.. తమ అనుచర వర్గాలతో కలిసి వచ్చి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అత్తాపూర్ డివిజన్‌లో తెదేపా నుంచి అధికారికంగా సి.స్వప్నను ప్రకటించారు. దీంతో అసంతృప్తి అభ్యర్థులు రెబల్‌గా పోటీ పడి నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్ కూతురు స్వప్నకు అధికారికంగా టికెట్ కేటాయించారు. టిఆర్‌ఎస్ నుంచి రావుల విజయ జంగయ్య ఆదివారం కార్యకర్తలతో భారీ ర్యాలీగా తరలివచ్చి నామినేషన్లు పత్రాన్ని రిటర్నింగ్ అధికారికి అందజేశారు. తెదేపా మిత్రపక్షమైన.. రెబల్‌గా బిజెపి తరపున తృప్తి శ్రీ్ధర్.. కార్యకర్తలు, నాయకులతో భారీగా తరలివచ్చి నామినేషన్‌ను దాఖలు చేశారు. భాజపా రాష్ట్ర నాయకులు మల్లారెడ్డి నేతృత్వంలో ర్యాలీగా తరలివచ్చి నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు. శాస్ర్తిపురం, సులేమాన్‌నగర్ డివిజన్ల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చి నామినేషన్లు దాఖలు చేశారు.
పథకాలే టిఆర్‌ఎస్‌ను గెలిపిస్తాయి
ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలే గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ను గెలిపిస్తాయని ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య అన్నారు. ఆదివారం గ్రేటర్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగింపులో మున్సిపల్ కార్యాలయంలో టిఆర్‌ఎస్ అభ్యర్థుల నామినేషన్‌ల ప్రక్రియలో పాల్గొన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 మాసాల్లో కనివిని ఎరుగని రీతిలో హైదరాబాద్‌ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దిన ఘనత కేసిఆర్‌కే దక్కిందని అన్నారు.
అమలుకు నోచుకొని వాగ్దానాలతో..
అమలుకు సాధ్యం కాని వాగ్దానాలను చేసి ప్రజలను మోసగిస్తూ గ్రేటర్‌లో గెలువడానికి టిఆర్‌ఎస్ కుట్ర పన్నుతుందని ఇంద్రారెడ్డి ట్రస్ట్ చైర్మెన్, కాంగ్రెస్ యువ నాయకుడు పి.కార్తీక్‌రెడ్డి మండిపడ్డారు. గోదావరి, కృష్ణ వాటర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందని.. టిఆర్‌ఎస్ తాము చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు.
గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌తోనే పోటీ
గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు టిడిపి మధ్యే పోటీ ఉంటుందని, టిఆర్‌ఎస్ దరిదాపుల్లో పోటీ కాదని రంగారెడ్డి జిల్లా టిడిపి జిల్లా అధ్యక్షుడు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్ అన్నారు. నామినేషన్ల ప్రక్రియలో పాల్గొని ప్రసంగించారు. గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు క్యాడర్ లేకున్నా ప్రతిపక్షాల నుంచి నాయకులను ప్రలోభాలకు గురిచేసి తన వైపు తిప్పుకొని టికెట్లు కేటాయించారని అన్నారు.
ముగిసిన నామినేషన్ల ప్రక్రియ
జిహెచ్‌ఎంసి ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులకు గేట్‌లోపలికి వచ్చిన వారందరికీ నామినేషన్లు వేసేందుకు పోలీసులు అనుమతించారు. ఆదివారం నామినేషన్‌లకు చివరి రోజు కావడంతో రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఐదు డివిజన్లలో మొత్తం 81 నామినేషన్లు సాయంత్రం వరకు దాఖలయ్యాయి. సులేమాన్‌నగర్ నుంచి ఆరు నామినేషన్లు, శాస్ర్తిపురం నుంచి 10 నామినేషన్లు, మైలార్‌దేవ్‌పల్లిలో 17 మంది, రాజేంద్రనగర్‌లో 27 నామినేషన్లు, అత్తాపూర్‌లో 21 మంది నామినేషన్లను వేశారు. అన్ని రాజకీయ పార్టీల నుంచి అసంతృప్తులు పెరుగడంతో రెబల్స్‌గా బరిలోకి దిగారు. నామినేషన్ల పరిశీలన సోమవారం జరుగనుంది.
