హైదరాబాద్

పేరుకు అమీర్‌పేట.. పోలింగ్‌లో గరీబుపేట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 20: అమీర్‌పేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పేర్లు చెబితే సంపన్నులు ఉండే ప్రాంతాలని ఇట్టే గుర్తుపట్టేస్తారు. రెండు తెలుగురాష్ట్రాల్లో బాగా పలుకుబడి ఉన్నవారు, పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులు, సెలబ్రిటీలు నివసిస్తున్న ఈ ప్రాంతం హైదరాబాద్‌కు ఓ ఆభరణంలాంటిది. అయితే ఓటింగ్ విషయానికి వచ్చేసరికి ఈ ప్రాంతాలు వెనుకవరుసలోనే ఉంటాయి. చైతన్యం లేకపోవడం, బద్ధకం, ఓటింగ్ స్ఫూర్తి లేకపోవడంతో ఇక్కడ ఎప్పుడూ ఓటింగ్ తక్కువగానే నమోదవుతూంటుంది. జిహెచ్‌ఎంసి 2009 ఎన్నికల్లో అమీర్‌పేట ఎస్టీ మహిళలకు రిజర్వు చేశారు.
ఈ డివిజన్‌లో మొత్తం 24,644 ఓట్లు ఉంటే కేవలం 5710 ఓట్లు పోలయ్యాయి. అంటే 23 శాతం మాత్రమే. కాగా నగరంలో ఎక్కువమంది ఓటర్లున్న కుత్బుల్లాపూర్‌లో ఆ ఎన్నికల్లో 40,660 ఓట్లకుగాను కేవలం 15,245 మంది ఓటు వేశారు. జూబ్లీహిల్స్ డివిజన్‌లో 44,488మంది ఓటర్లుంటే, 17,719 ఓట్లు, బంజారాహిల్స్‌లో 58,047 ఓట్లు ఉంటే, 21,529 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ ఎన్నికల్లో పాతబస్తీలోని మొఘల్‌పురా డివిజన్‌లో అత్యధికశాతం ఓటింగ్ నమోదైంది. అక్కడ 21,523 ఓటర్లుండగా 12,937 మంది ఓటు వేశారు. అంటే దాదాపు 60శాతం అన్నమాట. ఈసారి మాత్రం జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఎక్కువ పోలింగ్ అయ్యేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం 78 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ప్రజల్లో, ముఖ్యంగా సంపన్నవర్గాల్లో ఆసక్తి లేకపోవడం, కొన్నివర్గాల్లో చైతన్యం లేకపోవడంతో పోలింగ్ 30 నుంచి 40 శాతం జరుగుతోంది. ఈసారి పోలింగ్ పెరిగేలా చర్యలు తీసుకున్నామని ఎన్నికల సంఘం కార్యదర్శి ఎం. అశోక్ కుమార్ అంటున్నారు.
ఓటుహక్కు ఉందోలేదో, ఏ డివిజన్‌లో ఉందో తెలుసుకోకపోవడం, బద్ధకించడంవల్లే ఇలా జరుగుతోంది.

