హైదరాబాద్

బల్దియాకు 100 డేస్ ‘ప్లాన్’ భయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 3: మహానగర పాలక సంస్థ నుంచి జంటనగరవాసులకు మెరుగైన సేవలందించేందుకు మున్సిపల్ మంత్రి కెటిఆర్ ఆదేశాల మేరకు రూపకల్పన చేసిన వందరోజుల యాక్షన్ ప్లాన్ కింద చేపట్టాల్సిన పనులపై ప్రస్తుతం జిహెచ్‌ఎంసి అధికారులు హడావుడి చేస్తున్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న మున్సిపల్ మంత్రి కె.తారకరామారావు మరో మూడు,నాలుగు రోజుల్లో నగరానికి చేరుకోనున్నారు. పక్షం రోజుల ముందు పర్యటనకు వెళ్లే ముందే ఆయన జిహెచ్‌ఎంసి అధికారులతో ఈ ప్లాన్‌పై ప్రత్యేక సమీక్ష నిర్వహించి తాను అమెరికా నుంచి జూన్ 6 తర్వాత వచ్చిన వెంటనే మరోసారి సమీక్ష నిర్వహించనున్నట్లు స్పష్టం చేయటంతో అధికారులు అంతంతమాత్రంగా కొనసాగుతున్న పనులు కొంత మేరకైనా వేగవంతం చేసేందుకు పరుగులు పెడుతున్నారు. ఇప్పటికే ఈ ప్లాన్ కింద చేపట్టిన పనుల్లో కొన్నింటిని నూటికి నూరు శాతం, మరికొన్నింటిని ఎనభై నుంచి తొంభై శాతం వరకు పూర్తి చేశామని ప్రకటించుకున్న సంగతి తెలిసిందే! కానీ క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పనులు పరిశీలిస్తే జిహెచ్‌ఎంసి అధికారులు ప్లాన్‌లో పొందుపర్చిన పనుల్లో కనీసం యాభై శాతం కూడా పూర్తి చేయలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్లాన్‌లో జిహెచ్‌ఎంసి అధికారులు తొలి ప్రాధాన్యత అంశంగా పొందుపర్చిన ఆన్‌లైన్‌లో బిల్డింగ్, లే అవుట్ల రెగ్యులరైజేషన్ ఇచ్చే ప్రతిపాదనను పెట్టారు. కానీ వాస్తవానికి ఈ ప్రతిపాదనను అధికారులు జూన్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి తెచ్చారు. కానీ అంతకు ముందు రోజే ఈ ప్లాన్ రూపకల్పన చేసిన వంద రోజులు ముగిశాయి. అలాగే జిహెచ్‌ఎంసి అందిస్తోన్న సేవలను మొబైల్ ఫోన్ యాప్ ద్వారా అందించాలని నిర్ణయించి, ప్లాన్ పురోగతి నివేదికలో పూర్తయినట్లు పేర్కొన్నారు. కానీ వాస్తవానికి ఇంకా దానికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను కూడా సమకూర్చుకోలేదు. ఇక ఇదిలా ఉండగా, ఈ వందరోజుల యాక్షన్ ప్లాన్ కింద 40 మోడల్ మార్కెట్లను నిర్మించాలన్న లక్ష్యం పెట్టుకున్నారు. కానీ గత నెలాఖరు వరకు కూడా కేవలం నాలుగు మోడల్ మార్కెట్లను పూర్తి చేసిన అధికారులు ఆ ప్రతిపాదనను 81శాతం వరకు అమలు చేసినట్లు నివేదికల్లో పేర్కొన్నారు. దీంతో పాటు నగరంలో బహిరంగ మూత్రవిసర్జనను నివారించేందుకు గాను వంద ప్రీ ఫ్యాబ్రికేటెడ్ టాయిలెట్లను ఏర్పాటు చేయాలన్న టార్గెట్ పెట్టుకుని, గత నెలాఖరు వరకు 74 టాయిలెట్లను మాత్రమే ఏర్పాటు చేయగలిగారు. అలాగే నగరంలోని పది శ్మశానవాటికల్లో ఒక్కోదానిలో సుమారు రూ. కోటి వెచ్చించి వసతులను మెరుగుపర్చాలని భావించినా, ఇప్పటి వరకు ఒక్క శ్మశానవాటికలో కూడా ఏం పనులు చేపట్టారన్న ప్రశ్నకు సమాధానం చెప్పని అధికారులు మంత్రికి సమర్పించాల్సిన నివేదికలో మాత్రం క్షేత్ర స్థాయిలో పనులు 72శాతం పూర్తయినట్లు పేర్కొన్నారు. మొత్తం 26 అంశాలతో కూడిన వందరోజుల యాక్షన్ ప్లాన్‌లో మొత్తం 94.50 శాతం ప్లాన్ అమలు పురోగతిలో ఉన్నట్లు నివేదికలో అధికారులు పేర్కొనటం గమనార్హం. ప్లాన్‌లో పొందుపర్చిన ఒక్క వేసవి క్రీడా శిక్షణ శిబిరం నిర్వహణ మినహా మిగిలిన అంశాల్లో కొన్నింటికి సంబంధించి పనులే ప్రారంభం కాలేదు.కొన్ని పనులు ప్రారంభమైన అధికారులు ప్లాన్‌లో పేర్కొన్న స్థాయిలో సాగటం లేదు. ఇందుకు శ్మశానవాటికల ప్రతిపాదనే ఓ తార్కాణంగా చెప్పవచ్చు.