సరూర్‌నగర్‌లో..
సరూర్‌నగర్: సరూర్‌నగర్, ఆర్కేపురం డివిజన్లకు చెందిన వివిధ పార్టీల అభ్యర్థులు భారీ ర్యాలీలతో ఆదివారం తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఆర్కేపురం డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా దేప సురేఖ భాస్కర్‌రెడ్డి, భాజాపా నుంచి రాధాధీరజ్‌రెడ్డి నామినేషన్లు వేశారు. సరూర్‌నగర్ డివిజన్ నుంచి తెదేపా నుంచి అకుల అకిల అరవింద్, కాంగ్రెస్ నుంచి లోక్‌సాని కొండల్‌రెడ్డి భార్య సరూర్‌నగర్ మండలం ఎంపిడిఒ కార్యలయంలో తమ నామినేషన్లను దాఖాలు చేశారు. ఆర్కేపురం కాంగ్రెస్ అభ్యర్థిగా దేప సురేఖ భాస్కర్‌రెడ్డి తమ అనుచరులతో కలసి పెద్దఎత్తున ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్‌టిఆర్‌నగర్ ఫేస్-3, శ్రీనగర్ కాలనీ, వాస్తుకాలనీలో పాదయాత్ర నిర్వహించారు. దేప సురేఖ భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ..గతంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి పనులే మమ్మల్ని గెలిపిస్తాయని అన్నారు. తెరాసా ప్రభుత్వం వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు దాటుతున్న, ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని పేర్కొన్నారు. ఎన్‌టిఆర్ నగర్‌ను రేగ్యులేషన్ చేస్తాన్న వాగ్ధనాలు ఇప్పటికి నేరవేర్చలేదని విమర్శించారు.
టిఆర్‌ఎస్, కాంగ్రెస్ పోటాపోటీ ర్యాలీ
బేగంపేట: సికిందరాబాద్, సనత్‌నగర్ నియోజకవర్గం నుండి ఆయా కాంగ్రెస్, టిఆర్‌ఎస్ అభ్యర్థులు పోటాపోటీగా ర్యాలీగా వచ్చి సికిందరాబాద్ జిహెచ్‌ఎంసి సర్కిల్‌లో నామినేషన్లు వేశారు. బేగంపేట కాంగ్రెస్ అభ్యర్థి టి.మహేశ్వరి రాంగోపాల్‌పేట డివిజన్ కార్పొరేటర్ కిరణ్మయి, బన్సిలాల్‌పేట డివిజన్ రజనీదేవి, మోండా డివిజన్ నుంచి వసంత యాదవ్ ర్యాలీగా వచ్చి నామినేషన్లు వేశారు. బేగంపేట కార్పొరేటర్ అభ్యర్థి మహేశ్వరి బేగంపేట కట్టమైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ర్యాలీగా వచ్చారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి దగ్గర వుండి కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు వేయించారు. శశిధర్‌రెడ్డి వెంట స్థానిక కాంగ్రెస్ నేతలు శ్రీహరి, కిషోర్‌కుమార్, ఎంఆర్ బాలకృష్ణ, గుంటి సత్యనారాయణ పాల్గొన్నారు.
జెండాను మోసిన వారికి
టికెట్ కేటాయించరా?
