హైదరాబాద్

అంబరాన్నంటిన బతుకమ్మ సంబురాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 16: బతుకమ్మ బతుకమ్మ ఊయ్యాలో.. మావూరి బతుకమ్మ ఊయ్యాలో, ఒక్కేసి పూవ్వేసీ ఊయ్యాలో.. అంటూ మహిళలు ఆట పాటలతో బతుకమ్మ సంబురాల్లో మునిగిపోయారు. నవరాత్రి, విజయదశమి వేడుకల్లో భాగంగా నాంపల్లిలోని హైదరాబాద్ కలెక్టరేట్‌లో బతుకమ్మ ఆట పాటలతో మారుమ్రోగింది. కలెక్టరేట్‌లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు, అధికారులు తెలంగాణ సంప్రదాయాలకు అనుగుణంగా తయారై బతుకమ్మను రకరకాల పూలతో అలంకరించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో మంగళవారం సాయంత్రం బతుకమ్మ వేడుకలు అంగరంగా వైభవంగా జరిగాయి. కలెక్టర్ కార్యాలయంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు, అధికారులు బతుకమ్మలను తీసుకువచ్చి వేడుకల్లో పాల్గొన్నారు. కలెక్టర్ రఘునందన్ రావు.. జ్యోతి ప్రజ్వలన చేసి బతుకమ్మ వేడుకలను ప్రారంభించారు. నగరంలోని ఐసీడీఎస్‌కు చెందిన ఆయా ప్రాజెక్టుల నుండి వచ్చిన అంగన్‌వాడీ కార్యకర్తలు బతుకమ్మ వేడుకల్లో పెద్ద సంఖ్యలో హాజరాయ్యారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పూర్ణచందర్ రావు, ఎల్‌పీఓ రాధికారమణి, జిల్లా సంక్షేమాధికారి సునంద, డీపీఆర్‌ఓ యామిని పాల్గొన్నారు.
విజయ దశమి వేడుకల్లో భాగంగా నగరంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో బతుకమ్మ సంబరాలు మంగళవారం ఘనంగా జరిగాయి. బేగంపేటలోని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌వీఎస్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు ఎంతో అభిమానంతో జరుపుకునే పండుగల్లో బతుకమ్మ వేడుకలు ఎంతో ప్రసిద్ధి చెందిందని అన్నారు. బతుకమ్మ వేడులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని అన్నారు.
ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో మంగళవారం వెన్న ముద్దల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. బోర్డు ఆవరణలో బతుకమ్మ పండుగ వాతావరణం నెలకొంది. జలమండలిలో మహిళ ఉద్యోగులు వివిద రకాల పూలతో బతుకమ్మను పేర్చి ఆట పాటాలతో అలరింప జేశారు.
కీసర: మంగళవారం కలెక్టరేట్ ఆవరణలో మహిళా ఉద్యోగినులు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గౌరీ పూజను కలెక్టర్ ఎంవీ రెడ్డి చేసి వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. వివిధ శాఖల మహిళా ఉద్యోగులు, అంగన్‌వాడీ టీచర్లు ఉత్సాహంగా పాల్గొని పాటలతో మహిళలు పరవసించి బతుకమ్మ ఆడారు. కలెక్టరేట్ ప్రాంగణం అంతా బతుకమ్మ సంబురాలతో నూతన శోభ సంతరించుకుంది. కార్యక్రమంలో జేసీ శ్రీనివాస్ రెడ్డి, బాలనగర్ డీసీపీ పద్మజా, మల్కాజ్‌గిరి డీసీపీ ఉమామహేశ్వర శర్మ, సీపీవో సౌమ్య, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి విజయ కుమారి, డీపీఆర్వో పీబీ సరస్వతి, డీఈఓ విజయ కుమారి, జిల్లా రేడియో ఇంజనీరింగ్ అధికారి గీతాంజలి పాల్గొన్నారు.