అభివృద్ధి మాది
ప్రచారం మీది

టిఆర్‌ఎస్‌పై టిడిపి నేత రావుల విమర్శ
హైదరాబాద్, జనవరి 20: తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రచారం చేసుకుంటున్నదని టిటిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అనే అనుమానం కలుగుతున్నదని ఆయన బుధవారం విలేఖరుల సమావేశంలో అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కుటుంబ సభ్యుల చుట్టే ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి మంత్రి కె తారక రామారావుకు కనిపించడం లేదని ఆయన విమర్శించారు. ప్రభుత్వ ఆహ్వానం మేరకు మిషన్ భగీరథ కార్యక్రమంలో పాల్గొననున్న గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను పరామర్శించి వారికి న్యాయం జరిగేలా చూడాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన కోరారు. తెలంగాణలో 2200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన తెలిపారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కినా గవర్నర్ పట్టించుకోకపోవడం బాధాకరమని రావుల అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై స్పష్టత ఇచ్చేలా శే్వతపత్రం విడుదల చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మక్కా పేలుళ్లలో
బాధితుడికి ఎంబిటి టికెట్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 20: హైదరాబాద్‌లో 2002లో జరిగిన మక్కా మసీదు పేలుళ్ల ఘటనలో బాధితుడు సయ్యద్ ఇమ్రాన్ ఖాన్‌ను మజ్లిస్ బచావో తహరీక్ (ఎంబిటి) పార్టీ ఓల్డ్ బోయిన్ పల్లి మున్సిపల్ డివిజన్ నుంచి బరిలోకి దింపింది. ఎంబిటి యువ నాయకుడు, ఆజంపుర మాజీ కార్పొరేట్ అమ్జదుల్లాఖాన్ మాట్లాడుతూ హస్మత్‌పేట్‌కు చెందిన ఇమ్రాన్ ఖాన్ బోయిన్‌పల్లి, ఓల్డ్‌బోయిన్‌పల్లి వాసులకు సుపరిచితుడని, కొరియర్ సర్వీస్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న ఇమ్రాన్ ఎంబిటి నుంచి పోటీ చేయడం పార్టీ అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ మాట్లాడుతూ మక్కా పేలుళ్ల ఘటన, పాస్‌పోర్టు ఫోర్జరీ కేసుల్లో తాను నిర్దోషిగా విడుదలయ్యాయని, తాను హస్మత్‌పేట్‌లో జన్మించినప్పటికీ తనకు బోయిన్‌పల్లిలో ఎక్కువకాలం ఉన్నాని, ఈ రెండు ప్రాంతాల ప్రజలకు సుపరిచితుడన్నారు. ఎంబిటి నుంచి ఓల్డ్ బోయిన్‌పల్లి డివిజన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన విజయం ఖాయమన్నారు.

లెక్క తేలేది నేడే!

నేటితో ముగియనున్న
నామినేషన్ల ఉపసంహరణ
3 గం.ల తర్వాత అభ్యర్థుల తుది జాబితా
‘బి’ ఫారాల కోసం అభ్యర్థుల చక్కర్లు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 20: మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో నామినేషన్ల పర్వానికి నేటితో తెర పడనుంది. ఈ నెల 12వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరించి, 18నుంచి ప్రారంభించిన పరిశీలన ప్రక్రియ బుధవారంతో ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణకు గురువారం మధ్యాహ్నం మూడు గంటల వరకు మాత్రమే గడువు ఉంది. సాయంత్రంకల్లా బరిలో మిగిలే అభ్యర్థులు ఎవరన్నది తేలిపోతుంది. మరోవైపునామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు బి ఫారాల కోసం పార్టీ కార్యాలయాల చుట్టూ పరుగులు తీస్తున్నారు. టిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపి, టిడిపి పార్టీలకు తిరుగుబాటు దారుల బెడద తప్పేట్టు లేదు. నామినేటేడ్ పదవులు కేటాయిస్తామంటూ సర్దిచెప్పేందుకు అధికార పార్టీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తే టిఆర్‌ఎస్‌లో తిరుగుబాటుదారుల సంఖ్య కాస్త తగ్గొచ్చు. కాంగ్రెస్, టిడిపి, బిజెపి పార్టీల్లో వలసలు, అసంతృప్తులు పోలింగ్ వరకు కొనసాగే అవకాశాలున్నాయి. ఇప్పటికే బిజెపి, టిడిపి శ్రేణుల మధ్య పలు డివిజన్లలో విబేధాలు తలెత్తి బాహాబాహీకి దిగుతున్నాయి.
ఇప్పటి వరకు 150 డివిజన్లలో అభ్యర్థులు దాఖలు చేసిన 4వేల 69 నామినేషన్లను పరిశీలించిన అధికారులు అందులో 3850 ఆమోద యోగ్యంగా ఉన్నాయని ప్రకటించారు. ఉపసంహరణ గడువులోగా మరికొందరు పోటీనుంచి తప్పుకునే అవకాశం ఉంది. అభ్యర్థులు ఎవరన్నది తేలిపోయాక శుక్రవారం నుంచి ప్రచార కార్యక్రమాలు ఊపందుకోనున్నాయి.

