హైదరాబాద్

వరద సహాయక చర్యల్లో సైన్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 24: మహానగరంలో తరుచూ కురుస్తోన్న భారీ వర్షాలతో నీటి మునిగిన ప్రాంతాల్లోని ప్రజలకు సహాయక చర్యలను అందించేందుకు సైన్యం, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. నిన్నమొన్నటి వరకు జిహెచ్‌ఎంసి, ఫైర్, పోలీసు, రెవెన్యూ విభాగాలు చేపట్టిన సహాయక చర్యలు ఆశించిన స్థాయిలో ఫలించకపోవటంతో ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపింది. ఆరు ఎన్‌డిఆర్‌ఎఫ్, మరో తొమ్మిది సైన్యం బృందాలు సహాయక చర్యలను ప్రారంభించారు. దీంతో సహాయక చర్యలు ముమ్మరమయ్యాయి. నీటిలో చిక్కుకుని అన్నం. మంచినీరు కోసం అల్లాడిన బాధితులకు అపన్న హస్తం అందించటంతో పాటు వైద్యం అవసరమైన వారిని శిబిరాలకు తరలిస్తున్నారు. సైన్యానికి సంబంధించి ఒక్కో బృందంలో 35 నుంచి 40 మంది జవాన్లుంటారని, అలాగే ఒక్కో ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందంలో పది నుంచి పదిహేను మంది జవాన్లు ఉంటారని అధికారులు తెలిపారు. ఈ బృందాలను ఎక్కువగా నీటిలో మునిగిన అల్వాల్, బేగంపేట, హకీంపేట, నిజాంపేట ప్రాంతాల్లోని జిహెచ్‌ఎంసి స్థానిక డిప్యూటీ కమిషనర్ల పర్యవేక్షణలో సహాయక చర్యలు చేపట్టాల్సి ఉంటుందని ఆయా బృందాల ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. నాలుగు రోజుల నుంచి నీటిలో చిక్కుకున్న బేగంపేట, బ్రహ్మణవాడి, వడ్డెర బస్తీ, నిజాంపేట, హకీంపేట, అల్వాల్ ప్రాంతాల్లో సైన్యం, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. అంతేగాక, సెల్లార్లలో భారీగా నీరు చేరటం, అయిదు నుంచి ఆరు అడుగుల వరకు వర్షపు నీరు చేరిన పలు స్కూళ్లు, ఇతర భవనాల్లోని పై అంతస్తుల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఈ రెండు బృందాలు రెస్క్యు ఆపరేషన్లు ప్రారంభించాయి.
బృందాల ప్రత్యేకత ఏమిటి?
ముఖ్యంగా సైన్యంలోని జవాన్లకు విపత్కరమైన పరిస్థితుల్లో చిక్కుకున్న వారిని రక్షించటంలో ఈ రెండు బృందాల జవాన్లు నిష్ణాతులు. యుద్ధంలో తమను తాము కాపాడుకుంటూ శత్రువులను మట్టి కరిపించటం, అలాగే తన బెటాలియన్‌లో గాయపడిన సైనికుడ్ని కాపాడే తరహాలో శక్తిసామర్థ్యాలుండేలా వీరికి శిక్షణనిస్తారు. మనిషి మునిగిపోయే స్థాయిలో వరద నీరు ప్రవహించినా, ప్రత్యేక గన్‌ల ద్వారా ఒక వైపు నుంచి మరో వైపుకు తాడును పంపించి, ఆ తాడు సహాయంతో ఒక్కో సైనికుడు ఇద్దరిని సురక్షితంగా ఒకవైపు నుంచి మరోవైపుకు తీసుకురాగల సమర్థులు. వీరు భుజంపై సుమారు 80 నుంచి 90 కిలోల బరువును పెట్టుకుని కూడా రెస్క్యు ఆపరేషన్‌లో ముందుకెళ్లగలరు. ఇక ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాల ప్రస్తావనకొస్తే ఈ బృందాలకు ప్రత్యేకంగా భవనాలు కూలటం, తూఫాన్ రావటం, వరదలు, అగ్నిప్రమాదాలు సంభవించటం వంటి సందర్భాల్లో వీలైనంత వరకు ప్రాణ నష్టాన్ని తగ్గించే విధంగా స్పందించేలా శిక్షణనిస్తారు. యుద్ధాలతో వీరికి సంబంధం లేకున్నా, విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్న వారిని రక్షించటంలో వీరు స్పెషలిస్టులు. ఈ రెండు బృందాల వద్ధ పడవలు, మెడికల్ సంబంధిత సామాగ్రి, లైవ్ జాకెట్లతో పాటు ఇతర పరికరాలున్నాయి.
