హైదరాబాద్

ప్రజాతీర్పుకు రక్షణ కవచం ఈవిఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 21: ఒకప్పుడు ఎన్నికలంటే రోజుల తరబడి ప్రక్రియ..ఇందులో ముఖ్యంగా పోలింగ్ ముగిసిన తర్వాత జరిగే ఓట్ల లెక్కింపు సైతం రోజుల తరబడి జరిగేది. కానీ మన దేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత పోలింగ్, ఓట్ల లెక్కింపు అనే ఎన్నికల్లోని రెండు కీలకమైన ప్రక్రియలు గంటల్లోనే ముగిసిపోతున్నాయి. వచ్చే నెల 2వ తేదీన జరగనున్న జిహెచ్‌ఎంసి ఎన్నికల్లోనూ సుమారు 12వేల ఇవిఎంలను వినియోగించనున్నందున నగరవాసులకు ఇవిఎం పరిచయం, అది పనిచేసే తీరుపై అవగాహన, ఈ సారి ఓటింగ్ శాతాన్ని పెంచాలన్న సంకల్పంతో ఎన్నో సరికొత్త ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఈ ఇవిఎంను వినియోగించి ఓటు ఎలా వేయాలన్న విషయంపై కూడా త్వరలోనే అధికారులు ప్రజలకు డమీలతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందులో రాష్ట్ర ఎన్నికల సంఘం, జిహెచ్‌ఎంసి, ఇరవై స్వచ్చంధ సంస్థలతో ఏర్పాటైన తెలంగాణ ఎలక్షన్ వాచ్, ఫోరం ఫర్ గుడ్ గువర్నెన్స్ వంటి స్వచ్చంద సంస్థలను భాగస్వాములను చేయనుంది.
ఇవిఎం అంటే?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం(ఇవిఎం) అంటే ఏమిటీ? సాంప్రదాయ బ్యాలెట్ పేపర్ పద్దతికి దీనికున్న తేడా గురించి తెల్సుకుందాం! ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల బ్యాలెట్ యూనిట్‌తో పాటు మరోకంట్రోల్ యూనిట్‌ను కల్గి విద్యుత్‌తో పనిచేసే ఆధునిక యంత్రం ఇది. దీని ఆన్ అండ్ ఆఫ్ సంబంధిత ప్రెసైడింగ్ అధికారి ఆధీనంలో పనిచేస్తోంది. ఆయన అనుమతిస్తేనే ఓటరు తన ఓటు హక్కును ఈ యంత్రంలో వినియోగించుకోగలరు. అభ్యర్థుల పేర్లు, వారికి ఎన్నిక సంఘం గుర్తించిన చిహ్నాలతో బయటకు బ్యాలెట్ కన్పించేలా దీన్ని రూపకల్పన చేశారు.
దీని వల్ల ప్రయోజనం
1989,90లో ఎన్నికల సంఘం ఓ కంట్రోల్ యూనిట్, ఓ బ్యాలెట్ యూనిట్ కల్గిన ఒక ఇవిఎంను సుమారు రూ. 5500లకు ఖరీదు చేసింది. అయితే సాంప్రదాయ పద్దతి అయిన బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహిస్తే లక్షలాది బ్యాలెట్ పేపర్ల ముద్రణ, వాటి తరలింపునకయ్యే రవాణా వ్యయం, వాటిని భద్రపరిచేందుకయ్యే ఖర్చుతో పోల్చితే వీటి ఖరీదు చాలా తక్కువే. అంతేగాక, వీటి వినియోగం వల్ల ఎన్నికల ప్రక్రియకు చాలా వరకు సిబ్బంది అవసరం కూడా తగ్గుతోంది. వీటి వినియోగం వల్ల కేవలం పోలింగ్ మాత్రమే గాక, కౌంటింగ్ కూడా రెండు నుంచి నాలుగు గంటల్లో ముగించి ఎంతో విలువైన సమయాన్ని ఆదా చేయవచ్చు. ఇదే కౌంటింగ్ బ్యాలెట్ పేపర్లను వినియోగిస్తే లెక్కింపుకు 30నుంచి 40 గంటల సమయం పట్టేది.
మన దేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాన్ని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, బెంగుళూరు. అలాగే ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థలు వీటిని తయారు చేస్తున్నాయి.