రెండు కుటుంబాలు..
ఆరుగురు అభ్యర్థులు

బరిలో మాజీమంత్రి కొడుకు, కుమార్తె, సోదరుడు పాతబస్తీలో మాజీ కార్పొరేటర్, భార్య, కొడుకు పోటీ

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 20: బల్దియా ఎన్నికల బరిలో భార్యభర్తలు.. అన్నాచెల్లెళ్లు..తోడికోడళ్లు.. అత్తాకోడళ్లు, వదినా మరదళ్లు..బావా మరదళ్లు సై..అంటే సై అంటూ పోటీ చేస్తున్నారు. చుట్టం చుట్టమే.. పోటీ పోటీనే అంటూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. బల్దియా ఎన్నికల్లో తలపడుతున్న ఓ రెండు కుటుంబాలకు చెందిన ఆరుగురు సభ్యులు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ కుమారుడు విక్రంగౌడ్ జాంబాగ్ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో నిలువగా, ఆయన కుమార్తె శిల్పా గన్‌ఫౌండ్రి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అలాగే ముఖేష్ తమ్ముడు, గన్‌ఫౌండ్రి మాజీ కార్పొరేటర్ మధుగౌడ్ సతీమణి సరితా మధుగౌడ్ గన్‌ఫౌండ్రి నుంచి టిడిపి, బిజెపి మిత్రపక్షాల అభ్యర్థిగా తలపడుతున్నారు. పాతబస్తీలోని ఓ మాజీ కార్పొరేటర్ కుటుంబంలోని భార్య, కుమారుడు ముగ్గురూ మూడు డివిజన్లలో ఒకే పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. శాలిబండ డివిజన్ మజ్లిస్ కార్పొరేటర్ మహ్మద్ గౌస్ పార్టీపై అలకబూని కాంగ్రెస్‌లో చేరారు. ఆయన పురానాపూల్‌నుంచి పోటీ చేస్తూండగా, భార్య ఫర్వీనా సుల్తానాను ఘాన్సీబజార్, కొడుకు సోహెల్‌ను శాలిబండ డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీలో దించారు.

సమస్యాత్మక ప్రాంతాల్లో బందోబస్తు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 20: సౌత్ జోన్ పోలీసులు పాత బస్తీలోని ఏడు మున్సిపల్ డివిజన్లను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. ఈ మేరకు గట్టి భద్రత చర్యలు చేపట్టారు. ఎంఐఎం, ఎంబిటి, బిజెపి పోటీ చేస్తున్న డివిజన్లలో మత ఘర్షణలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉప్పుగూడ, ఆజంపు, పురానాపూల్, జంగమ్మెట్, షాలిబండ, పత్తర్‌గట్టి, డబీర్‌పుర డివిజన్లను అతి సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. ఇక్కడి ప్రాంతంలో ప్రచారం నిర్వహిస్తున్న పార్టీల అభ్యర్థుల వివరాలను సేకరిస్తున్నారు. అదేవిధంగా వివిధ కేసుల్లోని నిందితులుగా పేర్కొంటున్న వెయ్యి మంది పాత నేరస్థులను గుర్తించి బైండోవర్ చేస్తున్నారు. మరికొంత మందిని ఎన్నికల సందర్భంగా రెండు, మూడురోజుల పాటు నగర బహిష్కరణ కూడా జరపనున్నట్టు సౌత్ జోన్ డిసిపి వి సత్యనారాయణ తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఇప్పటికే 30 షాడో బృందాలను ఏర్పాటు చేసి సిసి కెమెరాలతో నిఘా పెంచామన్నారు. పశ్చిమ మండల పరిధిలోని మంగల్‌హాట్, ఆసిఫ్‌నగర్, షాహినాజ్‌గంజ్ ప్రాంతాలు సున్నిత, సమస్యాత్మకం కాగా భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్టు డిసిపి వెంకటేశ్వరరావు తెలిపారు. వెస్ట్‌జోన్ పరిధిలోని 1,325 బూత్‌లలో 127 సున్నితం, 59 అతి సున్నిత ప్రాంతాలుగా గుర్తించామని ప్రత్యేక దళాలతో గట్టి భద్రత చర్యలు తీసుకుంటున్నట్టు డిసిపి వివరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా తగు భద్రత ఏర్పాట్లు చేయనున్నట్టు పేర్కొన్నారు.

