హైదరాబాద్

నిధుల సమీకరణకు బాండ్ల జారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 25: నగరాన్ని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రతిపాదించిన పలు భారీ ప్రాజెక్టుల పనులను చేపట్టేందుకు జిహెచ్‌ఎంసి పెద్ద మొత్తంలో నిధులను సమకూర్చుకునేందుకు బాండ్లు జారీ చేయనున్నట్లు కమిషనర్ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. రానున్న ఆర్థిక సంవత్సరం(2017-18)కు సంబంధించిన జిహెచ్‌ఎంసి బడ్జెట్‌లో ఎస్‌ఆర్‌డిపి, డబుల్ బెడ్ రూం ఇళ్లకు నిధులు కేటాయించాలేదని, వీటి పనులెలా చేపడుతారంటూ మజ్లిస్ సభ్యుడు మాజీద్ హస్సేన్ ప్రశ్నకు కమిషనర్ సమాధానంగా చెప్పారు. తాజా బడ్జెట్‌లో 14వ ఆర్థిక సంఘం నుంచి రూ. 363 కోట్లను ఆశిస్తున్నట్లు, స్వచ్ఛ్భారత్ కింద కేంద్రం నంచి రూ. 50 కోట్లు, ఇతర గ్రాంట్లు వంటి మార్గాల్లో రూ. 622.52 కోట్లను బడ్జెట్‌లో ప్రతిపాదించినట్లు తెలిపారు. స్థానిక సంస్థలు భారీగా నిధులను సమీకరించుకునేందుకు బాండ్లను జారీ చేసుకోవచ్చునని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్లు కమిషనర్ గుర్తు చేశారు. ఇప్పటికే పూణే, అహ్మదాబాద్ నగరాల స్థానిక సంస్థలు బాండ్లను జారీ చేసి నిధులను సమీకరించుకున్నట్లు, అదే బాటలో బల్దియా కూడా పయనించనున్నట్లు కమిషనర్ వివరించారు. అలాగే రానున్న 2016 నుంచి మూడేళ్లలో జిహెచ్‌ఎంసి రూ. 3300 కోట్లను బాండ్ల ద్వారా సమకూర్చుకోవాలని భావిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. ఇప్పటికే పలు ఆర్థిక సంస్థలు, బ్యాంకులతో ఓ దఫా సమావేశం నిర్వహించామని, తక్కువ వడ్డీతో రుణాలిచ్చేందుకు ముందుకొచ్చే బ్యాంకుల నుంచి రుణాలను కూడా తీసుకుంటామని తెలిపారు. కార్పొరేషన్ ప్రధాన ఆర్థిక వనరైన ఆస్తిపన్ను వసూళ్లు ఈ సారి కూడా ఆశాజనకంగానే కొనసాగుతున్నట్లు వెల్లడించారు. గత సంవత్సరం రూ. వెయ్యి 20 కోట్ల మేరకు వసూలు కాగా, ఈ సారి శుక్రవారం సాయంత్రం వరకు రూ. వెయ్యి 83 కోట్ల వరకు వసూలైనట్లు తెలిపారు. చాలా మంది బకాయిదారులు ఆర్థిక సంవత్సరం చివరి రోజు చెల్లించే అవకాశముండటంతో తాము బడ్జెట్‌లో కేటాయించిన విధంగా రూ. 1200 కోట్ల లక్ష్యాన్ని అధిగమించనున్నట్లు కమిషనర్ వెల్లడించారు.

వాహనాల దొంగలు అరెస్టు
రూ. 8 లక్షల విలువైన
11 వాహనాలు స్వాధీనం
సైదాబాద్, మార్చి 25: జల్సాలకు అలవాటుపడి వాహనాలను తస్కరిస్తూ తప్పించుకు తిరుగుతున్న నలుగురు యువకుల ముఠాను సైదాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఇన్‌స్పెక్టర్ కె.సత్తయ్య కేసు వివరాలను వెల్లడించారు. బాలాపూర్‌కు చెందిన కారు డ్రైవర్ మహ్మద్ అబ్దుల్ (19), హఫీజ్‌బాబానగర్‌కు చెందిన మీర్జా ఫైజల్ (18), ఫైజల్ అలీఖాన్ (18), మాదన్నపేటకు చెందిన మహ్మద్ రియాజ్‌అలీ (18)లు ముఠాగా ఏర్పడి జల్సాల కోసం కొంతకాలంగా వాహనాలను దొంగతనం చేస్తూ తప్పించుకుతిరుగుతున్నారు. వీరిలో మహ్మద్ అబ్దుల్ పాత నేరస్తుడు కాగా మిగిలిన ముగ్గురు ఇంటర్మీడియట్ విద్యార్థులు కావడం గమనార్హం. శుక్రవారం సాయంత్రం బడాబాగ్ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా తస్కరించిన వాహనాలపై సంచరిస్తున్న యువకులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలను అంగీకరించారు. వీరి వద్ద రూ. ఎనిమిది లక్షలు విలువ చేసే 11 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సమావేశంలో డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ కె.నాగేశ్వర్‌రావు, ఎస్‌ఐ రాఘవేందర్ సిబ్బంది పాల్గొన్నారు.