నార్సింగి: గోల్కొండ కోటలో టిఆర్‌ఎస్ జెండాను మోసిన వారికి టికెట్ కేటాయించకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గోల్కొండ డివిజన్ నుంచి రాజమల్లేష్ యాదవ్ మాట్లాడుతూ తాను ముందునుంచి పార్టీలో పనిచేస్తున్నానని తెలిపారు. ప్రజలతో కనీస పరిచయం లేని వారికి పార్టీ టికెట్ ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. తాము ఇన్నాళ్లూ పార్టీలో జెండాను పట్టుకుని పనిచేసిన తర్వాత తమకు టికెట్ ఇవ్వకపోవడంలో ఆంతర్యమేమిటని, తమ పరిస్థితి ఏమిటని పేర్కొన్నారు.

పోలియో నుంచి చిన్నారులను కాపాడుకోవాలి
* ఎమ్మెల్యే కెపి వివేక్
జీడిమెట్ల, జనవరి 17: ఐదేళ్లలోపు వయస్సు గల చిన్నారులందరికి పల్స్‌పోలియో చుక్కలను తప్పనిసరిగా వేయించాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేక్ సూచించారు. జీడిమెట్ల డివిజన్‌లోని కుత్బుల్లాపూర్ గ్రామం, అయోధ్యనగర్‌లలో పల్స్‌పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ పోలియో వ్యాధి మహమ్మారి నుండి చిన్నారులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఐదు సంవత్సరాలలోపు చిన్నారులందరికి తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలను వేయాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు గడ్డం రాజేందర్‌రెడ్డి, రాజ్‌కుమార్, జాన్సీ, ఇందిర పాల్గొన్నారు. అదేవిధంగా కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని జగద్గిరిగుట్ట, చింతల్, రంగారెడ్డినగర్, గాజులరామారం, సూరారం, సుభాష్‌నగర్, కుత్బుల్లాపూర్ డివిజన్‌లలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. నిజాంపేట్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో గ్రామ సర్పంచ్ శెనిగల ప్రమీల సాయిలు యాదవ్ చిన్నారులకు పోలియో చుక్కలను వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అదేవిధంగా మండలంలోని బాచుపల్లి, ప్రగతినగర్, మల్లంపేట్, బౌరంపేట్, దొమ్మరపోచంపల్లి, గాగిల్లాపూర్, దుందిగల్, బహద్దూర్‌పల్లి, దూలపల్లి, కొంపల్లి గ్రామాలలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

నామినేషన్ల వరద
తిరుగుబాటు బెడద!

చివరి రోజు అభ్యర్థుల హడావుడి
కాంగ్రెస్-698, టిఆర్‌ఎస్-888, టిడిపి-608, బిజెపి-456, మజ్లిస్ 89 నామినేషన్లు
ఒక్కో పార్టీ నుంచి డివిజన్‌కు అయిదారుగురు దరఖాస్తు
చివరి నిమిషంలో జాబితా ఖరారు చేసిన టిడిపి
14 స్థానాల్లో నామినేషన్లు వేయని మజ్లిస్
మొత్తం నామినేషన్లు 4069.. నేడు పరిశీలన