బస కోసం ప్రత్యేక ఏర్పాటు
తొమ్మిది ఆర్మీ, ఆరు ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు బస చేసేందుకు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా యూసుఫ్‌గూడలోని పిజెఆర్ స్టేడియం, లాలాపేట, మొఘల్‌పురా, లాలాపేట, ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో బృందాల బస కోసం జిహెచ్‌ఎంసి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది.
ఎమర్జెన్సీ కంట్రోల్ రూం నెంబర్లు
* జిహెచ్‌ఎంసి-డయల్ 100, 21111111
* రంగారెడ్డి-1800425081
* జలమండలి-155313,9949930003
* అంబులెన్స్-104,108
* పోలీసు-100,040-27852482, 27852333
* టిఎస్‌పిడిసిఎల్ 1912, 7382072104,9490619846
ప్రభుత్వం వైఫల్యం వల్లే ఈ వరద ముంపు
అల్వాల్: వరద నీటిపై రాజకీయ చెయ్యవద్దనుకున్నా ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత తమపైన ఉందని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు. శనివారం మల్కాజిగిరి నియోజకవర్గం కాంగ్రెస్ కమిటీ ఇన్‌చార్జి నందికంటి శ్రీ్ధర్ వరద బాధితులకు ఎర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఓల్డు అల్వాల్ శ్రీ బేకరీవద్ద పైభాగం నుండి వస్తున్న వరద ఉద్ధృతిని సమీక్షించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. రాష్ట్రంలో వర్షాలు కురవటం శుభసూచకమైతే భారీవర్షాలు కురవటం వల్ల వరద నీరు వెళ్లటానికి సరియైన మార్గం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ప్రధానంగా హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చుతామని ఎన్నికల కన్నా ముందునుండి ప్రకటనలు చేస్తున్న టిఆర్‌యస్ నాయకులకు అధికారంలోకి రాగానే విశ్వనగరం మాట మార్చారని ఆరోపించారు. టిఆర్‌యస్ ప్రభుత్వానికి ఎన్నికలపైన ఉన్న శ్రద్ధ హైదరాబాద్ పైన లేదని, గ్రేటర్ ఎన్నికల్లో మెజారిటీ సాధించామని సంబరాలు చేసుకున్నారు కాని గ్రేటర్‌లో ఉన్న మురుగు నీటి కాలువలు పూడికలు తీయ్యలేదని, దీంతో వరద నీరు కాలువల్లోనుండి కాలనీలు, బస్తీల్లోని ఇళ్లలోకి వచ్చిందని చెప్పారు. ప్రభుత్వం ముందుగానే ఎందుకు పూడిక తియ్యలేదని ప్రశ్నించారు ప్రభుత్వానికి సూచనలు చేసినా పట్టించుకోకుండా ప్రతిపక్షాలను విమర్శించటమే పనిగా పెట్టుకున్నారని, ప్రజలు ప్రతి అంశాన్ని గమనిస్తున్నారని అన్నారు. భారీవర్షాల కారణంగా ప్రజలు వారివారి ప్రాంతాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.
కాలనీలోని ఇళ్లలోకి నీరు వచ్చిన వారిని ప్రభుత్వం అదుకునే విదంగా కాంగ్రెస్ నాయకులు పనిచెయ్యాలని, ప్రజలతో మమేకమై వారి ఇబ్బందుల్లో పాలు పంచుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. కార్యక్రమంలో మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఉప్పల్ ఇన్‌చార్జి బండారి లక్ష్మారెడ్డి, మాజీ కౌన్సిలర్ టి.మోహన్, మాజీ కార్పొరేటర్ గీతా రాణి, ఇతర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.