బడ్జెట్‌కు కౌన్సిల్ ఆమోదం

సర్కారుకు ప్రతిపాదనలు
మార్పులు చేర్పులపై
జరగని చర్చ

హైదరాబాద్, మార్చి 25: మహానగరంలోని కోటి మంది జనాభాకు అతిముఖ్యమైన, అత్యవసరమైన సేవలందించే జిహెచ్‌ఎంసి రానున్న ఆర్థిక సంవత్సరానికి రూ. 5643 కోట్లతో రూపొందించిన బడ్జెట్‌కు పాలక మండలి ఆమోద ముద్ర వేసింది. మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన శనివారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో బడ్జెట్‌పై మార్పులు చేర్పులు చేసే విషయంపై సభ్యులు చర్చించాలని సూచించారు. అధికార పార్టీ మినహా మిగిలిన మజ్లిస్, కాంగ్రెస్, బిజెపి పార్టీలకు చెందిన సభ్యులు బడ్జెటేతర అంశాలపై చర్చించారు. బిజెపి, మజ్లిస్ పార్టీ కార్పొరేటర్ల వార్షిక బడ్జెట్‌పై ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సమావేశంలోనే తీర్మానం చేయాలని కోరాయి. ఇందుకు మేయర్ బొంతు రామ్మోహన్ జోక్యం చేసుకుని ఇదివరకే శాసన మండలి సభ్యులు, నగర మంత్రులతో మున్సిపల్ మంత్రి కె. తారకరామారావు బడ్జెట్‌పై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారని వివరించారు. కార్పొరేటర్ల వార్షిక బడ్జెట్ అంశాన్ని ఇప్పటి పలు సార్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుపుతూ, తదుపరిగా మంత్రులు, పాలక మండలి ఎక్స్ ఆఫిషియో సభ్యులతో సమావేశమై నిర్ణయం తీసుకుంటామని తెలిపినట్లు వెల్లడించారు. మజ్లిస్ సలీంబేగ్ జోక్యం చేసుకుని ఆస్తిపన్ను పెంచే యోచనలో అధికారులున్నట్లు తెలిసిందని, ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టడం, పౌరసేవలను నిర్వాహణను మెరుగుపరిచిన తర్వాతే ఈ విషయాన్ని పరిశీలించాలని సూచించారు. కాంగ్రెస్ సభ్యుడు శంకర్‌యాదవ్ జోక్యం చేసుకుని పటాన్‌చెరువు డివిజన్‌లోని ఓ ఇంటికి జిహెచ్‌ఎంసి అధికారులు అధిక మొత్తంలో ఆస్తిపన్నును పెంచారని, గ్రామకంఠ భూమిలో నిర్మించిన ఆ ఇంటిని అక్రమ నిర్మాణంగా రికార్డుల్లోకి ఎక్కించి, పన్ను పెంచటం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించగా, మేయర్ రామ్మోహన్ జోక్యం చేసుకుని ఇది బడ్జెట్ సమావేశమని, బడ్జెట్‌కు సంబంధించిన విషయాలను మాత్రమే ప్రస్తావించాలని సూచించారు.
డివిజన్‌లోని అభివృద్ధి పనులకు సంబంధించి ఇప్పటికే పది నుంచి పదిహేనుసార్లు అధికారులకు ప్రతిపాదనలు పంపామని, అధికారులు బడ్జెట్ లేదని మంజూరు చేయటం లేదని బిజెపి సభ్యురాలు రాధారెడ్డి సభ దృష్టికి తీసుకువచ్చారు. అంతలో అధికారపార్టీకి చెందిన చారి మాట్లాడుతూ నగరంలోని 150 డివిజన్లలో సమానంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, నగరాన్ని గ్లోబల్ సిటీ చేసే విధంగా బడ్జెట్ ఉందంటూ వ్యాఖ్యానించగా, మజ్లిస్, బిజెపి, కాంగ్రెస్ సభ్యులు జోక్యం చేసుకుని ఆయన వ్యాఖ్యలకు అభ్యంతరాలు తెలపుతుండగానే బడ్జెట్‌ను కౌన్సిల్ ఆమోదించినట్లు ప్రకటిస్తూ మేయర్ సభను ముగించారు.

మా బడ్జెట్ సంగతేంటీ?
కార్పొరేటర్లకే బడ్జెట్ లేదు.. ఆర్టీసీని ఆదుకోవటమా?
తీర్మానం చేయాలని పట్టుబట్టిన మజ్లిస్
కార్పొరేటర్లకు రూ. 5 కోట్ల బడ్జెట్ ఇవ్వాలి
ప్రతిపాదనలు సర్కారుకు పంపుతామన్న మేయర్