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 17: జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో అన్ని పార్టీలకు రెబెల్స్ బెడద తప్పేట్టు లేదు. వివిధ పార్టీల అధినాయకులు అభ్యర్థుల ఎంపిక కోసం ఎంతో కసరత్తు చేసినా, టికెట్లు ఆశిస్తూ ప్రధాన పార్టీల్లో ఒక్కో పార్టీకి చెందిన అభ్యర్థులు వందల సంఖ్యలో నామినేషన్లు సమర్పించారు. వీరిలో ఎవరికి బి ఫారం దక్కుతుందో తెలియని అయోమయం నెలకొంది. కానీ నామినేషన్ల స్వీకరణ ఆదివారం ముగిసిన వెంటనే వివిధ పార్టీలకు చెందిన తిరుగుబాటు నేతలను బుజ్జగించే పనిలో పడ్డారు. నామినేషన్ల స్వీకరణకు గడువు ముగిసిన ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల కల్లా మొత్తం 150 డివిజన్లలో 1704 నామినేషన్లు దాఖలైనట్లు, మొత్తం నామినేషన్ల సంఖ్య 2969కు చేరినట్లు కమిషనర్ జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఒక్కో డివిజన్‌లో ఒక్కో పార్టీ తరపున నలుగురు, అయిదుగురు అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. వీరిలో అసలు అభ్యర్థి ఒకరే అయినా, అందరూ బి ఫారంపై ఆశలు పెట్టుకున్నారు. అసలు అభ్యర్థి ఎంపిక కోసం అధికార పార్టీతో పాటు విపక్షాలకు చెందిన అధినాయకులు ఆదివారం నుంచే బుజ్జగింపు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా అభ్యర్థుల ఎంపికపై అధికార పార్టీ టిఆర్‌ఎస్‌తో పాటు ఇతర పార్టీలు రోజుల తరబడి కసరత్తు చేసినా, టిఆర్‌ఎస్ మినహా మగిలిన పార్టీలన్నీ పూర్తి స్థాయిలో డివిజన్లకు అభ్యర్థులను ఖరారు చేయలేకపోయాయి. ముఖ్యంగా టిడిపి, బిజెపి పార్టీల సీట్ల సర్దుబాటు చర్చలు ఆదివారం ఉదయం ఓ కొలిక్కి వచ్చి, చివరి నిమిషంలో అభ్యర్థుల పేర్లు ఖరారు చేయటంతో నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులు రిటర్నింగ్ కార్యాలయాలకు పరుగులు తీశారు. అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు కార్యాలయాలకు రావటంతో బల్దియా ఆఫీసులకు కార్యకర్తలు, నేతల తాకిడి నెలకొంది. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థుల ఎంపిక కోసం ఎంత కసరత్తు చేసినా మజ్లిస్ పార్టీ మొత్తం 75 డివిజన్లకు పోటీ చేయాలని భావించినా, నామినేషన్ సమర్పణ చివరి క్షణం వరకు 61 డివిజన్లలో నామినేషన్లు దాఖలు చేయగలిగారు. ఇక బిజెపి పార్టీ ప్రస్తావనకొస్తే మిత్రపక్షమైన టిడిపితో కలిసి 63 సీట్లకు పోటీ చేయాలని నిర్ణయించినా, ఆ పార్టీ నుంచి సుమారు 308 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి 150 డివిజన్లకు గాను 501 నామినేషన్లు దాఖలయ్యాయంటే ఒక్కో డివిజన్ నుంచి ముగ్గురు లేదా నలుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారని చెప్పవచ్చు. అలాగే టిఆర్‌ఎస్ పార్టీ నుంచి కూడా 150 డివిజన్లకు ఏకంగా 698 మంది నామినేషన్లు దాఖలు చేశారంటే ఒక్కో డివిజన్ నుంచి నలుగురు, పలు డివిజన్లలో అయిదుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారని చెప్పవచ్చు. ఇక గ్రేటర్‌లో పోటీ చేయటం లేదని ప్రకటించుకున్న వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కూడా మూడు నామినేషన్లు దాఖలు కాగా, అధికార టిఆర్‌ఎస్ పార్టీ తర్వాత అత్యధికంగా నామినేషన్లను స్వతంత్రులు సమర్పించారు.