తొలిసారి వినియోగం
అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కల్గిన మన దేశంలో ఈ ఇవిఎంలను మొట్టమొదటి సారిగా 189,90లో తయారు చేశారు. వీటిని తొలుత ప్రయోగాత్మకంగా మొట్టమొదటి సారిగా 1998 నవంబర్ మాసంలో జరిగిన శాసన సభ సాధారణ ఎన్నికల్లో భాగంగా 16 అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల్లో వినియోగించారు. మధ్యప్రదేశ్‌లోని అయిదు, రాజస్థాన్‌లోని అయిదు దిల్లీలోని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో వినియోగించారు.
ఓట్ల సామర్థ్యం ఎంత?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రంలో గరిష్ఠంగా 3840 ఓట్లను భధ్రపరిచే సామర్థ్యం ఉంది. కానీ సాధారణంగా మన దేశంలో ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఓటర్ల సంఖ్య గరిష్ఠంగా 1500లకు మించదు. అంటే ఇంతకన్నా మరో రెండింతల సామర్థ్యం కల్గిన ఇవిఎంలను మనం వినియోగిస్తున్నామన్న మాట.
గరిష్ఠంగా అభ్యర్థుల సంఖ్య
లోక్‌సభ గానీ, శాసన సభ ఎన్నికలు గానీ గరిష్ఠంగా ఎంత మంది పోటీలో ఉన్న బ్యాలెట్‌ను ఈ ఇవిఎంలో ఉపయోగిస్తారంటే గరిష్ఠంగా 64 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా, వీటిని వినియోగించి పోలింగ్ నిర్వహించవచ్చు. ఇక ఇందులోని బ్యాలెటింగ్ యూనిట్‌లో 16 మంది అభ్యర్థులను పొందుపర్చవచ్చు. ఒక వేళ 16 మంది అభ్యర్థులకు సంఖ్య మించితే అదనంగా మరో బ్యాలెటింగ్ యూనిట్‌ను దీనికి అనుసంధానం చేసుకోవచ్చు. అపుడే అభ్యర్థుల బ్యాలెటింట్ సంఖ్య 32కు చేరుతోంది. అలాగే అభ్యర్థుల సంఖ్య పెరిగితే మరో 16 మంది అభ్యర్థులతో 48, అవసరమైతే నాలుగో బ్యాలెటింగ్ యూనిట్‌ను అనుసంధానం చేస్తే గరిష్ఠంగా ఇవిఎంలలో 64 మంది అభ్యర్థుల బ్యాలెట్‌ను పొందుపర్చవచ్చు.
పార్లమెంటుకు గానీ, అసెంబ్లీకి గానీ పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య 64కు మించితే అలాంటి స్థానాల్లో ఈ ఇవిఎంలను వినియోగించే అవకాశం లేదు. ఇందుకు సాంప్రదాయమైన బ్యాలెట్ పేపర్ విధానమే సరైందని ఎన్నికల సంఘం కూడా పేర్కొంటుంది.
కరెంటు లేని ప్రాంతాల్లోనూ..
సహజంగా విద్యుత్‌తో పనిచేసే ఇవిఎంలు కరెంటు సరఫరా లేని కుగ్రామాలు, మారుమూల ప్రాంతాల్లోనూ వినియోగించవచ్చు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెంగుళూరు, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లు తయారు చేసే ఆరు వోల్టుల ఆల్కలైన్ సాధారణ బ్యాటరితోనూ ఇది పనిచేయగలదు.
పోలింగ్ సమయంలో మొరాయిస్తే..!
ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ రోజు ఈ ఇవిఎంలు మొరాయిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై కూడా ఎన్నికల సంఘం స్పష్టమైన నిర్ణయంతో ఉంది. ఇందుకోసం ఇవిఎంలను రిజర్వులో ఉంచుతారు. అయినా పది పోలింగ్ స్టేషన్లలోని ఇవిఎంలు మొరాయిస్తే, వాటి స్థానంలో కొత్త వాటిని పెట్టేందుకు వీలుగా ప్రత్యేకంగా ఓ అధికారిని నియమిస్తారు. మొరాయించేందుకు ముందు ఇవిఎంలో పడ్డ ఓట్లు కంట్రోల్ యూనిట్ మెమెరీలో సేవ్ అవుతాయి. ఆ తర్వాత యదావిధిగా పోలింగ్ నిర్వహించవచ్చు. అంతేగాక, కొత్త ఇవిఎంను పెట్టిన తర్వాత మళ్లీ మొదటి నుంచి పోలింగ్ నిర్వహించే అవసరం లేదు.
