ఉత్తరాయణం

ట్రంప్ గెలుపుతో అయోమయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్ని సర్వేల అంచనాలను తలకిందులు చేస్తూ అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలవడం ఇపుడు విశ్వవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అనేక విషయాల్లో ఆది నుంచి దుందుడుకుగా వ్యవహరించిన ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టాక ప్రపంచ దేశాలతో ఎలా వ్యవహరిస్తారన్నది ప్రస్తుతానికి జవాబు లేని ప్రశ్న. అమెరికా ప్రజల అసంతృప్తిని ‘సొమ్ము’ చేసుకోవడంలో, వారికి మెరుగైన కలల్ని ‘అమ్మడం’లో, వారి భయాన్ని, అభద్రతను ఓట్లుగా మార్చుకోవడంలో రియల్ ఎస్టేట్ దిగ్గజమైన ట్రంప్ తన సత్తా చాటుకున్నారు. అమెరికాలో అవుట్ సోర్సింగ్‌పై ట్రంప్ నిషేధం విధిస్తే ఆ పరిస్థితులను తట్టుకునేందుకు భారత్ సహా మిగతా దేశాలు సిద్ధంగా ఉండాలి. ఉగ్రవాదంపై ఆయన గురిపెడితే ప్రపంచానికి మంచిదే. చైనా దిగుమతులు, రష్యాతో చెలిమి, విదేశాంగ నీతి వంటి కీలక అంశాల్లో ట్రంప్ వైఖరి ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం. ప్రస్తుతానికి ప్రపంచ దేశాలది అంతా ఊహాగానమే.. అయోమయమే.. ట్రంప్ పాలన మొదలైతే తప్ప ఎలాంటి స్పష్టత రాదేమో..
-డా.డివిజి శంకరరావు, పార్వతీపురం
చిల్లర సమస్య
మార్కెట్లో చిల్లర సమస్య నానాటికీ ఎక్కువవుతోంది. ఏది కొనాలన్నా వినియోగదారులను చిల్లర శాసిస్తున్నది. బస్సు ప్రయాణంలో చిల్లర కోసం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కండక్టర్లు బస్సు ప్రయాణీకులకు టిక్కెట్ వెనుక చిల్లర ఎంత ఇవ్వాలన్నది రాసి ఇస్తున్నారు. బస్సు దిగినప్పుడు ఇద్దరు, ముగ్గురికి కలిపి చిల్లర పంచుకోవాలని డబ్బు ఇవ్వడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు వ్యాపారస్తులు చిల్లర కొరత కారణంగా గిరాకీని సైతం వదులుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో వ్యాపారులకు, వినియోగదారులకు చిల్లర కారణంగా ఘర్షణలు జరుగుతున్నాయి. చాలా ప్రాంతాల్లో ఐదు రూపాయల నోటు చెల్లదని వ్యాపారులు తిరస్కరిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ కొన్ని నాణాలను, చిన్న నోట్లను ముద్రించడం లేదు. ఈ కారణంగానూ చిల్లర కొరత అధికంగా ఏర్పడుతోంది. ప్రతి బ్యాంక్‌లోనూ ప్రజలకు చిల్లరను విరివిగా ఇవ్వడానికి ఏర్పాట్లు చేయాలి.
-షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్
మాతృభాష దుస్థితి
‘తేనెలొలుకు భాష..’ అంటూ ఒకప్పుడు కవులు, రచయితలు అభివర్ణించిన తెలుగు భాష ఇపుడు అంతరించిపోయే దశకు చేరుకుంటోందన్న ఆందోళన కలుగుతోంది. ఇంగ్లీషు మోజులోపడి తెలుగు ప్రజలు వారి మాతృభాషను దూరం చేసుకుంటున్నారు. భాషావేత్తలు మాతృభాషను పరిరక్షించుకోవాలనే తపనతో తెలుగు రక్షణ వేదిక, తెలుగు భాషోద్యమ సమాఖ్య, మాతృభాషా పరిరక్షణ సమితి లాంటి సంస్థలను ఏర్పాటు చేసి ఎంతోకొంత కృషి చేస్తున్నారు. తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించినా ప్రభుత్వ ఉత్తర్వులు మాత్రం ఇంకా ఆంగ్ల భాషలోనే వెలువడుతుండడం, ప్రభుత్వ కార్యాలయాల బోర్డులు ఆంగ్లంలోనే ఉండడం, తెలుగుకి ప్రత్యేక మంత్రిత్వశాఖ లేకపోవడం, మాతృభాష అభివృద్ధికి బడ్జెట్‌లో నిధులు కేటాయించక పోవడం వంటివి భాషాభిమానులను ఆవేదనకు గురిచేస్తున్నాయి. తెలంగాణలో ఇంకా అధికార భాషా సంఘాన్ని ఏర్పాటు చేయలేదు. కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర ప్రభుత్వాలు వారి మాతృభాషకు ఎనలేని ప్రాధాన్యత, గౌరవాన్ని ఇస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆంగ్లభాషలోనే ఎక్కువగా సంభాషణలు జరగడం భాషా అభివృద్ధికి ఆటంకంగా నిలుస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల పాలకులు మాతృభాష అమలుతీరుపై దృష్టి సారించాలి.
-కామిడి సతీష్‌రెడ్డి, జడలపేట