హైదరాబాద్

మరో రింగురోడ్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 22: మహానగరంలో ట్రాఫిక్ సమస్య అనేది కేవలం వాహనదారులకే గాక, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు సైతం తలభారంగా మారింది. ఇప్పటికే నగరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం మెట్రోరైలును అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుండగా, ఇందుకు సమాంతరంగానే ఎస్‌ఆర్‌డిపి కింద పలు చోట్ల అండర్‌పాస్‌లు, మల్టీలెవేల్ ఫ్లై ఓవర్లు, స్కైవేలు వంటివి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే! అయితే నగరంలో ఏ ప్రాజెక్టు చేపట్టినా అందుకు క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే అడ్డంకులు, అధిక మొత్తంలో వెచ్చించినా నిర్ణీత గడువులోపు ప్రాజెక్టులు పూర్తికాకపోవటం వంటి కారణాలతో జిహెచ్‌ఎంసి అధికారులు కొత్త పాఠాలు నేర్చుకున్నారు. ఇందుకు గాను రోజురోజుకి వాహనాల రాకపోకలు పెరుగుతున్న ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం చుట్టూ తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో ప్రత్యేకమైన రింగురోడ్డను ఏర్పాటు చేయాలని జిహెచ్‌ఎంసి ప్రతిపాదనలు సిద్దం చేసింది. వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళిక(ఎస్‌ఆర్‌డిపి) కిందే 120 అడుగుల వెడల్పుతో ఈ రింగురోడ్డును ఏర్పాటు చేస్తే విశ్వవిద్యాలయం చుట్టూ పెరిగిన ట్రాఫిక్ సమస్యను కొంత వరకు తగ్గించాలని అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా శివం జంక్షన్, అడిక్‌మెట్, తార్నాక రోడ్డు, తార్నాక జంక్షన్, హబ్సిగూడ, ఎన్‌సిసి గేటు, రామంతాపూర్ మీదుగా హబ్సిగూడ వీది నెంబరు 8, తార్నాక జంక్షన్ వకరు ఈ రింగురోడ్డును ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే ఓ సారి ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికారులతో చర్చలు కూడా జరిపారు. ఇందులో భాగంగానే ట్రాఫిక్ మరింత సజావుగా సాగేందుకు వీలుగా తార్నాక జంక్షన్ నుంచి వౌలాలీ వరకున్న రోడ్డును కూడా అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. అంతేగాక, అనుకున్న సమయం కల్లా ఈ రింగురోడ్డును పూర్తి చేయాలని, ఇందుకు భూ సేకరణకు సంబంధించి ప్రైవేటు ఆస్తుల జోలికెళ్లకుండా ఓయూ భూమినే సేకరించాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. అంతేగాక, హెచ్‌ఎండిఏ రూపొందించిన మాస్టర్ ప్లాన్‌లో కూడా ఓయూలోని నాలుగు అంతర్గత రోడ్లను విస్తరించాలని ప్రతిపాదించారు. అనుకున్న సమయంలో ఈ రింగురోడ్డును పూర్తి చేసుకోగలిగితే మాస్టర్ ప్లాన్‌లో ప్రతిపాదించిన రోడ్ల విస్తరణ ప్రతిపాదనలు తొలగించే అవకాశముంది. అయితే మెట్రోరైలు రెండో దశగా ప్రభుత్వం సిద్దంగా ఉందని రెండురోజుల క్రితం మంత్రి కె. తారకరామారావు ప్రకటించటం, తార్నాక నుంచి ఇసిఐఎల్ జంక్షన్ వరకు మెట్రోరైలు వచ్చే ప్రతిపాదనలుండటంతో ఈ పనులు ప్రారంభమయ్యే ముందే ఓయూ చుట్టూ రింగురోడ్డును ఏర్పాటు చేయాలని జిహెచ్‌ఎంసి అధికారులు భావిస్తున్నారు. ముందుగానే రోడ్డును అభివృద్ధి చేస్తే ఈ రూట్‌లో మెట్రోరైలు రెండో దశ భూసేకరణకు పెద్దగా అడ్డంకులొచ్చే అవకాశాలు ఉండకపోవచ్చునని అధికారులు భావిస్తున్నారు.
రింగురోడ్డుతో పెరగనున్న భద్రత
ఉస్మానియా విశ్వవిద్యాలయం చుట్టూ రింగురోడ్డు అందుబాటులోకి వస్తే యూనివర్శిటీ చుట్టూ ట్రాఫిక్, శబ్ద కాలుష్యం తగ్గి, భద్రత పెరిగే అవకాశముంది. అంతేగాక, ఇప్పటికే ఓయూకి చెందిన కొన్ని భూములు కబ్జాల పాలై కోర్టుల్లో కేసులు కూడా నడుస్తున్నాయి. ఈ రోడ్డు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలాంటి పరిణామాలు పునరావృత్తం కాకపోవచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేగాక, ఓయూతో సంబంధమున్న వారు మాత్రమే లోనికి వచ్చే అవకాశముంటుంది. మిగిలిన సాధారణ ట్రాఫిక్ రింగురోడ్డు నుంచి బయటవైపే ప్రయాణం సాగించాల్సి ఉన్నందున, ఇతర వ్యక్తులు లోనికి వచ్చే అవకాశముండదు.