జీడిమెట్ల: నగర శివారులోని బాచుపల్లిలో వీఎన్‌ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో వివిధ విభాగాలకు చెందిన అధ్యాపకులు బతుకమ్మ పండుగ సంబురాలను ఉత్సాహంగా ఆటపాటలతో నిర్వహించారు. దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా విద్యాధిదేవత సరస్వతీ దేవీగా అలంకరించిన అమ్మవారిని స్తుతిస్తూ ప్రత్యేక పూజలను నిర్వహించారు. బతుకమ్మ ఆడటం సుహృద్భావ వాతావరణానికి సూచన అని ఈసీఈ విభాగాధిపతి, స్టూడెంట్ ప్రోగ్రెషన్ డాక్టర్ వై.పద్మశాయి అన్నారు.
సైదాబాద్: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు పాతబస్తీ యాకుత్‌పురాలోఅంగరంగ వైభవంగా జరిగాయి. రంగు, రంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో వచ్చిన మహిళలు ఒకచోట పెట్టి బతుకమ్మ పాటలు పాడుతూ వేడుకలు జరుపుకున్నారు. మంగళవారం ఐఎస్ సదన్ డివిజన్ కార్పొరేటర్ సామ స్వప్న సుందర్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ బావి, శ్రీరాంనగర్ కాలనీలోబతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. సంప్రదాయ దుస్తులు ధరించి ఆటపాటలతో ఆకట్టుకున్నారు. వేడుకలకు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ పాటలకు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. కార్యక్రమంలో యాకుత్‌పుర నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి సామ సుందర్ రెడ్డి, నాయకులు శివకుమార్, గణేశ్, ప్రవీణ్‌రాజ్, మహేందర్ రెడ్డి, దిడ్డి వెంకటేశ్, శైలజా గౌడ్, అనిత పాల్గొన్నారు.
షాద్‌నగర్: పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. సోమవారం రాత్రి షాద్‌నగర్ పట్టణంలోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బతుకమ్మ సంబరాలను కన్నుల పండువగా నిర్వహించారు. మహిళలు నూతన వస్త్రాలు ధరించి రంగురంగుల బతుకమ్మలను తయారు చేయడంతోపాటు గౌరమ్మకు పూజలు చేశారు. బతుకమ్మ పాటలు, కోలాటాలతో మహిళలు సందడి..సందడి చేశారు. కార్యక్రమంలో మహిళలు కీర్తన, రాణి, సంద్య, లక్ష్మీ, పద్మశాలి సంఘం అధ్యక్షుడు బిజ్జుల చిన్నయ్య, ప్రధాన కార్యదర్శి ఒగ్గు కిశోర్, గౌరవ అధ్యక్షుడు పులిపాటి నర్సింలు, పాలాది శివ, సిలివేరు రవికుమార్, భిక్షపతి పాల్గొన్నారు.
షాబాద్: తెలంగాణ సంప్రదాయానికి బతుకమ్మ పండగ ప్రతీకగా నిలుస్తుందని మండల అభివృద్ధి అధికారి పద్మావతి అన్నారు. మంగళవారం మండల పరిపరిషత్ కార్యాయలంలో రంగు రంగుల బతుకమ్మలను చేసి మండలంలోని మహిళలందరూ ఆట పాటలతో అలరించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత తెలంగాణ జీవన విధానం సంస్కృతి మరింత అభివృద్ధి జరిగిందని, మహిళలకు గౌరవం దక్కిందన్నారు. బతుకమ్మ పండగతో తెలంగాణ బిడ్డల బతుకులు మారుతున్నాయని వివరించారు.
మర్పల్లి: మర్పల్లితోపాటు ఆయా గ్రామాల్లో మహిళలు బతుకమ్మ సంబరాలను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. సాయంత్రం ఇళ్ల ముందు బతుకమ్మలను పూలతో పేర్చి, గౌరీదేవిని ప్రతిష్ఠించి పాటలు పాడుతూ అనంతరం నిమజ్జనం చేస్తున్నారు.