శివారు...ప్రచార హోరు

దుమ్మురేపుతున్న నేతలు
సిటీలో ఆకట్టుకోని సీన్

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 20: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) ఎన్నికల్లో రెండు రోజులుగా ప్రచారం ఊపందుకుంది. నామినేషన్ల ఉపసంహరణకు గురువారం వరకు గడువు ఉన్నప్పటికీ, బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఇప్పటికే బి ఫారాలు అందడంతో ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. నగరం మధ్యలో ఉన్న డివిజన్లలో జరుగుతున్న ప్రచారంతో పోల్చుకుంటే నగర పొలిమేర ప్రాంత డివిజన్లలోనే ప్రచార పటాటోపం ఎక్కువగా కనిపిస్తోంది. గతంలో ఉన్న డివిజన్ల సరిహద్దులు మారడం, ఎక్కువ డివిజన్లు రిజర్వు కావడంతో కొత్తగా పుట్టుకొచ్చిన నాయకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
నగరంలోని అభ్యర్థులు చాలా మటుకు గతంలో ఏదో ఒక పార్టీ నుంచి పోటి చేసినవారో, గతంలో రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి వచ్చినవారో కావడంతో ప్రచారం మొక్కుబడిగా జరుగుతోంది. అయితే నగర పొలిమేర ప్రాంతాల నుంచి బరిలోకి దిగిన అభ్యర్థులలో ఎక్కువమంది రాజకీయాల్లో కొత్తగా వచ్చినవారే ఉన్నారు. దీంతో ఎన్నికల బరిలోకి దిగిన సరికొత్త నేతలు ఎలాగైనా గెలుపొందాలన్న పట్టుదలతో ప్రచారం కొత్తపుంతలు తొక్కిస్తున్నారు. నగరం మధ్యనున్న డివిజన్లలో కాంగ్రెస్, బిజెపి, టిఆర్‌ఎస్‌ల అభ్యర్థులదే హడావుడి కనిపిస్తుండగా. పొలిమేర ప్రాంతాల్లోని డివిజన్లలో ఎక్కువ శాతం ఓటర్లు సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన వారు ఉండటంతో ఇక్కడి నుంచి బరిలో నిలిచిన టిడిపి అభ్యర్థులు కూడా తెగ హడావుడి చేస్తున్నారు. సిటీలోని డివిజన్లలో టిఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య ముఖాముఖి పోటీ నెలకొనగా, పొలిమేర ప్రాంత డివిజన్లలో టిఆర్‌ఎస్, టిడిపి, కాంగ్రెస్ మూడు పార్టీల మధ్య పోటీ నెలకుంది. జిహెచ్‌ఎంసిలో మొత్తం 150 డివిజన్లు ఉండగా, నగరం మధ్యలో 86 డివిజన్లు, పొలిమేర ప్రాంతాల్లో 64 డివిజన్లు ఉన్నాయి. పైగా నగరంలోని 86 డివిజన్లలో 50 డివిజన్లు పాతబస్తీ పరిధిలోనే ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా బరిలో నిలిచిన ఎంఐఎం అభ్యర్థులది ఇతర పార్టీలతో పోలిస్తే బయటికి ప్రచారం తక్కువగానే కనిపిస్తోంది. దీంతో నగరం మధ్యలోని 86 డివిజన్లలో పాతబస్తీలోని 50 డివిజన్లు మినహాయిస్తే మిగతా 36 డివిజన్లలో మాత్రమే అభ్యర్థుల ప్రచారం కాస్తోకూస్తో కనిపిస్తోంది.
పొలమేర ప్రాంతాల్లోని 64 డివిజన్లలో అన్ని పార్టీలు కూడా బలమైన అభ్యర్థులనే బరిలోకి దింపాయి. ఇక్కడ రియల్ ఏస్టేట్ వ్యాపారం బాగా ఉండటం, ఈ వర్గంనుంచే ఎక్కువమంది బరిలో నిలవడం, వారు ఖర్చుకు వెనకాడకపోవడంతో ప్రచారం హోరెత్తిపోతోంది.