ఖర్చుపై నిఘా
రూ. పదిలక్షలు దాటే లావాదేవీల వివరాలివ్వాలి
బ్యాంకర్లకు జిహెచ్‌ఎంసి కమిషనర్ సూచన
ఎన్నికల వ్యయ నియంత్రణకు చర్యలు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 17: జిహెచ్‌ఎంసి ఎన్నికల వ్యయాన్ని నియంత్రించేందుకు ఆర్థికపరమైన లావాదేవీలపై జిహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి. జనార్దన్‌రెడ్డి ఆంక్షలు విధించారు. బ్యాంకులలో రూ. పది లక్షలకు పై బడి డిపాజిట్‌లు, విత్‌డ్రాలు జరిగితే అట్టి వివరాలను జిహెచ్‌ఎంసి ఎన్నికల అధికారికి పంపాలని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒకే బ్యాంకు నుంచి పలు బ్యాంకు ఖాతాలకు ఆర్టిజిఎస్ ద్వారా నగదు పంపిణీ జరిగినట్లయితే అట్టి వివరాలను, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు గాని, వారి కుటుంబ సభ్యులు గాని లక్ష రూపాయల కంటే ఎక్కువ విత్‌డ్రా చేస్తే అలాంటి వివరాలను వెంటనే అందజేయాలని స్పష్టం చేశారు. ఈ అంశాలకు సంబంధించి రోజువారి నివేదికలను పంపాల్సిందిగా ఆయన బ్యాంకర్లకు సూచించారు. అదే విధంగా బ్యాంకులకు, ఏటిఎంలకు పెద్ద మొత్తంలో తరలించే డబ్బును కేవలం సంబంధిత బ్యాంకుల అధికారికా వాహనాల్లో మాత్రమే తరలించాలని కమిషనర్ స్పష్టం చేశారు. ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలు, కంపెనీల ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు తరలించరాదని పేర్కొన్నారు. ఏటిఎంలలో డబ్బును వేసేందుకు నగదును తీసుకువెళ్లే ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలు, కంపెనీలకు సంబంధిత బ్యాంకు ఇచ్చే అధికారిక లెటర్లు, పత్రాలు కల్గి ఉండాలని వివరించారు. నగదును తరలించే ఔట్‌సోర్సింగ్, కంపెనీలను జిహెచ్‌ఎంసి ఎన్నికల అధికారి గాని, రాష్ట్ర ఎన్నికల సంఘం గానీ గుర్తించిన అధికారులు గాని తనిఖీ చేయవచ్చునని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు సంబంధిత బ్యాంకులన్నింటికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ జనరల్ మేనేజర్‌గా ఉన్న ఎస్‌బిహెచ్‌కు లిఖితపూర్వకంగా లేఖ కూడా రాసినట్లు కమిషనర్ జనార్దన్‌రెడ్డి తెలిపారు.
కెపిహెచ్‌బిలో భారీ చోరీ
కెపిహెచ్‌బికాలనీ, జనవరి 17: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఇంటి యజమానులు సొంత ఊరుకు వెళ్లగా ఇంటి తాళాలు పగలగొట్టి 50 తులాల బంగారం, రెండున్నర కెజీల వెండి, రూ.25వేల రూపాయల నగదును అపహరించుకొని పరారైన సంఘటన కెపిహెచ్‌బి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ప్రగతినగర్‌లోని శ్రీసాయి అంబిక రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లో నివాసముంట్తున్న శ్రీనివాస్‌రావు సంక్రాంతి సందర్భంగా ఈనెల 13న సొంత ఊరైన విజయవాడకు వెళ్లారు. తిరిగి ఆదివారం ఉదయం విజయవాడ నుండి ప్రగతినగర్‌లోని నివాసానికి చేరుకొగా ఇంటి తాళాలను పగలగొట్టి బిరువాలోని బంగారం, వెండి, రూ.25వేల నగదును అపహరణకు గురైనట్లు గమనించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాంలో సాక్షాధారాలను సేకరించారు.
పాతబస్తీ దాటి...సత్తా చాటి...