హైదరాబాద్, మార్చి 25: జిహెచ్‌ఎంసి బడ్జెట్ సరే..మేం ప్రజల ద్వారా గెలిచి కౌన్సిల్‌కు వచ్చిన మా బడ్జెట్ సంగతేంటీ?..అభివృద్ధి పనులపై ప్రజలెన్నో ఆశలు పెట్టుకున్నారు..ఇప్పటి వరకు తమకు వార్షిక బడ్జెట్ కేటాయించలేదని..ప్రజలకు ఎం సమాధానం చెప్పాలని కార్పొరేటర్లు మేయర్ బొంతు రామ్మోహన్‌కు ఏకరువు పెట్టారు.
శనివారం జిహెచ్‌ఎంసి బడ్జెట్‌పై నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో శాసన మండలి సభ్యుడు జాఫ్రీ మాట్లాడుతూ ప్రజలతో దగ్గరి సంబంధాలున్న కార్పొరేటర్లకు కేటాయించేందుకే నిధుల్లేవని చెబుతూ, నష్టాల్లో ఉన్న ఆర్టీసికి 2015లో రూ. 300 కోట్లు, 2016లో రూ. 150 కోట్లు ఇవ్వటం అవసరమా? అని ప్రశ్నించారు.
మజ్లిస్ సభ్యుడు, మాజీ మేయర్ మాజీద్ హుస్సేన్ మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నుంచి జిహెచ్‌ఎంసికి పన్నులు, గ్రాంట్ల రూపంలో రావల్సిన నిధుల్లో ఇప్పటి వరకు ఎంత వరకు వసూలు చేశారని ప్రశ్నించారు. అంతేగాక, రాష్ట్ర ప్రభుత్వం నుంచి బల్దియా రూ. 2112 కోట్లను ఆశిస్తూ ప్రతిపాదనలు పంపగా, బడ్జెట్‌లో కేవలం రూ. వెయ్యి కోట్లు కేటాయించగా, మిగిలిన మరో వెయ్యి కోట్లను ఎలా సమకూర్చుకుంటారు? ప్రజలపై ఏమైనా భారం వేస్తారా? అని ప్రశ్నించారు. కమిషనర్ డా.బి.జనార్దన్ రెడ్డి సమాధానం చెబుతూ 13వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఇంకా రూ. 130 కోట్ల మేరకు కేంద్రం నుంచి రావల్సి ఉన్నాయని వివరించారు. 14వ ఆర్థిక సంఘానికి ఇప్పటికే రూ. 217 కోట్ల బిల్లులు సమర్పించినట్లు వివరించారు. ఆ తర్వాత మజ్లిస్ సభ్యురాలు అయేషా రుబీనా మాట్లాడుతూ కొన్ని డివిజన్లలో ఎక్కువ మొత్తంలో, మరికొన్ని డివిజన్లలో అసలు పనులు జరగటం లేదని, దీనిపై కౌన్సిల్‌లో నిర్ణయం తీసుకోవాలన్నారు. కార్పొరేటర్ల వార్షిక బడ్జెట్‌కు సంబంధించి ఇదే సమావేశంలో తీర్మానం చేయాలని కోరారు. ప్రజలకు తామేదో చేస్తామని ఆశించి గెలిపించారని, వారి అవసరాలకు తగిన విధంగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఒక్కో కార్పొరేటర్‌కు రూ. 2 కోట్లు కేటాయించాలని కోరారు. ఈ అంశంపై నిర్ణయం తీసుకున్న తర్వాతే జిహెచ్‌ఎంసి బడ్జెట్‌ను ఆమోదించాలని సూచించారు. బిజెపి సభ్యుడు శంకర్‌యాదవ్ మాట్లాడుతూ కార్పొరేటర్ల బడ్జెట్ కోసం ప్రతి కార్పొరేటర్ ఎదురుచూస్తున్నారని వివరించారు. అంతేగాక, బడ్జెట్‌లో కేటాయింపులు చేయటమేగాక, అవి ఎంతవరకు అమలవుతున్నాయన్న విషయాన్ని సమీక్షించేందుకు ప్రతి నెల కౌన్సిల్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించాలని కోరారు. మజ్లిస్ సభ్యుడు ఎం.ఏ. గఫార్ మాట్లాడుతూ ప్రతి కార్పొరేటర్‌కు రూ. 5 కోట్ల వార్షిక బడ్జెట్‌ను కేటాయించాలని కోరారు. తాను 1986 నుంచి కార్పొరేటర్‌గా కొనసాగుతున్నానని, కార్పొరేటర్లకు వార్షిక బడ్జెట్ లేకుండా జిహెచ్‌ఎంసి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భం ఇపుడే చూస్తున్నానని వ్యాఖ్యానించారు.
అధ్యయనం చేసి నివేదిక సమర్పించండి
కార్పొరేటర్లకు ప్రత్యేకించి వార్షిక బడ్జెట్ లేనందున, కొన్ని డివిజన్లలో పెద్ద మొత్తంలో, మరికొన్ని ప్రాంతాల్లో అసలు పనులు జరగటం లేదన్న మజ్లిస్ సభ్యురాలు అయేషా రుబీనా ప్రశ్నకు స్పందించిన మేయర్ నగరంలోని అన్ని డివిజన్లలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని కమిషనర్ జనార్దన్ రెడ్డిని ఆదేశించారు.