హైదరాబాద్

ప్రాథమిక బాధ్యతల్లో ఒకటిగా ‘ఓటుహక్కు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 25: చట్టం ద్వారా మనకు లభించిన ఓటు హక్కును ఆర్టికల్ 51ఎలో పొందుపరిచిన ప్రాథమిక బాధ్యతలలో ఒకటిగా చేర్చాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లోకాయుక్త జస్టిస్ బి.సుభాషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
సోమవారం రవీంద్రభారతిలో జరిగిన జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమానికి జస్టిస్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్లు తమ ఓటు హక్కును విజ్ఞతతో వినియోగించుకోవాలని, ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు లోబడకుండా ఒక మంచి వ్యక్తిని తమ ప్రజాప్రతినిధిగా ఎన్నుకుంటే ప్రజల సమస్యలకు పరిష్కారం చూపేందుకు ముందంజలో ఉంటారని అన్నారు. ప్రభుత్వం ఓటర్లకు అవగాహన కలిగించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతుందని కాని ప్రజలు అందులో భాగస్వామ్యం వహిస్తేనే ఇటువంటి కార్యక్రమాలు విజయవంతం అవుతాయని ఆయన అన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం అయిన మన దేశం 1950 జనవరి 26 నుండి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంగా రూపొందిందని తరతరాల రాచరిక పాలన నుండి విముక్తి లభించిందని ఆయన తెలిపారు. ప్రభుత్వం అనేక విధాలుగా ఓటరు నమోదు కార్యక్రమాలను చేపడుతుందని నేటి యువత నమోదు చేసుకోవడంతోపాటు ఉత్సాహంగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ మాట్లాడుతూ పట్టణ ప్రాంతాలలో ఓటింగ్ శాతం తక్కువగా ఉంటోందని పట్టణ ప్రాంతాల్లో చదువుకున్న వారు నిర్లిప్తత వదిలి ఓటు తమ సామాజిక బాధ్యతగా భావించి తప్పనిసరిగా ఓటు వేయాలని కోరారు. యువత ఇటువంటి కార్యక్రమంలో క్రియాశీలక పాత్ర వహించాలని అన్నారు. ఓటింగ్ శాతం పెంచటానికి ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో అందరు కలిసి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఎన్నికల ముఖ్య అధికారి బన్వర్‌లాల్ విచ్చేసిన అతిథులకు స్వాగతం పలుకుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్ల 6 లక్షల ఓటర్లు, 74వేల పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని అన్నారు. ఇరు రాష్ట్రాలలోని 294 నియోజకవర్గాలలో ఆరవ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని ఆయన అన్నారు. ఎన్నికల ప్రక్రియలో ప్రజలు ముఖ్యపాత్ర వహించాలని వారు తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఇతరులను కూడా ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఓటర్ల జాబితా ప్రక్షాళన కార్యక్రమం దాదాపు 3 నుండి 4 నెలలు జరిగిందని దీనిలో ఎంతో బ్లాక్ స్థాయి అధికారులు, ఎఇఆర్‌ఓలు అంకిత భావంతో పనిచేశారని ఈ సందర్భంగా అప్పటి కర్నూలు జిల్లా కలెక్టర్ విజయ్‌మోహన్, నిజామాబాద్ కలెక్టర్ రొనాల్డ్ రోజ్ (ప్రస్తుతం మెదక్ కలెక్టర్) చాలా ప్రతిభావంతంగా పనిచేశారని ఆయన కొనియాడారు. సమాజంలో ఓటింగ్ ప్రాముఖ్యత, ఆవశ్యకతను పెంపొందించేందుకు గాను జిల్లా స్థాయి, రాష్టస్థ్రాయిలో కళాశాలలు, పాఠశాలల్లో పోటీలను నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని ఆయన తెలిపారు.
జిహెచ్‌ఎంసి కమీషనర్ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ జిహెచ్‌ఎంసి ఎన్నికలు ఫిబ్రవరి 2న జరుగుతున్నాయని ఇందులో ప్రజలు ఉత్సాహంగా పాల్గొని ఓటింగ్ శాతాన్ని పెంచాలని పిలుపునిచ్చారు.
గతంలో 2002 సంవత్సరంలో 28 శాతం, 2007లో 45 శాతం ఓటింగ్ నమోదు అయ్యిందని ఈసారి జిహెచ్‌ఎంసిలో ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. తమ పోలింగ్ బూతు వివరాలు తెలియకపోవడం వల్ల చాలా మంది ఓటు వేయలేక పోయారని సర్వేలో తెలిసిందని ఈసారి జిహెచ్‌ఎంసి అధికారులే ఓటర్లు స్లిప్పులు ఇంటింటికి అందిస్తున్నారని, మొబైల్ ఆప్ ద్వారా కూడా తమ ఓలింగ్ బూతు వివరాలు తెలుసుకునే సౌలభ్యం కలిగించామని ఆయన వివరించారు. పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులకు 5 లక్షల ప్రతిజ్ఞ పత్రాలు అందజేస్తున్నామని వారు తమ తల్లిదండ్రులను ఓటింగ్‌లో పాల్గొనేలా మోటివేట్ చేయాలని ఆయన కోరారు.
అనంతరం ఎన్నికల విధులలో ఉత్తమ సేవలు అందించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అధికారులకు మెమోంటోలు, నగదు బహుమతులు అందజేశారు. ఇందులో ముఖ్యంగా తమ జిల్లాలో ఎన్నికల ప్రక్రియలో చురుగ్గా పాల్గొని, చైతన్యపరిచిన అప్పటి నిజామాబాద్ కలెక్టర్ రోనాల్డ్ రోజ్, కర్నూలు కలెక్టర్ విజయ్ మోహన్‌ను ఈ సందర్భంగా మెమోంటో, 25వేల నగదు బహుమతులతో సత్కరించారు.
రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో జరిగిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర స్థాయి పాఠశాల, కళాశాల విద్యార్థినీ విద్యార్థులకు రాష్టస్థ్రాయి పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. నూతనంగా ఓటరుగా నమోదు చేసుకున్నవారికి ఎపిక్ కార్డును అందించారు.
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్ రావు మాట్లాడుతూ ఓటు హక్కును తమ బాధ్యతగా భావించి ఎన్నికల్లో తప్పక ఓటు వేయాలని, ఈ కార్యక్రమంలో బహుమతులు అందుకున్న వారిని అభినందిస్తూ వందన సమర్పణ చేశారు.ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలి, ఎన్‌సిసి క్యాడెట్, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, మహిళలు పాల్గొన్నారు.