సాంస్కృతిక సంస్థ నుంచి రాజకీయ పార్టీగా ఆవిర్భావం ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో ఉనికి చాటుకున్న ఎంఐఎం

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 17: మజ్లిస్ పార్టీ అంటే పాతబస్తీకే పరిమితమనుకుంటారు. ఇదంతా గతం. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ సరిహద్దులు దాటి తెలంగాణ రాష్ట్రం నుండి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. మహారాష్ట్ర ఎన్నికల్లో సత్తా చాటింది. కర్నాటక మున్సిపల్ ఎన్నికల్లో అనేక వార్డులు గెలిచింది. మజ్లిస్ పార్టీ అనగానే ఒవైసీ సోదరులు గుర్తుకొస్తారు. వీరిలో పెద్దన్నయ్య అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ ఎంపిగా ఉంటే, సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీ తెలంగాణ శాసనసభలో మజ్లిస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఉన్నారు. మజ్లిస్ ఇఫ్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) సాంస్కృతిక సంస్థగా ఏర్పడింది.
ఎంఐఎంకు ఖాసీం రజ్వీ నాయకత్వం వహించారు. ఖాసీం రజ్వీ అంటే పోలీసు యాక్షన్ కంటే ముందు జరిగిన రక్తసిక్తమైన చరిత్ర గుర్తుకొస్తుంది. అదంతా గతం. ఈ రోజు మజ్లిస్ పార్టీ జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఉరకలేస్తోంది. ఈ పార్టీ అండదండలు లేకుండా మేయర్ పదవిని గెలుచుకోవడం కష్టం.
చరిత్రలోకి వెళితే, 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ హైదరాబాద్ దక్కన్ సంస్థానం మాత్రం దేశంలో విలీనం కాలేదు. కమ్యూనిస్టు యోధులు, ఆర్యసమాజ్ సంస్ధలు నిజాంపాలనపై తిరుగుబాటు చేశాయి. 1948లో సెప్టెంబర్ 17న పోలీసు యాక్షన్ జరిగింది. హైదరాబాద్ దక్కన్ స్టేట్‌ను భారత్‌లో విలీనం చేయాలంటూ నిజాంపై ఒత్తిడి పెరిగింది. అనంతరం పోలీసు యాక్షన్ ద్వారా హైదరాబాద్ సంస్ధానానికి విముక్తి కలిగింది. ఖాసిం రజ్వీని భారత సైన్యం బంధించింది. ఖాసిం రజ్వీపై దేశద్రోహం కేసు పెట్టి ఎరవాడ జైల్లో నిర్బంధించారు. 1957లో ఖాసిం రజ్వీని విడుదల చేస్తూ దేశం విడిచి వెళ్లిపోవాలని నాటి ప్రభుత్వం ఆదేశం మేరకు ఖాసిం రజ్వీ పాకిస్తాన్ వెళ్లిపోయాడు. రజ్వీ పాకిస్తాన్ వెళ్లిపోతూ నాటి ఎంఐఎం సాంస్కృతిక సంస్థను న్యాయవాది అబ్దుల్ వసీం ఒవైసీకి అప్పజెప్పారు. అప్పటి నుంచి ఎంఐఎం అబ్దుల్ వసీం ఒవైసీ నేతృత్వంలో కొనసాగింది. అబ్దుల్ వసీం తమ సాంస్కృతిక సంస్థ ద్వారా ప్రజల్లో మమేకం కావడం, మైనార్టీ ప్రజల ఆదరణ పొందడంతో సంస్థకు ప్రజాబలం చేకూరింది. అనేక కారణాలతో 11నెలల పాటు అబ్దుల్ వసీంను అప్పటి ప్రభుత్వం జైల్లో పెట్టింది. 1958లో ఎంఐఎం సాంస్కృతిక సంస్థను ఆలిండియా మజ్లిస్ ఇఫ్తెహాదుల్ ముస్లిమీన్ రాజకీయ పార్టీగా మార్చారు. అబ్దుల్ వసీం మరణించగా అతని కుమారుడు సలావుద్దీన్ ఒవైసీ ఎఐఎంఐఎం పార్టీ పగ్గాలు చేపట్టారు. 1962లో మొదటి సారిగా హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి. సలావుద్దీన్ ఒవైసీ తన 19వ ఏటనే నాంపల్లి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. ఆ తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పత్తర్‌గట్టి నుంచి గెలుపొందారు. 1971లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది. 