చార్మినార్: దసరా నవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ ఆటాపాట, దాండియా నృత్యాలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని విద్యాశాఖ విభాగం టీఎన్‌జీఓఎస్ అధ్యక్షుడు కేఆర్ రాజ్‌కుమార్ అన్నారు. గన్‌ఫౌండ్రిలోని డీఈఓ ఆఫీసులో మంగళవారం దసరా, బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు. లక్ష్మీమాత పూజతో ప్రారంభమైన ఈ ఉత్సవాల్లో బతుకమ్మ వేడుకలు, దాండియా నృత్యాలు ఉద్యోగుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపాయని వ్యాఖ్యానించారు. సంఘం ట్రెజరర్ ఎస్‌డీ ప్రేమ్‌కుమార్, హైదరాబాద్ జిల్లా ట్రెజరర్ ఉమారెడ్డి, ఆర్‌జేడీఎస్‌ఈ విజయలక్ష్మి బాయి, జగన్నాథ్, వేణుగోపాల్, వరదరాజులు పాల్గొన్నారు.
కాచిగూడ: జీవీఆర్ కరాటే అకాడమీలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరాటే విద్యార్థులు భక్తిశ్రద్ధలతో బతుకమ్మ ఆట, పాటలతో ఆకట్టుకున్నారు. కార్యక్రమానికి టీఆర్ ఎస్ నాయకురాలు దేవిరెడ్డి విజితారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పండుగగా ఎంతో ఆదరణ పొంది దేశ విదేశాలలో బతుకమ్మ సంబురాలను జరుపుకోవడం సంతోషదాయకమని అన్నారు. కార్యక్రమంలో విజయలక్ష్మీ, అకాడమీ డైరెక్టర్ జీ ఎస్ గోపాల్ రెడ్డి, డా.హరిత పాల్గొన్నారు.

ఎల్బీనగర్ అభివృద్ధికి మహాకూటమిని గెలిపించాలి
వనస్థలిపురం, అక్టోబర్ 16: ఎల్బీనగర్ నియోజకవర్గం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే మహాకూటమిని అధిక మెజారిటీతో గెలిపించాలని రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి చెప్పారు. మంగళవారం హయత్‌నగర్ డివిజన్ పరిధిలోని శారదనగర్, భూలక్ష్మీనగర్ కాలనీలో పాదయాత్ర చేస్తూ ఇంటింటికీ తిరుగుతూ మహాకూటమికి ఓటువేసి అప్పుల తెలంగాణగా తయారు చేస్తున్న కేసీఆర్‌ను ఓడించాలని ఓటర్లను కోరారు. అనంతరం కాలనీ సంక్షేమ సంఘాల నాయకులతో ఏర్పాటుచేసిన సమావేశంలో రంగారెడ్డి మాట్లాడుతూ, మాటల గారడితో కుటుంబపాలనను సాగిస్తున్న తెరాస షభ్రుత్వానికి తగిన బుద్ధి చెప్పడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని గుర్తు చేశారు. మహాకూటమి అధికాంలోకి వస్తే ప్రభుత్వంలో టీడీపీ కీలక పాత్రపోషించడం ఖాయమని పేర్కొన్నారు. మాజీ కార్పొరేటర్ సామ ప్రభాకర్‌రెడ్డి, టీడీపీ డివిజన్ అధ్యక్షుడు సింగిరెడ్డి మురళీధర్‌రెడ్డి, నాగరాజు, సామ రాఖేష్ రెడ్డి, శ్రీను, ప్రవీణ్, మహేందర్ పాల్గొన్నారు.

హయత్‌నగర్‌లో ప్రచారం
మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని హయత్‌నగర్, రాజరాజ్వేరి కాలనీ, ఆర్టీసీ కాలనీ, ఎల్‌ఐ కాలనీ, బృందావన్ కాలనీ, కొలన్ శివారెడ్డి కాలనీ, యెల్లారెడ్డి కాలనీలలో టీడీపీ నాయకులు ఇంటింటికీ తిరుగుతూ మహా కూటమి అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ టీడీపీ తయారుచేసిన కరపత్రాలను ఓటర్లకు పంచిపెట్టారు. డివిజన్ అధ్యక్షుడు నాంపల్లి రామేశ్వర్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో రమేష్, జగన్, నందు, అంజి, రాజు, కిరణ్ పాల్గొన్నారు.