జాతీయ వార్తలు

‘మేజర్ సాహెబ్.. కమాండర్ సాహెబ్!’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 5: పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై జరిగిన ఉగ్రవాద దాడికి సంబంధించి అనేక అంశాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మిలిటెంట్ల మధ్య ఏ రకమైన సంభాషణ జరిగిందన్న దానిపై గురుదాస్‌పూర్ ఎస్‌పికి చెందిన స్నేహితుడు రాజేశ్ వర్మ కీలక వివరాలు వెల్లడించారు. తమను ఉగ్రవాదులు అపహరించిన సమయంలో వారి మధ్య జరిగిన సంభాషణలను తాము విన్నామని ‘కమాండ్ సాహెబ్’ అంటూ ఏవర్నో సంభోదిస్తూ వారు మాట్లాడేవారని ఆయన తెలిపారు. ప్రతి పది నిముషాలకోసారి తన వద్దకు వచ్చేవారని, దాదాపు 4 గంటలపాటు తాను ఉగ్రవాదులు నిర్బంధంలోనే ఉన్నానని వర్మ వెల్లడించారు. గత శుక్రవారం తనను, ఎస్‌పి సల్వేందర్ సింగ్‌ను అలాగే ఆయన వంటవాడిని మిలిటెంట్లు కిడ్నాప్ చేశారని ఆయన చెప్పారు. ‘ఈ ప్రాంతమంతా చాలా ప్రశాంతంగా ఉంది. మేం మా లక్ష్యాన్ని సునాయాసంగా చేరుకోగలుగుతాం’ అంటూ కమాండర్ సాహెబ్‌కు ఉగ్రవాదులు చెప్పిన మాట తాను విన్నానని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అల్లా దయవల్ల తమ లక్ష్యాన్ని నెరవేర్చుకోగలుగుతామన్న ధీమా భారీ ఆయుధాలతో ఉన్న ఆ మిలిటెంట్ల మాటల్లో కనిపించిందని స్పష్టం చేశారు. ఈ మిలిటెంట్లలో ఒకరిద్దరు మాత్రమే మేజర్ సాహెబ్, కమాండర్ సాహెబ్‌లతో మాట్లాడేవారని మిగిలిన వారందరూ వౌనంగానే ఉన్నారని వర్మ పేర్కొన్నారు. అయితే ఉగ్రవాదులు ఉర్దూలోనే ఎక్కువ మాట్లాడుకోవడం వల్ల ఇన్షా అల్లా అన్న మాట తప్ప తనకు మరేదీ అర్థంకాలేదని తెలిపారు. రాజేశ్‌పై కత్తితో దాడి చేసిన మిలిటెంట్లు అతడిని దారిలోనే పడేయడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తమను కిడ్నాప్ చేసిన సమయంలో చోటుచేసుకున్న పరిణామాలు వెల్లడించారు.

కుట్రను ఛేదిస్తాం
పాక్ సహాయమూ తీసుకుంటాం
పఠాన్‌కోట్‌పై ఎన్‌ఐఏ చీఫ్ ఉద్ఘాటన
న్యూఢిల్లీ, జనవరి 5: పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడికి కుట్రపన్నినవారి గుట్టును రట్టుచేసే విషయంలో పాకిస్తాన్ సహాయ, సహకారాలు తీసుకోవాలని జాతీయ దర్యాప్తు ఏజెన్సీ (ఎన్‌ఐఏ) భావిస్తోంది. ఈ దాడికి ఎక్కడ కుట్ర జరిగింది? దీనివెనక ఎవరు ఉన్నారన్నదానిపై వివరాలు తెలిశాక తదుపరి చర్యల నిమిత్తం పాకిస్తాన్ సాయం కోరతామని ఎన్‌ఐఏ అధినేత శరత్‌కుమార్ తెలిపారు. పఠాన్‌కోట్ పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు బుధవారం అక్కడికి వెళ్తున్న శరత్‌కుమార్ ఈ దాడి కుట్రను ఛేదించడం అన్నది తమ ముందున్న అత్యంత కీలకమైన పెద్దసవాలేనని పేర్కొన్నారు. గతంలో కూడా ఎలాంటి ఆధారం లేని ఎన్నో కీలక కేసులను తాము ఛేదించిన విషయాన్ని ఆయనీ సందర్భంగా గుర్తుచేశారు. ఈ దాడికి సంబంధించి ఏన్నో కోణాల్లో విస్తృత స్థాయిలో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని వెల్లడించిన ఆయన ‘ఇప్పటికి ఇప్పుడే ఇందుకు సంబంధించిన గడువును నిర్దేశించుకునే అవకాశం లేదు. అయితే సాధ్యమైనంత త్వరలో దర్యాప్తు పూర్తిచేయడానికి శక్తివంచనలేకుండా కృషి చేస్తాం’ అని అన్నారు. ఈ ఉగ్రవాదులందరూ పాకిస్తాన్‌కు చెందినవారే అనడంలో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. ఇప్పటివరకూ ఉగ్రవాదులకు, కుట్రదారులకు మధ్య జరిగిన సంభాషణల ఆధారంగానే తాము కీలకమైన వివరాలు సేకరించగలిగామని, వాటి ఆధారంగానే తదుపరి దర్యాప్తు కొనసాగిస్తామని ఆయన తెలిపారు. దర్యాప్తు ముందుకెళ్లేకొద్దీ మరిన్ని ఆధారాలు లభించడంతోపాటు ఈ దాడి వెనక ఉన్న అసలు సూత్రధారుల గుట్టును కూడా రట్టుచేసే అవకాశం ఉందని శరత్‌కుమార్ స్పష్టం చేశారు.

కుట్రదారులను వదలొద్దు
పఠాన్‌కోట్ దాడులపై పాక్‌కు అమెరికా విజ్ఞప్తి
వాషింగ్టన్, జనవరి 5: భారత్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై జరిగిన దాడికి సూత్రధారులపై ఎలాంటి జాప్యం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్‌కు అమెరికా విజ్ఞప్తి చేసింది. ఉగ్రవాదాన్ని అణచివేసే విషయంలో వివక్షను పాటించబోమని అంటూ గతంలో ఇచ్చిన హామీని పఠాన్‌కోట్ దాడి నేపథ్యంలో నిరూపించుకోవాలని స్పష్టం చేసింది. ఇప్పటివరకూ తమకు అందిన ఆధారాల ప్రాతిపదికగా ముందుకు సాగుతున్నామని పాకిస్తాన్ ప్రకటించిన నేపథ్యంలో అమెరికా ఈ మేరకు విజ్ఞప్తి చేసింది. ఉగ్రవాదాన్ని నిరోధించే విషయంలో పాక్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అమెరికా విదేశాంగ విభాగం ప్రతినిధి జాన్ కిర్బీ స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి స్వస్తిపలికి శాంతియుత సంబంధాలు పాదుగొల్పడం ప్రస్తుత పరిస్థితుల్లో భారత్, పాకిస్తాన్‌లకు ఎంతో అవసరమన్నారు.