1999 వరకు పాతబస్తీ నుంచి వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన సలావుద్దీన్ ఒవైసీ మజ్లిస్ పార్టీ తరఫున ఐదుగురు ఎమ్మెల్యేలను గెలిపించుకొని పార్టీని బలోపేతం చేశారు. కాగా 1994లో పార్టీ నాయకత్వంలో ఏర్పడిన విభేదాల కారణంగా నాటి ఎమ్మెల్యే అమానుల్లాఖాన్ ఎంఐఎంను వీడి ఎంబిటి (మజ్లిస్ బచావో తహరిక్) పార్టీని స్థాపించారు. నాటి నుంచి ఎంఐఎం, ఎంబిటి పార్టీలు ఒక్కొక్క స్థానానే్న గెలుస్తూ వచ్చాయి. 2004లో సలావుద్దీన్ ఒవైసీ మృతి చెందగా ఆయన కుమారుడు అసదుద్దీన్ ఒవైసీ పార్టీ పగ్గాలు చేపట్టారు. మతతత్వ పార్టీగా ముద్ర పడిన మజ్లిస్ పార్టీ, ప్రజాపార్టీయేనని, ఈ పార్టీలో కుల, మత విభేదాలు లేవని, మజ్లిస్ నాయకత్వంలో ఎలాంటి మత విద్వేషాలు, మత ఘర్షణలు జరగవని నిరూపించిన అసదుద్దీన్ ఒవైసీ అంచెలంచెలుగా పార్టీని బలోపేతం చేశారు. నలుగురు కార్పొరేటర్లు ఉన్న పార్టీలో 44మంది కార్పొరేటర్లు, ఏడుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలను గెలిపించుకొని తెలంగాణలోనే కాకుండా మహరాష్టల్రో కూడా పాగా వేశారు. మహారాష్టల్రో ఒక ఎమ్మెల్యే స్థానంతో పాటు 120 స్థానిక సంస్థల్లో విజయం సాధించారు. ఔరంగాబాద్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 28 స్థానాలు గెలుచుకున్నారు. ఒక సాంస్కృతిక సంస్థ నుంచి ఆవిర్భవించిన ఎంఐఎం పార్టీ దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది.
టిఆర్‌ఎస్‌కు తెలంగాణ లోక్‌సత్తా సంపూర్ణ మద్దతు
కాచిగూడ, జనవరి 17: జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీకి తెలంగాణ లోక్‌సత్తా పార్టీ సంపూర్ణ మద్దతును ప్రకటించింది. ఈ సందర్భంగా ఆదివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో తెలంగాణ లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు ధర్మారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నగరాన్ని అభివృద్ధి చేస్తుందన్న నమ్మకంతో టిఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. గ్రేటర్ ఎన్నికల్లో ఓట్లుచీల్చే ప్రయత్నం తమ పార్టీ చేయడం లేదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రజలను చైతన్యం చేశాయని తెలిపారు. గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు పూర్తి సహయ, సహకారాలను అందిస్తామని వివరించారు. సమావేశంలో లోక్‌సత్తా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

అభ్యర్థులకు కేటాయించే
హోర్డింగ్‌ల వివరాలివ్వండి

జిహెచ్‌ఎంసి కమిషనర్ ఆదేశం

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 17: జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు ప్రచారం నిమ్తితం కేటాయించే హోర్డింగ్‌లు, అడ్వర్‌టైజ్‌మెంట్ పోల్స్‌కు సంబంధించి అద్దె వసూళ్ల వివరాలను ఎప్పటికపుడు స్థానిక డిప్యూటీ కమిషనర్లకు, ఎన్నికల అధికారులకు అందజేయాలని కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి అభ్యర్థులకు సూచించారు. నగరంలో వివిధ ఎజెన్సీలు నిర్వహిస్తున్న హోర్డింగ్‌లు, యునిపోల్స్, బస్ షెల్టర్లు, సెంట్రల్ మీడియన్స్‌లు వివిధ పార్టీల ప్రచారానికి కేటాయించారని, వీటికి సంబంధించి అద్దె మొత్తాన్ని చెక్కుల రూపంలో సంబంధిత అభ్యర్థులు, పార్టీల నుంచి స్వీకరించాలని కమిషనర్ పేర్కొన్నారు. ప్రార్థన మందిరాలు, ఆలయాలు, మసీదులు, చర్చిల ప్రాంగణాల్లో రాజకీయపార్టీల ప్రచారాన్ని నిషేధించామని, దీంతో పాటు ఆయా ఆవరణల్లో రాజకీయ ప్రచార కటౌట్లను కూడా ఉంచరాదని సూచించారు.