చదువులేని ఓటర్లు ఇవిఎంలను ఎంత వరకు సక్రమంగా వినియోగించుకుంటున్నారన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. కానీ సాంప్రదాయ బ్యాలెట్ పేపర్ పద్దతిలో ఎన్నికలు నిర్వహించినపుడు ఓటరు తనకు నచ్చిన అభ్యర్థి గుర్తు పక్కన ఓటింగ్ మార్కు వేసి, బ్యాలెట్ పేపర్‌ను తొలుత పొడువుగా, ఆ తర్వాత అడ్డంగా మలిచి బాక్సులో వేయాల్సి ఉండేది. కానీ ఇవిఎంలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఓటరుకు బ్యాలెట్ పేపర్ ఓ పద్దతిలో మలిచే పని తప్పి, తనకు నచ్చిన అభ్యర్థుల పేర్ల పక్కన ఉన్న చిహ్నాం పక్కనే ఉన్న బటన్‌ను నొక్కి ఓటు వేయవచ్చు. దీంతో నిరక్షరాస్యులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఇవిఎంలో ఓటు వేసేందుకు పెద్దగా ఇబ్బందులేమీ లేవనే చెప్పవచ్చు. కానీ ఇవిఎం వినియోగంపై కొంత వరకైనా అవగాహన అవసరమన్న విషయానికి ఎన్నికల సంఘం సైతం ఏకీభవిస్తోంది.
బూత్‌లు కబ్జా చేసినపుడు
దేశంలోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ బూత్‌లను కబ్జా చేసి భారీగా రిగ్గింగ్‌లు జరిగిన సందర్భాలెన్నో ఉన్నాయి. ఇవిఎంలను వినియోగిస్తున్న నేటి రోజుల్లో కూడా పోలింగ్ బూత్‌లను కబ్జా చేస్తే ఇవిఎంలో రిగ్గింగ్ చేయవచ్చా? అన్న అనుమానం రాక తప్పదు. కానీ ఒక పోలింగ్ బూత్‌లోని ఇవిఎం ఆన్, క్లోజ్ బటన్ కేవలం ఆ బూత్ ప్రెసైడింగ్ అధికారులకు మాత్రమే తెలిసి ఉంటుంది. అగంతకులు బూత్‌లోకి చొరబడినా, వారు హల్‌చల్ చేసే సమయంలో ప్రెసైడింగ్ అధికారి ఇవిఎంలోని క్లోజ్ బటన్ నెక్కితే ఆ తర్వాత ఓట్లు ఎంటర్ చేసే అవకాశాల్లేవు. సాధారణంగా ఇవిఎం నిమిషానికి కేవలం 5 ఓట్లను మాత్రమే రికార్డు చేయగలదు. రిగ్గింగ్‌కు పాల్పడేవారు ఎంత తక్కువ సమయంలో ఎన్ని ఎక్కువ ఓట్లు వేద్దామా? అని హడావుడి చేయటం, అంతలో పోలీసులు రావటం వంటివి జరిగి రిగ్గింగ్‌కు ఆస్కారం లేదు. అయితే సాంప్రదాయ బ్యాలెట్ పేపర్ల విధానం అమలు చేసిన రోజుల్లో బ్యాలెట్ పేపర్లను అగంతకులు లాక్కొని, వాటిపై వారే ఓట్లు వేసుకుని బాక్సుల్లో వేసేవారు. ఇలాంటి సందర్భాల్లో కేవలం 30 నిమిషాల్లో 150 ఓట్లు వేసి పోలీసులు వచ్చేలోపు పారిపోయేవారు. ఎన్నికల ప్రక్రియలో కొత్త విధానాలు, అందులో ముఖ్యంగా ఇవిఎం వినియోగంతో రిగ్గింగ్ కనుమరుగైపోయింది.