జాతీయ రహదార్లు, ట్రాఫిక్‌కు ఇబ్బంది కల్గించే ప్రాంతాల్లో, ప్రభుత్వ భవనాలు, విద్యుత్, టెలిఫోన్ పోల్స్‌లను ప్రచారానికి వినియోగిస్తే దీనికి సంబంధించి అనుమతులను సంబంధిత ఏజెన్సీల నుంచి ముందస్తుగా పొందాలని తెలియజేశారు.
ఎన్నికల ప్రచారానికి సంబంధించిన కరపత్రాలు, పోస్టర్లు ముద్రిస్తే వాటిపై సంబంధిత ప్రచురణ కర్త పేరు, ప్రింటర్ పేరు ప్రచురించాలని తెలిపారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలుగానీ, అభ్యర్థులు గాని ప్రైవేటు స్థలాల్లో తమ ప్రచారానికి సంబంధించి పోస్టర్లు, బ్యానర్లు, జెండాలను ప్రదర్శించేందుకు సంబంధిత యజమానుల నుంచి అనుమతి పొందాలని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ జె. శంకరయ్యతో పాటు పలు అడ్వర్‌టైజ్ ఏజెన్సీల ప్రతినిధులు హాజరయ్యారు.

నేటి నుంచి ప్రచారం ముమ్మరం

మంత్రి పద్మారావు వెల్లడి

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 17: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని సోమవారం నుంచి మరింత ఉద్దృతం చేయనున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి టి. పద్మారావు వెల్లడించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఆయా డివిజన్లకు సంబంధించిన అభ్యర్థుల నామినేషన్ దాఖలులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ 80 నుంచి 85 సీట్లను కైవసం చేసుకుని మేయర్ పీఠం దక్కించుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి కోసం రూపకల్పన చేసిన ప్రతిపాదనలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లో విస్త్రృతంగా ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. మంత్రులతో పాటు మొదలుకుని నగర నాయకులు, అసెంబ్లీ నియోజకవర్గాలు, డివిజన్ల స్థాయి నేతలు, కార్యకర్తలను ఈ ప్రచారంలో భాగస్వాములను చేస్తామన్నారు.
రాష్టవ్య్రాప్తంగా సంక్షేమ పథకాల అమలుకు ఏటా ప్రభుత్వం సుమారు రూ. 34వేల కోట్లను వెచ్చించటాన్ని, వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు నెలకు ఇస్తున్న రూ. వెయ్యి ఆసరా పథకం, పేద మైనార్టీ కుటుంబాలకు చెందిన ఆడ పిల్లల వివాహాల కోసం అమలు చేస్తున్న షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి వంటి పథకాలు, గోదావరి జలాల తరలింపు, డబుల్ బెడ్ రూం ఇళ్లు, ట్రాఫిక్ సమస్య నివారణ కోసం నిర్మించనున్న స్కైవేలు, గ్రేటర్ సెపరేటర్లు, మల్టీలెవెల్ ఫ్లైఓవర్లు వంటి అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు మంత్రి తెలిపారు.